top of page

ఊరంతా డయేరియా!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Feb 23
  • 1 min read
  • ఒకే ప్రైవేటు ఆసుపత్రిలో 30 మందికి చికిత్స

  • గోల్కొండరేవు పరిసర ప్రాంతాల్లో వ్యాధి లక్షణాలు తీవ్రం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం నగరంలో సగభాగం సోమవారం డయేరియా బారిన పడింది. వాంతులు, విరేచనాలు లక్షణాలతో గోల్కొండరేవు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేదరవీధి మెయిన్ రోడ్డును, కాలువలను పునర్నిర్మిస్తుండటంతో భూమి లోపల ఉండే వాటర్ పైప్‌లైన్ పగిలి కాలువల్లో నీరు మెయిన్ పైప్‌లైన్‌లోకి వెళ్లిపోవడంతో దాన్ని తాగిన ప్రజలు డయేరియా బారిన పడ్డారు. ముఖ్యంగా మొండేటివీధి, పెద్దమార్కెట్‌రోడ్డు, గోల్కొండరేవు రోడ్డు, ఎచ్చెర్లవీధి, రాజుమాస్టర్ కాలనీ, బోడెమ్మకోవెల ప్రాంతాల్లో ఎక్కువ మంది డయేరియాతో బాధపడుతున్నారు. అలాగే గుడివీధి, సంతోషిమాత కోవెల పరిసర ప్రాంతాలు, వాంబే కాలనీ ఏరియాల్లోనూ డయేరియా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా కార్పొరేషన్ కార్యాలయం వెనుక ఉన్న సర్వీస్ ట్యాంక్ నుంచి ఏయే ప్రాంతాలకైతే కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతుందో ఆ ప్రాంతాల ప్రజలు డయేరియా బారిన పడ్డారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆస్పత్రిపాలయ్యారని తెలుసుకున్న తర్వాత ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకొని వెళ్లిపోయారు. కార్పొరేషన్ వాటర్‌వర్క్స్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పైప్‌లైన్ రిపేర్ వర్క్ చేస్తున్నారు. ఈలోగా ముందస్తు చర్యగా తాగేనీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకటించివుంటే మరింతమంది డయేరియా బారిన పడకుండా చేయొచ్చు. అలా కాకుండా దీన్ని కప్పిపుచ్చాలని చూడటం వల్ల మిగతావారికి అవగాహన లేక ఆస్పత్రిపాలవుతున్నారు. మరోవైపు నగరంలో ఇటీవల కుళాయిల నుంచి చెత్తాచెదారం వస్తుందని చెబుతున్నారు. ఈమేరకు మరికొన్ని ప్రాంతాల్లో కూడా డయేరియా ఉందని తెలుస్తుంది. సీజన్ మారినప్ప్పుడు ఇటువంటి వ్యాధులు రావడం సహజమని కొట్టిపారేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే మేలు. ఎందుకంటే.. నగరంలో ఏ నర్సింగ్ హÃం, ఆసుపత్రికి వెళ్లినా ఒకరిద్దరు డయేరియా పేషెంట్లు కనిపిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page