అసలే ఫోర్జరీ.. అందులో గ్రామకంఠం
తప్పుడు నెంబర్లు వేసి కోటబొమ్మాళిలో రిజిస్ట్రేషన్
తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ అని తెలిసినా పట్టించుకోని అధికారులు
లబోదిబోమంటున్న గ్రామస్తులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో ఏదైనా భూమిని కాజేయాలనుకుంటున్నారా? అది ప్రభుత్వ భూమైనా ఫర్వాలేదు. అప్పటికే ఆ భూమిలో వేరేవారి సొంత భవనాలు ఉన్నా ఇబ్బందే లేదు. మీరు ఫోర్జరీ పత్రాలు తెచ్చినా రిజిస్ట్రేషన్ చేయడానికి జిల్లాలో ఒక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. అది మరెక్కడో కాదు.. కోటబొమ్మాళి. సబ్‌రిజిస్ట్రార్‌లు ఎంతమంది మారినా జిల్లాలో వివాదాస్పద భూములకు, ఫోర్జరీ పత్రాలతో వచ్చిన ఎండార్స్‌మెంట్లతో ఎంచక్కా రిజిస్ట్రేషన్ చేసేస్తారు. ఆ తర్వాత సివిల్ మేటరని కోర్టుల చుట్టూ తిరగాల్సింది మాత్రం మనమే. ఫోర్జరీ ఎండార్స్‌మెంట్‌లు, పొజిషన్ సర్టిఫికేట్లుతో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంను బరిడీకొట్టి ప్రభుత్వ భూములను దర్జాగా అనుభవిస్తున్నవారు జిల్లా అంతటా ఉన్నారు. ఫోర్జరీ ఎండార్స్‌మెంట్‌ను తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడానికి వెళ్లి తిరస్కరించబడినవారూ ఉన్నారు. వీటిని సదరు సబ్ రిజిస్ట్రార్లు ఆయా మండలాలకు చెందిన తహసీల్దార్లకు సమాచారం ఇచ్చి వివరణ కోరిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిదే ఈ కథ కూడా.

మెళియాపుట్టి నుంచి తహసీల్దారు సంతకంతో గత నెల 18, ఈ నెల 13న వచ్చిన రెండు ఎండార్స్‌మెంట్‌లను ఫోర్జరీగా గుర్తించారు. ఈ రెండు ఎండార్స్‌మెంట్‌లు మెళియాపుట్టి మండల కేంద్రం నుంచి రావడం గమనార్హం. ఇదే కోవలో ఈ ఏడాది జనవరి 22న ఒకటి, జూలై 16న రెండు ఫోర్జరీ ఎండార్స్‌మెంట్‌లను తీసుకువచ్చి కోటబొమ్మాళి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దర్జాగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ వ్యవహారం సోమవారం గ్రీవెన్స్‌లో బాధితులు ఎం.గోవిందరావు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. రిజిస్ట్రేషన్ చేసిన భూమి గ్రామకంఠం కావడం మరో విశేషం. ఈ భూమికి ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్టు తహసీల్దారు సంతకం, కార్యాలయం రౌండ్‌సీల్ వేసి కోటబొమ్మాళి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించి 53 సెంట్లు గ్రామకంఠాన్ని రిజిస్ట్ట్రేషన్ చేశారు.
మెళియాపుట్టి మండలం మర్రిపాడు(సి) బంజరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 290లో 0.53 సెంట్లు గ్రామకంఠాన్ని గ్రామానికి చెందిన హనుమంతు లింగరాజు, సంజీవమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. తహసిల్దార్ కార్యాలయం స్టాంపులు తయారు చేసి, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి పొజిషన్ సర్టిఫికెట్‌ను సృష్ట్టించి కోటబొమ్మాళి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో వారసత్వంగా చూపించి రిజిస్ట్రేషన్ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. రేఖా సంఖ్య 45/2024తో ఈ ఏడాది జనవరి 22న తహసిల్దార్ కార్యాలయం నుంచి ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్టు ఫోర్జరీ పొజిషన్ సర్టిఫికెట్‌తో హనుమంతు జీవనరావు పేరున జనవరి 25న డాక్యుమెంట్ నెంబర్ 249/2024తో కోటబొమ్మాళి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. రేఖా సంఖ్య 65/2024లో జూలై 16న తహసీల్దార్ ఎండార్స్‌మెంట్ జారీ చేసినట్టు చూపించి రెండు ఫోర్జరీ పొజిషన్ సర్టిఫికెట్లతో హనుమంతు లింగరాజు పేరుతో జూలై 24న డాక్యుమెంట్ నెంబర్ 3751/2024తో, హనుమంతు సహదేవుడు పేరుతో జూలై 29న డాక్యుమెంట్ నెంబర్ 3828/2024న కోటబొమ్మాళిలో రిజిస్ట్రేషన్ చేశారు. వాస్తవంగా సర్వే నెంబర్ 290లో ఉన్న గ్రామకంఠాన్ని తూర్పు భాగంలో ఉన్న సర్వే నెంబర్ 289/3లో ఉన్న జిరాయితీ మెట్టభూమిగా చూపించి ముగ్గురి పేరున రిజిస్ట్రేషన్ చేసినట్టు గ్రామానికి చెందిన ఆరుగురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మండల సర్వేయర్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వ భూములను సొంతం చేసుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామకంఠంలో 1997లో నిర్మించిన తమ్మినేని వనజాక్షి డాబా ఇల్లు ఉంది. దీన్ని ఆ ముగ్గ్గురు తమకు చెందినట్టుగా చూపించి స్వాధీనం చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 289/3పై జేసీ కోర్టులో ప్రస్తుతం వివాదం నడుస్తుంది. 2017లో అప్పటి మెళియాపుట్టి తహసీల్దారు జాలారి చలమయ్య హయాంలో గ్రామానికి చెందిన సాంబయ్య దీన్ని వారసత్వంగా సంక్రమించిందని రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేసి ఈ`పాస్ పుస్తకాలను సంపాదించగలిగాడు. ఫోర్జరీ ధ్రువపత్రాలతో డాక్యుమెంట్లను సృష్టించినట్టు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 289/3లో పూరా విస్తీర్ణం రెవెన్యూ రికార్డుల ప్రాప్తికి 6.47 ఎకరాలను 24మంది రైతుల అనుభవంలో ఉంది. 2017 తర్వాత ఇదే సర్వే నెంబర్‌లో పూరా విస్తీర్ణం 12.94 ఎకరాలుగా మారిపోయింది. క్షేత్రస్థాయిలో భూమి లేకున్నా రికార్డుల్లో మాత్రం 12.94 ఎకరాలుగా చూపిస్తుంది. అప్పటి నుంచి హక్కు అనుభవంలో ఉన్న రైతులకు 1`బీ, అడంగల్ రావడం నిలిచిపోయింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి వెబ్‌ల్యాండ్‌లో పేర్లు నమోదు చేసుకోవడంతో సాంబయ్య పేరుతో రావడం ప్రారంభమైంది. అప్పటి అధికార పార్టీ నాయకుల అండతో సాంబయ్య మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. అదే రీతిన మోళియాపుట్టి మండలం చిన్నపెద్ద కొత్తూరులో 3.50 ఎకరాలు, గేదెలపోలూరులో 2.40 ఎకరాలు, పడ్డలో 1.09 ఎకరాలను తహసీల్దారు చలమయ్య హయాంలో సాంబయ్య పేరుతో రికార్డుల్లోకి ఎక్కిపోయింది. ఈ భూమంతా ప్రభుత్వ భూమేనంటూ కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఈ వివాదంపై ఇద్దరు కలెక్టర్లు, జేసీ, సబ్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను నలుగురు తహసీల్దార్లు పక్కన పెట్టేశారు. రెవెన్యూ రికార్డులను మాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
రెవెన్యూ అధికారులకు సదరు భూమిపై స.హ. చట్టం ద్వారా సమాచారం అడిగితే రికార్డులు అందుబాటులో లేవని చెప్పి తప్పించుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు. సర్వే నెంబర్ 289/3లో ఉన్న భూమిని 1980లో పెద్దిన రామలింగం సుబుద్ధి కుమారుల నుంచి కొనుగోలు ద్వారా సంక్రమించిన అనుభవ హక్కులు కలిగివున్న రైతులు 2022లో టెక్కలి సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సబ్‌కలెక్టర్ విచారణ చేసి సాంబయ్య ఈ`పాస్ బుక్కులను రద్దు చేసి 1`బీ అడంగల్ నుంచి పేరును 30 రోజుల్లో తొలగించాలని మెళియాపుట్టి తహసీల్దారును ఆదేశించారు. సబ్‌కలెక్టర్ ఆదేశాలను తహసీల్దార్ అమలుచేయలేదు. టెక్కలి సబ్‌కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేయాలని జేసీకి ఆక్రమణదారుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేసిన జేసీ టెక్కలి సబ్‌కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయాలని తహసీల్దారుకు ఈ ఏడాది జూన్ 19 ఆదేశించారు. మెళియాపుట్టి రెవెన్యూ అధికారులు జేసీ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు ప్రారంభించి ఏడీ సర్వే, రెవెన్యూ అధికారులు సర్వే చేసి 24 మంది రైతులకు అనుభవ హక్కులు కల్పించి జేసీకి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం జేసీ కోర్టులో వివాదం ఇప్పటికీ నడుస్తుంది.
Comments