
భారత్‌లో చిన్నారుల ఎదుగుదల కులాన్ని బట్టి మారుతోంది. ఆధిపత్య కులాల్లో పిల్లల ఎదుగుదల లోపం అణగారిన వర్గాలవారితో పోలిస్తే తక్కువగా ఉంది. ఆదివాసీ, దళిత పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. భారత్, సబ్-సహారా ఆఫ్రికాలోని దేశాలకు చెందిన పలు సర్వేల ఆధారంగా తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడిరచింది. దేశంలో ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 35 శాతం మంది ఎదుగుదల సమస్యతో బాధపడుతున్నారని వివరించింది. ప్రపంచంలోని ఇతర దేశాలే కాదు.. సబ్-సహారా ఆఫ్రికాలోని దేశాల కంటే కూడా ఈ లోపాన్ని ఎదుర్కొంటున్న చిన్నారుల సంఖ్య భారత్‌లోనే అధికంగా ఉన్నదని తెలిపింది. పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు సైతం ఇదే విషయాన్ని తెలుపు తున్నాయి. సబ్-సహారా ఆఫ్రికా కంటే అధిక స్థాయిలో భారత్‌లోని పిల్లల ఎదుగుదల లోపానికి దశాబ్దాలుగా వస్తున్న కుల వివక్ష కూడా కారణమని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తున్నది. అశోక యూనివర్సిటీకి చెందిన అశ్వినీ దేశ్‌పాండే, మలేషియాలోని మోనాశ్ యూనివర్సిటీకి చెందిన రాజేశ్ రామచంద్రన్‌లు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రపంచంలో ఈ రెండు ప్రాంతాల్లో కలిపి ఐదేళ్ల లోపు చిన్నారులు 44 శాతం మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎదుగుదల లోపంతో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 70 శాతం మంది ఈ రెండు ప్రాంతాల నుంచే ఉండటం గమనార్హం. ఇది పోషకా హార లోపానికి ఒక సూచికగా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇందులో భారత రేటు 35.7 శాతంగా ఉంది. 49 దేశాలను కలిగిన సబ్-సహారా 33.6 శాతంతో భారత్ కంటే తక్కువగానే ఉంది. సబ్-సహారా ఆఫ్రికాతో పోలిస్తే భారత చిన్నారులు ఎత్తు తక్కువ ఉన్నారన్న హైట్ గ్యాప్ మీదనే దృష్టిని సారిస్తూ.. పిల్లల పోషకాహార లోపంలో సామాజిక గుర్తింపు పాత్రను, ముఖ్యంగా కులాన్ని విస్మరిస్తు న్నారని అధ్యయనం తెలిపింది. చిన్నారుల జీవితంలో ‘గోల్డెన్ పీరియడ్’గా పిలవబడే తొలి వెయ్యి రోజులు చాలా కీలకం. రెండేళ్ల వయసు వచ్చేనాటికి 80 శాతం మెదడు ఎదుగుతుంది. ఇది సుదీర్ఘ జీవితానికి కావాల్సిన ఒక పునాది. ఈ కీలకమైన సమయంలో చిన్నారులకు ఆరోగ్య సంరక్షణ మంచి పోషకాహారం, ప్రారంభ అభ్యాసం, సురక్షితమైన వాతావరణం వంటివి చాలా ముఖ్యం. ఇవి చిన్నారుల భవిష్యత్తును నిర్ణయిస్తాయని నిపుణులు చెప్తున్నారు. అయితే, గోల్డెన్ పీరియడ్‌లో చిన్నారులకు ఇవేమీ అందకపోవటంతో వారి ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని అంటున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం 2021లో సబ్-సహారా, దక్షిణాసియా (భారత్‌తో కలుపుకొని)లు ప్రపంచ పేదరికంలో 85 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది పేదరిక, అభివృద్ధిలో సవాళ్లను తెలి యజేస్తున్నది. ఇది కూడా చిన్నారులపై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ఎదుగుదల సమస్య రేట్లు యుద్ధంతో దెబ్బతిన్న సబ్-సహారా ఆఫ్రియాలోని డి.ఆర్ కాంగో వంటి దేశాల్లో ఉన్నాయి. ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో మూడోవంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్న ఆదివాసీలు, దళితుల్లో పరిస్థితులు మరింత క్లిష్టంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. భారత్‌లో అణగారిన కులాలతో పోలిస్తే.. ఆధిపత్య కులాల పిల్లల్లో ఎదుగుదల లోపం 20 శాతం తక్కువ అని పరిశోధకులు చెప్పారు. జనన క్రమం, పారిశుధ్య పద్ధతులు, తల్లి ఎత్తు, తోబుట్టువుల సంఖ్య, విద్య, రక్తహీనత, కుటుంబ సామాజిక ఆర్థిక పరిస్థితి వంటి అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకున్నారు. దేశంలో సామాజిక అసమానతపై చర్చ జరగాలి. భారత్‌లో పిల్లల ఎదుగుదల లోపంపై కొన్నేళ్లుగా అనేక చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఇవి జన్యుపరమైనవిగా చూపితే, మరికొందరు పోషకాహార లోపంగా ఎత్తిచూపుతున్నారు. ఇంకొందరు ప్రభుత్వాల వైఫల్యాన్ని కారణంగా చెప్తున్నారు. దేశంలో బాలురతో పోలిస్తే బాలికల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఆదివాసీలు వంటి అణగారిన సామాజిక వర్గాల్లోని చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతు న్నారు. భారత్‌లో ప్రత్యేకించి పేద కుటుంబాలు, తక్కువ చదువు కలిగి ఉన్న తల్లులు, అణగారిన సామాజికవర్గాలకు చెందిన పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారన్నది సుస్పష్టమని నిపుణు లు చెప్తున్నారు. చిన్నారుల్లో ఈ ఎదుగుదల అంతరం విషయానికి వస్తే.. కుల ఆధారిత సామాజిక అసమానత కారణమవుతున్నదనీ, దాని విషయంలో సమాజంలో చర్చ జరగకపోవటం శోచనీయం.
Comments