ఎదురుదాడి.. మావోల సైద్ధాంతిక చర్య!
- DV RAMANA
- Jun 10
- 2 min read

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఒక అదనపు ఎస్పీ దుర్మరణం చెందారు. అంతకు ముందు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెండు మూడు ట్రాక్టర్లను దహనం చేశారు. దీనిపై విచారణకు వెళ్లిన ఏఎస్పీ మందుపాతర పేలుడులో మృతి చెందినట్లు వచ్చిన వార్తలను చూసి చాలామంది విస్మయం చెంది ఉండవచ్చు. ఎందుకంటే ఇటీవలి కాలంలో మావోయస్టులకు వరుసగా కోలుకోలేని ఎదురుదెబ్బలే తప్ప ఎదురు దాడులు చేసేంత పరిస్థితి లేదు. దేశంలో మావోయిస్టులను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న దండకారణ్య ప్రాంతంలో ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి మావోయిస్టు పార్టీ గతంలో ఎన్నడూ ఎదుర్కోనంత ఎదురుదెబ్బలు తింటోంది. అటవీ ప్రాంతాలను, గిరిజన తండాలను కేంద్ర, రాష్ట్రాల సాయుధ భద్రతా బలగాలు జల్లెడ పడుతూ మావోయిస్టు క్యాడర్‌ను, సానుభూతిపరులను ఏరిపారేస్తున్నాయి. బలగాల ధాటికి అగ్రశ్రేణి నాయకులు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. గత మూడు నెలల్లోనే పార్టీ మూల స్తంభాలైన సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్, తదితరులను కోల్పోయింది. క్యాడర్ చెల్లాచెదురైంది. చాలా మంది లొంగిపోయారు. కొందరు పోలీసులకు కోవర్టులుగా మారారు. మొత్తంగా పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. భద్రతా బలగాలు విరుచుకుపడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు కౌంటర్ అటాక్ (ఎదురు దాడి)కు దిగుతుందా అన్న అనుమానాలు కలగడం సహజమే. కానీ ఇది వాస్తవం. ప్రతి ఏటా జనవరి నుంచి జూన్ వరకు మావోయిస్టులు జరిపే వ్యూహాత్మక దాడుల్లో ఇది భాగమని మావోయిస్టు ఉద్యమంపై అవగాహన ఉన్నవారు పేర్కొంటున్నారు. పార్టీ ఉనికికే ముప్పు వాటిల్లిన తరుణాల్లో దాడులు చేయడం మావోయిస్టు సిద్ధాంతంలో భాగం. పార్టీ క్యాడర్‌లో నైతిక స్థైర్యం పెంచడమే ఈ ఎదురు దాడుల లక్ష్యం. మావోయిస్టు పార్టీ తమ సుప్రీం లీడర్ నంబాల కేశవరావునే కోల్పోయింది. ఇది పార్టీ క్యాడర్‌ను, సానుభూతిపరులను తీవ్ర నిరాశ, ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి సందర్భాల్లో చేసే దాడులు క్యాడర్‌లో ఉత్సాహం నింపుతాయి. నైతిక స్థైర్యాన్ని పెంచి మళ్లీ పోరాటం దిశగా నడిపిస్తాయని మావోయిస్టు సిద్ధాంతకర్తలు చెబుతారు. పార్టీ బలంగానే ఉందన్న సందేశం ఇవ్వడానికి ఈ దాడులు ఉపయోగపడతాయని చెబుతారు. భద్రతా దళాలు మావోయిస్టులను బలహీనపరిచాయని, ఇక ఆ పార్టీ బతికి బట్టకట్టడం కష్టమన్న ప్రచారం సాగుతున్న తరుణంలో తమ పార్టీని అంత తేలికగా తీసిపారవేయవద్దనే సంకేతాన్ని ప్రభుత్వానికి, ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి తెలియజెప్పడమే ఈ ఎదురు దాడి ఉద్దేశం కావచ్చు. భద్రతా బలగాలు కీలక నాయకులను హతమార్చినప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవడం మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల్లో ఓ భాగం. పోలీసు బలగాలపై ఒత్తిడి పెంచడం, వ్యూహాత్మకంగా వెనకడుగు వేసేలా చేయడం దీని లక్ష్యం. భద్రతా బలగాలు అమాయకులైన గిరిజనులను కూడా ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపుతున్నాయని, అందుకే వారిపై ప్రతీకార దాడులు చేస్తున్నట్లు మావోయిస్టు నేతలు చెబుతుంటారు. తమ నేతలను మాత్రమే కాకుండా అమాయక అటవీ ప్రాంత ప్రజలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని చెప్పడం, దాన్ని ఎదుర్కోవడానికే ప్రతీకార దాడులని ప్రచారం చేయడం ద్వారా ప్రజల మద్దతు, సానుభూతిని మావోయిస్టు పార్టీ పొందుతోంది. ఈ వ్యూహంతోనే సిద్ధాంతపరమైన దాడులకు ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది. పార్టీకి ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, తమపై భద్రతా బలగాలు పైచేయి సాధించకుండా చూడటంతో పాటు పోలీసు బలగాలపై మానసికంగా ఒత్తిడి పెంచే లక్ష్యంతో ఇలాంటి ప్రతీకార దాడులకు పాల్పడుతుంటారు. సాయుధ పోలీసు బలగాలపై మెరుపు దాడులకు దిగడం, వారిని లక్ష్యంగా చేసుకుని మందుపాతరలు పేల్చడం వల్ల వారి కదలికలను నియంత్రించడం కూడా ఒక వ్యూహం. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తమ విప్లవం, తమ సిద్ధాంతం సజీవమైనవని సమాజానికి, సర్కారుకు సందేశం ఇచ్చే ఉద్దేశంతో కూడా ఇలాంటి దాడులకు మావోయిస్టు పార్టీ సిద్ధపడుతుంది. తాము చేసే ప్రజా డిమాండ్ల చర్చ జరగడానికి కూడా ఇలాంటి దాడులు సహకరిస్తాయన్నది మావోయిస్టు వ్యూహకర్తల నమ్మకం. ఒకనాటి పీపుల్స్‌వార్ సిద్ధాంతం ప్రకారం విప్లవకారుడు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం దిశగా నడవాలి. రాజ్యం నిర్బంధం పెంచినా, వర్గ నిర్మూలన చర్యలు చేపట్టినా సిద్ధాంతపరంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవాలి. అందుకు అవసరమైతే ఎదురుదాడులు వారి సైద్ధాంతిక వ్యూహం.
Comments