`నెలన్నర రోజుల్లోనే రూ.4650 కోట్ల సొత్తు స్వాధీనం
`ఇంకా సగం ఎన్నికల ప్రక్రియ ఉండగానే రికార్డు
`గత ఎన్నికల్లో స్వాధీనమైన దానికంటే ఇదే ఎక్కువ
`ఈసారి పట్టుబడిన వాటిలో సింహభాగం మత్తుమందులే
`ఎన్నికలకు డబ్బు జబ్బు చేసిందన్న ఆందోళన
ఎన్నికల రచ్చబండ - డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి

రోజుకు రూ.వంద కోట్లు. ఈ అంకె చూసి ఇదేదో బడా సంస్థ రోజువారీ ఆదాయం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ ఎన్నికల సీజనులో జరుగుతున్న సోదాలు, దాడుల్లో రోజుకు సగటున పట్టుబడుతున్న మద్యం, మందు, మత్తుమందుల విలువ ఇది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కానీ ఇది ముమ్మాటికీ నిజమని సాక్షాత్తు ఎన్నికల సంఘమే ప్రకటించింది. ఎన్నికల్లో ప్రలోభాలను, ఓట్ల కొనుగోలును అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సోదాల్లో అసలు ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే రూ.4,650 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకోవడం దేశ ఎన్నికల చరిత్రలోనే తొలిసారి. ఏడు విడతలుగా జరిగే ఎన్నికల ప్రక్రియ జూన్ ఒకటో తేదీన ముగుస్తుంది. అంటే మిగిలిన నెలన్నర రోజుల్లో ఇంకెంత పెద్ద మొత్తాలు దొరుకుతాయో అంచనాకు అందడం లేదు. భారత ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా డబ్బు ప్రవాహిస్తోందని ఎన్నికల సంఘమే వ్యాఖ్యానించడం విశేషం. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల ప్రక్రియకు డబ్బు జబ్బు పట్టుకుందన్నది నిష్టుర సత్యం. గతంలోనూ ప్రలోభాలు ఉండేవి. కానీ ఓటర్లను రిక్షాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించడం, మద్యం, సారా పోయడం, రూపాయో అర్ధరూపాయో చేతిలో పెట్టడం వరకే ఉండేది. కానీ రానురాను ప్రలోభాలు శృతిమించిపోయాయి. పార్టీలు, అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను వలలో వేసుకునేందుకు బంగారు, వెండి వస్తువులు, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, బట్టలు, తాగినంత మద్యం ఇవ్వడంతో ఓటర్లు కూడా ఈ కుసంస్కృతికి అలవాటు పడిపోయారు. మనస్సాక్షిగా, స్వచ్ఛందంగా వేయాల్సిన ఓటును అమ్ముకునే స్థితికి ఓటర్లను పార్టీలు దిగజార్చేశాయి. డబ్బులు ఇవ్వకపోతే ఓటు ఎందుకు వేయాలన్న దుస్థితి నేడు నెలకొంది. ఫలితంగా అభ్యర్థుల ఎన్నికల ఖర్చు అమాంతం పెరిగిపోయింది. అసెంబ్లీ నియోజకవర్గాన్ని బట్టి రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు వెచ్చించడానికి సిద్ధపడిపోతున్నారు. ఒక్కసారి పదవిలోకి వచ్చేస్తే అధికారాన్ని అడ్డుపెట్టుకుని అంతకు అంత తిరిగి సంపాదించవచ్చన్న ధీమాతో ఖర్చులకు, పంపకాలకు సై అంటున్నారు. వీటికోసం డబ్బు, మద్యం, ఇతర నజరానాలు తరలిస్తున్న క్రమంలోనే తనిఖీ బృందాలకు ఇవి పట్టుబడుతున్నాయి.
ఈసారి డ్రగ్స్ కూడా పెద్దఎత్తున..
ఓటర్లకు నగదుతోపాటు మద్యం, బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు, ఇతర ఖరీదైన బహుమతుల రూపంలో ప్రలోభాలకు గురి చేయడం కొత్త కాదు. కానీ ఈసారి వీటితో డ్రగ్స్ కూడా వచ్చి చేరాయి. భారీగా మత్తు పదార్థాలు పట్టుబడుతుండటమే దీనికి నిదర్శనం. వీటిని అరికట్టేందుకు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ 13 వరకు స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 4,650 కోట్ల అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అంటే సగటున రోజుకు రూ. 100 కోట్ల మేర పట్టుబడుతున్నట్లు లెక్క. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలంటిలో స్వాధీనం చేసుకున్న మొత్తం కంటే ఇదే ఎక్కువ. అది కూడా ఎన్నికల ప్రక్రియ సగం కూడా పూర్తి కాకముందే ఇంత పెద్దమొత్తం లభించడం ఆందోళనకరం. అప్పటివరకు నగదు రూపంలో రూ. 395.39 కోట్లు, బంగారం వంటి వస్తువుల రూపంలో రూ. 562.10 కోట్లు, రూ. 489.31 కోట్ల విలువైన 3.58 కోట్ల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. వీటికితోడు గంజాయి, కొకైన్ తదితర రకాల మాదకద్రవ్యాలను తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం రికవరీల్లో రూ. 2,068.85 కోట్ల(45 శాతం)తో డ్రగ్సే మొదటి స్థానం ఆక్రమించాయి. అంటే.. ఈ ఎన్నికల్లో మత్తు పదార్థాలతో కూడా యువత, ఇతర వర్గాలను ప్రలోభాలకు గురి చేసే ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అర్థమవుతోంది. ఇది చాలా అనర్థదాయకమని, పార్టీలు ఓట్ల కోసం నైచ్యానికి దిగజారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక టీవీలు, ఫ్రిడ్జ్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాల రూపంలో రూ. 1,142.49 కోట్ల మేర తనిఖీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఆ రాష్ట్రాలే టాప్
గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఈసీ స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 3,475 మాత్రమే. దాన్ని ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ సగం కూడా పూర్తి కాకముందే దాటేయడం విశేషం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం రూ. 4,658 కోట్లలో అత్యధికంగా రాజస్థాన్ నుంచి రూ. 778.52 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 605 కోట్లతో గుజరాత్ ద్వితీయ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి రూ. 121.84 కోట్ల మేర రికవరీ కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 125.97 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వెల్లడిరచింది. తెలంగాణలో నగదు రూ.49,18 కోట్ల నగదు, రూ.19.21 కోట్ల విలువైన మద్యం, రూ.22.71 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.30.74 కోట్ల బంగారం, ఇతర విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తాయిలాల అక్రమ రవాణాలో లద్దాక్, లక్షద్వీప్ ప్రాంతాలు చివరి స్థానాల్లో నిలిచాయి.
నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వేటే
ఎన్నికలను డబ్బుతో ప్రభావితం చేయడం ద్వారా పోటీలో ఉన్న అభ్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా పోతాయని ఈసీ ఆందోళన వ్యక్తం చేసింది. అలా జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. విధినిర్వహణలో అలసత్వం ప్రదర్శించే ఫ్లయింగ్ స్క్వాడ్, ఇతర తనిఖీ బృందాలు, అధికారులపైన, అలాగే అక్రమ రవాణాకు కారణమైన పార్టీలు, అభ్యర్థులపైనా కఠిన చర్యలకు ఈసీ ఏమాత్రం వెనుకాడడం లేదు. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఓ ప్రముఖ నేత కాన్వాయ్‌ని తనిఖీ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించిన ఫ్లయింగ్ స్క్వాడ్‌పై ఈసీ వేటు వేసింది. ఒక రాష్ట్రంలో సీఎం కాన్వాయ్, మరో రాష్ట్రంలో డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ను తనిఖీ చేయకుండా వదిలేసిన అధికారులపైనా చర్యలకు ఆదేశించింది. అలా ఇప్పటి వరకు 106 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ఈసీ వెల్లడిరచింది.

కీలకంగా ఈసీఎంఎస్, సీ విజిల్
కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈసీఎంఎస్) దేశవ్యాప్తంగా తనిఖీలు, రికవరీల్లో కీలక పాత్ర పోషిస్తోంది. మొత్తం అన్ని వ్యవస్థలను ఇది సమన్వయం చేస్తున్న ఈ సిస్టం పరిధిలో వివిధ విభాగాలకు చెందిన 6,398 చెందిన జిల్లా నోడల్ అధికారులు, 734 మంది రాష్ట్ర నోడల్ అధికారులు, 59 వేల ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఉన్నాయి. దీన్ని 2023 నుంచే అమల్లోకి వచ్చింది. డబ్బు, బంగారం తదితరాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ), రాష్ట్ర పోలీసులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ), పోస్టల్ శాఖ, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) వంటి సంస్థలు పనిచేస్తుండగా, మద్యం అక్రమ రవాణాపై రాష్ట్ర పోలీసులు, ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ అధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసులతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) వంటి సంస్థలు పనిచేస్తున్నాయి. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ-విజిల్ మొబైల్ యాప్ కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా అందిన 3,262 ఫిర్యాదుల ఆధారంగానే నగదు, మద్యం, ఉచిత బహుమతులను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ పేర్కొంది.
Comments