
ఇంతకూ డ్రగ్స్ దొరలు.. ఏ పార్టీ వీరులో?!వారు మీవారు.. కాదు మీవారే!
డ్రగ్స్ కంటెయినర్ చుట్టూ ఎన్నికల రాజకీయం
సంధ్యా ఆక్వా యాజమాన్యం పార్టీ సంబంధాలపై పరస్పర ఆరోపణలు
రెండు ప్రధాన పార్టీలతోనూ కలిసి ఉన్నట్లు ఫొటోలు
కొన్ని పార్టీల నేతలతో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు ప్రచారం
ఎన్నికల్లో ప్రయోజనానికే దీనికి రాజకీయ రంగం
(రచ్చబండ)
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
సాధారణంగా ఎవరైనా.. ఏదో ఒక పార్టీలోనే ఉంటారు. క్రియాశీల కార్యకర్తగా, అభిమానిగా, సానుభూతిపరునిగా.. మొత్తం మీద ఏదో ఒక రూపంలో తనకు నచ్చిన పార్టీలోనే ఉంటారు. ఒకవేళ ఆ పార్టీ తీరు నచ్చకపోతే.. దాన్ని వీడి మరో పార్టీలో చేరడం సహజం. కానీ అదేం చిత్రమో గానీ.. ఆ నలుగురైదుగురు మాత్రం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నింట్లోనూ ఉన్నారట!.. అలా అని వారు చెప్పడం లేదు.. ఆయా పార్టీలే పోటీ పడి వారిని తమ ప్రత్యర్థి పార్టీ ఖాతాలో వేసేస్తున్నారు. వారు వైకాపా నేతలే అని టీడీపీవారు చెబుతుంటే.. కాదు కాదు టీడీపీవారేనని వైకాపావారు చెప్పేస్తున్నారు. అలాగే బీజేపీతో సంబంధాన్ని అంటగడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలవారిని చేర్చుకునేందుకు రాజకీయ పార్టీలు ఉత్సాహం చూపిస్తుంటాయి. కానీ ఆ నలుగురైదుగురిని మాత్రం తమలో కలపుకొనేందుకు కాకుండా ఎదుటి పార్టీలో చేర్చేందుకే అత్యుత్సాహం చూపిస్తున్నాయి. దీనికి కారణం.. మత్తు రాజకీయం. ఎన్నికల్లో ఏచిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి కూడా పార్టీలు ఇష్టపడవు. తమకు పనికొచ్చేవాటితోపాటు.. ఎదుటిపక్షాన్ని దెబ్బకొట్టేవాటిని కూడా వదిలిపెట్టవు. సరిగ్గా అటువంటిదే విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కంటెయినర్ ఉదంతం. దీన్ని బ్రెజిల్ నుంచి తెప్పించిన సంధ్యా అక్వా సంస్థ యజమానుల చుట్టూ ఇప్పుడు రంజైన రాజకీయం జరుగుతోంది. సదరు యజమానులతో మీకు సంబంధాలు ఉన్నాయంటే.. కాదు కాదు మీకే సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ, వైకాపా, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరి తీరుతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ నేపథ్యం..
బ్రెజిల్‌లోని శాంటోస్ పోర్టు నుంచి ఈ నెల 16న విశాఖ పోర్టుకు చేరిన కార్గో షిప్‌లో మన రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన సంధ్యా ఆక్వా సంస్థ పేరుతో ఒక భారీ కంటెయినర్ అన్‌లోడ్ అయ్యింది. దానికి సంబంధించి ముందే ఇంటర్‌పోల్ నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన సీబీఐ పోర్టుకు చేరుకునినీ నెల 19న కంటెయినర్‌ను సీజ్ చేసి రొయ్యల మేత పేరుతో ఉన్న సరుకును మూడు నాలుగుసార్లు శాంపిల్ తీసి పరీక్షించగా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. సుమారు రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఆ కంటెయినర్‌లో ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తిస్థాయిలో నిర్థారించేందుకు శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. మరోవైపు ఆక్వా సంస్థ కు చెందిన విశాఖ, ప్రకాశం జిల్లాలోని కార్యాలయాలు, ప్లాంట్లతో తనిఖీలు జరుగుతున్నాయి. తమ రొయ్యల మేత తయారీ ప్లాంట్‌లో ఉపయోగించేందుకు డ్రై ఈస్ట్ తెప్పించామని, అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని ఆక్వా సంస్థతోపాటు డ్రై ఈస్ట్ పంపిన బ్రెజిల్ కంపెనీ కూడా చెబుతున్నాయి. అయితే సందట్లో సడేమియా అన్నట్లు ఇందులో రాజకీయం చొరబడిరది. దీన్ని ఎన్నికల ప్రయోజనాలకు వాడేసుకునే ఎత్తులు మొదలయ్యాయి. ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా డ్రగ్స్ రాజకీయం చేయడం ప్రారంభించాయి. కంటెయినర్ తెప్పించిన సంద్యా ఆక్వా యాజమాన్యం, దానితో సంబంధం ఉన్న వారందరూ ‘మీ పార్టీవారంటే.. కాదు మీపార్టీవారే ’ అంటూ దుమ్మెత్తిపోసుకోవడం ప్రారంభించాయి.
పార్టీలు, వారి అనుకూల మీడియా అత్యుత్సాహం
డ్రగ్స్ కంటెయినర్ పట్టుబడిన వార్త ఇంకా పూర్తిస్థాయిలో జనబాహుళ్యంలోకి రాకముందే తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్స్(ట్విటర్)లోకి వచ్చేసి అత్యుత్సాహంగా అధికార వైకాపాకు మత్తు బురద అంటించేశారు. సంధ్యా ఆక్వా సంస్థ యజమానులకు వైకాపా అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అనుమానితులందరూ ఆ పార్టీవారేనని, ఎన్నికల్లో డ్రగ్స్ పంపిణీ చేసి యువతను చిత్తు చేసేందుకు అధికార పార్టీ తెగబడుతోందని ఆరోపణలు గుప్పించారు. వైకాపా నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని తమ పార్టీ ఎప్పటినుంచే చేస్తున్న ఆరోపణలు నిజమని రుజువయ్యాయని భుజాలు చరుచుకున్నారు. అధికార పార్టీ పాపాల పుట్ట బద్దలవుతోందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూడా రంగంలోకి దిగి అధికార పార్టీపై ఆరోపణలు గుప్పించారు. విశాఖ పోర్టులో డ్రగ్స్ కంటెయినర్ తనిఖీలకు పోలీసులు, పోర్టు ఉద్యోగులు సహకరించకపోవడంతోనే దీనికి వెనుక అధికార వైకాపా ఉందని స్పష్టమవుతోందని చంద్రబాబు ఆరోపించారు. ఇంత భారీ స్థాయిలో ఎన్నికల ముందు రాష్ట్రానికి డ్రగ్స్ చేరడం చాలా ఆనుమానాలకు తావిస్తోందన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్గా మారిపోయిందని, యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుందనే నా భయాన్ని ఇది ధృవీకరిస్తోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైకాపా సర్కారు ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తామంటున్న విశాఖను డ్రగ్స్ రాజధానిగా మార్చేస్తోందని పవన్‌కల్యాణ్ విమర్శించారు.
వైకాపా ఎదురు దాడి
ప్రతిపక్షాల విమర్శలపై అధికారపక్షం తీవ్రంగా కౌంటర్ దాడి ప్రారంభించింది. డ్రగ్స్ కేసులో అనుమానితులందరూ టీడీపీ నేతలు, వారితో వ్యాపార సంబంధాలు ఉన్నవారేనని ప్రత్యారోపణలు చేస్తోంది. అంతేకాక తెలుగు డ్రగ్స్ పార్టీ అంటూ టీడీపీపై సెటైర్లు వేస్తోంది. ఈ కేసులు అనుమానితులుగా భావిస్తున్న కూనం వీరభద్రచౌదరి, కూనం కోటయ్య చౌదరి, దామచర్ల సత్య, రాయపాటి వినోద్, తదితరులు వైకాపాకు చెందిన వారని వారి స్వగ్రామం ఈదుమూడిలో సంక్రాంతి ఉత్సవాల సమయంలో ఏర్పాటు చేసిన వైకాపా నేతలున్న ఒక ఫ్లెక్సీని సామాజిక మాధ్యమాలు, అనుకూల పత్రికలు, ఛానళ్లలో చూపిస్తూ టీడీపీ ప్రచారం చేసింది. దాన్ని ఖండిస్తూనే దామచర్ల సత్య, కోటయ్య చౌదరిలు చంద్రబాబు, లోకేష్‌లతో కలిసి ఉన్న ఫొటోలను వైకాపా ప్రచారంలోకి తెచ్చి, వారంతా టీడీపీ భక్తులేనని, ఆ పార్టీలో ఉన్నవారేనని ప్రత్యారోపణ చేసింది. అలాగే టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజాతో, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబంతో వీరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పురంధేశ్వరి రాజీనామా చేసినట్లు కొన్ని వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దాన్ని బీజేపీ అధికారికంగా ఖండిరచింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూడా డ్రగ్స్ కంటెయినర్‌తో సంబంధం ఉన్నవారంతా బీజేపీలోనే ఉన్నారని ఆరోపించడం విశేషం.
ఇంతకూ వారు ఏ పార్టీలో ఉన్నట్లు?
అయితే పార్టీలు ఎంత దుమ్మెత్తిపోసుకుంటున్నా.. ప్రత్యర్థులపై ఎంతగా బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నా అసలు సంద్యా ఆక్వా యాజమాన్యం ఏ పార్టీలో ఉందన్నది ఇంతవరకు వెల్లడి కాలేదు. పట్టుబడిన కంటెయినర్‌లో ఉన్న డ్రగ్స్‌తో తమకు సంబంధంలేదని, తాము డ్రై ఈస్ట్ మాత్రమే ఆర్డర్ చేశామని చెబుతున్న సంస్థ యాజమాన్యం, తమపై రాజకీయంగా వస్తున్న ఆరోపణలపై మాత్రం ఇంతవరకు స్పందించలేదు. వ్యాపారులు, వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసుకునేందుకు అన్ని పార్టీలతోనూ సంబంధాలు కొనసాగిస్తుంటాయి. కొందరు మాత్రమే పార్టీలతో అంటకాగుతుంటారు. పార్టీల కార్యక్రమాల్లో బహిరంగంగానే పాల్గొంటుంటారు. సంధ్యా ఆక్వా యాజమాన్యం అలా చేసిన దాఖలాలు కూడా లేవు. కానీ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మాత్రం డ్రగ్స్ బురదను ప్రత్యర్థులపై చల్లి ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే డ్రగ్స్ కంటెయినర్ చుట్టు ఆరోపణల సాలెగూడు అల్లి అందులో ప్రత్యర్థి పార్టీని ఇరికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయని అర్థమవుతోంది. సీబీఐ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత మాత్రమే డ్రగ్స్ కంటెయినర్‌తో సంధ్యా ఆక్వాకు ఉన్న లింకులు, అలాగే యాజమాన్యానికి ఉన్న పార్టీల లింకులు బయటపడే అవకాశం ఉంది. అంతవరకు రాజకీయ మత్తు మాత్రం ఎన్నికలను కిక్కెస్తూనే ఉంటుంది. మన రాజకీయాల తీరే అంత మరి!
Comments