top of page

ఎన్నికల సందట్లో..ఇసుకాసురుల బరితెగింపు!

Writer: NVS PRASADNVS PRASAD
  • సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత మరింత పెరిగిన తవ్వకాలు

  • అధికార యంత్రాంగం బిజీని వాడేసుకుంటున్న అక్రమార్కులు

  • వైకాపా, టీడీపీ నేతలు కలిసే యథేచ్ఛగా దందాలు

  • రాత్రివేళల్లోనే విచ్చలవిడిగా తవ్వకాలు, తరలింపులు

  • రవాణాలో ఇబ్బందుల్లేకుండా సంబంధిత అధికారులకు ముడుపులు




సుక తవ్వకాల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు చోటుచేసుకున్నాయని స్వయంగా గ్రీన్‌ ట్రిబ్యూనలే సుప్రీంకోర్టుకు నివేదించింది. దాంతో స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతి అధికారి కోర్టు క్యూరేటర్‌గానే భావించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. కానీ విడ్డూరంగా.. ఆ తర్వాత నుంచే జిల్లాలో అక్రమ తవ్వకాలు పెరిగిపోయాయి. అధికార యంత్రాంగమంతా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో బిజీగా ఉండటంతో ఇదే అదనుగా ఇసుకాసురులు వాల్టా చట్టాలను తుంగలో తొక్కి నదీగర్భాలను కుళ్లబొడిచి ఇసుకను తోడేయడం ద్వారా కాసులు దండుకోవాలని చూడటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఇసుక అక్రమాల గురించి నిఘా వ్యవస్థలకు తెలిసినా తెలియనట్లు వ్యవహరిస్తున్నాయి. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే ఎప్పటిలాగే జేపీ వెంచర్స్‌ లేదంటే మరో సంస్థ వచ్చి తవ్వుకుంటుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక విధానం అమలుచేస్తామని హామీ ఇచ్చినందున ఇసుకకు డిమాండ్‌ తగ్గిపోయే అవకాశం ఉన్నందున సొమ్ము చేసుకోవడం కష్టమవుతుందని భావించి ఇప్పుడే ఎడాపెడా తవ్వేసి సొమ్ము చేసుకోవాలన్న లక్ష్యంతోనే అక్రమార్కులు బరి తెగిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో ఏ నదిలో కూడా సరిపడినంత ఇసుక లేదు. మళ్లీ వరద వస్తే తప్ప ఇసుక లభ్యం కాదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా నదీ గర్భాలను పొక్లెయిన్లతో మట్టిపొరలు వచ్చేంత వరకు తవ్వేసి ఇసుక తోడేస్తున్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఇసుక అక్రమ తవ్వకాల్లో నైపుణ్యం ఉన్నవారంతా ఒకే పార్టీకి చెందినవారే. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో కార్యకర్తలకు చేతి నిండా పని కల్పించి ఆ ప్రాంత ఎమ్మెల్యేల జేబులు నింపే కార్యక్రమం చేసింది. 2019 వరకు ఈ దందా యథేచ్ఛగా సాగింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ అక్రమాలు సరికొత్త రూపం దాల్చాయి. నేరుగా ఎమ్మెల్యేలే ఇసుక దందాలో జోక్యం చేసుకొనే పరిస్థితి వచ్చింది. 2019 ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉన్న వారంతా ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తుందని గ్రహించి ఎన్నికల ముందే పార్టీ మార్చి వైకాపా కండువా కప్పుకొని ఇసుక దందాకు ఆటంకం లేకుండా చూసుకున్నారు. ప్రస్తుత ఎన్నికల ముందు కూడా అలాంటి పరిస్థితే అక్కడక్కడా కనిపించింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇసుక దందాలో చేయి తిరిగిన వారిలో కొందరు టీడీపీ పంచన చేరిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చినా దందాకు ఆటంకం లేకుండా కొనసాగించవచ్చని కొందరు ఆలోచిస్తే, మరికొందరు వైకాపా వచ్చినా, టీడీపీ వచ్చినా ఇసుక అక్రమ తవ్వకాలకు ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. గార మండలం బూరవల్లిలో వైకాపా నాయకులుగా చెలామణీ అవుతున్న జగన్‌, మాధవనాయుడు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. శ్రీకాకుళం మండలం కరజాడలో వైకాపా నుంచి ఇటీవల టీడీపీలో చేరిన పట్నాన క్రిష్ణ, వైకాపాకు చెందిన బలగ శ్రీను, గొండు శేఖర్‌ తదితరులు తవ్వకాలు జరుపుతున్నారు. శ్రీకాకుళం మండలం భైరిలో టీడీపీ నుంచి వైకాపాలోకి వెళ్లిన గణేష్‌, పొన్నాంలో వైకాపాను వీడి టీడీపీలో చేరిన గురువు లక్ష్మణరావు, వైకాపాలో కొనసాగుతున్న వాసు, ప్రసన్న, రాజారావు, అంబళ్లవలసలో వైకాపా నాయకులు అచ్యుత్‌, అర్జున్‌ ప్రధాన పాత్రదారులుగా ప్రస్తుతం ఇసుక దందా సాగుతోంది.

అడ్డురావద్దని చెప్పి మరీ..

ఇసుక దందాపై ‘సత్యం’లో వరుసగా రెండు రోజులు కథనాలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించి రీచ్‌ల్లోకి వాహనాలు వెళ్లకుండా ట్రెంచ్‌లు తవ్వించారు. అయినా పొన్నాంలో మంగళవారం పట్టపగలే యంత్రాలను నదిలోకి తరలించి ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక లోడ్‌ చేసి తరలించారు. ఇసుక అక్రమాలపై పత్రికల్లో కథనాలు వచ్చిన ప్రతిసారీ ట్రెంచ్‌లు తవ్వడం, ఒకటి రెండు రోజులు నదిలోకి ఎవరూ వెళ్లకుండా, ఇసుక తవ్వకాలు జరపకుండా కట్టుదిట్టం చేయడం, ఆ తర్వాత విడిచిపెట్టడం సర్వసాధారణమైపోయింది. శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, జలుమూరు మండలాల పరిధిలో నాగావళి, వంశధారల్లో తవ్వకాలు జరుపుతున్న వారంతా వైకాపాలో ముఖ్య నాయకులుగా చెలామణీ అవుతున్నవారే. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నాయకులు సెబ్‌ అధికారులకు ఫోన్‌ చేసి మరీ ఇసుక తవ్వకాలపై దాడులు చేయవద్దని, వారంతా పార్టీ కార్యకర్తలేనని, ఎన్నికల్లో కార్యకర్తల జేబు ఖర్చులకు ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణమని చెప్పి ఇసుక అక్రమ తవ్వకాలకు లైన్‌ క్లియర్‌ చేశారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు శ్రీకాకుళం రూరల్‌ పరిధిలో వైకాపా నాయకులు, ఇటీవల టీడీపీలో చేరిన వారు కలిసి ఎంచక్కా ఇసుక దందా చేస్తున్నారు. సెబ్‌ అధికారులు మౌనం వహించడం, పోలీస్‌ అధికారులకు లారీ, ట్రాక్టర్‌కు లెక్కగట్టి డబ్బులు ఇచ్చేస్తుండడంతో దందాకు అదుపు లేకుండాపోతుంది.

రాత్రివేళల్లో విచ్చలవిడిగా..

సుప్రీంకోర్టు ఆదేశాలతో జిల్లా ఉన్నతాధికారులు, ఇసుక కమిటీ సభ్యులు రీచ్‌లను పరిశీలించడానికి వస్తారని సమాచారం రావడంతో పగటి పూట అక్రమార్కులు కనిపించడంలేదు. సాయంత్రం ఆరు దాటిన తర్వాతే సమీప తోటల్లో ఉన్న జేసీబీలు, పొక్లెయిన్లను నదిలో దించి ట్రాక్టర్లతో ఇసుక తరలించి తోటల్లో డంపింగ్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లోకి ఎక్కించి రాత్రి 9 నుంచి తెల్లవార్లూ తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం బట్టేరు, బూరవెల్లి, అంబళ్లవలస, గోపాలపెంట, ముద్దాడపేట, హయాతీనగరం రీచ్‌ల్లో మాత్రమే ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఈ రీచ్‌ల్లో ప్రతిమ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. బట్టేరు, బూరవెల్లి రీచ్‌ల్లో తవ్విన ఇసుకను విశాఖ, విజయనగరం అవసరాలకు తరలిస్తున్నారు. మిగతా రీచ్‌ల్లో తవ్విన ఇసుకను జిల్లా అవసరాలకు, ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తున్నారు. తోటల్లో డంప్‌ చేసిన ఇసుకను ఎచ్చెర్ల పాపారావు ద్వారా ట్రాన్స్‌పోర్టు చేస్తున్నారు. ఈ పాపారావు గతంలో ఎచ్చెర్ల పరిధిలోని ముద్దాడపేట, హయాతీనగరం తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ దందా చేసేవాడు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం, గార, నరసన్నపేట మండలాల నుంచి ఇసుకను ఇతర ప్రాంతాలకు బహిరంగంగా లారీల్లో రవాణా చేస్తున్నారు.

డబ్బులుకొట్టి నిరాఘాటంగా రవాణా

ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించేందుకు పోలీసులు, సెబ్‌, ఆర్టీవో, రెవెన్యూ, విజిలెన్స్‌ అధికారులను మేనేజ్‌ చేస్తున్నారు. దాంతో శ్రీకాకుళం, గార ప్రాంతాల నుంచి ఇసుక రవాణా చేసే రోజున దానికి అడ్డుకట్ట వేయాల్సిన క్షేత్రస్థాయి సిబ్బందిని అధికారులు వేరే ప్రాంతాల్లో విధులకు పంపించి అక్రమ రవాణాకు అవాంతరాలు లేకుండా చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అక్రమ రీచ్‌లు నిర్వహిస్తున్న ప్రతిచోటా స్థానిక పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్‌ చేస్తున్నామని ఆరోపణలు ఉన్నాయి. ఇసుకను లారీల్లో లోడ్‌ చేసిన రోజున ఎవరికి ఇవ్వాల్సిన మొత్తం వారికి ఇస్త్తే తప్ప లారీలను రోడ్డు ఎక్కనివ్వరని, ఒకవేళ ఇవ్వకుండా తరలిస్తే మధ్యలో నిలిపేసి బెదిరిస్తారని చెబుతున్నారు. జాతీయ రహదారి మీదుగా విశాఖకు వెళ్లే ఇసుక లారీలను మార్గమధ్యంలో మూడు చోట్ల పోలీసులు ఆపుతారని, నిలిపిన ప్రతిచోటా అధికారి స్థాయిని, సిబ్బందిని బట్టి డబ్బులు సమర్పించుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుందని కొందరు లారీ డ్రైవర్లు చెబుతున్నారు. మరికొందరు లారీల యజమానులు ముందుగానే మాట్లాడుకొని ఆటంకం లేకుండా చూసుకుంటారని చెబుతున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page