top of page

ఎన్నెన్నో జన్మల బంధం నీది - నాది

Writer: NVS PRASADNVS PRASAD
  • పాలకొండ కమిషనర్లంతా ఏసీబీ ట్రాప్‌

  • నగర పంచాయతీలోనూ ఇదే ఆనవాయితీ

  • హడలిపోతున్న అధికారులు

  • మున్సిపాలిటీల్లో ఆల్‌టైమ్‌ రికార్డు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఆ ప్రాంతంలో సాధారణ పౌరుడికి చైతన్యం ఎక్కువో, లేదూ అంటే అక్కడ మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లిన తర్వాత కమిషనర్ల చేతికి దురద పుడుతుందో తెలియదుగానీ పాలకొండ మున్సిపల్‌ కమిషనర్లుగా పని చేసినవారిలో మూడొంతుల మంది అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడమే ఇప్పుడు మన టాపిక్‌. ఏసీబీకి దొరక్కుండా తప్పించుకున్న ఆ కొద్దిమంది కూడా అదృష్టంకొద్దీ ఆ రోజు బయటపడిపోయారు కానీ, వాస్తవానికి వీరి మీద కూడా ఏసీబీకి ఫిర్యాదులు రావడం, ట్రాప్‌కు సిద్ధం కావడం వంటి పరిణామాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పాలకొండ మున్సిపల్‌ ఆఫీసులో కమిషనర్లుగా పని చేసినవారు ఏసీబీకి దొరికిపోవడంతో ఇప్పుడు అక్కడ పని చేయాలంటేనే అధికారులు వణికిపోతున్నారు తప్ప లంచాలు తీసుకోము అని మాత్రం చెప్పడంలేదు.

2013లో మొదటిసారిగా మేజర్‌ నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా పాలకొండ ప్రమోషన్‌ పొందింది. దీనికి మొదటి కమిషనర్‌ పిల్లి నాగభూషణరావు. ఈయన మద్దెల సాంబమూర్తి అనే వ్యక్తి దగ్గర్నుంచి ఇంటి ప్లాన్‌ అప్రూవల్‌ కోసం రూ.12,500 లంచం తీసుకుంటూ అప్పట్లో ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ఆ రోజు నుంచి ఈ పరంపర మొన్నటి సామంచి సర్వేశ్వరరావు వరకు కొనసాగుతునే ఉంది.

ఈ మున్సిపాలిటీ ఎంత శాపగ్రస్తమైందంటే.. నగర పంచాయతీగా ఉన్నప్పుడు ఇక్కడ మేనేజర్‌గా పని చేస్తూ మున్సిపాలిటీ అయిన తర్వాత కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన టి.కనకరాజు అనే ఉద్యోగి మున్సిపల్‌ డైరెక్టరేట్‌ నుంచి శాఖ మార్పు ఉత్తర్వులు తీసుకున్న మరుసటిరోజే పి.గురునాథరావు అనే వ్యక్తి నుంచి ప్లాన్‌ అప్రూవల్‌ కోసం రూ.10వేలు లంచం ఆశించి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ద్వారా దాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.

2010లో నగర పంచాయతీగా ఉన్నప్పుడు అప్పటి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బత్తుల మల్లేశ్వరరావు కూడా ఒక కేసులో టి.శంకరరావు అనే వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. ప్రస్తుతం ఆ కేసును కొట్టేశారు అది వేరే విషయం.

మళ్లీ వర్తమానంలోకి వస్తే.. 2022లో నడిపేన రామారావు అనే కమిషనర్‌ మున్సిపాలిటీలో షాప్‌ అలాట్‌మెంట్‌ కోసం వండాన కూర్మారావు అనే వ్యక్తి నుంచి రూ.20వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈయన మున్సిపాలిటీలో పందులు పట్టించి, దాన్ని మాంసం కోసం వేరే వ్యక్తులకు అమ్మేశారన్న కథనం ‘సత్యం’ పాఠకులకు తెలుసు.


ఇప్పుడు తాజాగా 2024లో సామంచి సర్వేశ్వరరావు కమిషనర్‌గా వచ్చారు. ఈయన అక్కడ ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్‌ రౌతు భారతి నుంచి లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులకు కొద్ది రోజుల క్రితం చిక్కారు. వాస్తవానికి ఇక్కడ కమిషనర్‌ సర్వేశ్వరరావు డాక్టర్‌ భారతికి మున్సిపాలిటీ పరంగా చేసిన ఫేవర్‌ లేదు. తన ఆధ్వర్యంలో డెలివరీ అయిన ఒక బిడ్డకు సంబంధించి డేటాఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ కోసం మున్సిపల్‌ కార్యాలయానికి సమర్పించిన డేటాను డాక్టర్‌ భారతి తప్పుగా పంపించారు. దీంతో బిడ్డ తండ్రి తమ బర్త్‌ సర్టిఫికెట్‌ తప్పుగా వచ్చిందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే, ఆయన డాక్టర్‌ భారతికి రూ.500 ఫైన్‌ వేసి వదిలేశారు. కానీ బిడ్డ తండ్రి మాత్రం ఆర్టీఐ ద్వారా తప్పు ఎక్కడ జరిగిందనేది తేల్చి, ఆర్టీఐ కమిషనర్‌కు నేరుగా అప్రోచ్‌ అయ్యారు. దీంతో డాక్టర్‌ భారతి నుంచి వచ్చిన డేటా తప్పని, దాని వల్లే డేటాఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌ తప్పుగా వచ్చిందని ఆర్టీఐ కమిషనర్‌ ముందు చెప్పడానికి సామంచి సర్వేశ్వరరావు చెప్పాల్సి ఉంది. అయితే ఇక్కడ భారతికి ఫేవర్‌గా ఆర్టీఐ కమిషనర్‌కు చెప్పడం కోసమే లంచం అడిగారని ఏసీబీ అధికారులు గుర్తించినా, మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన తతంగం కాబట్టి, అది కూడా డేటాఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌తో ముడిపడి ఉంది కాబట్టి ఈయన్ను కూడా రిమాండ్‌కు పంపారు. వీరు కాకుండా మరో ఇద్దరిపై ఏసీబీకి గతంలో ఫిర్యాదులు వచ్చాయి. కానీ అక్కడికి వెళ్లే లోపు వాతావరణం మారిపోవడంతో వీరు తప్పించుకున్నారు. లేదంటే పాలకొండలో పని చేసిన కమిషనర్లకు శతశాతం ఏసీబీ రికార్డు దక్కుండేది. ఒక్కోసారి ఏసీబీ ట్రాప్‌ నుంచి విచిత్రంగా అధికారులు బయటపడుతుంటారు.

2016 ఆగస్టులో రాజాం కమిషనర్‌ పొందర సింహాచలం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బుక్కయ్యారు. వాస్తవానికి ఆయన్ను 2011లో ఒకసారి, 2013లో మరోసారి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ పట్టుకోవాల్సింది. 2011లో ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి, ఆ తర్వాత దాన్ని వెనక్కు తీసుకోవడంతో ఏసీబీ వెనక్కు వచ్చేసింది. 2013లో ఫిర్యాదుదారుడితో అక్కడ డబ్బులు ఇప్పస్తూ ఇక్కడి నుంచి బయల్దేరిన ఏసీబీ అధికారులకు పొందూరు వద్ద ఫ్లైఓవర్‌ లేకపోవడంతో రెండు రైళ్లు వచ్చిపోయే రైల్వేగేట్లు పడిపోయాయి. దీంతో అధిక సమయం అక్కడే పోయింది. ఈలోగా ఫిర్యాదుదారుడి నుంచి సింహాచలం సొమ్ములు తీసుకోవడం, ఆ తర్వాత ఎంచక్కా వెళ్లిపోయారు కూడా. ఇలాంటిదే పాలకొండలో ఇద్దరు కమిషనర్ల వ్యవహారంలో కూడా జరిగింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page