పట్టుకొని పోలీసులకు అప్పగించిన శంకర్
ఉక్కుపాదం మోపాలని ఆదేశం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గంజాయి సేవిస్తున్న ఇద్దరిని ఎమ్మెల్యే గొండు శంకర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోని ఇద్దరు యువకులు గంజాయి సేవిస్తుండగా ఎమ్మెల్యే శంకర్ పట్టుకోవడం పట్ల నగరంలో చర్చ సాగుతోంది. పొట్టిశ్రీరాములు పెద్ద మార్కెట్‌లో మంగళవారం పర్యటించిన ఎమ్మెల్యే అధికారులతో కలిసి నిరుపయోగంగా ఉన్న మార్కెట్ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భవనంపై అనుమానాస్పదంగా ఉన్న దమ్మలవీధికి చెందిన ఇద్దర్ని ఎమ్మెల్యే గుర్తించారు. వారిని ఎమ్మెల్యే శంకర్, ఆయన సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించి, తనిఖీ చేయగా వారు గంజాయి సేవిస్తున్నట్టు బయటపడిరది. దీంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫోన్ చేసి ఇద్దరు యువకులను అప్పగించారు. పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి నుంచి గంజాయిని, సేవించడానికి వినియోగిస్తున్న బాటిల్, గంజాయి దట్టించిన గొట్టం, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. గంజాయి ఎక్కడ నుంచి తీసుకువచ్చారు తదితర సమాచారాన్ని వారి నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. గంజాయి సేవిస్తున్న యువకులను పట్టుకున్నట్టు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చినా సకాలంలో స్పందించాల్సిన పోలీసులు ఆలస్యంగా రావడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్ సమీపంలోని పెద్దమార్కెట్‌లో నిరుపయోగంగా ఉన్న భవనాలపైన అసాంఘిక కార్యాకలాపాలు యదేచ్ఛగా సాగుతున్నాయని చెప్పడానికి అక్కడ ఖాళీ మద్యం సీసాలే నిదర్శనమని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. రోజుకు 16 గంటలు రద్దీగా ఉండే పెద్దమార్కెట్‌లో గంజాయి సేవించడానికి యువకులు అడ్డాగా మార్చుకున్నారనడానికి ఈ వ్యవహారమే నిదర్శనమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి విక్రయించేవారిపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ఆదేశించారు. మాదకద్రవ్యాల, గంజాయి వంటి మత్తు పదార్థాలు మార్కెట్లో సరఫరా కావడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మాదకద్రవ్యాలను నియంత్రించడానికి పోలీసు వ్యవస్థ గట్టి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. నగరంలోని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా పోలీసు వ్యవస్థ సంకల్పం పేరుతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. యువతలో ఇంకా మార్పు రావట్లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రజలు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం మార్కెట్‌ను పరిశీలించి పెద్దమార్కెట్ స్వరూపాన్ని మార్చేందుకు కృషి చేస్తానన్నారు. అవసరమైతే అసెంబ్లీలో మార్కెట్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడుతో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని వ్యాపారులు హమీ ఇచ్చారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్‌లో పారిశుధ్యం పూర్తిస్థాయిలో మెరుగుగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశించారు.

Commentaires