ఎరువుల వ్యవస్థలపై యుద్ధం దరువు!
- DV RAMANA

- Mar 10
- 3 min read
పెట్రో ముప్పు కంటే ఇదే ప్రమాదకరం
ఎరువుల తయారీకి గ్యాస్, ఉప ఉత్పత్తులే ఆధారం
అవి నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడమూ కష్టమే

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మధ్యప్రాచ్యంలో యుద్ధజ్వాలలు. ఇరాన్‌పై ఇజ్రాయెల్`అమెరికా సంయుక్త దాడులు, ఇరాన్ ప్రతిదాడులు.. ఫలితంగా ప్రపంచం మొత్తానికి ఇంధనం సరఫరా చేసే గల్ఫ్ దేశాల్లోని ముడిచమురు, గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలు, రిఫైనరీలో మంటల్లో చిక్కుకుని నాశనమవుతున్నాయి. దీనికితోడు ప్రపంచ ఆయిల్ సరఫరాలో 20 శాతం వరకు రవాణా చేస్తున్న హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం పరిస్థితిని మరింత దుర్భరం చేసింది. ఆయిల్ కొరత ఏర్పడితే దాని ప్రభావం దాదాపు అన్ని రంగాలపైనా పడుతుంది. ఆయిల్ ధరలతోపాటు రవాణా ఛార్జీలు, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. దాంతో అన్ని నిత్యావసర వస్తువులకు ఆ మంట అంటుకుంటుంది. ఈ పరిణామాలు అన్ని దేశాలను, ప్రజలను భయపెడుతున్నాయి. కానీ మరో ముప్పును ఎవరూ ఊహించడం లేదు. దానికి ప్రత్యామ్నాయాలు కూడా ఆలోచించడం లేదు. అదే ఎరువుల కొరత. ఆధునిక వ్యవసాయంలో అవే కీలక వనరులు. అవి లేకుండా పంటల సాగును ఊహించలేం. అయితే యుద్ధానికి, ఎరువుల కొరతకు సంబంధం ఏమిటన్న సందేహం కలగవచ్చు. సంబంధం కచ్చితంగా ఉంది. ముడిచమురు, సహజ వాయువుతో పలు రసాయనిక ఎరువులు ఉత్పత్తి అవుతున్నాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో జర్మన్ రసాయన శాస్త్రవేత్తలు ఫ్రిట్జ్ హేబర్, కార్ల్ బాష్ ఒక రసాయన విప్లవాన్ని సష్టించారు. రసాయనిక ప్రక్రియ ద్వారా మిథేన్‌ను అమ్మోనియాగా, అమ్మోనియాను యూరియా వంటి నత్రజని ఎరువులుగా మారుస్తారు. ప్రపంచ జనాభాకు అవసరమైన గోధుమలు, మొక్కజొన్న, వరి దిగుబడులు ఈ ఎరువుల వల్లే పెరుగుతాయి. లేకపోతే దిగుబడులు భారీగా పడిపోతాయి.
పర్షియన్ గల్ఫ్‌లోనే చవక
ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు, అమ్మకాలు జరిగే యూరియాలో మూడింట ఒక వంతు హోర్ముజ్ జలసంధి నుంచే రవాణా అవుతుంది. ఈ వ్యవస్థకు పర్షియన్ గల్ఫ్ కేంద్రంగా ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయి. అమ్మోనియా ఉత్పత్తికి అవసరమైన చౌకైన సహజ వాయువు ఇక్కడ లభిస్తుంది. అలాగే దశాబ్దాలుగా ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో అమ్మోనియా, యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి భారీ పెట్టుబడులు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే నత్రజని ఎరువులు, ఇతర దేశాల్లోని ఎరువుల ప్లాంట్లకు అవసరమైన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎలఎన్‌జీ) హర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించాల్సిందే. దీని మూసివేత వల్ల అమ్మోనియా, యూరియా, ఎలఎన్‌జీ రవాణా నిలిచిపోవచ్చు లేదా రవాణా ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరగడం వల్ల అవి విపరీతంగా ప్రియం కావచ్చు. దీని ప్రభావం రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా పంటపొలాల్లో కనిపిస్తుంది. నత్రజని వాడకం స్వల్పంగా తగ్గినా, దిగుబడిలో భారీ తగ్గుదల కనిపిస్తుంది. దీనివల్ల లక్షలాది టన్నుల పంట నష్టం వాటిల్లవచ్చు. దీని ప్రభావం పశుగ్రాసం, పశువుల ఉత్పత్తి, బయో ఫ్యూయల్స్, చివరికి ఆహార ధరలపై పడుతుంది.
సొంత వ్యవస్థ ఇప్పటికిప్పుడు అసాధ్యం
కొన్ని దేశాల వద్ద ఎరువుల నిల్వలు ఉన్నా.. కానీ నిల్వలు పెంచుకోవడం ఇతర దేశాలకు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. భారతదేశం తన యూరియా ప్లాంట్లను నడపడానికి పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే ఎనఎన్‌జీ దిగుమతులపై ఆధారపడుతుంది. బ్రెజిల్ సోయాబీన్, మొక్కజొన్న ఉత్పత్తికి దిగుమతి చేసుకున్న ఎరువులపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల ఉత్పత్తిదారులలో ఒకటైన అమెరికా కూడా ప్రాంతీయ డిమాండ్‌ను తీర్చడానికి అమ్మోనియా, యూరియాను దిగుమతి చేసుకుంటుంది. నత్రజని మాత్రమే కాకుండా మొక్కల ఎదుగుదలకు అవసరయ్యే సల్ఫర్ చమురు, గ్యాస్ శుద్ధి చేసే ప్రక్రియలో ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. చమురు ఉత్పత్తి, రవాణా నిలిచిపోతే.. ఆ ప్రభావం సల్ఫర్ ఉత్పత్తిపై కూడా పడుతుంది. కృత్రిమ నత్రజని(నైట్రోజన్) లేకపోతే ఆహార ఉత్పత్తి పడిపోతుంది. చమురు ధరలు పెరిగిన వెంటనే ఆ ప్రభావం తెలిసిపోతుంది. కానీ ఎరువులు కొరత, ధరలు పెరగితే ఆ ప్రభావం వెంటనే తెలియదు. ముందు రైతులు దాని బారిన పడతారు. వారు పండించే ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. అప్పుడే ఆ ప్రభావం ప్రజలకు తెలిసి వస్తుంది. వాస్తవం చెప్పాలంటే చమురు సంక్షోభం కంటే ఆహార సంక్షోభం చాలా ప్రమాదకరం.
మనపైనే ఎక్కువ ప్రభావం
ఎరువుల కొరత ప్రపంచం మొత్తాన్ని పీడించే తీవ్ర సమస్య. కాకపోతే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద యూరియా వినియోగదారు అయిన భారత్‌పై ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
`దేశీయ అవసరాల కోసం మన ప్రభుత్వం గల్ఫ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల నుంచి వచ్చే ఎలఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్)పై ఎక్కువగా ఆధారపడుతున్నది. ఇప్పుడు అవి నిలిచిపోతే ఎరువుల తయారీ ఖర్చు విపరీతంగా పెరుగుతుంది.
`ప్రభుత్వం రైతులకు ఎరువులను సబ్సిడీ ధరలకు అందిస్తుంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఆటోమేటిగ్గా సబ్సిడీల భారం పెరిగి ఆర్థిక లోటుకు దారితీస్తుంది.
`పంట ఎదుగుదలకు నత్రజని అవసరం. అది దొరక్కపోతే దిగుబడులు భారీగా పడిపోతాయి.
`వరి, గోధుమ వంటి ప్రధాన పంటల సాగులో యూరియా వాడకం చాలా ఎక్కువ. యూరియా లేకపోతే దిగుబడులు 20 నుంచి 30 శాతం తగ్గుతుందని నిపుణుల అంచనా. దిగుబడి తగ్గితే మార్కెట్‌లో బియ్యం, గోధుమల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు.
ప్రత్యామ్నాయాలు అంతంతే
చమురును రష్యా, ఆఫ్రికా వంటి ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవచ్చు, కానీ ఎరువుల తయారీకి అవసరమైన గ్యాస్, మౌలిక సదుపాయాలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నంత చౌకగా మరెక్కడా లేవు. వాటిని దిగుమతి చేసుకోవడం ఆర్థికంగా భారమవుతుంది. చమురు సంక్షోభం రవాణాను ఆపేస్తే, ఎరువుల సంక్షోభం ఆహార భద్రతను దెబ్బతీసి మనుగడను సవాల్ చేస్తుంది. అందుకే ప్రపంచదేశాలు ఇంధన భద్రతపై కంటే ఎరువుల సరఫరా గొలుసును (సప్లై చైన్) కాపాడుకోవడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం ఈ దిశగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎలఎన్జీ, ఎరువులపై ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా రష్యా, మొరాకో, కెనడా వంటి దేశాలతో ముందే దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటోంది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు కోసం దేశవ్యాప్తంగా ఎరువులను నిల్వ చేయడం ప్రారంభించింది. నానో యూరియా వంటి ప్రత్యామ్నాయ మార్గాలపైనా దష్టి సారించింది.






Comments