జాగింగ్ చేసేవారినీ పతుగెత్తిస్తున్న భైరవులు
ప్రభుత్వాసుపత్రుల్లో యాంటీ రేబిస్ కరువు
కుక్కల సంఖ్య పెరగడానికి కారణమేంటి?
చర్మవ్యాధులకు కారణం బిస్కట్లేనంటున్న వైద్యులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మాయదారి కుక్కలు మార్నింగ్ వాక్‌కు వెళ్తుంటే రన్నింగ్ రేస్‌లో పాల్గొనేవాడిమళ్లే పరుగెత్తిస్తున్నాయి. పోనీ బైక్‌పై వెళ్తుంటే వెంటబడి తిరగేసేస్తున్నాయి. పిల్లల్ని వీధిలోని దుకాణానికి పంపితే, వారు ఇంటికి వచ్చేసరికి కుక్కల కారణంగా చిన్న గాయమైనా తగిలించుకోక తప్పడంలేదు. వారి సంగతి సరేసరి.. పెద్దవారు, అందులోనూ వీధిలోనివారమే కదాని బయటకు వస్తే ఎవరైతే నాకేంటన్న రీతిలో అవి వెంటపడుతున్నాయి. దీని గురించి పట్టించుకునేవారే లేరు. గతంలో మెర్సీ చూపకుండా కుక్కల్ని పట్టి చంపించేవారు. ఇప్పుడు గ్రీన్‌మెర్సీ పుణ్యమాని వాటి సంఖ్య పెరిగిపోయింది. ఇటీవల కుక్కలకు కు.ని. చికిత్స చేసి వీధుల్లో వదిలేస్తున్నారట. అదే నిజమైతే కుక్కల సంఖ్య ఇంత విచ్చలవిడిగా ఎందుకుంటుంది? అయితే గతంలో ఏడాది ఒకసారి పిల్లలు పెట్టే కుక్కలు ఖరీఫ్, రబీ పంటల మాదిరిగా ఏడాదికి రెండుసార్లు ఈనేస్తున్నాయి. మరి వాటికి కు.ని. చికిత్సలు చేస్తున్నారో, లేక కుక్కల సంఖ్య పెరగడానికి వయాగ్రా వేసి పంపుతున్నారో వారికే ఎరుక. ఇకపోతే టౌన్‌లో ఎక్కడ చూసినా కుక్కల చర్మంపై జుట్టు ఊడిపోయి పొట్టు రాలుతోంది. సరిగ్గా చెప్పాలంటే శంకర్ దర్శకత్వం వహించి విక్రం హీరోగా నటించిన ‘ఐ’ సినిమాలో హీరో మాదిరిగా ఒళ్లంతా ముడతలమయమై కనిపిస్తున్నాయి. పక్కనుంచి వెళ్తుంటే కంపు కొడుతున్నాయి. పెంచుకున్న కుక్క ప్రేమతో పళ్లు నాటితేనే వైజాగ్‌లో తండ్రీకొడుకులు చనిపోయిన విషయం అందరికీ విదితమే. ఇక వీధి కుక్కలు, అందులోనూ గజ్జితో నిండినవి, ఎవరూ ఎప్పుడూ ఒక్క ఇంజక్షన్ కూడా వేయనివి కరిస్తే మన పరిస్థితి ఏమిటి? అసలే ప్రభుత్వాసుపత్రుల్లో యాంటీ రేబిస్ ఇంజక్షన్లు లేవని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈమధ్య జంతుకారుణ్యం మనోళ్లకి బాగా పెరిగింది. కొందరు కుక్కల ప్రేమికులు బిస్కట్లు తెచ్చి ప్రతీ సెంటర్‌లోనూ వాటికి మేపుతున్నారు. వీరు వచ్చేవరకు భైరవులు పదుల సంఖ్యలో ఉండటమే కాకుండా, అటు ఇటు వచ్చి వెళ్లేవారిని గాయపరుస్తున్నాయి. అయితే కుక్కలకు చర్మవ్యాధులు రావడానికి ఈ బిస్కట్లే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వీటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.
Commentaires