top of page

ఎవరీ అశ్విని వైష్ణవ్‌?

Writer: DUPPALA RAVIKUMARDUPPALA RAVIKUMAR
  • ఒడిషా కేడర్‌ ఐఏఎస్‌ అధికారి, వాజ్‌పేయి ప్రైవేట్‌ కార్యదర్శి

  • కార్పొరేట్‌ కంపెనీల బాస్‌, ఒడిషా భూ ఆక్రమణ కేసుల్లో ముద్దాయి

  • ప్రస్తుతం మూడు మంత్రి పదవులు నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు


మొన్న జూన్‌ 17న పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగ్‌ జిల్లాలో రైలు ప్రమాదం జరిగినపుడు మోటార్‌సైకిల్‌ మీద ప్రమాద స్థలానికి వచ్చేసి హడావిడి సృష్టించిన కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రచారంలో మోదీని మించిపోయారని విమర్శకులు తిట్టిపోశారు. కాని అతనేమీ లాల్‌బహదూర్‌ శాస్త్రి కాదు కదా! అందుకే రైలు ప్రమాదాలు ఎన్ని జరిగినా నిమ్మకు నీరెత్తినట్టే ఉంటాడాయన. ఎక్కడో సాంకేతిక కారణంతో 1956లో రైలు ప్రమాదం జరిగితే ఒకసారి కాదు రెండుసార్లు రాజీనామా చేసిన చరిత్ర ఆ శాస్త్రిది. దీనికి భిన్నంగా ఇప్పటి మన రైల్వేమంత్రి ప్రధాని ఆలోచనలను ముందుకు తీసుకుపోవాలని నిరంతరం తహతహలాడే మనిషి. ఎగువ మధ్యతరగతి, ధనవంతుల రైలు ప్రయాణాలు మరింత సుఖవంతంగా ఎలా ఉండాలని నిరంతరం ఆలోచించే మనిషి. బీదవారి సంగతి ఎందుకులెండి. అయినా వారెందుకు రైలు ప్రయాణాలు చేస్తారని? డార్జిలింగ్‌ సంఘటన తర్వాత ప్రతిపక్షం ఆయనను రైల్వే మంత్రి అని కాకుండా రీల్‌ మంత్రి అనే పిలుస్తున్నారు. అంటే ఎగతాళిగా కాదు. సీరియస్‌గా! ఎందుకంటే ఆయన కొన్ని వందల రీల్స్‌ చేసి ఇన్‌స్టాలో వదిలారు. ప్రొఫెషనల్స్‌తో రీల్స్‌ తీయించి, సోషల్‌ మీడియాలో వదిలిన తీరు చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. పేదవారు ప్రయాణం చేయలేని అత్యంత వేగవంతమైన, అంతా ఎయిర్‌కండిషన్‌తో కూడిన వందేభారత్‌ రైలు బళ్లు ఆయన చలవేనని మనం నమ్ముతాం. గత మూడేళ్లలో ఆయన దయవల్లనే భారత రైల్వే జ్వాజ్వాలమానంగా వెలుగొందుతుందని మనకు కళ్లు విచ్చుకుంటాయి.

 రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదమది

అంతకు ఏడాది ముందు ఒడిషా రాష్ట్రం బాలాసోర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 296 మంది మరణించగా, 1200 మంది క్షతగాత్రులయ్యారు. భారత రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదమది. దురదృష్టవశాత్తూ అక్కడ కూడా ఆయన షో మానలేదని అప్పటి పత్రికలు విమర్శించాయి. ఆ ప్రమాదం మీద సిబిఐ విచారణ జరిపింది. తలెత్తిన సాంకేతిక సమస్యలను అధిగమించడానికి రాజకీయ పరిష్కారం కనుగొనాలని సిఫారసు చేసింది. ఆ శిథిలాల నుంచి క్షతగాత్రలను మోస్తూ, తళతళలాడిపోయే శ్వేతవస్త్రాలు ధరించి ఆయన ఫోటోలు దిగారు. తర్వాత కాసేపటికి రోడ్డు మీద కొబ్బరిబొండాం తాగుతూ ఒడిషా రైతులతో ప్రమాదం గురించి ముచ్చట్లు చెపుతూ ఫోటోలు పత్రికలో వచ్చాయి. చాలా విచిత్రంగా అంతకు ముందు యుపిఏ హయాంలో రైల్వే మంత్రులుగా పనిచేసిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌, మమతా బెనర్జీ చేసిన తప్పిదాలే ఇప్పటి ప్రమాదాలకు కారణమని ఆయన చెప్తుంటే, భారతీయ జనతా పార్టీ ఆ వ్యాఖ్యలు తమ పార్టీకి మేలు చేస్తాయనే నమ్మింది. అందుకే మందలించలేదు. సరికదా, మరి రెండు మంత్రిత్వ శాఖలు కట్టబెట్టింది.

రాజ్యసభ సభ్యునికి మూడు మంత్రిత్వ శాఖలు

2019లో తొలిసారి రాజ్యసభకు అశ్విని వైష్ణవ్‌ ఎంపికవ్వడమే చాలా నాటకీయంగా జరిగింది. ఆ ఏడాది రాజ్యసభలో ఒడిషా నుంచి ఖాళీ అయిన మూడు స్థానాలకు బిజెపి, బిజెడి పార్టీల ఉమ్మడి అభ్యర్థి అశ్విని కావడం విశేషం. వాజ్‌పేయి ప్రధానిగా పనిచేసిన కాలంలో ఆయనకు ప్రైవేట్‌ కార్యదర్శిగా పనిచేసిన అశ్వినిని బిజెపి ప్రతిపాదించింది. అప్పటి ఒడిషా ముఖ్యమంత్రి సమర్ధించారు. దాంతో అశ్విని రాజ్యసభలో అడుగుపెట్టారు. కొద్దికాలానికే కేంద్ర మంత్రి పదవి వరించింది. అయితే అప్పటికి బిజెడికి తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ బిజెపి ప్రతిపాదించిన అభ్యర్థిని ఎలా రాజ్యసభకు పంపారో ఇప్పటికీ వీడని చిక్కుముడి. రాజ్యసభకు అశ్విని వైష్ణవ్‌ ఎంపికైనప్పుడు ఒడిషా విధానసభలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేత నరసింగ మిశ్రా అశ్వినికి, ఒడిషా మైనింగ్‌ మాఫియాకు సంబంధాలున్నట్టు ఆరోపించారు. ఒడిషాలో సహజసంపద దోచుకోవడానికి వత్తాసు పలికిన మనిషిని రాజ్యసభకు పంపడం సిగ్గుచేటని అభివర్ణించారు. బిజూ పట్నాయక్‌ దీనిగురించి కూడా మౌనం పాటించారు.

రెండవసారి రాజ్యసభకు

ఫిబ్రవరి 2024లో రెండవసారి కూడా ఆయన రాజ్యసభకు ఉమ్మడి అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. తర్వాత బిజు`మోదీ సంబంధాలు బీటలు వారాయి. మొన్నటి ఎన్నికలలో తమను చావుదెబ్బ కొట్టిన బిజెపిని ఇప్పుడు బిజెడి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజ్యసభలో తమ 9 మంది ఎంపీలు మోదీ ప్రభుత్వానికి తీవ్రంగా వ్యతిరేకిస్తారని మొన్నటి ఎన్నికల తర్వాత బిజూ వ్యాఖ్యానించారు. నిజానికి వైష్ణవ్‌ ఫక్తు రాజకీయ నాయకుడు కాదు. 1994 బ్యాచ్‌ ఒడిషా కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. తన కెరియర్‌ అంతా ఎంత వివాదాస్పందగా ఉన్నా ఇంతింతై వటుడిరతై అన్నట్టుగా ఆయన ఎదిగిపోయారు. 2003లో కేంద్ర సర్వీసుకు వెళ్లిన వెంటనే వాజ్‌పేయి ప్రభుత్వంలో పిఎంఓలో డెప్యుటి సెక్రటరీగా చేరారు. అప్పటికి అక్కడ జాయింట్‌ సెక్రటరీగా ఉన్న అశోక్‌ సైకియా ఈయనను అక్కడికి తీసుకువెళ్లారని చెప్తారు. కాని 2004లో వాజ్‌పేయి ప్రధానిగా వైదొలిగారు. అయినా, ఆయనకు ప్రైవేట్‌ కార్యదర్శిగా అశ్విని కొనసాగారు. 2006లో గోవాలోని మార్ముగావ్‌ పోర్ట్‌ ట్రస్ట్‌కు చేరారు. రెండేళ్ల తర్వాత స్టడీలీవ్‌ మీద అమెరికాలో వార్టన్‌ బిజెనెస్‌ స్కూల్‌లో ఎంబిఏ చేసారు. అటునుంచి వచ్చాక సివిల్‌ సర్వీసులకు సెలవు చెప్పేశారు. కార్పొరేట్‌ కంపెనీలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో చేరారు. జనరల్‌ ఎలక్ట్రిక్‌, సీమెన్స్‌ కంపెనీలలో పనిచేసారు. 2012లో గుజరాత్‌ చేరి, అక్కడ ఆటోమొబైల్‌ పరిశ్రమ స్థాపించి, పారిశ్రామికవేత్త అయ్యారు.

ఆదినుంచీ వివాదాస్పదుడే!

రాజ్యసభ సభ్యుడు అయ్యాక 2021లో రైల్వేమంత్రిగా ప్రధానమంత్రి అవకాశమిచ్చారు. సాధారణంగా రైల్వేశాఖ రాజకీయాల్లో మల్లగుల్లాలు పడ్డవారికే దక్కుతుంది. అలాంటి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి దక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వారి నోళ్లు మరింత సాగిపోయేటట్టు మన ప్రధాని వ్యవహరించారు. ఆయన కష్టపడే తత్వం తెలుసుకున్న ప్రధాని మరో రెండు శాఖలు క్రమంగా అప్పజెప్పారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒక రాజ్యసభ సభ్యుడు మూడు శాఖలకు కేబినెట్‌ మంత్రి కావడం ఇదే ప్రథమం. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలతో పాటు ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ కూడా ఆయనకే అప్పజెప్పారు. దీనిబట్టే ఆయన మోదీకి ఎంత దగ్గర మనిషో మనకు అర్థమవుతుంది. 2024 ఎన్నికల తర్వాత కమ్యూనికేషన్స్‌ శాఖను జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగించి, అశ్విని వద్ద ఇన్ఫర్మేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ శాఖలుంచారు. రైల్వే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందువరకూ అశ్విని పలు కంపెనీలలో కీలక పదవుల్లో ఉండేవారు. అందులో తమిళనాడుకు చెందిన బి.ప్రభాకరన్‌ కంపెనీలు కొన్ని కాగా, మరికొన్ని సజ్జన్‌ జిందాల్‌ కంపెనీలు. వీరిద్దరితోనూ అంటకాగి, అనతికాలంలోనే అద్భుతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగిన అశ్విని మంత్రి అయ్యాక ఆ కంపెనీలకు దూరమయ్యారు.

వివిధ కార్పొరేట్‌ సంస్థలలో ఆయన తన పదవులకు రాజీనామా చేసేసారే గాని, ఆయన కుటుంబ సభ్యులంతా ఇంకా చాలా కంపెనీల్లో పదవులు నిర్వరిస్తున్నారు. ఆయన భార్య సునీతా వైష్ణవ్‌, కొడుకు రాహుల్‌ వైష్ణవ్‌, కుమార్తె తాన్యా వైష్ణవ్‌ ఇప్పటికీ గురుగ్రామ్‌, హర్యానా, ఢల్లీి శివార్లలో ఉన్న కంపెనీలలో కీలక పదవుల్లో ఉన్నారు.

 సమాచార శాఖ మంత్రి అయిన తర్వాత

అశ్విని జులై 2021లో సమాచార శాఖ మంత్రి అయిన తర్వాత పెగాసస్‌ కుంభకోణం బయటపడిరది. ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్‌ కంపెనీ దగ్గర కొన్న సాఫ్ట్‌వేర్‌తో రాజకీయ నేతల, ప్రత్యర్థుల ఫోన్లు టాపింగ్‌లో ఉన్నాయని వైర్‌ ప్రచురించిన కథనం ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక కథనంలో ఆయన మంత్రి కాకమునుపు ఆయన ఫోన్లో కూడా ఈ పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉన్నట్టు ఆరోపించింది. ఆ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండిరగ్‌లో ఉంది. రైల్వే మంత్రి అయిన తర్వాత ఆ శాఖలో ఉద్యోగాల నియామకాలను ఆపేసారని పలు రాష్ట్రాలలో యువత ఆందోళనలు చేసింది. మొక్కుబడిగా నియామక ప్రకటనలు జారీ చేయడం, భర్తీలో అలవికాని జాప్యం చేస్తారని గొప్ప పేరు గడిరచారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచబడుతుందనే సామెతను నమ్మిన అశ్విని భారతీయ రైల్వేలో నూతన ఉద్యోగాలు అవసరం లేదని నమ్ముతారు. సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌లో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారో తెలియదు కాని దీర్ఘకాలం సివిల్‌ సర్వెంటుగా పనిచేసిన ఒడిషా రాష్ట్రంలో అనేక స్థల వివాదాల్లో ఆయన పేరున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page