top of page

ఎవరు అసలు.. ఎవరు నకిలీ?

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Apr 17
  • 2 min read
  • పలాస భూవివాదం సరికొత్తగా తెరపైకి

  • తామే వారసులమంటూ ఇప్పటికే ఇద్దరి వాదులాట

  • వారితో చాటుమాటు ఒప్పందానికి ఓ వర్తకుడు రెడీ

  • ఇంతలో తానే వారసుడినంటూ మూడో కష్ణుడి రంగప్రవేశం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

చిరంజీవి, జంధ్యాల కాంబినేషన్‌లో వచ్చిన చంటబ్బాయ్ సినిమా చూశారా? అందులో జగ్గయ్య వారసుడు ఎవరని ఎంక్వైరీ మొదలుపెడితే.. అది కాస్త లీకై వారసులం తామంటే తామేనంటూ చంద్రమోహన్, శ్రీలక్ష్మి, సుధాకర్, కష్ణవేణి ఆ ఇంట్లోకి ఎంటరవుతారు. బాలకష్ణ, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్‌లో వచ్చిన గాండీవం సినిమాలో కూడా వారసుడ్ని వెతికే ప్రయత్నంలో చివరకు బ్రహ్మానందం కూడా తన బిడ్డేనేమోనన్న అనుమానం నాగేశ్వరరావుకు కలిగించే విధంగా సినిమా కథ నడిపారు. సరిగ్గా ఇలాంటి కథే పలాస`కాశీబుగ్గలో రెండేళ్లుగా నడుస్తోంది. స్థలాల ధరలకు రెక్కలు రావడంతో కొందరు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి తమదేనంటూ ఆక్రమించుకోవడం మొన్నటికి మొన్న రాగోలులో చూశాం. ఇలాంటివి అనేకం విన్నాం, పత్రికల్లోనూ చదివాం. అలాగే ఎప్ప్పుడో ఊరు డెవలప్ కానప్ప్పుడు దఖలుపడిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియక వాటి వివరాలు వారసులకు చెప్పక కొన్ని తరాలు మరణిస్తే, ఇప్ప్పుడు వాటికి కాగితాలు పుట్టించి సొంతం చేసుకుని కోట్లు కూడేసుకోవాలని చూస్తున్నవారి కథ ఇది.

ఒకరిని మించి మరొకరు

పలాస`కాశీబుగ్గ మెయిన్ రోడ్డు (కేటీ రోడ్డు)లోని సర్వే నెంబరు 219/3లో 565.5 చదరపు అడుగుల స్థలం ఉంది. దీనికి అసలు వారసులెవరో ఇంతవరకు తెలియదు. కానీ దాదాపు మూడు దశాబ్దాల నుంచి రామారావు అనే వ్యక్తి అక్కడ టీకొట్టు పెట్టుకొని జీవనం సాగించాడు. ఇన్నేళ్లయినా ఈ స్థలం వద్దకు ఎవరూ రాకపోవడం చూసి అది తనదేనంటూ తన కుమారుడు రాజు పేరు మీద రాసిచ్చేశాడు. అంటే.. ఒక డాక్యుమెంట్ అదనంగా చేరినట్టు. సదరు రాజు 2025 జనవరిలో ఆ స్థలాన్ని రొక్కం సాయి అనే వ్యక్తికి అమ్మేశాడు. అంటే మరో డాక్యుమెంట్ చేరి రామారావు వైపునున్న పత్రాలు గట్టయిపోయాయి. కట్ చేస్తే.. మందస మండలానికి చెందిన యు.మన్మధరావు తనకు ఇదే స్థలాన్ని అమ్మారంటూ మాజీ కౌన్సిలర్ బోర బుజ్జి 2024 డిసెంబర్‌లో తన పేరిట జరిగిన రిజిస్ట్రేషన్ పత్రాలు బయటపెట్టారు. అంటే టీకొట్టు రామారావు కొడుకు రాజు రొక్కం సాయికి అమ్మిన దానికంటే ముందే తనకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పినా ఆయన చూపిన డాక్యుమెంట్‌లో సర్వే నెంబరు 225/1 అని ఉంది. కానీ ఈ నెంబరులో ఎటువంటి ఖాళీ స్థలం లేదు. అయితే హద్దులు, విస్తీర్ణం, భౌగోళిక స్వరూపం అంతా సేమ్ టు సేమ్. దీంతో ఈ స్థలం మాదంటే మాదన్న వివాదం మొదలైంది. కానీ వీరిద్దరిదీ కాదని స్థానికులకు తెలుసు. ఇదే విషయం ‘సత్యం’ ఇంతకు ముందు కథనాలు ప్రచురించింది. దీంతో ఎక్కడి శక్తులు అక్కడ గప్‌చుప్ అయిపోయాయి. ఇప్ప్పుడు తాజాగా రొక్కం సాయి, బుజ్జిలను ఒప్పించి స్థానిక బంగారు వర్తకుడు ఒకరు దీన్ని రూ.2 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేయడానికి, ఆ సొమ్మును ఇద్దరికీ సమానంగా సర్దేలా ఒక ఒప్పందానికి వచ్చారట. సరిగ్గా అదే టైమ్‌లో ఈ స్థలం తమదంటూ మందస మండలం వీఆర్‌పురం గ్రామం అడ్రస్‌తో ప్రస్తుతం ఒడిశాలో నివాసముంటున్న ఉపేంద్ర పట్నాయిక్ వారసులు పాత డాక్యుమెంట్లు పట్టుకొని రంగప్రవేశం చేశారు. పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు సాయి, బుజ్జి డబ్బులు సర్దుకుంటే.. అందులో కొంత చూసీచూడనట్లు వ్యవహరించినందుకు తామూ నొక్కేద్దామని చూసినవారు ఇప్ప్పుడు మూడో కష్ణుడు ఎంటరవడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారట.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page