top of page

ఎవరి గోల వారిది..!

Writer: DV RAMANADV RAMANA

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో ప్రధాని మోదీ ముచ్చట్లను దేశమంతా చూసింది. పవన్‌ విలాసంగా వినోదంగా స్పందించగా, చంద్రబాబు వినమ్రంగా ప్రత్యేక గౌరవంతో ప్రతిస్పందించడం కూడా కనిపిం చింది. ఈ ఘట్టానికి ముందు పవన్‌ మూడడుగులు గుర్తు చేసుకోవాలి. దక్షిణాది తీర్థయాత్ర, మహా కుంభలో స్నానం, బీజేపీ వ్యతిరేక నేతలపై దాడి, వెంటనే ఢిల్లీలో ప్రత్యక్షం కావడం ఒక వరసలోవే. ఆ వేదికపై మోదీ ఆయన్ను అడిగిన ప్రశ్న కూడా మతానికి, యాత్రలకు సంబంధించిందే. అచ్చంగా ఇలాగే మోదీ కూడా కేదారనాథ్‌ గుహలోనో, అమరనాథ్‌లోనో ప్రత్యక్షం కావడం, ఢిల్లీ ఎన్నికల రోజే కుంభమేళాలో స్నానం చేసిన దృశ్యాలు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. హిమాలయాలకు వెళతావా? అని ప్రధాని అడగడం నిజానికి వెళ్లమని చెప్పడమే కావచ్చు. ఆ విధంగా చూస్తే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కే మాత్రమే పరిమితమైన సమస్య కాదు. కాస్త వెనక్కు వెళ్తే తిరుపతి లడ్డూ సమస్యపై ప్రాయశ్చిత దీక్ష, తొక్కిసలాట ఘటనపై క్షమాపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సనాతన రాజకీయాల ప్రతినిధిగా ముందుకు రావడమే గాక ప్రభుత్వ పరంగా తన మాట ప్రత్యేకంగా వినిపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లతో సహా మిగిలిన వారు వ్యవహరించిన, మాట్లాడిన తీరుకు ఇది కొంత భిన్నం. తాజాగా శ్రీవారి ఆలయంలోనే ఉద్యోగిని దుర్భాషలాడిన కర్నాటక బీజేపీకి చెందిన టీటీడీ సభ్యుడిపై మాత్రం ఇంకా స్పందించలేదు. చంద్రబాబు అనుభవంపై అపార గౌరవం ప్రకటిస్తూనే తన సొంత ముద్రకోసం పవన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. కనీసం మూడు నాలుగు సందర్భాల్లో హోంశాఖ పనితీరుపై వ్యాఖ్యానాలు, విసుర్లు సాగించడం కూడా యాదృచ్చికం కాదు. లోకేశ్‌ పాత్రపై పదే పదే చర్చ రావడం, ఆయన అనుయా యుల ప్రతిస్పందన కూడా ఇందులో భాగం కావచ్చు. ఆఖరుకు సీనియర్‌ మంత్రి అచ్చెన్నాయుడు కూడా లోకేశ్‌ తమ తదుపరి నాయకుడని ప్రకటించేశారు. ‘మావల్ల మళ్లీ అధికారంలోకి వచ్చి మమ్మల్నే టీడీపీ నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారని’ కొందరు జనసేన నాయకులు అంటుంటే, మీ పదకొండు శాతం ఓటింగు మించిన పదవులు, వనరులు, ఫోకస్‌ ఇచ్చామని’ టీడీపీ వర్గాలు కొన్ని అదే స్థాయిలో సమా ధానమిస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ప్రతి సందర్భంలోనూ మిగిలిన వారందరికీ అతీతుడుగా ఉన్నట్టు ఫోకస్‌లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీలో కీలక స్థానాల్లో ఉన్నవారే వ్యాఖ్యానిస్తున్నారు. చంద్ర బాబు అనేక కారణాల వల్ల పవన్‌కు అధిక ప్రాధాన్యత కల్పించడంతో జాతీయ కార్యదర్శి లోకేశ్‌ ప్రచారం తగ్గుతుందనే భావం టీడీపీలో నెలకొంది. లోకేశ్‌ స్థానానికీ పవన్‌పై ఫోకస్‌కూ వైరుధ్యం వల్లనే భిన్న సంకేతాలు వస్తున్నాయని అనేకమంది అంటున్నా అదే ఏకైక సమస్య కాదు. ఎందుకంటే ఆ వారసత్వ వాస్తవం. పవన్‌ కల్యాణ్‌కే గాక దేశమంతటికీ తెలుసు. లోకేశ్‌ కన్నా ముందు నారా భువ నేశ్వరిని రెండో స్థానంలోకి తేవాలనే బలమైన ఆలోచన కూడా టీడీపీకి వుంది. ఇది పవన్‌ రేపటి స్థానానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. లోతైన రాజకీయ వ్యూహాత్మక కారణాలే దీనివెనక వున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి పెద్ద మద్దతుదారు టీడీపీ అయినా ఏపీకి పెద్దగా ఒరగబెడు తున్నదేమీలేదు. పైపెచ్చు కష్టకాలంలో జగన్‌ నుంచి కాపాడి చంద్రబాబును మళ్లీ గద్దెక్కించినందుకు తమను మోయవలసిందేనన్న ఆలోచన బీజేపీది. పురంధేశ్వరి హయాంలో చంద్రబాబు తమ పార్టీని అదుపు చేస్తున్నారనే ఆగ్రహం బీజేపీ నేతలది. కేంద్రంలో నడ్డా తర్వాత అధ్యక్షుడు నిర్ణయమై ఆ తదుపరి ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక కూడా జరిగితే గానీ ఈ విషయంలో స్పష్టత రాదు. ఎక్కడైనా సరే పొత్తు పెట్టుకున్న పార్టీలను నెమ్మదిగా చప్పరించడం బీజేపీ వ్యూహంగా ఉంటోంది. ఇక్కడ వారికి పవన్‌ కల్యాణ్‌ ఆకర్షణీయమైన తోడుగా ఉన్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌ల కోసం ప్రయత్నించి విఫలమైన బీజేపీకి ఇది చాలా ఇష్టమైన పరిణామం. నిజానికి చిరంజీవి కూడా తాను రాజకీయాల్లోకి రాదలుచుకోలేదంటూనే పవన్‌ తన ఆశలు నెరవేరుస్తాడని ప్రకటించారు. రాజకీయాల్లోకి రాకున్నా తను తలపెట్టిన పనుల కోసం పెద్దపెద్ద వారిని కలుస్తూనే ఉంటానని కూడా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు ముందు ఆయన సంక్రాంతి సంబరాల పేరిట ఢిల్లీలో మోదీతో కలసి ఉండటం, మరో తమ్ముడు నాగబాబుకు మంత్రి పదవి హామీ గుర్తు చేసుకుంటే మొత్తం ఆ కుటుంబం మోదీతో బంధం వేసుకున్న తీరు తెలుస్తుంది. బీజేపీతో కలిసినా ముస్లిం ఓట్లు కాపాడుకోవాలని చంద్ర బాబు ద్వంద్వ వ్యూహం. కాగా చంద్రబాబు కుటుంబాన్నే శాశ్వతంగా మోయలేము గనక తమ విస్తరణ చూసుకోవాలనేది జనసేన వ్యూహం. ఆ ఆశలను వాడుకుని తను ఎదగాలనేది బీజేపీ పథకం. పవన్‌ చాటున బీజేపీ అల్లుకుపోతే ఎలా అనే ప్రశ్న టీడీపీ నేతలది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page