top of page

ఎవరిది ఈ పాపం!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Sep 30
  • 4 min read
  • శ్రీకాకుళంలో కౌన్సిల్‌ పదవీకాలం ముగిసి 15 ఏళ్లు పూర్తి

  • ఎన్నికలతో మూడు పార్టీలూ ముక్కలాట

  • సమస్యలు చెప్పుకోడానికి మనిషి లేక కునారిల్లిపోయిన హెడ్‌క్వార్టర్‌

  • మరో పవర్‌పాయింట్‌ రాకుండా జాగ్రత్తపడుతున్న నాయకులు

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

మనం ఉంటున్న గదిలో 15 రోజులు గచ్చులు ఉడ్చకపోతే ఏం జరుగుతుంది? మనం తినే మెతుకు 15 గంటలు బయట ఉండిపోతే ఎలా మారిపోతుంది? ఇంటిని నడపాల్సిన పెద్దమనిషి నట్టేట మనల్ని విడిచిపోతే ఎలా ఉంటుంది? శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. 2010 సెప్టెంబరు 30 నాటికి మున్సిపల్‌ కౌన్సిల్‌ పదవీ కాలం ముగిసి నేటికి సరిగ్గా 15 ఏళ్లు పూర్తయింది. 2005లో ఎన్నికైన కౌన్సిల్‌ 2010 వరకు పదవిలో ఉండగా, ఆ తర్వాత ఇప్పటి వరకు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. బహుశా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇదే రికార్డయివుంటుంది. ఇందులో తిలా పాపం, తలా పిడికెడు ఉంది. 2010 నాటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ గాని, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగి నవ్యాంధ్ర పేరుతో వచ్చిన టీడీపీ గాని, 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా గాని ఎన్నికలు వాయిదా పడటానికి అవసరమైన అన్ని ఎత్తుగడలు వేశాయి గాని, దానికి కార్పొరేషన్‌, పంచాయతీల విలీనమనే షుగర్‌ కోటెడ్‌ చేదు మాత్రను స్థానికుల చేత మింగించాయి. మరో పవర్‌ సెంటర్‌ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మొలవకుండా జాగ్రత్తపడ్డాయి. కానీ సగటు నగరవాసి మాత్రం ‘మా మున్సిపాలిటీ కార్పొరేషనంత పెద్దదైపోయింది కాబట్టి ఎన్నికలు జరగడంలేదు’ అనుకుంటున్నాడు. 15 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిరదన్న విషయాన్ని మర్చిపోయాడు.

శ్రీకాకుళం మున్సిపాలిటీలో 7 పంచాయతీలను కలపడం ద్వారా నగర కార్పొరేషన్‌గా మార్చి ఎన్నికలు జరిపితే పెద్ద ఎత్తున నిధులొస్తాయని, అప్పటికే నగరానికి ఆనుకొని పంచాయతీల్లో కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడం వల్ల అందరికీ లబ్ధి చేకూరుతుందని, 2010 తర్వాత ఏడు పంచాయతీలను విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఇది ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే.. విలీన పంచాయతీల్లో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కుశాలపురం, తోటపాలెం పంచాయతీల్లో ఒకదానికి చెందిన శివారు గ్రామం దోమాంకు అప్పటికే పంచాయతీ ఎన్నికలైపోయాయి. అయినా దీనిని విలీన పంచాయతీల్లో కలుపుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అంటే.. ఈ పంచాయతీలకు సంబంధించిన రాజకీయ నేతలో, లేదూ అంటే అప్పటికే ఎన్నికైవారో కోర్టుకు వెళ్లడం ద్వారా ఈ విలీనాన్ని అడ్డుకోవాలనేదే నేతల ఆలోచనగా మనకు అర్థమవుతుంది. పంచాయతీల విలీనం అర్థరహితమని, దీనివల్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఉపాధి నిధులు గ్రామాలకు రాకుండాపోతుందంటూ విలీన పంచాయతీల నేతలు యథావిధిగా హైకోర్టు తలుపుతట్టారు. దీంతో ఈ కేసు తేలేవరకు ఎన్నికలు జరగవని అర్థమైపోయింది. 2014`19లో రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుపుతానంటూ విలీన పంచాయతీలను విడదీస్తూ రెండు జీవోలు తెచ్చారు. కానీ అప్పటికే విలీన పంచాయతీలను కలపుతూ శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఉన్న 36 వార్డులను 50 డివిజన్లుగా విభజించారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు తెచ్చిన జీవో ప్రకారం పంచాయతీల్లో ఉన్న వార్డులను వదిలేసి మళ్లీ పాత మున్సిపాలిటీ పరిధిలోనే వార్డు బౌండరీలను నిర్ణయించాలి. కానీ అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న గుండ లక్ష్మీదేవి గాని, కమిషనర్‌ గాని వెంటనే ఈ పని పట్టాలెక్కించేందుకు ముందుకు రాలేదు. ఆ తర్వాత తీరిగ్గా ఏడాది తర్వాత ఈ ఎన్నికల ఫైల్‌ను వార్డుల విభజన రీతిని అచ్చెన్నాయుడు ముందు పెడితే, తాను తెచ్చిన రెండు జీవోలు వృథా అయిపోయాయంటూ అలిగి, ఆయన పూర్తిగా దాన్ని పక్కన పడేశారు. కలెక్టర్‌గా సౌరబ్‌గౌర్‌ ఉన్నప్పుడే ఎంపీటీసీ ఎలక్షన్లకు నోటిఫికేషన్‌ వచ్చింది. కానీ అంతకు ముందు 2014లోనే పంచాయతీల విలీనం మీద కోర్టు స్టే ఉంది. ఎవరైతే కోర్టు నుంచి కేసును విత్‌డ్రా చేసుకుంటారో, వారు ఎంపీటీసీ ఎన్నికలకు అర్హులంటూ ప్రకటించారు. ఆ మేరకు పాత్రునివలస, ఖాజీపేట పంచాయతీలు కేసును విత్‌డ్రా చేసుకున్నాయి. ఇక్కడ ఎంపీటీసీ ఎన్నికలైతే జరిగాయి గానీ, సర్పంచ్‌ ఎన్నికలు మాత్రం జరగలేదు. 2018 నుంచి అటు ఎంపీటీసీలకు గాని, ఇటు సర్పంచ్‌లకు గాని దేనికీ ఎన్నికలు జరగలేదు. దీంతో ఇటు మున్సిపాలిటీ, అటు పంచాయతీలు సమాంతరంగా నష్టపోయాయి. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మున్సిపల్‌ మంత్రిగా పని చేసిన బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఎన్నికలు జరపాలని కోరారు. అది జరగలేదు సరికదా.. విలీన పంచాయతీల జీవోను ఆర్డినెన్స్‌గా మార్చేసి, కరోనా కష్టకాలంలో అత్యవసర కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి, దాన్ని చట్టం కూడా చేసి గవర్నర్‌ ఆమోదాన్ని కూడా తెచ్చేసింది వైకాపా ప్రభుత్వం. దీంతో వైకాపా హయాంలో కూడా ఎన్నికలకు నోచుకోలేదు. విచిత్రమేమిటంటే.. తాము అధికారంలోకి వస్తే కార్పొరేషన్‌ ఎన్నికలు జరిపితీరుతామని ఎన్నికలకు ముందు వైకాపా హామీ ఇచ్చింది. కానీ అది నెరవేర్చలేదు. ధర్మాన ప్రసాదరావు మంత్రి కాకపోవడం వల్లే ఎన్నికలు జరగడంలేదని, ఆయన మళ్లీ కేబినెట్‌కు వెళితే.. మోక్షం లభిస్తుందని భావించారు. అదీ జరగలేదు.

సీన్‌ కట్‌ చేస్తే.. ఇప్పుడు కుశాలపురం, తోటపాలెం పంచాయతీలను కార్పొరేషన్‌ పరిధి నుంచి తప్పించాలని ఎన్నికైన దగ్గర్నుంచి ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌ మున్సిపల్‌ మంత్రి నారాయణ చెవిలో పోరు పెడుతున్నారు. బహుశా మరికొద్ది నెలల్లో ఇందుకు సంబంధించి సానుకూల ఫలితం రావచ్చు. అదే జరిగితే కార్పొరేషన్‌కు సరిపడే జనాభా కోసం రాగోలును గాని, ఒప్పంగిని గాని కొత్తగా చేర్చుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడివారెవరూ ఇందుకు సిద్ధంగా లేరు. తోటపాలెం, కుశాలపురం పంచాయతీలు వేరుపడటం ద్వారా వారికి సర్పంచ్‌ ఎన్నికలు జరుగుతాయేమోగాని, మరో రెండు పంచాయతీలు చేరితే గాని శ్రీకాకుళం మున్సిపాలిటీ నగర కార్పొరేషన్‌ కాదు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కూడా చెప్పలేని పరిస్థితి. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ కూడా తమ కార్పొరేషన్‌లో ఎన్నికలు జరిపించాలని అటు ముఖ్యమంత్రికి, ఇటు మున్సిపల్‌ మంత్రికి ఒకటికి పదిసార్లు విన్నవిస్తున్నా అసలు సమస్య ఎక్కడో ప్రభుత్వం పట్టుకోలేకపోతోంది. మున్సిపాలిటీని కాస్త స్థాయి లేకపోయినా కార్పొరేషన్‌ చేయడమే అసలు సమస్య. ఆమధ్య మంత్రి అచ్చెన్నాయుడు రాగోలును మున్సిపాలిటీలో కలిపితే ఎలా ఉంటుందని టీడీపీ నేతల్ని అడిగారు. ఆయన కోసం రాగోలును కలిపినా, ప్రస్తుతం కోర్టులో కేసు వేసిన పంచాయతీలు ఈ కేసును విత్‌డ్రా చేసుకోవడం కోసం ఏ నాయకుడూ ప్రయత్నించడంలేదు. ఎందుకంటే.. టీడీపీ అధికారంలో ఉంటే వైకాపా పంచాయతీల్లో పాగా వేసివుంది. వైకాపా ఉన్నప్పుడు టీడీపీ సర్పంచ్‌లు గెలిచారు. కాబట్టి శ్రీకాకుళం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగాలంటే అన్ని పార్టీలు, అన్ని పంచాయతీ నేతలు కలిసి కూర్చుంటే గానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. 2014కు ముందు ఏకపక్షంగా విలీనం చేసిన కాంగ్రెస్‌, 2019 వరకు అధికారంలో ఉండి కూడా ఓటర్ల జాబితాను, వార్డు విభజనను సరిచేయలేని టీడీపీ, 2024 వరకు అధికారంలో ఉన్న వైకాపా చేసిన చట్టాలు.. ఇవన్నీ సగటు సిక్కోలువాసికి గుదిబండగా మారాయి. అంతేకాదు.. ఎంతోమంది ఔత్సాహిక రాజకీయ నాయకులకు పదవులు లేకుండా కూడా పోయింది. శ్రీకాకుళం మున్సిపాలిటీకి చైర్మన్‌ అంటే.. ఏదో ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ లాంటి ప్రోటోకాలే. అదే శ్రీకాకుళానికి మేయరంటే.. పెద్ద ప్రోటోకాలే. కచ్చితంగా మేయరనే పోస్టు జిల్లాలో ఉండే ఎంతోమంది రాజకీయ నాయకులకు సమాంతర కేంద్రమవుతుందనడంలో సందేహం లేదు. ఈ విషయం రాజకీయాలను ఔపోషణ పట్టేసిన జిల్లా నేతలకు తెలియంది కాదు. ఎన్నికలు ఎన్నాళ్లు ఆలస్యమైతే, వీరికి అంత మంచిది. కానీ శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్‌ పరిస్థితి మాత్రం వేరు. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నప్పుడే ఎన్నికలు జరిపించలేకపోయారని, ఇక ఎమ్మెల్యేగా గెలిస్తే మీరేం చేయగలరని ఎన్నికల ముందు వచ్చిన ఒక ప్రశ్నకు ఎన్నికలు జరిపి తానేంటో చూపిస్తానని శంకర్‌ సమాధానమిచ్చారు. ఇప్పుడు ఆయనకిది ఇజ్జత్‌కా సవాల్‌.


ఫుట్‌బాల్‌ ఆడుకున్నారు
ree

శ్రీకాకుళం కార్పొరేషన్‌ ఎన్నికలు జరపకపోవడం ద్వారా ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. గడిచిన 15 ఏళ్లలో కొందరు రాగోలు కలిపేయాలంటారు, మరికొందరు కిల్లిపాలెం తీసేయాలంటారు. ఎచ్చెర్లలో ఉన్నవి తప్పించాలని అక్కడి ఎమ్మెల్యే తిరుగుతున్నారు. మొత్తానికి సిక్కోలుతో ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నారు. ఇంత ఘోరం ఎప్పుడూ లేదు. 2005 చివరి కౌన్సిల్‌కు నేను చైర్‌పర్సన్‌ అయ్యాను. అప్పుడు పుట్టిన బిడ్డకు ఇప్పుడు ఓటుహక్కు వచ్చేసింది. కానీ ఎన్నికలే జరగడంలేదు. 16 ఏళ్లుగా డివిజన్‌కు ఒకరు చొప్పున రాజకీయ ఉద్యోగం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

- ఎంవీ పద్మావతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, 2005-2010


యాక్సెసెబిలిటీ లేకుండాపోయింది
ree

నేను ఐదేళ్లు చైర్‌పర్సన్‌గా చేశాను. అంతకు ముందు నాన్నగారు పదేళ్లు పని చేశారు. నిత్యం సమస్యలు చెప్పుకోడానికి జనం వస్తునే ఉండేవారు. కౌన్సిలర్‌/ కార్పొరేటర్‌ ఎవరైనా ఆ డివిజన్‌కు వారధిగా పని చేస్తారు. వారి వద్దకు వచ్చి స్థానికులకు సమస్యలు చెప్పుకునే యాక్సెసెబిలిటీ ఉంటుంది. ఇప్పుడది లేదు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ సమస్యలున్నాయి. ఈ 15 ఏళ్లలో ఇలాంటి వర్షాలు ఎన్ని కురిసివుంటాయి? ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? కలెక్టర్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందిస్తున్నారు సరే.. కానీ సామాన్యులు వారిని కలిసి గోడు చెప్పుకునే అవకాశం ఉందదు కదా. కారణం ఏదైనా కావచ్చు. ఎన్నికలు జరగకపోవడం సరికాదు.

- పైడిశెట్టి జయంతి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, 2000-2005


వ్యవస్థ పోయింది
ree

మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకపోవడం వల్ల మున్సిపల్‌ వ్యవస్థ పూర్తిగా పోయింది. ఇప్పుడు పంచాయతీలను కలపడం, తీయడం వంటి ప్రక్రియల వల్ల కథ మళ్లీ మొదటికొచ్చింది. కౌన్సిల్‌ ముగిసి 15 ఏళ్లయినా ఇంతవరకు చనిపోయినవారి ఓట్లు తొలగించలేదు. 3వేలు నుంచి 4వేలు మధ్య ఒక డివిజన్‌లో ఓటర్లు ఉండాలన్న నిబంధన వల్ల ఈ విలీనం ప్రక్రియ మొదలైంది. అసలు ఓటర్లు ఎంతమందో తేలితే, ఏ వార్డులో ఎంతమంది బతికున్నారో తెలిస్తే అప్పుడు డివిజన్‌ కోసం మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఏం చేసినా ఎన్నికలు జరగవు.

- పిల్లల నీలాద్రి, మాజీ కౌన్సిలర్‌


కార్పొరేషన్‌ సైజ్‌కే ఎన్నికలు జరగాలి
ree

ఇన్నాళ్లు ఎన్నికలు లేకుండా గడిచిపోయిన తర్వాత కూడా మళ్లీ పాత మున్సిపాలిటీకి ఎన్నికలు జరుపుతామని ఎవరైనా అంటే అది సరికాదు. నిధులు అధికంగా రావాలంటే కార్పొరేషన్‌ స్థాయికే ఎన్నికలు జరగాలి. 15 ఏళ్లుగా పాలకవర్గం లేకపోవడం వల్ల అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదు.


- మాదారపు వెంకటేష్‌, నగర టీడీపీ అధ్యక్షుడు




అభివృద్ధికి విఘాతం
ree

దూడ భవానీశంకర్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు నగరం మొత్తం మీద కాలువలపై కల్వర్టులు నిర్మించారు. ఆ తర్వాత ఇంతవరకు ఎవరూ అటువైపు చూడలేదు. పాలకవర్గం లేకపోవడం వల్ల ప్రతీ చిన్న విషయానికీ ఎమ్మెల్యే వద్దకు పరుగెత్తే అవకాశం అందరికీ ఉండదు. వార్డు స్థాయిలో సమస్యలు ఏమిటని తెలుసుకునే అవకాశం ఎమెల్యేకూ ఉండదు. స్థానికంగా ఒక ప్రజాప్రతినిధి ఉంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుతం చెత్త పేరుకుపోయినా, వీధి దీపాలు వెలగకపోయినా, కుక్కలు ముక్కలు పీకేస్తున్నా ఎవరికీ పట్టకపోవడానికి కారణం స్థానిక సమస్యలు చెప్పుకోడానికి నాధుడు లేకపోవడమే.

- శిమ్మ రాజశేఖర్‌, అడ్వకేట్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page