`సమకాలీన రాజకీయాల్లో గుణాత్మక మార్పు
`నేతల వలసలను అడ్డుకునే ప్రయత్నాలు నిల్
`వారు మారినా ఓటర్లు మారరన్న ధీమా
`నేతలు, ప్రజల మధ్య వలంటీర్లు రావడమే మార్పుకు కారణం
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికలనాటి దృశ్యమే ప్రస్తుత ఎన్నికల్లో కనిపిస్తోంది. కూటమికి ఓటేసేవారెవరు, వైకాపాకు ఎక్కడి నుంచి ఓటు వస్తుందన్న విషయం బరిలో ఉన్న అభ్యర్థులకు ఇప్పటికే తేటతెల్లమైపోయింది. వలంటీర్ వ్యవస్థను ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నందున వైకాపా ఓటు ఎక్కడుందన్న విషయం అర్థమైపోయింది. అందుకే వైకాపా మళ్లీ గెలుస్తుందన్న కోణంలో ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు. గతంలో మాదిరిగా కొందరు నాయకులు వెళ్లిపోతే, వారి వెంట తమ ఓటుబ్యాంకు వెళ్లిపోతుందన్న బాధ ఎవరిలోనూ కనిపించడంలేదు. దీనికి కారణం.. ఎవరి ఓటు బ్యాంకు ఎంత అన్న లెక్కలు ఇప్పటికే రెండు పార్టీల అభ్యర్థుల వద్ద ఉండటమే. అలాగే నాయకులు వెళ్లినంతమాత్రాన వారి వెంట పొలోమంటూ కార్యకర్తలు, అభిమానులు వెళ్లిపోయే పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో లేకపోవడమూ ఒక కారణంగా కనిపిస్తోంది.

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ఐదేళ్లు పని చేసిన వలంటీర్లు ఎవరు ఎవరికి ఓటేస్తారన్న వివరాలను ఇప్పటికే సేకరించి అభ్యర్థుల చేతిలో పెట్టారు. దీనిలో కూడికలు, తీసివేతల అనంతరం మిగిలిన అంకె మీద స్పష్టమైన అవగాహనతో వైకాపా అభ్యర్థులు ఉన్నారు. అందుకే వైకాపాను వీడి టీడీపీలో చేరుతామంటే ‘బాబ్బాబు.. కొద్దిగా సహకరిద్దురూ’ అంటూ బతిమాలే పరిస్థితి కనిపించడంలేదు. తెలుగుదేశంలో కూడా ఇదే వాతావరణం కనిపిస్తోంది. వైకాపా ఐదేళ్ల పాలనలో నష్టపోవడమో, విసిగిపోవడమో లేక మొదట్నుంచి తమ పార్టీ పట్ల అభిమానం ఉన్నవారి ఓటు లెక్క టీడీపీ అభ్యర్థుల వద్ద ఉంది. కాకపోతే టీడీపీ నుంచి వెళ్లిపోవాల్సినవారు వైకాపా అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో దఫదఫాలుగా కండువా మార్చేశారు. కాబట్టి ఇప్పుడు పెద్దగా టీడీపీ నుంచి వైకాపాలోకి చేరికలు లేవు. ఇక టీడీపీ నుంచి వైకాపాకు వచ్చారు అని చెప్పుకుంటున్నవారంతా వైకాపాలోనే ఇన్నాళ్లూ ఉండి స్థానిక నాయకత్వం వ్యవహరించిన తీరు నచ్చకో, తమ మాట చెల్లుబాటు కాలేదనో దూరంగా ఉన్నవారు మాత్రమే తప్ప వారిలో 90 శాతం మంది తెలుగుదేశం నేతలు కారు. ఐప్యాక్ ఇచ్చిన రిపోర్టులు, వలంటీర్లు సేకరించిన డేటా మేరకు వైకాపా అభ్యర్థులు గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. అందుకే పార్టీ అసంతృప్తి నేతలను బుజ్జగించడానికి పెద్దగా చొరవ చూపడంలేదు. శ్రీకాకుళంలో వరం వారసులు, నరసన్నపేట నియోజకవర్గంలో అభ్యర్థి కృష్ణదాస్ మేనల్లుడు, సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు టీడీపీకి వెళ్లిపోయినా తమ వచ్చిన నష్టమేమీ లేదన్న రీతిలోనే అభ్యర్థులు ఉన్నారు. అలా అని తమ పార్టీలో చేరడానికి వచ్చేవారిని కాదనడంలేదు. నరసన్నపేట నియోజకవర్గంలోని మూడు మండలాల్లో చాలా రోజుల నుంచే ఎమ్మెల్యే కృష్ణదాస్‌కు వ్యతిరేకంగా అసమ్మతి రాజకీయాలు నడిచాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్నా వీరిని బుజ్జగించడానికి గతంలో మాదిరిగా కృష్ణదాస్ ప్రయత్నించలేదు. దీంతో సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, పోలాకి నుంచి డీసీసీబీ మాజీ అధ్యక్షుడు డోల జగన్, మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణ్, సంపతిరావు రామన్న, నరసన్నపేట నుంచి వెలమ కార్పొరేషన్ చైర్మన్ బావాజీనాయుడు, బాలభూపాలనాయుడు, జలుమూరు వైకాపా సీనియర్ నాయకుడు మెండ రాంబాబు టీడీపీలో చేరిపోయారు. గత నెలలో శ్రీకాకుళంలో జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో అసమ్మతి నాయకులను పిలిపించి బుజ్జగించాలని ప్రాంతీయ సమన్వయకర్తలు సుబ్బారెడ్డి, చిన్నశ్రీను చేసిన ప్రయత్నాలను జిల్లా అధ్యక్షుడైన కృష్ణదాస్ అడ్డుకున్నారు. ధర్మాన ప్రసాదరావు ఇంటికి అసమ్మతి నాయకులను పిలిపించి తన సమక్షంలోనే చిన్నశ్రీను మాట్లాడాలని నిర్ణయించినా ఆ సమావేశానికి రావడానికి కృష్ణదాస్ నిరాకరించారని తెలిసింది. ఆ తర్వాత డోల జగన్‌ను చిన్న శ్రీను విజయనగరం పిలిపించి మాట్లాడినా ఫలితం కనిపించలేదు. కూర్మినాయుడు టీడీపీలో చేరడానికి కొన్ని రోజుల ముందు కృష్ణదాస్‌తో సమావేశమై చర్చించారు. కానీ ఇది తూతూ మంత్రంగానే జరిగిందని భోగట్టా.

నాయకుడి వెంట నడిచే పరిస్థితి లేదు
వాస్తవానికి అసమ్మతి నాయకులను ఎన్నికల ముందు ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నించడం, వారు పెట్టిన డిమాండ్లకు ఓకే అనడం గతం. కానీ ఇప్పుడు నాయకుడి వెంట ఓటరు లేడని నేరుగా తాను అనుకున్న అభ్యర్థికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంకేతాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. మరోవైపు ఎంపీపీగా ఉన్న చిన్నాల కూర్మినాయుడు వైకాపాలో ఉంటూ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రచారం చేయలేరని తొలుత కృష్ణదాస్ భావించారు. కానీ ఎందుకైనా మంచిదని ఆయన చుట్టూ ఉన్న నాయకులను తనతో తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇదే కొనసాగితే తన క్యాడర్ చేజారిపోతుందని భావించిన కూర్మినాయుడు టీడీపీ కండువా కప్పుకోవాల్సి వచ్చింది. తాను ఎంపీపీగా వ్యవహరిస్తున్న మండలంలో గతంలో మంత్రిగా ఉన్న కృష్ణదాస్ అనుచరులు కాళ్లు, వేళ్లు పెట్టి తనను డీగ్రేడ్ చేశారనేదే కూర్మినాయుడు ఆరోపణ. అయితే వైకాపాలో ఉన్నా ఆయన ఓటు రాదు కాబట్టి పార్టీ మారడమే మంచిదనే ఉద్దేశంలో కృష్ణదాస్ విడిచిపెట్టేశారు. జలుమూరు జెడ్పీటీసీ ప్రతినిధి మెండ రాంబాబు మొదట్నుంచి కృష్ణదాస్‌కు వీరవిధేయుడిగా ఉన్నారు. దాస్ మంత్రి అయిన తర్వాతే వీరి మధ్య గ్యాప్ బయటపడిరది. ఈయన కూడా పార్టీ వీడుతారన్న సంకేతాలు అందినా అడ్డుకోడానికి పార్టీ సిద్ధపడలేదు. కారణం.. అక్కడ టీడీపీ టిక్కెట్ ఆశించిన డాక్టర్ బగ్గు శ్రీనివాసరావు చిన్నాన్న బగ్గు రామకృష్ణ కృష్ణదాస్ కోసం పని చేస్తున్నారు. మెండ రాంబాబు అటు వెళ్తే, బగ్గు రామకృష్ణ ఇటు వస్తారన్న కోణంలో వైకాపా వ్యవహరించింది. ఎవరు ఏమేరకు ప్రభావితం చేస్తారో చెప్పేది ఎన్నికల ఫలితాలే అయినా టీడీపీలో భారీ ఎత్తున వైకాపా నుంచి మండల స్థాయి నాయకులు చేరడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపినట్టు అయింది. రామ్మోహన్‌నాయుడు మళ్లీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తుండటం, కింజరాపు కుటుంబం ప్రభావం పేటపై ఉండడం వల్ల రమణమూర్తి గెలుపుపై ఆశలు పెరిగాయి. నామినేషన్ల సమయంలో ఇరు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా జనసమీకరణ చేశారు. జనసమీకరణలో వైకాపా కొంత ఆధిపత్యం చూపించినా ఆ తర్వాత వైకాపాను వీడి కొందరు నాయకులు టీడీపీలో చేరడంతో ఆ పార్టీకి కొంత సానుకూలత వ్యక్తమయింది. చేరికల జోరు టీడీపీలో ఉన్నంత వైకాపాలో కనిపించలేదు. దీనికి కారణం ఓటరు తమతో ఉన్నాడన్న ధైర్యం. ఇది ఏమేరకు వర్కవుట్ అవుతుందో చెప్పడానికి చరిత్రలో ఆధారాలు లేవు. ఎందుకంటే.. ఇటువంటి ఎన్నిక సమకాలీన రాజకీయాల్లో ఇదే మొదటిది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరూ తమకే ఓటేస్తారని వైకాపా భావిస్తుంటే, గ్రామాల్లో టీడీపీ పెట్టిన దగ్గరనుంచి తమ వెంటే ఉన్న ఓటు తమకే వస్తుందని టీడీపీ భావిస్తోంది. దీనిపై ఇప్పటి వరకు ఏ సెఫాలజిస్టూ బల్లగుద్ది మరీ రిపోర్టు ఇవ్వలేకపోతున్నారు.

ఎవరి లెక్కలు వారివి

2019 ఎన్నికల్లో సారవకోట నుంచి 1800, జలుమూరు నుంచి 5,800, పోలాకి నుంచి ఏడువేలు, నరసన్నపేట నుంచి ఐదువేల ఓట్ల మెజార్టీ కృష్ణదాస్‌కు వచ్చింది. ఈసారి ఈ లెక్కలు మారనున్నాయని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో వారం క్రితం కృష్ణదాస్ వెనుకబడి ఉండేవారని, ప్రస్తుతం మెరుగైన స్థితికి చేరుకున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీలో చేరిన నాయకుల్లో సారవకోట ఎంపీపీ కూర్మినాయుడు సుమారు రెండువేల ఓట్లను ప్రభావితం చేస్తారని లెక్కలు వేస్తున్నారు. కృష్ణదాస్ పోటీ చేసిన ప్రతిసారీ మెజార్టీ ఇస్తున్న జలుమూరు మండలంలో 2019లో వైకాపాకు వచ్చిన మెజార్టీ కంటే మూడు వేలు తగ్గుతుందని లెక్కలు వేస్తున్నారు. నరసన్నపేట పట్టణంలో టీడీపీకి, నరసన్నపేట మండలంలో కృష్ణదాస్‌కు మెజార్టీ వస్తుందని.. ఈ రెండూ కలిపితే ఇద్దరు అభ్యర్థులు ఈక్వెల్ అవుతారన్నది ఒక అంచనా. పోలాకిలో 2019తో పోల్చితే ఓట్లు తగ్గినా కృష్ణదాస్ స్పష్టమైన మెజార్టీ సాధిస్తారని లెక్కలు వేస్తున్నారు. దీంతో పేటలో కృష్ణదాస్ మరోసారి విజయం సాధిస్తారని వైకాపా నాయకుల అంచనా. టీడీపీ నాయకులు మాత్రం ఇప్పుడు వైకాపా పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నవారంతా 2019లో కూడా వైకాపాకే ఓటేశారని, జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న కోణంలో అందరూ ఓటేయడంతో ఆ మెజార్టీ సాధ్యమైందని, ఈసారి అది మారుతుందంటున్నారు. మొదటినుంచీ ఉన్న తెలుగుదేశం
ఓటు ఆ పార్టీ అభ్యర్థికే పడుతుందని, దీనికి తోడు తటస్థ ఓటరు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీకి కలిసొస్తుందని నమ్ముతున్నారు.
Comments