top of page

ఎవర్రా మీరంతా..?!

Writer: ADMINADMIN
  • జిల్లాలో రెండుచోట్ల దొంగనోట్ల ముఠా గుట్టురట్టు

  • ఉభయగోదావరి జిల్లాల్లో మరో గుంపును అరెస్టు చేసిన పోలీసులు

  • నర్సాపురం నుంచి నిందితుడ్ని తెస్తుండగా పోలీసులపై దాడి

  • జి.సిగడాం నుంచి వెళ్లిన పోలీసులు నిందితులను తెస్తుండగా గ్రేట్‌ ఎస్కేప్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో జి.సిగడాం మండలంలో రూ.15 లక్షలు నకిలీ కరెన్సీని చెలామణికి తీసుకువెళ్తుండగా, శుక్రవారం ఎన్ని రాజేష్‌, గనగళ్ల రవికుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో మెళియాపుట్టి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.57.25 లక్షలు నకిలీ నోట్లు, దాని ప్రింటింగ్‌కు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చూపించారు టెక్కలి సబ్‌ డివిజన్‌ అధికారులు. అదే సమయంలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న 12 మందిని అమలాపురం ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. అసలు దొంగనోట్లు చలామణి ఎక్కువైపోతుందనే రూ.2వేల నోటును రద్దు చేశామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా చిన్నా చితకా నోట్లు నకిలీవి ముద్రించడం వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరుగుతోంది? రాష్ట్రవ్యాప్తంగా నకిలీ నోట్లు చెలామణీ చేస్తున్న ముఠాకు మూలం ఒక్కచోటే ఉన్నట్లు అర్థమవుతుంది. అయితే అది ఒడిశా నుంచా? లేదా పాత ఉభయగోదావరి జిల్లాల నుంచా అనేది తేలకముందే ఖమ్మంలో కూడా వీటి మూలాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మన జేబులో ఉన్నది దొంగనోటా? అసలునోటా అన్నది కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడిరది.

జి.సిగడాంలో దొరికిన ఎన్ని రాజేష్‌, గనగళ్ల రవికుమార్‌లను విచారిస్తే.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో దీని మూలాలు ఉన్నాయని పోలీసులు గ్రహించారు. అందులో భాగంగా వీరిచ్చిన సమాచారం మేరకు నర్సాపురం వెళ్లి రాపాక ప్రభాకర్‌ అలియాస్‌ ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని రాజమండ్రిలో ఉన్న కృష్ణారావు అనే మరో వ్యక్తిని కూడా అరెస్టు చేయడానికి కారులో శుక్రవారం వచ్చారు. అయితే కృష్ణారావు ఆచూకీ లభించకపోవడంతో అక్కడి పోలీసులకు సమాచారమిచ్చి రాపాక ప్రభాకర్‌ను శ్రీకాకుళం తరలిస్తుండగా, దొంగనోట్ల గ్యాంగ్‌కు చెందిన వ్యక్తులు వాహనాల మీద వచ్చి జి.సిగడాం పోలీసుల కారు మీద దాడి చేసి అద్దాలు బద్దలుగొట్టి పోలీసుల అదుపులో ఉన్న రాపాక ప్రభాకర్‌ను తీసుకుపోయారు. పోలీసుల మీదే స్వయంగా దాడిచేసి, కారును అడ్డగించి అదుపులో ఉన్న నిందితుడ్ని పట్టుకుపోవడమంటే చిన్న నేరం కాదు. కానీ ఇందుకు పాల్పడ్డారంటే దొంగనోట్ల ముఠా రాష్ట్రంలో గట్టిగా పాతుకుపోయిందని అర్థమవుతుంది.

జి.సిగడాం పోలీసుల మీద జరిగిన దాడికి సంబంధించిన సమాచారం అడుగుతారని రణస్థలం సర్కిల్‌లో పోలీసులు ఫోన్లు లిఫ్ట్‌ చేయడంలేదు. ‘సత్యం’ సేకరించిన ప్రాథమిక వివరాల మేరకు పోలీసుల కారు నుంచి విడిపించుకుపోయిన రాపాక ప్రభాకర్‌ అలియాస్‌ ప్రతాప్‌రెడ్డిది నర్సాపురం గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో కొప్పొర్రు గ్రామం. కానీ, ఈయన రెడ్డి కాదని స్థానికులు ‘సత్యం’కు సమాచారమిచ్చారు. ఇటువంటి పనులు చేసినప్పుడు అలియాస్‌గా చాలా పేర్లు మారుస్తుంటాడని తెలుస్తుంది.

అసలునోట్లు లక్ష ఇస్తే, నకిలీ నోట్లు రూ.5 లక్షలు తెచ్చుకునే అవకాశం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా దందా ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండే శ్రీకాకుళం, భద్రాచలం, ఖమ్మం, నల్గొండ వంటి ప్రాంతాల్లో వారాంతపు సంతలు, పశువుల సంతలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇక్కడే ఈ ఫేక్‌ కరెన్సీ చెలామణీలోకి వెళ్లిపోతుంది. చాలాకాలంగా దీని మీద ఎవరూ దృష్టి సారించకపోవడంతో నకిలీ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతూ వచ్చింది. దీంతో జిల్లాలో అసలునోట్లు కొన్ని ఇచ్చి నకిలీ నోట్లు అంతకు ఐదింతలు తెచ్చుకునే ముఠాకు ఆశ పెరిగింది. ఎవరికో నోట్లిచ్చే బదులు, ఆ నకిలీ నోట్లు తామే తయారుచేసుకుంటే పోలేదా అన్న భావన రావడంతో అటు ఒడిశా వైపు, ఇటు భద్రాద్రి వైపు జిల్లాలో నకిలీ నోట్ల ముఠా దృష్టి సారించింది. అందులో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం దగ్గర కొప్పర్రు గ్రామానికి చెందిన రాపాక ప్రభాకర్‌తోను, రాజమండ్రికి చెందిన కృష్ణారావుతోను మన జిల్లా లావేరుకు చెందిన ఎన్ని రాజేష్‌కు, నగరానికి చెందిన గనగళ్ల రవికి పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి నకిలీ నోట్లు తీసుకువచ్చి చలామణి చేస్తుండగానే పోలీసులకు చిక్కారు. నకిలీ నోట్లను తయారుచేసే ప్రింటర్‌, అందులో ఇంకు, స్కానర్‌లను భద్రాచలం నుంచి రాజేష్‌ తీసుకువచ్చినట్లు పోలీసులు ప్రకటించారు. సీన్‌ కట్‌చేస్తే.. మెళియాపుట్టిలో దొరికిన ఆరుగురు నకిలీ నోట్ల ముఠాతో పాటు అక్కడ కూడా ప్రింటర్‌, స్కానర్‌, ఇంకులను డీఎస్పీ మూర్తి స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మరీ దరిద్రమేమిటంటే.. ఒడిశా నుంచి తెచ్చిన దొంగనోటుకే మళ్లీ సాన్‌ చేసి మరో దొంగనోటును సృష్టించి చలామణి చేస్తుండగా దొరికిపోయారు. జి.సిగడాంలో ఎన్ని రాజేష్‌ గ్యాంగు నుంచి అమలాపురం దగ్గర రాజోలులో దొరికిపోయిన ముఠా వరకు అందరూ బ్యాంకుకు డిపాజిట్‌ చేసిన సందర్భంలోనే చిక్కారు. కానీ గ్రామాల్లో అభయం శుభం తెలియని వృద్ధులు ఈ నోట్లు తీసుకోవడం ద్వారా మోసపోవడంతో పాటు స్టేషన్ల చుట్టూ తిరగాలని, వీరిని మాటువేసి పట్టుకున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో బ్యాంకులో డిపాజిట్‌ చేస్తున్నప్పుడు పట్టుకోగా, మెళియాపుట్టిలలో కూడా ఓ వృద్ధ మహిళ నుంచి రూ.5వేలు అప్పు తీసుకొని, ఆమెకు తిరిగి చెల్లించినప్పుడు ఫేక్‌ కరెన్సీ ఇవ్వడం, ఆమె బ్యాంకులో డిపాజిట్‌కు వెళ్తే.. అవి ఫేక్‌ అని తేలడంతో ముసలమ్మను పట్టుకొని మొత్తం డొంకను కదిలించారు టెక్కలి డీఎస్పీ. మెళియాపుట్టి నకిలీ నోట్ల స్కామ్‌లో దొరికినవారు కానీ, జి.సిగడాంలో కారుతో సహా దొరికిన ఇద్దరు కానీ చిన్నింటోళ్లేం కాదు. వీరి గతచరిత్రా ఘనమే.

మెళియాపుట్టి నిందితుల చరిత్ర ఇది..

శుక్రవారం మెళియాపుట్టి కేసులో ఏ`2గా ఉన్న శంకరరెడ్డి గతంలో పలాస దొరికిన నకిలీ నోట్ల ముఠాలో కీలక నిందితుడే. కాయిన్స్‌, బ్లాక్‌కరెన్సీ పేరుతో రాజమండ్రి, విజయనగరంలో పలువురిని మోసం చేసినట్టు కేసులు నమోదయ్యాయి. మిగతావారిపై కూడా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. శంకర్‌రెడ్డి పలాస కేంద్రంగా నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్టు పోలీసులకు మొదటి నుంచి అనుమానం ఉన్నా ఆయనపై నిఘా పెట్టడంలో గత అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికీ పలాస కేంద్రంగా ఫేక్‌ కరెన్సీ చలామణి అవుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం, రాజకీయ ప్రలోభాలకు తలొగ్గడంతో గతంలో నకిలీ నోట్లు చలామణి చేసినట్టు విచారణలో పోలీసులు గుర్తించినా చర్యలు తీసుకోలేకపోయారు. శుక్రవారం అరెస్టు అయిన వారి వెనుక మరింత మంది ఉన్నారని ఉహగానాలు వినిపిస్తున్నాయి. దీన్ని నిజం చేస్తూ ఈ రెండు కేసుల్లో మరి కొంత మందిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు ప్రకటించారు.

జి.సిగడాం బాబుల చరిత్ర ఇది

జి.సిగడాంలో రూ.15లక్షలు నకిలీనోట్లను కారులో తరలిస్తుండగా పట్టుబడిన ఎన్ని రాజేష్‌, గనగళ్ల రవికుమార్‌ల చరిత్ర ఘనమైనదే. రాజేష్‌ ఒక పత్రికకు విలేకరిగా, నేషనల్‌ హ్యూమన్‌రైట్స్‌ కౌన్సిల్‌ అనే ఒక పెట్టుడు సంస్థకు జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకుంటూ చేసిన దందాలు అనేకం ఉన్నాయి. నగరంలో ఎక్కడ తట్టెడు ఇసుక కనిపించినా నిర్మాణాలేవో జరుగుతున్నాయని వెళ్లి యజమానులను బెదిరించి సొమ్ములు తీసుకోవడంలో మనోడు సిద్ధహస్తుడు. దీనికి తోడు హ్యూమన్‌రైట్స్‌ కౌన్సిల్‌ అనే ఒక ఐడెంటిటీ కార్డు కూడా మెడలో వేళాడుతుండటంతో విలేకరి ప్లస్‌ హ్యూమన్‌రైట్స్‌ మరింత పవర్‌ఫుల్‌ అని చెప్పి ఎంతోమందిని బ్లాక్‌మెయిల్‌ చేసి దండుకున్న చరిత్ర ఇప్పుడు పోలీసులు తవ్వుతున్నారు. ఇక మరో నిందితుడు గనగళ్ల రవికుమార్‌ డీఆర్‌డీఏలో ఉద్యోగం చేస్తూ మహిళా స్వయం శక్తి సంఘాల పొదుపు సొమ్ములను కాజేశాడు. దీనిపై ఎచ్చెర్లకు చెందిన పలు సంఘాలు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో రవికుమార్‌ విధుల నుంచి సస్పెండ్‌ చేసి డబ్బులు రికవరీ చేశారు. ఆ తర్వాత కోవిడ్‌లో టిడ్కో క్వారంటీన్‌ కేంద్రానికి ఇన్‌చార్జీగా వ్యవహరించి ఈ కేంద్రాలకు ఆహారం సరఫరా చేసే హోటల్స్‌ యజమానులతో కలిసి అడ్డుగోలుగా వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ఉన్నతాధికారులను మంచి చేసుకొని సీతంపేట మండలానికి బదిలీపై వెళ్లిపోయాడు. ఆతర్వాత అక్కడ విధులకు హాజరుకాకుండా, కాజేసిన డబ్బులు కట్టకుండా వ్యవహరిస్తుండడంతో రవికుమార్‌ను విధుల నుంచి తొలగించారు. ఆతర్వాత మీడియా పేరుతో దందాలు చేస్తున్న వారితో సంబంధాలు పెట్టుకొని నకిలీ నోట్లు ముద్రణ, చలామణిపై ఒడిశాలో పలు ప్రాంతాలు తిరిగి కొన్ని నకిలీ నోట్లను చలామణి చేశారు.

రాజోలులో ముఠా గుట్టురట్టు

నకిలీ కరెన్సీ రూ.500 నోట్లతో మోసగించిన 12 మంది ముఠాను అరెస్ట్‌ చేసి, దానికి వినియోగించే పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు. కృష్ణాజిల్లా హనుమాన్‌ జంక్షన్‌ సమీపంలోని వీరవల్లి కేంద్రంగా నకిలీ కరెన్సీని ముద్రిస్తూ లావాదేవీలు సాగిస్తున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.500 దొంగనోట్లు 266, వారు ఉపయోగించిన ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లు, ఇతర పరికరాలను రాజోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవంబరు 30న రాజోలులో ఏక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో ఒక వ్యక్తి రూ.500 నోట్లు 100 డిపాజిట్‌ చేశాడు. అవి నకిలీనోట్లని గుర్తించిన బ్రాంచ్‌ మేనేజర్‌ రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాజోలు మండలం తాటిపాక మఠంకు చెందిన పాస్టర్‌ కోళ్ల వీరవెంకటసత్యనారాయణ డిపాజిట్‌ చేసినట్లు గుర్తించి అతనిని పట్టుకుని విచారణ చేయగా.. నకిలీ కరెన్సీ చలామణి చేసేవారు ఒక్కొక్కరు బయటకు వచ్చారు. నర్సాపురానికి చెందిన రాపాక ప్రభాకర్‌ భీమవరం లాడ్జిలో ఉన్నాడని తెలుసుకొని అక్కడ మాటువేసి పట్టుకున్న తర్వాత అటు నర్సాపురంలో గాని, ఇటు భీమవరంలో గానీ ఎవరికీ ఎటువంటి అనుమానం రాలేదు. కృష్ణారావు కోసం రాజమండ్రిలో గాలిస్తున్నప్పుడే ఎక్కడో ఇది లీకైంది. అందుకే రాజమండ్రి వీఎల్‌ పురం దగ్గరకు వచ్చేసరికి శ్రీకాకుళం పోలీసుల మీద అర్థరాత్రి 12.30 సమయంలో 25 మంది రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలతో వెంబడిరచి దాడికి దిగడం వెనుక మాస్టర్‌ మైండ్‌ వేరేగా ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page