`ఏమాత్రం మారని జిల్లా బీసీ సేంక్షేమాధికారి తీరు
`మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు చీవాట్లు పెట్టినా బేఖాతరు
`అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సక్రమంగా అందని జీతాలు
`బీసీ స్టడీ సర్కిల్‌కు కర్చీల కొనుగోళ్లలోనూ కక్కుర్తి
`తనవారికి హాస్టళ్లు అదనంగా కట్టబెట్టి నెలవారీ వసూళ్లు

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దాంతో పరిపాలన తీరు కూడా మారుతోంది. కానీ ప్రభుత్వం మారినంత మాత్రాన తాము మారాల్సిన అవసరం లేదన్నట్లు కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి తీరే దీనికి ఉదాహరణ. వసూళ్లకు, ఆశ్రిత పక్షపాతానికి మారుపేరుతో గతం నుంచీ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ అధికారి ఇప్పటికీ అదే పంథా కొనసాగిస్తున్నట్లు ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలతో స్పష్టమవుతోంది. హాస్టల్ వార్డెన్ల నుంచి నెలవారీ వసూళ్లతోపాటు ఏవైనా కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఖర్చుల భారాన్ని కూడా వారిపైనే రుద్దేసి, ఈమె మాత్రం ఆ ఖర్చులకు బిల్లులు పెట్టుకుని జేబులో వేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా వేధించడమే కాకుండా తనకు అనువైన వార్డెన్లకు ఎక్కువ హాస్టళ్లకు ఇన్‌ఛార్జీలుగా నియమించి సొమ్ము దండుకుంటున్నట్లు ఆ శాఖ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి చీవాట్లు తిన్నారంటేనే ఈమెగారి వ్యవహారశైలి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు మారినా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారుల పనితీరులో ఇసుమంతైనా మార్పు కనిపించడంలేదు. ఎవరొస్తే మాకేంటి.. మా దందా మాదే.. అన్నట్లు సాక్షాత్తు జిల్లా బీసీ సంక్షేమాధికారే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ హాస్టళ్లు 92 ఉంటే వార్డెన్లు మాత్రం 51 మందే ఉన్నారు. దాంతో వీరందరికీ అనివార్యంగా రెగ్యులర్‌గా చూసే హాస్టల్‌తోపాటు అదనంగా మరో హాస్టల్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని వార్డెన్లందరూ సమానమే అయినా వారందరికంటే పలాస కళాశాల హాస్టల్ వార్డెన్ ఉపేంద్రను మాత్రం ఎక్కువ సమానుడిగా జిల్లా అధికారి ట్రీట్ చేస్తున్నారు. ఇతర వార్డెన్లకు ఒక్కో హాస్టల్‌కే ఇన్‌ఛార్జీ బాధ్యతలు అప్పగిస్తే ఉపేంద్రకు మాత్రం పలాసతోపాటు వంద కిలోమీటర్ల పరిధిలో మరో రెండు హాస్టళ్లకు ఇన్‌ఛార్జిని చేశారు. పలాస నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచిలి మండలం ఎస్‌ఎం పల్లి, 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కవిటి మండలం రాజపురం వసతి గృహాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రాజపురంలో 170 మంది, ఎంఎస్ పల్లిలో 160, పలాసలో 70 మంది.. వెరసి 400 మంది విద్యార్థులు ఆయనగారి పరిధిలో ఉన్నారు. తనకు మూడు బాధ్యతలు కట్టబెట్టినందుకు కృతజ్ఞతగా మిగతా వార్డెన్ల మాదిరిగానే ప్రతినెలా విద్యార్థుల సంఖ్యను బట్టి చెల్లించేదానితోపాటు అదనంగా రూ.10వేలు కప్పంగా జిల్లా అధికారికి ఆయన సమర్పిస్తున్నట్లు తోటి వార్డెన్లే బహిరంగంగా చెబుతున్నారు. రాజపురానికి సమీపంలో పీకే పాలెం వసతిగృహం ఉంది. ఇక్కడి వార్డెన్‌ను కాదని 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాసలో పనిచేస్తున్న వార్డెన్ ఉపేంద్రకు రాజపురం బాధ్యతలు అప్పగించారు. ఇటీవల వసతి గృహాల అధికారులతో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ నిర్వహించిన సమీక్షలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అసిస్టెంట్ బీసీ సంక్షేధికారి ఎమ్మెల్యే దీనిపై నిలదీయగా జిల్లా అధికారి ఉత్తర్వుల మేరకు ఉపేంద్రకు బాధ్యతలు ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. జిల్లా బీసీ సంక్షేమాధికారి స్వగ్రామం కవిటి కావడంతో ఆ మండలంలో ఉన్న రాజపురం హాస్టల్ ఇన్‌ఛార్జిగా తను చెప్పినట్లు చేసే ఉపేంద్రకు బాధ్యతలు అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి.
కుర్చీల కొను‘గోల్‌మాల్’
బీసీ స్టడీసర్కిల్ పేరుతో వంద కుర్చీల కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో 16వేల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో వందమంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళంలోని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్న జిల్లా బీసీ సంక్షేమాధికారి దీన్ని అదనుగా చేసుకొని స్టడీ సర్కిల్‌కు అవసరమైన కుర్చీల కొనుగోలుకు తలో రూ.వెయ్యి ఇవ్వాలని జిల్లాలోని బీసీ హాస్టళ్ల వార్డెన్లకు ఇండెంట్ పెట్టారు. ఆ మేరకు వార్డెన్ల సంఘం ప్రతినిధులు తమ వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు కూడా పెట్టారు. ఆ మేరకు రూ.51వేలు వసూలయ్యాయి. అందులో రూ.50,600 వెచ్చించి వంద కుర్చీలు కొనుగోలు చేసి బీసీ స్టడీసర్కిల్‌కు అప్పగించారు. కానీ కుర్చీల కొనుగోలుకు రూ.50,600 అయ్యిందని, ఆ మొత్తం చెల్లించాల్సి ఉందంటూ గుంటూరులోని రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయానికి జిల్లా అధికారి బిల్లు పెట్టారు. అయితే వార్డెన్ల నుంచి దండిన మొత్తంతో వాటిని కొనుగోలు చేసిన విషయం బయటపడటంతో మాట మార్చేశారు. మొత్తం 200 కుర్చీలు కొనుగోలు చేశామని, వార్డెన్లు ఇచ్చిన సొమ్ముతో కొనగోలు చేసినవి కాకుండా మిగిలిన వంద కుర్చీలకు డబ్బు చెల్లించాల్సి ఉందని బుకాయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని 80 అడుగల రోడ్డులో బీసీ స్టడీసర్కిల్ భవనం ఉన్నా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఐటీసీలోని గిరిజన్ భవన్‌లో ఈ నెల 26 నుంచి డీఎస్సీ ఎస్జీటీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. వార్డెన్ల సొమ్ముతో కొన్న వంద కుర్చీలనే ఇక్కడకు తరలించి, అరువుపై కొన్నట్లు ప్రచారం చేస్తున్నారని తెలిసింది.
అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ఆటలు
జిల్లాలోని బీసీ హాస్టళ్లలో పని చేస్తున్న 111 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మే నెల వేతనాలు ఇంకా అందలేదు. జూన్‌లో కొందరికి ఐదు రోజులు, మరికొందరికి పది రోజులు, ఇంకొందరికి 15 రోజులు పని చేసినట్టు చూపించి వేతనాలు జమ చేశారు. దీనిపై పలువురు ఉద్యోగులు గత నెలలో మంత్రి అచ్చెన్నాయుడు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన బీసీ సంక్షేమ అధికారికి ఫోన్ చేసి వివరణ కోరారు. ఇతర జిల్లాల్లో మాదిరిగానే వేతనాలు ఇచ్చామని ఆమె చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పెండిరగ్ వేతనాలు చెల్లించాలని మంత్రి ఆదేశించినా ఇప్పటికీ అవి అందలేదని తెలిసింది. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించినట్లే బీసీ హాస్టళ్ల ఉద్యోగులకు చెల్లించాలని మంత్రి ఆదేశించినా ఇప్పటికీ అమల్లోకి రాలేదు.
`జిల్లాల విభజన సమయంలో విజయనగరం జిల్లాలో చేరిన జి.సిగడాం మండలం సంతవురిటికి చెందిన ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఆ జిల్లాకు శ్రీకాకుళం నగరంలోని కళాశాల హాస్టల్‌కు బదిలీ చేశారు. ప్రభుత్వం మారిని తర్వాత సదరు ఉద్యోగి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ఆశ్రయించాడు. ఎంపీ బీసీ అధికారికి ఫోన్ చేసి చీవాట్లు పెట్టి తక్షణమే ఆ ఉద్యోగిని రిలీవ్ చేయాలని ఆదేశిస్తే గానీ సదరు అధికారి స్పందించలేదు.
`ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో బీసీ హాస్టళ్ల పనితీరుపై ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇటీవల బీసీ అధికారిని ఇంటికి పిలిపించి మందలించారు. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల బదిలీలపైనా నిలదీశారని తెలిసింది. దీంతోపాటు బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన నిధుల ఖర్చుపైనా వివరణ కోరినట్టు తెలిసింది. కింతలిలో పని చేస్తున్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని కొందరు వార్డెన్లు ఫిర్యాదు చేశారన్న సాకుతో వైకాపా హయాంలో స్థానిక నాయకుడి సూచనలతో ఇచ్ఛాపురం బదిలీ చేయడంపైనా కూన నిలదీశారు.
కలెక్టర్ సీసీ దన్నుతో..
ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితమే ఉద్యోగ విరమణ చేసిన ఆచారి అనే రిటైర్డ్ ఉద్యోగి రణస్థలం మండలం జీరుపాలెం బాలికల హాస్టల్‌తోపాటు కొమరవానిపేట బాలుర హాస్టల్‌ను అనధికారికంగా నిర్వహిస్తున్నారని అందిన ఫిర్యాదుపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా అధికారిని వివరణ కోరినట్టు తెలిసింది. సదరు ఆచారి జిల్లా అధికారి దన్నుతో ఎనిమిది మంది వార్డెన్లను బెదిరిస్తూ పెత్తనం సాగిస్తున్నట్టు బాధితులు డీఆర్వోకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై డీఆర్వో వివరణ కోరినా స్పందించని బీసీ అధికారి కలెక్టర్ సీసీ ప్రసాద్ ద్వారా చాలా వ్యవహారాలను చక్కబెడుతున్నట్టు ఆ శాఖ అధికారుల్లో చర్చ జరుగుతోంది. హాస్టళ్ల నిర్వహణ, బీసీ సంక్షేమాధికారి తీరుపై ఫిర్యాదు చేయడానికి వచ్చేవారిని కలెక్టర్‌ను కలవకుండా సీసీ అడ్డుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆరు నెలల వ్యవధిలో ముగ్గురు కలెక్టర్లు మారినా నెలల తరబడి పెండిరగ్‌లో ఉన్న ఫైల్స్ వారి వద్దకు వెళ్లకుండా సీసీ ద్వారా జిల్లా బీసీ సంక్షేమాధికారి మేనేజ్ చేస్తున్నట్లు తెలిసింది.
Comments