top of page

ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌లో నకిలీ రుణాలు

Writer: NVS PRASADNVS PRASAD
  • పాత ఆర్‌.ఎం. హయాంలోనే అధికం

  • కొద్ది రోజులుగా రికార్డులు పరిశీలిస్తున్న విజిలెన్స్‌

  • నరసన్నపేట బ్రాంచ్‌ శైలిలోనే ఆర్థిక నేరం

  • టీఆర్‌ఎం రాజు ఖాతాలో మరికొందరు బలి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నరసన్నపేట బజారు బ్రాంచిలో ఏమాదిరిగా ఎంఎస్‌ఎంఈ రుణాల పేరుతో బ్యాంకు అధికారులు తమ ఖాతాలో సొమ్ములు వేసుకొని రొటేషన్‌ చేసుకున్నారో, మెయిన్‌ బ్రాంచిలో కూడా ఇప్పుడు అదే మాదిరిగా నకిలీ రుణాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ బ్రాంచిలో కొలట్రల్‌ ష్యూరిటీ పెట్టిన ఆస్తి కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు మంజూరు చేయడం ఒకటైతే, అసలు లబ్ధిదారులే లేకుండా సూక్ష్మరుణాల పేరుతో కొంత మొత్తాన్ని వేరే ఖాతాలకు డైవర్ట్‌ చేయడం మరో అంశం. దీనికి సంబంధించి బ్యాంకు విజిలెన్స్‌ అధికారులకు ఎప్పుడు, ఎక్కడ్నుంచి ఉప్పందిందో తెలియదుగానీ గత కొద్ది రోజులుగా ఇక్కడ రికార్డులను పరిశీలించి దాదాపు రూ.4కోట్ల వరకు ఈ విధంగా ప్రజల సొమ్ము దారిమళ్లిందని గుర్తించినట్లు తెలుస్తుంది. విచిత్రంగా అటు గార, ఇటు నరసన్నపేట బజారు బ్రాంచి కుంభకోణాలు జరిగినప్పుడు రీజనల్‌ మేనేజర్‌గా వ్యవహరించిన టీఆర్‌ఎం రాజు హయాంలోనే ఇందులో ఎక్కువ మొత్తం జరిగినట్లు తెలుస్తుంది. ఎస్‌బీఐలో ఇటువంటి కుంభకోణాలు బయటపడినప్పుడు ముందుగా ఫీల్డ్‌ ఆఫీసరు, బ్రాంచి మేనేజర్లను మూడో కంటికి తెలియకుండా బదిలీ చేసేస్తున్నారు. దీంతో ఆలస్యంగా ఇటువంటి వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు మెయిన్‌ బ్రాంచి విషయంలో కూడా నకిలీ రుణాల అంశం బయటపడటంతో సంబంధిత ఫీల్డ్‌ ఆఫీసర్‌ను కొన్నాళ్ల క్రితం ఇక్కడి నుంచి వేరేచోటకు పంపించేశారు. మూడోకంటికి తెలియకుండా చూడాలని బ్యాంకు ఉన్నతాధికారులు తాపత్రయపడ్డారు. అయితే నకిలీ రుణాలను మళ్లీ రికవరీ చేయాల్సి ఉండటంతో ఎవరి పేరుతో ఎంత ఇచ్చారు? అందుకు సంబంధించి కొలట్రల్‌ ష్యూరిటీగా ఎంతమేర ఆస్తిపత్రాలు ఉంచారు? అన్న వివరాలను పరిశీలిస్తున్నారు. ఇందులో ష్యూరిటీ కింద ఇచ్చిన పత్రాల్లో ఉన్న ఆస్తి కంటే మంజూరుచేసిన రుణం ఎక్కువుందని గ్రహించి కొందర్ని విచారించగా, అప్పట్లో సంబంధిత బ్యాంకు అధికారులను మేనేజ్‌ చేసి, సొమ్ములిచ్చి రుణాన్ని పొందామని వారు చెబుతున్నట్టు భోగట్టా. ప్రస్తుతం ఇక్కడి నుంచి బదిలీ చేయబడిన ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఇచ్చిన రుణం రూ.75 లక్షలు కాగా, అంతకు ముందు నుంచి రూ.3 కోట్లు పైబడి నకిలీ రుణాలు బ్యాంకు దాటేసినట్టు తెలుస్తుంది. ఇటువంటి రుణాలు మంజూరుచేసినప్పుడు బ్రాంచి మేనేజర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ దగ్గర్నుంచి రీజనల్‌ మేనేజర్‌ వరకు అందరూ పరిశీలిస్తారు. ఫీల్డ్‌ ఆఫీసర్‌ స్థాయిలో లోపం ఉందని గుర్తించినా రీజనల్‌ మేనేజర్‌ స్థాయిలో బిజినెస్‌ పేరుతోనో, ఆబ్లిగేషన్‌ పేరుతోనో, ప్రీమియం కస్టమర్‌ అన్న సాకుతోనో రుణాలు పరిమితికి మించి ఇమ్మంటే కిందిస్థాయి అధికారులు ఇవ్వాల్సిందే. కానీ ఈ వ్యవహారం బయటపడిన తర్వాత మాత్రం ఆర్‌ఎం స్థాయి వ్యక్తులను బ్యాంకు మేనేజ్‌మెంట్‌ రక్షించి, కిందవారిని బలి తీసుకుంటుంది. గార బ్రాంచిలో బంగారు నగలు మాయమయ్యాయని అప్పటి ఆర్‌ఎం రాజు ప్రకటించడం, దానికి అసిస్టెంట్‌ మేనేజర్‌ స్వప్నప్రియ కుటుంబమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఒక ఎత్తయితే, దర్యాప్తు జరుగుతుండగానే బ్రాంచిలో పని చేస్తున్న సిబ్బందిని బదిలీ చేసేశారు. చివరకు ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న అటెండర్లను కూడా అక్కడి నుంచి మార్చేశారు. అంటే పోలీసులు విచారణకు వస్తే ఆ సమయంలో తాము లేమని, ఎటువంటి సమాచారం తెలియదని చెప్పి తప్పించుకోవడమే టీఆర్‌ఎం రాజు ప్రధాన వ్యూహం. ఆయన ఇక్కడ ఆర్‌ఎంగా పని చేసినప్పుడు వెలుగుచూసిన రెండు కుంభకోణాల మీద ఇంతవరకు ఎటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా ఆయన హయాంలోనే శ్రీకాకుళం మెయిన్‌ బ్రాంచిలో కూడా నకిలీ రుణాలు వెలుగుచూసిన తర్వాతనైనా ఆయనపై చర్యలుంటాయా అనేది ప్రశ్నార్ధకమే. ఎందుకంటే నరసన్నపేట బజారుబ్రాంచిలో నకిలీల పేరుతో రుణాలు బయటికి వెళ్లిపోయాయని ‘సత్యం’ మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకువచ్చిన తర్వాత అవన్నీ గిట్టని రాతలని టీఆర్‌ఎం రాజు తేల్చిపారేశారు. కానీ అప్పటి ఆమదాలవలస చీఫ్‌ మేనేజర్‌ బీఏఎన్‌ మూర్తి నరసన్నపేట వచ్చి విచారణ చేపట్టిన తర్వాత ‘సత్యం’లో వచ్చినది వాస్తవమేనని తేల్చడంతో ఆయన్ను ఆకస్మికంగా ఆమదాలవలస నుంచి బదిలీ చేసేశారు. ఇప్పుడు కూడా శ్రీకాకుళం మెయిన్‌ బ్రాంచిలో టీఆర్‌ఎం రాజు పాత్ర బయటపడకుండా ఉండేందుకు ఫీల్డ్‌ ఆఫీసర్‌ను ఇంతకు క్రితమే ఇక్కడి నుంచి పంపించేశారు. ఇవన్నీ చూస్తుంటే టీఆర్‌ఎం రాజు వెనుక స్టేట్‌బ్యాంకుకే చెందిన పెద్ద తలకాయలెవరో ఉన్నట్టు అనుమానం కలగకమానదు.

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page