మైన్స్ అధికారుల నుంచి కలెక్టర్ ఆరా
లెక్కలు చెప్పలేక చేతులెత్తేసిన మైన్స్
తాత్కాలిక అగ్రిమెంట్లు రద్దు
సీసీల ఏర్పాటుకు ఆదేశం
ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

‘అసలు జిల్లాలో ఎన్నిచోట్ల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి? దాని ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఎంత చేరింది?’ ఇది మైన్స్ అధికారులకు కలెక్టర్ అడిగిన ప్రశ్న. ఎంత తవ్వకాలు జరిగిందో లెక్క లేదు. ‘ఎంతమంది డీడీలు తీస్తున్నారో తెలీదు. ఉచితం కావడంతో అగ్రెసివ్‌గా ముందుకెళ్లలేకపోతున్నాం.’ ఇది మైన్స్ డీడీ కలెక్టర్‌కు చెప్పిన సమాధానం. దీంతో ఏడు రోజులకు అనుమతులు ఇచ్చిన ర్యాంపుల్లో తవ్వకాలు ఆపాలని కలెక్టర్ అక్కడికక్కడే ఆదేశాలిచ్చిన వైనమిది.
జిల్లాలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన డీషిల్ట్రేషన్ కాలువల్లో తప్ప మిగిలిన చోట్ల ఇసుక తవ్వకాలు ఆపాలని స్వయంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించినా ఎక్కడా దాన్ని పాటించే నాధుడు కనిపించడంలేదు. కలెక్టర్ ఆఫీసులో ఉండే అధికారి ఇక్కడికి వచ్చి ఏం చూస్తారన్న ధీమాలో ఇసుకాసురులు ఉంటే, దారి పొడవునా చెక్‌పోస్టులు ఏర్పాటుచేసినచోట కనీస తనిఖీలు లేకపోవడంతో ఇసుకను పక్కజిల్లాకు పట్టుకుపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇసుక కొరతను నివారించి నిర్మాణ రంగానికి ఊతమివ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చింది. అందులో భాగంగా ఇసుకను తవ్వి ఒడ్డున వేయడానికి టెండర్లు పిలిచింది. ఇందుకు హాజరైన కాంట్రాక్టర్లు వేసిన బిడ్లు, చూపిన పత్రాలు నమ్మశక్యంగా లేవనే కారణంతో వారం రోజులకు తాత్కాలిక అనుమతులు 12 ర్యాంపులకు మంజూరుచేసింది. ఇందులో మొదటి విడతగా ఆరు ర్యాంపులు జిల్లాలో మొదలయ్యాయి. ఆ తర్వాత మరో ఆరు ర్యాంపులు వచ్చాయి. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు ఏడు రోజులు ముగిసిపోవడంతో ఈ ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు నిలిపేయాలని ప్రభుత్వం కొత్త నిర్దేశకాలిస్తే తవ్వకాలు ప్రారంభించాలని కలెక్టర్ పేర్కొన్నారు. కానీ ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడంలేదు. జిల్లాలో అనేక ర్యాంపుల నుంచి ఇసుక అక్రమంగా తవ్వేస్తున్నారన్న నివేదికల మేరకు మైనింగ్ డీడీని పిలిచి అసలు ఇప్పటి వరకు ఏయే ర్యాంపుల్లో ఎన్ని మెట్రిక్ టన్నుల ఇసుకను తవ్వారో చెప్పాలని కలెక్టర్ కోరారు. కానీ, ప్రతీ ర్యాంపులోను ప్రొక్లయినర్లు దించి పెద్ద ఎత్తున ఇసుకను తవ్వుకుపోవడంతో మైనింగ్ శాఖ ఎక్కడ ఎంత తవ్వారనే నిఘాను ఉంచలేదు. ఎందుకంటే.. ఒకవైపు స్వయంగా ముఖ్యమంత్రే ఉచిత ఇసుకని ట్రాక్టర్ మీద లోడు ఎక్కువ ఉన్నా కేసు రాస్తే ఒప్పుకోనని ప్రకటించడంతో మైనింగ్ శాఖ అటువైపు దృష్టి సారించలేదు. మరోవైపు నదీ గర్భాలు ఎక్కడికక్కడ దొలిచేస్తున్నారన్న కథనాల మేరకు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఎవరైనా ఆశ్రయిస్తే స్వయంగా కలెక్టరే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎంతమేరకు తవ్వారన్న నివేదికను అడిగారు. అది మైన్స్ శాఖ వద్ద లేకపోవడంతో వారం రోజుల పాటు ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయని కలెక్టర్ ప్రకటించారు. త్వరలోనే అన్ని ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి, లారీలను జియోట్యాంగింగ్ చేసి పర్యవేక్షించాలని మైన్స్ శాఖను ఆదేశించారు. ఈమేరకు జిల్లావ్యాప్తంగా తవ్వకాలు జరుపుతున్నవారికి మైన్స్ డీడీ సమాచారమందించారు. వీరంతా వినినట్టే నటించి తమ పని తాము చేసుకుపోతున్నారు. ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలో ఇసుక కొరత లేదు. అవసరానికి మించే తవ్వేశారు. కానీ ఎక్కడికక్కడ స్టాక్‌పాయింట్లు పెట్టుకొని ఇసుకను నిల్వ చేస్తున్నారు. ఎవర్ని అడిగినా సొంత అవసరాల కోసం సొంతంగా తవ్వించుకుంటున్నామనే సమాధానాలిస్తున్నారు. మరోవైపు నదుల్లో ప్రొక్లయినర్లు ఉన్నా మైన్స్, రెవెన్యూ శాఖలు ఏమీ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే.. టెండర్లను కాదని నామినేషన్ పద్ధతిలో ఇసుక తవ్వకాలకు అనుమతి తెచ్చుకున్నారంటే కచ్చితంగా ప్రభుత్వ పెద్దల అండదండలు ఉంటాయని సంబంధిత శాఖలు భావిస్తున్నాయి. ఎంత ఉచిత ఇసుకైనా ఎంత తవ్వుతున్నారన్నదానికి ఒక లెక్కుండాలి. అది లేకపోవడంతో ఇసుకాసురుల ఇష్టారాజ్యంగా మారింది. వాస్తవానికి గార, కాఖండ్యాంలలో డీషిల్ట్రేషన్ కింద ఇసుకను తవ్వుకోడానికి పూర్తిస్థాయి అనుమతులున్నాయి. ప్రస్తుతం 12 ర్యాంపులూ మూతపడినట్టే. ఈ రెండుచోట్లా కాకుండా ఎక్కడ ఇసుక తవ్వినా, రవాణా చేసినా చర్యలు తీసుకునే అధికారం యంత్రాంగానికి ఉంది. ఇప్పుడు నివగాం, బట్టేరు, పురుషోత్తపురం, ముద్దాడపేట, గోపాలపెంటలో ఇప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయి.
బిల్లులతో పొంతన కుదరడంలేదు
సాధారణంగా ఇసుక కావాలంటే గ్రామ సచివాలయాలు లేదా ఏపీ శాండ్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. జీపీఎస్ అమర్చిన వాహనంతో పాటు ఏ రీచ్ నుంచి కావాలో ఎంపిక చేసుకోవాలి. అధికారుల నుంచి అనుమతి పత్రం వచ్చాక రీచ్‌కు వెళ్లి చూపిస్తే కాంట్రాక్టర్ లోడ్ చేస్తారు. అయితే ఈ విధంగా ఎంతమంది బిల్లులు తెచ్చారు? ఎంత ఇసుక లోడయిందన్న లెక్కలు కూడా సంబంధిత శాఖలో లేవు. తాత్కాలిక అగ్రిమెంట్లు ఇచ్చినప్పుడు ఇసుక లభ్యతను బట్టి 7వేల మెట్రిక్ టన్నుల నుంచి 10వేల మెట్రిక్ టన్నుల వరకు ఒక్కో రీచ్‌కు కేటాయించారు. ఇంత ఇసుక తరలిపోయిన తర్వాత కనీసం సంబంధిత ర్యాంపులో ఆ మేరకు వ్యాపారమైనా జరిగినట్లు డబ్బులు ప్రభుత్వ ఖాతాలో జమవ్వాలి. కానీ అటువంటిదేమీ లేకుండానే వందలాది లారీలు వెళ్లిపోవడంతో కలెక్టర్ మొత్తం ర్యాంపులను ఆపేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.
Comentários