ఆధారాలిచ్చినవారిని అరెస్ట్ చేశారు
డీజీ స్థాయి అధికారి చెప్పారని కథ మార్చేశారు
విచారణ మధ్యలో తప్పుకున్న సీఐ
కామేశ్వరరావుతో కుదిరిన డీల్
ఆర్‌ఎం రాజును ఇప్పటికీ విచారించని వైనం
గార ఎస్‌బీఐ కుంభకోణంలో జెత్వానీ కేసు పోలికలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గత ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్న పోలీసులంతా రాష్ట్రవ్యాప్తంగా ఒకేలా వ్యవహరించారా? అంటే.. అవుననడానికే ఆధారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం వ్యక్తి ప్రయోజనం కోసం వ్యవస్థలను కుళ్లబొడిచేసి సొమ్ములు చేసుకొని వెళ్లిపోయినట్లు అర్థమవుతుంది. రోజూ సినీ నటి జెత్వానీ కేసును చదువుతుంటే పెద్ద పెద్ద ఐపీఎస్ అధికారులు ఇంత చిన్న లాజిక్‌ను మర్చిపోయి ఎందుకు క్రైమ్‌కు పాల్పడ్డారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక పారిశ్రామికవేత్త కోసం ఉన్నత పోలీసు అధికారి జెత్వానీ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లే ఒక బ్యాంకు అధికారి కోసం మరో పోలీసు డీజీ స్థాయి అధికారి చెప్పారని ఇక్కడి పోలీసులు దొంగకేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అక్కడా తెర వెనుక కథ నడిపింది పోలీసు పెద్ద తలకాయే. ఇక్కడ కథలోనూ కీలక పాత్ర పోలీసు డీజీ స్థాయి వ్యక్తిదే.

జెత్వానీ కేసులో నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్టు గార ఎస్‌బీఐ కేసులో అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్య వెనుక కూడా రెండు కోణాలు ఉన్నాయి. తాకట్టు బంగారం లాకర్‌లో ఉండాల్సింది మాయం కావడంతో పోలీసులు దర్యాప్తు జరిపి దోషులను శిక్షించి బాధితులకు న్యాయం చేకూర్చాల్సిందిపోయి, తన కూతురు ఆత్మహత్యకు బ్యాంకులో నగలు మాయమవడమే కారణమని స్వయంగా అప్పటి ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్వప్నప్రియ తల్లినే పోలీసులు వేధించిన విషయం ఇప్పుడు జెత్వానీ కేసు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. ముంబయి నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఏం చేశారో, శ్రీకాకుళంలో స్వప్నప్రియ ఆత్మహత్య కేసులో కూడా ఇక్కడి పోలీసులు అదే పని చేశారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు, ముఖ్యమంత్రి గ్రీవెన్స్‌కు ఫిర్యాదులు వెళ్లిన తర్వాత జరుగుతున్న దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
గార ఎస్‌బీఐలో తాకట్టులో ఉన్న బంగారు నగలు మాయమైన మాట వాస్తవమని, ఆ బ్యాంకుకు అసిస్టెంట్ మేనేజర్‌గా స్వప్నప్రియ పని చేస్తుందని, లాకర్‌లో ఉండాల్సిన నగలు ఎక్కడ ఉన్నాయో తనకు తెలుసని, ఎవరెవరు తాకట్టుపెట్టారో కూడా ఆధారాలు సంపాదించానని అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు సూచన మేరకు కొంత బంగారాన్ని విడిపించి బ్యాంకుకు అందజేశానని, మిగిలిన అన్ని వివరాలు చనిపోయిన స్వప్నప్రియ ఫోన్‌లో ఉన్నాయంటూ స్వప్నప్రియ సోదరుడు కిరణ్ అప్పటి ఎస్పీ గ్రీవెన్స్‌కు వెళ్లి నేరుగా ఆధారాలన్నీ సమర్పిస్తే దాని మీద విచారణ జరపాల్సిన పోలీసు అధికారులు అక్కడికి 24 గంటల్లో కిరణ్‌ను పట్టుకెళ్లి లోపలేశారు. అలా అని ఆయన బ్యాంకు నుంచి బంగారం తీసుకువెళ్లాడన్న ఆధారాన్ని ఏడాది కావస్తున్నా ఇంతవరకు పోలీసులు సంపాదించలేకపోయారు. అందుకే ఛార్జిషీట్ కూడా ఇప్పటి వరకు పడలేదు. స్వప్నప్రియ బ్యాంకు నుంచి బంగారం తీసుకువెళ్లి సోదరుడికి ఇచ్చిందన్న ఒక్క ఆధారాన్ని కూడా పోలీసులు ఇప్పటి వరకు సంపాదించలేదు. ఆ మాటకొస్తే బ్యాంకులో ఉన్న బంగారం మాయమవడం వెనుక కుట్ర ఏమిటో స్వప్నప్రియ సోదరుడు కిరణ్ తన తల్లితో కలిసి ఎస్పీకి ఆధారాలు సమర్పించిన రోజే ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ వీడిపోయింది. అక్కడి నుంచే పోలీసుల ఆలోచన మరో రూట్‌లో వెళ్లింది. ఇన్ని లక్షలు విలువైన బంగారాన్ని బ్యాంకు కాంపౌండ్ దాటించేసినవారిని పిలిచి బేరమాడితే పెద్ద ఎత్తున సొమ్ములొస్తాయన్న ఆలోచనకు బీజం పడిరది. అందులో భాగంగానే కిరణ్ ఇచ్చిన ఆధారాల మేరకు అప్పటి ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు గ్యాంగ్‌ను పిలిచి బేరం కుదుర్చుకున్న పోలీసులు పెద్ద మొత్తంలో సొమ్ములు తీసుకొని స్వప్నప్రియ సోదరుడి మీదకు కేసు నెట్టేశారు. కులపరంగా మైనార్టీ కావడం, రాజకీయ, పోలీసు ప్రాపకం లేకపోవడంతో ఈ కేసులో కిరణ్‌ను బలిపశువును చేసి తప్పుకోవచ్చని పోలీసులు భావించారు. ఈ ప్రాసెస్‌లో తప్పు మీద తప్పు చేసుకుంటూపోయారు.
20 సెల్‌ఫోన్లో, 15 ద్విచక్ర వాహనాలో దొంగిలించిన వ్యక్తి దొరికితే ముసుగులేసి మరీ మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు గార బ్యాంకు కుంభకోణాన్ని ఛేదించామంటూ విలేకరుల సమావేశం పెట్టినప్పుడు కిరణ్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. ఇందుకు ఒక బలమైన కారణం ఉంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి ఆధారాలు ఉండి శిక్ష తప్పదు అన్న కేసుల్లోనే నిందితుడ్ని మీడియా ముందు చూపించాలి. కానీ అప్పటికే తాము అరెస్ట్ చేసిన వ్యక్తి నిందితుడు కాదని పోలీసులకు తెలుసు. అందుకే మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పకుండా ఆ ప్రెస్‌మీట్‌ను అర్ధాంతరంగా ముగించేశారు. ఈ కథ చదువుతుంటే ముంబయి నటి జెత్వానీ కథ లాంటిదే అంతకు క్రితం శ్రీకాకుళంలో జరిగిపోయిందనిపిస్తే ఆ తప్పు మనది కాదు. పోలీసు బుర్రలన్నీ ఒకేలా ఉంటాయనడానికి నిదర్శనం. గార ఎస్బీఐ వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఉన్న అప్పటి సీఐ నాయుడుకి ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరు ఏ రోజుకైనా పీకకు చుట్టుకుంటుందని తెలుసు. ఎందుకంటే.. శ్రీకాకుళం వన్‌టౌన్‌తో పాటు గార పోలీస్‌స్టేషన్‌కు కూడా ఆయనే సీఐ. ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ ఆయనే నిర్వహించారు. ఎప్పుడైతే ఈ కేసు తప్పుదారి పడుతుందని తెలుసుకున్నారో ఆయన అప్పటికప్పుడు లాంగ్‌లీవ్ పెట్టి వెళ్లిపోయారు. దీంతో గార ఎస్‌ఐగా ఉంటూ సీఐగా పదోన్నతి పొందిన కామేశ్వరరావు ఈ కేసును డీల్ చేశారు. గార ఎస్‌ఐగా పని చేసిన సమయంలో కామేశ్వరరావు చేయని పాపం లేదు. శ్రీకూర్మంలో వైకాపా నాయకుడు రామశేషు హత్య కేసును పూర్తిగా నీరుగార్చేయడానికి కామేశ్వరరావు పెద్ద ఎత్తున సొమ్ములు తీసుకున్నారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. రామశేషును హత్య చేసింది ఎవరన్న విషయం గార పోలీసుల విచారణలో ముందే తేలిపోయినా నిందితులను తప్పించడం కోసం పెద్ద ఎత్తున సొమ్ములు తీసుకొని స్థానిక తెలుగుదేశం నేతల మీదకు ఈ కేసును నెట్టేయాలని ప్రయత్నించారన్న ఆరోపణ ఆయనపై ఉంది. అయితే అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావుకు శ్రీకూర్మం స్థానికులు ఈ విషయం చేరవేయడంతో తెలుగుదేశం నాయకులు బతికిపోయారు. అలాగే గార పరిధిలో జరిగిన నేరాలు, ఘోరాల్లో అసలైన నిందితులను తప్పించి గతంలో క్రైమ్ రికార్డుల్లో ఉన్న వేరే మండలాలకు చెందిన కొందర్ని తీసుకువచ్చి అరెస్ట్ చూపించిన ఘటనలు కామేశ్వరరావు సర్వీసులో కోకొల్లలు అని చెప్పుకుంటారు. శ్రీకాకుళం లా అండ్ ఆర్డర్ డీఎస్పీగా శృతి పనిచేసిన రోజుల్లో కామేశ్వరరావుకు సంబంధించిన తలనొప్పులు తీర్చడానికే రోజంతా సరిపోయేదన్న టాక్ ఆ డిపార్ట్‌మెంట్‌లో ఉంది. అలాంటి కామేశ్వరరావు నేరుగా అప్పటి ఎస్పీకి ఈ వ్యవహారంలో లాభనష్టాలు చెప్పడంతో కథ మొత్తం తిప్పేశారు. దీనికి తోడు డిపార్ట్‌మెంట్‌లో అప్పటి ఎస్పీకి గాడ్‌ఫాదర్‌గా వ్యవహరించిన డీజీ స్థాయి అధికారి కూడా ఈ కేసులో ఎస్‌బీఐ ఆర్‌ఎం టీఆర్‌ఎం రాజు తరఫున రికమండ్ చేయడంతో స్వామికార్యం, స్వకార్యం రెండూ పూర్తవుతాయన్న కారణంతో స్వప్నప్రియ కేసును స్వయంగా ఆమె కుటుంబ సభ్యుల మీదకే నెట్టేశారు.

బ్యాంకులో తాకట్టులో ఉండాల్సిన బంగారం యథావిధిగా ఉందని ఎప్పటికప్పుడు ఆడిటింగ్ డిపార్ట్‌మెంట్ రిపోర్టు ఎలా ఇచ్చిందని, ఇప్పుడు పోయిందని టీఆర్‌ఎం రాజు పోలీసులకు ఎలా ఫిర్యాదు చేశారన్న అనుమానం బ్యాంకు వైపు నుంచి అప్పటి చీఫ్ జనరల్ మేనేజర్‌కు వచ్చింది. టెక్నికల్‌గా ఇది అత్యంత విలువైన ప్రశ్న. ఈ ఒక్క కారణంతోనే టీఆర్‌ఎం రాజును బాధ్యుడ్ని చేస్తూ ఉద్యోగం తొలగించొచ్చు. కానీ దొంగలెవరో పోలీసులు కనిపెట్టారని, ఆ మేరకు రిమాండ్‌కు కూడా పంపారనే ఒక కాగితం చూపిస్తూ మరోసారి డీజీ స్థాయి వ్యక్తితో అప్పటి సీజీఎంకు చెప్పించడంతో ఆయన భయపడిపోయి ఈ కేసులో ఈ కోణం విడిచిపెట్టేసినట్లు తెలుస్తుంది. ఎన్నిసార్లు ఆడిట్ జరిగినా, ఎంతమంది అధికారులు వచ్చినా లాకర్‌లో బంగారం సేఫ్‌గా ఉందని రిపోర్టు ఇచ్చారంటే అది రీజనల్ మేనేజర్ స్థాయిలో మేనేజ్ చేస్తే గానీ కుదరదు. ఇక జెత్వానీ కేసుతో సరితూగే మరికొన్ని అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఎలుకల మందు తాగి స్వప్నప్రియ ఆత్మహత్యకు ప్రయత్నించిన తర్వాత శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో ఎస్‌బీఐ నుంచి ఇద్దరు అధికారులు వచ్చి మంచం మీద ఉన్న ఆమె వద్ద నుంచి కొన్ని సంతకాలు తీసుకొని వెళ్లిపోయారు. స్వప్నప్రియ ఎలుకల మందు తాగి రోజులు గడవడం, కడుపునొప్పి తీవ్రం కావడంతో ఆత్మహత్యాయత్నం విషయం బయటపెట్టింది. దీంతో ఆగమేఘాల మీద మెడికవర్‌లో చేర్పించి ఓవైపు తప్పి, మరోవైపు సోదరుడు హడావుడిగా తిరుగుతుంటే ఐడీ కార్డులు వేసుకొచ్చి మరీ ఇద్దరు అధికారులు స్వప్నప్రియ నుంచి సంతకాలు తీసుకున్నారు. పోనీ బ్యాంకు సొమ్ములతో ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం సంతకాలు తీసుకున్నారా అంటే మెడికవర్‌కు స్వప్నప్రియ కుటుంబమే సొమ్ములు చెల్లించింది. అలా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు సంతకాలు తీసుకోవడం వెనుక కూడా ఓ కుట్ర ఉంది. స్వప్నప్రియ చనిపోయిన తర్వాత పరామర్శకు ఎవరు వెళ్లినా వారి మీద కూడా కేసు పెట్టిస్తానని టీఆర్‌ఎం రాజు బెదిరించారని వినికిడి. అప్పటి పోలీసుల నుంచి ఎంత సహకారం లేకపోతే టీఆర్‌ఎం రాజు ఇంత విచ్చలవిడిగా భయపెట్టగలుగుతారు. గార బ్యాంకు కుంభకోణం జరిగినప్పుడు ఉన్న స్టాఫ్ మొత్తాన్ని మార్చేసి పోలీసు విచారణకు ఎవర్నీ అందుబాటులో లేకుండాచేసిన టీఆర్‌ఎం రాజు, అప్పటి పోలీసు అధికారులు చేసిన హత్య ఇది.
Comments