top of page

ఎందుకీ యాచకబతుకులు?!

Writer: NVS PRASADNVS PRASAD
  • బెనిఫిట్‌ షోలు, బొంగులో షోలు లేవన్న రేవంత్‌

  • సినిమాల్లోనే పౌరుషం.. బయట ఏమాత్రం కనపడని రోషం

  • జగన్‌ను కలిసినప్పుడు గింజుకున్నారు.. రేవంత్‌తో కరచాలనానికే కక్కుర్తిపడ్డారు

  • సినిమాలో హీరోలు.. నిజజీవితంలో జీరోలు

  • ఆకాశంలో ‘తార’ల్ని నేలకు దింపిన రేవతి



(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఇంపోర్టెడ్‌ కార్లలో ఖరీదైన దుస్తులు వేసుకుని చలువ కళ్లద్దాలు పెట్టుకుని, బౌన్సర్లను, వందిమాగధులను వెంట బెట్టుకుని అచ్చం పెదరాయుడు మూవీలో సత్యనారాయణలా దిగి ముఖ్యమంత్రి దగ్గర వంగి వంగి నమస్కారాలు పెట్టి ముష్టి అడుక్కోడం కంటే, దుబారా ఖర్చులు తగ్గించుకుని, పద్ధతిగా నాణ్యమైన సినిమాలు తీసి, న్యాయమైన టికెట్‌ రేట్లతో జనాలు సినిమాలు ఆదరించేలా చేసుకోవచ్చు కదా. ఈ దేశంలో ఏ రిక్షా పుల్లర్‌ అయినా 10 రూపాయల కిరాయికి 30 రూపాయలు ఇప్పించమని ప్రభుత్వాన్ని కోరుకున్నాడా? ఈ దేశంలో ఏ ఆటోవాలా అయినా ప్రజల్ని వేగంగా గమ్యాలు చేర్చడానికి ఆటో కొనుక్కుంటున్నాను, అందుచేత కారుచౌకగా నాకు ఒక ఆటో ఇప్పించండి అని ప్రభుత్వాన్ని వేడుకున్నాడా? ఈ దేశంలో ఏ కార్మికుడు అయినా నేను చాలీచాలని జీతంతో బతకడమే కష్టంగా వుంది, గుడిసె అయినా వేసుకుంటాను.. అని కనీసం గజం స్థలం అయినా ప్రభుత్వాన్ని ఉచితంగా అడిగాడా? ఏ ఉద్యోగయినా మీరు వేసే ఈ టాక్స్‌లు కట్టలేకపోతున్నాను.. నాకు ఆదాయపు పన్ను నుంచి ఈ సంవత్సరం మినహాయింపు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని అడుక్కున్నాడా? ఒకవేళ పొరపాటున ఎవరైనా అడిగినా ఏ ప్రభుత్వం అయినా అలా వాళ్లకు సాయం చేసిందా? మరి ఎందుకు ఈ ముష్టి సినీవీరులకే అడుగడుగునా ఈ వీరముష్టి? కళామతల్లి ముద్దుబిడ్డలకే ఎందుకు ఈ యాచక బతుకులు?

తెలంగాణ ముఖ్యమంత్రితో తెలుగు సినీ ప్రముఖుల భేటీ (అంటే దేబిరింత) పూర్తయ్యాక మన మహావీరులకి తమ స్థానం ఏంటో తెలిసి వచ్చింది. ఆంధ్రలో లాగా తెలంగాణలో కులాల కుమ్ములాటలు మరీ ఇంత రొచ్చు స్థాయిలో లేకపోవడం వల్ల ఏ హీరోను తక్కువ చేస్తే ఆ కులపోళ్లు మనోభావాలు దెబ్బతినిపించుకుంటారోననే దుస్థితి అక్కడ లేకపోవడం వల్ల చాలా సాదాసీదాగా అక్కడ మీటింగ్‌ జరిగింది. మన మహా హీరోలకు కులపరమైన ఉన్మాదులు తప్ప కళాపూర్వకమైన అభిమానులు ఒక్కరంటే ఒక్కరు లేరు. వీళ్ల కళ ఏపాటిదని అభిమానులు ఉండడానికి! వందల కోట్లలో సినిమా వ్యాపారం జరగటం, సామాన్యుడికి అది అందుబాటులో ఉన్న ఒక అవకాశం కావటం వల్ల వీళ్లంతా మహా స్టార్లు అవటం మినహా మామూలుగా మనుషులుగా చూస్తే వీళ్లంతా అతి సామాన్య గుణగణాలు ఉన్నటువంటి వాళ్లు కూడా కాదనేది ఆయా సినిమా ఫంక్షన్లలో మైకుల ముందు వాళ్లు మాట్లాడే చెత్త చూస్తే అర్థమవుతుంది. ఈపాటి దానికి వీళ్లంతా తమ పేర్ల చివరన బాబు అని తగిలించుకుని వాళ్లలో వాళ్లే తెగ గౌరవించేసుకుంటారు వినేవాడికి ఒళ్లు మండిపోతుందనే జ్ఞానం కూడా లేకుండా. తెలంగాణలో వీళ్ల కులాత్మకత పనిచేయక నేల మీదకు దిగివచ్చి బొచ్చెతో అక్కడ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఆయన బెనిఫిట్‌ షోలు, బొంగులో షోలు లేవంటూ వీళ్ల చేతిలో బొకేలు, వాళ్లు తెచ్చిన శాలువలు లాగేసుకుని మరీ వెనక్కి పంపించేశారు. వేలాది కోట్ల రూపాయలు వెనకేసుకుని కూడా సిగ్గు చంపుకుని ప్రభుత్వం ముందు అడుక్కోవడానికి వెళ్లిన వీళ్లంతా పాలిపోయిన ముఖాలతో వెనక్కి వచ్చేశారు. మురళీమోహన్‌ లాంటి అవకాశవాదులు కూడా ఇక మళ్లీ ఎక్కడా నోరు ఎత్తరు. ఒక్క రేవతి చనిపోయి వీళ్లందరికీ క్రమశిక్షణ నేర్పింది అనే అనాలి.

దిల్‌ రాజు నోట్లో నుంచి పెద్ద బూతు విన్నాం. మాకు టికెట్ల రేట్లు, బెనిఫిట్‌ షోలు, ప్రీమియర్‌ షోలు అనేవి ప్రధానమైనవి కావు, సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లడమే మా ధ్యేయం అంటూ కొత్త భాషణం చెప్పాడు హృదయ రాజు? ఏది ఏమైనా మీకు ఇలానే జరగాలి. సినిమా ఇండస్ట్రీ వాళ్లను ఇలా ట్రీట్‌ చేయాలని తెలియక సరిగ్గా ట్రీట్‌ చేసి మా జగన్మోహన్‌ రెడ్డి తప్పు చేసారు. కట్ట కట్టుకుని నలభై మంది వెళ్లారు, సినిమా టికెట్ల రేట్లు పెంచం, బెనిఫిట్‌, ప్రీమియర్‌లు ఉండవు అని తేల్చి చెప్పి ఇకపై సినిమాలకు ప్రత్యేకంగా సెస్‌ ఉంటుందని వాత పెట్టి పంపారు రేవంత్‌రెడ్డి. రాయితీలు ఇవ్వకపోగా ఆదాయంలో కోత పెట్టాడుతున్నారు. మీకు ఇలా వాతలు పెడితేనే సెట్‌ అవుతారు. మీకు ఈ రూటే కరెక్ట్‌. తన అన్న చిరంజీవి జగన్మోహన్‌రెడ్డి దగ్గరకు వెళ్లి చేతులు కట్టుకొని కూర్చున్నారంటూ అప్పట్లో పవన్‌కల్యాణ్‌ తెగ ఆవేదన చెందారు. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన మహామహులు రేవంత్‌రెడ్డి ముందు ఎలా మోకరిల్లారో గురువారం చూశాం. హీరోలు, దర్శకులు, నిర్మాతలు శాలువాలు కప్పి దండం పెట్టడం తప్ప రేవంత్‌రెడ్డి ఎవరికీ ప్రతినమస్కారం చేసిన సీన్‌ కనపడలేదు. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్‌కేలో సినీనటుడు, రాజకీయవేత్త మురళీమోహన్‌ అప్పట్లో జగన్మోహన్‌రెడ్డి ఇంటి గేటు ముందు వాహనాలు ఆపి లోపలికి నడిపించారని గగ్గోలు పెట్టారు. గురువారం మాత్రం తెలంగాణ పోలీస్‌ కమాండ్‌ రూమ్‌లో రేవంత్‌రెడ్డి సినీ ప్రముఖులతో సమావేశం పెట్టారు. జగన్మోహన్‌రెడ్డి లాగా క్యాంప్‌ కార్యాలయానికి ఆహ్వానించలేదు సరికదా.. రేవంత్‌రెడ్డి వస్తారని సినీ ప్రముఖులంతా చాలాసేపు అక్కడ వెయిట్‌ చేశారు. దీనిపై ఇంతవరకు ఎక్కడా సినీ ప్రముఖులు నోరు విప్పలేదు సరికదా.. ఇదే మురళీ మోహన్‌ ముందు మైక్‌ పెడితే, అంతా సవ్యంగానే జరిగిందని చెప్పుకురావడం కొసమెరుపు. రేవంత్‌రెడ్డి సినీపరిశ్రమకు వరాలివ్వలేదు సరికదా.. సినిమాలు ఎలా తీయాలో డైరెక్షన్‌ ఇచ్చి పంపారు. సినిమాల్లో మీసాలు మెలేసి, తొడలు కొట్టే హీరోలు నిజ జీవితంలో కనీసం ఆత్మాభిమానం ఉన్న మనుషులుగా కూడా నిన్న కనిపించలేదు. మొన్నటికి మొన్న యువసామ్రాట్‌ నాగార్జున మాజీ కోడలు సమంత కేరెక్టర్‌ను నిందిస్తూ నాగార్జున మీదే ఆరోపణలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాలని ఒక్క మాట కూడా అనని అక్కినేని వంశాంకురం, ఆ తర్వాత తన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చేస్తే అక్రమమని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించని హీరో బేషరతుగా రేవంత్‌రెడ్డిని సినీ పరిశ్రమ తరఫున కలవడం ఏం సంకేతం ఇస్తున్నట్టు? తన కొడుకుపైనే హత్యానేరం మోపి ఎట్టి పరిస్థితుల్లోనూ జైలులో ఉంచాలని భావించిన రేవంత్‌రెడ్డిని నిస్సిగ్గుగా కలిసి ముఖం మీద నవ్వురంగు పులుముకొని బయటికొచ్చిన అల్లు అరవింద్‌ను ఏమనాలి? సంధ్యా థియేటర్‌ తొక్కిసలాటలో అల్లు అర్జున్‌ ఎ`11గా ఉన్నారు. 1 నుంచి 10 వరకు ఉన్న నిందితులను కాదని కేవలం పుష్పరాజ్‌ మీదే కాన్సంట్రేట్‌ చేసిన రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి పాహిమాం అనడం ఏ పౌరుషానికి నిదర్శనం? సినీ హీరోల ఆత్మాభిమానం దెబ్బతిందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాఖ్యలను సమర్ధించిన మురళీమోహన్‌ ఇప్పుడు రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి ఏం బావుకున్నట్టు? చిరంజీవి అనే ఒక నటుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి నమస్కారం పెడితే దాన్ని రాద్ధాంతం చేసారు. నేడు ఏమి జరుగుతుందని అందరూ వెళ్లి భయంతో మోకరిల్లారు? అయినా కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. మిమ్మల్ని ఇంటికి పిలిచి గౌరవంగా అన్నా అన్నా అంటే వినరు, మీరెంతరా ఆఫ్ట్రాల్‌ మొహానికి రంగులేసుకునే వాళ్లు అంటేనే మీకు తృప్తిగా సంతృప్తిగా ఉంటుందేమో!

2 Comments


Madina Sylani khajasha
Madina Sylani khajasha
Dec 27, 2024

maaamuluga ledu sir ee article gunday lothullo yekkado santhosham pellubhkindi

Like
Prasad Satyam
Prasad Satyam
Feb 17
Replying to

Thanq

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page