top of page

ఎంపీ అభ్యర్థిని విస్మరిస్తే... అంతే సంగతులు!

Writer: ADMINADMIN
  • అసంతృప్తులతో ప్రత్యేక భేటీ

  • ఇచ్ఛాపురం చైర్‌పర్సన్‌ భర్తపై ఉలాల భారతి ఫిర్యాదు

  • 24న జిల్లాకు రానున్న జగన్‌ బస్సు యాత్ర

  • వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ సుబ్బారెడ్డి

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

జిల్లాలో ఎన్నికలకు ముందు నిర్వహించిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేతల ముందు ఫిర్యాదులు, పితూరీలు పెట్టారు. శుక్రవారం స్థానిక ఆనందమయి కళ్యాణ మండపంలో నిర్వహించిన వైకాపా జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పోలింగ్‌ రోజు వరకు గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు, అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం సమన్వయంతో పని చేయాలని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త ఎంవీ సుబ్బారెడ్డి పిలుపునిస్తే తమ అభిప్రాయాలకు విలువ లేకుండా అభ్యర్థులను బరిలో నిలిపి, ఇప్పుడు సమైక్యంగా పని చేయాలని కోరడం సబబు కాదని కొందరు ప్రశ్నించడంతో అసమ్మతి పోటు ఎదుర్కొంటున్న నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉన్న లుకలుకలను ఇంతకు ముందే సర్దామని, ఇప్పుడు అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్నదానిపై సుబ్బారెడ్డి, చిన్నశ్రీను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం మున్సిపల్‌ వైస్‌చైర్‌పర్సన్‌ ఉలాల భారతీ దివ్య ఇటీవల తన మీద చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి బర్త అనుచితంగా ప్రవర్తించారని, వైకాపా అభ్యర్థి పిరియా విజయ కోసం పని చేస్తున్నందునే తన పట్ల కక్షపూరితంగా వ్యవహరించారని పేర్కొన్నారని తెలిసింది. దీంతో పిలక రాజ్యలక్ష్మి భర్తను, ఉలాల భారతీ దివ్యకు

నచ్చజెప్పి కలిసి పని చేసేలా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తుంది. ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి కోట గోవిందరావుతో పాటు మరో ఇద్దరితో వైకాపా సమన్వయకర్త ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం తన వ్యతిరేక వర్గీయుల్ని కలుస్తున్నదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నట్టు భోగట్టా. ఇప్పటి వరకు ఏయే వర్గాలను కలుసుకున్నారు? ప్రచారంలో ఇంకా కలుపుకొనిపోవాల్సిన నాయకులు ఎంతమంది మిగిలివున్నారు? గెలుపు కోసం ఏం చేయాలనే అంశాలు ఆరా తీసినట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ను కోఆర్డినేట్‌ చేయడంలో చాలామంది వైకాపా అభ్యర్థులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఫిర్యాదు ఇంతకు ముందే ఆ పార్టీ నేతల వద్ద ఉండటంతో ఎంపీ అభ్యర్థితో కోఆర్డినేట్‌ చేసుకోవాల్సిన బాధ్యతను ఇటు సుబ్బారెడ్డి, అటు చిన్నశ్రీను ఇద్దరూ నొక్కివక్కాణించారు. అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారానికి వెళ్లినప్పుడు ఎంపీకి కచ్చితంగా తెలపాలని, ఆ రోజు షెడ్యూల్‌ బట్టి ఎక్కడ ప్రచారంలో పాల్గొనాలో ఎంపీ అభ్యర్థి నిర్ణయించుకుంటారని వారు తెలిపారు. అసెంబ్లీ పరిధిలో పంచుతున్న పాంప్లెట్లలో ఎంపీ అభ్యర్థి పేరు, ఫొటో కచ్చితంగా ఉండాల్సిందేనని వీరు ఆదేశించారు. కేవలం అసెంబ్లీ అభ్యర్థికి మాత్రమే ఓటు వచ్చి, ఎంపీకి రాకపోయినా ఫర్వాలేదన్న కోణంలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, గతంలో ఇలా చేసే ఎంపీ స్థానాన్ని కోల్పోయామని వారు గుర్తు చేశారు. ఈ నెల 24న ముఖ్యమంత్రి టెక్కలిలో మేము కూడా సిద్ధం బస్సుయాత్రను ముగిస్తారని, ఈలోగానే అన్ని నియోజకవర్గాల్లోనూ అందరూ ఒక్క తాటిపైకి రావాలని సూచించారు. 25న జగన్మోహన్‌రెడ్డి నామినేషన్‌ కోసం పులివెందుల వెళ్తున్నందున రాత్రి బస ఉండకపోవచ్చని, అభ్యర్థులందరి వినతులు వినే సమయం లేనందున ఈ విస్తృత స్థాయి సమావేశమే ఎన్నికల సమాయత్త సమావేశంగా భావించి అలుకలు వీడాలని సూచించారు. పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు, ఏడుగురు అబ్జర్వర్లతో సుబ్బారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించి అసంతృప్తి నేతలతో మాట్లాడటానికి సుబ్బారెడ్డి సిద్ధమైనప్పటికీ, అక్కడ ధర్మాన కృష్ణదాస్‌ అసంతృప్తి నేతలంటూ ఎవరూ లేరని పేర్కొనడంతో ప్రత్యేక సమావేశాన్ని ముగించేశారు. రానున్న 30 రోజులు ప్రజల మధ్యనే ఉండాలన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వైకాపా ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని వివరించాలన్నారు.



విభేదాలు పక్కన పెట్టండి

నాయకుల మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి అభ్యర్ధుల విజయం కోసం కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ కోరారు. ఓట్ల సమీకరణకు ఏ విషయంలోనూ వెనుకడుగు వేయొద్దని సూచించారు. ప్రత్యర్ధి పార్టీలోని అసంతృప్తులతో మాట్లాడాలని సూచించారు.

మళ్లీ నేను గెలుస్తాను

శ్రీకాకుళం నియోజకవర్గంలో మరోమారు ఎమ్మెల్యేగా తానే గెలవబోతున్నట్టు మంత్రి ధర్మాన ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీలో ఎవరు పోటీలో ఉంటారో వారికే స్పష్టత లేదన్నారు. టీడీపీ నాయకులే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వారి బలహీనతలను బయటపెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా నాయకులు విమర్శించడానికి టీడీపీలో అసమ్మతి నాయకులు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ప్రతిపక్షాలు, ఎన్నికల కమిషన్‌తో ఇబ్బందులు ఉంటాయని ఊహించే ప్రణాళిక ప్రకారం వాలంటీర్లను రాజీనామా చేయించి ప్రచారంలో వినియోగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని కొనసాగిస్తామన్నారు. గ్రామాల్లో రాజీనామా చేసిన వాలంటీర్లతో ప్రచారం చేయాలన్నారు. వాలంటీర్ల ద్వారా నామినేషన్లకు జనసమీకరణ చేయించుకోవాలన్నారు. జిల్లాలో వైకాపా మర్యాదపూర్వకమైన విజయాన్ని, సీట్లను సాధించి రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి సీఎం కావడంలో కీలకభూమిక పోషిస్తుందని అన్నారు. సమావేశంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు రెడ్డిశాంతి, వి.కళావతి, గొర్లె కిరణ్‌కుమార్‌, ఎంపీ అభ్యర్ధి పేరాడ తిలక్‌, ఎమ్మెల్యే అభ్యర్ధులు దువ్వాడ శ్రీనివాస్‌, పిరియా విజయ, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్‌, నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పిరియా సాయిరాజ్‌, మీసాల నీలకంఠంనాయుడు, ఎం.వి.పద్మావతి, అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్‌, చింతాడ రవికుమార్‌, ఎం.వి.స్వరూప్‌ తదితరులు పాల్గొన్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page