`మందు బానిసల్లో పరివర్తన కృషిలో ఆల్కహాలిక్స్ ఎనానిమస్
`అంతర్జాతీయంగా విస్తరించిన ఆ సంస్థ సేవలు
`సేవా దృక్పథంతో పూర్తి ఉచితంగా కౌన్సెలింగ్
`ఔషధాలు వాడకుండానే క్లాసులు, సాహిత్యంతోనే చికిత్స
`శ్రీకాకుళంలోనూ సేవలందిస్తున్న ఏఏ సంస్థ
మద్యపానం ఓ వ్యసనం. ఇది సృష్టించే అనర్థాలను గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
‘మద్యం మానేయాలనే ఉంది.. కానీ అదెలాగో అర్థం కావడంలేదు’ అని చాలామంది మందుబాబులు చెబుతుంటారు.
ఇంకొంతమంది మందు మానేస్తున్నామంటూ ప్రమాణాలు చేస్తుంటారు. కానీ ఒకటిరెండు రోజుల్లోనే నాలుక పిడచకట్టుకుపోయి, మనసు అదుపుతప్పి మళ్లీ మందు బాటిల్ అందుకుంటారు. ఒకటికి రెండిరతలు ఎక్కువ తాగేస్తుంటారు.
సరిగ్గా ఇటువంటివారి కోసమే పనిచేస్తోంది ఆల్కహాలిక్ ఎనానిమస్ (ఏఏ) సంస్థ. బహుశా ఈ పేరు ఎవరూ ఇంతవరకు వినుండకపోవచ్చు. కానీ ఇది అంతర్జాతీయ సంస్థ. మద్యం వ్యసనం నుంచి బయటపడాలన్న ఆలోచన ఉన్న వారికోసమే ఇది ఏర్పాటైందని.. ఈ సంస్థ వార్షికోత్సవ సమావేశానికి వెళ్తే గానీ అర్థం కాలేదు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్ బయట దీనికి సంబంధించిన బ్యానర్ చూసి ఆసక్తితో లోపలికి వెళ్లి నిర్వాహకులను ఆరా తీసినప్పుడు మద్యం, సారాకు బానిసలైనవారిని వారు పూర్తి ఉచితంగా ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు దశాబ్దాలుగా శ్రమిస్తున్నట్లు అర్థమైంది. ఎటువంటి మందులు(ఔషధాలు) వాడకుండా, పైసా ఖర్చు లేకుండా కేవలం కౌన్సెలింగ్, సాహిత్యం(పుస్తకాల) ద్వారానే వ్యసనం నుంచి దూరం చేసేందుకు కృషి చేస్తూ.. గణనీయ విజయాలు సాధిస్తుండటం విశేషం.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
మద్యం చెడు వ్యసనమే గానీ.. మద్యపానం చేసేవారందరూ వ్యసనపరులు కారన్నది వాస్తవం. రిలాక్స్ అవ్వడానికో, ప్రత్యేక సందర్భాల్లోనూ మద్యం సేవించేవారిని వ్యసనపరులని చెప్పలేం. వీరికి భిన్నంగా చాలామంది నిత్యం తాగుతూ అది లేకపోతే బతకలేమన్నట్లు బానిసలుగా మారుతుంటారు. వీరిని వ్యసనం నుంచి తప్పించడం అంత సులభం కాదు. ఆ ప్రయత్నాలకు మొదటి అడ్డంకి స్వయంగా వారే. కానీ కొంతమందిలో పరివర్తన కనిపిస్తుంటుంది. తాగుడు మానేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు. కానీ ఎలా మానాలి? అన్నది తెలియక సతమతమవుతుంటారు. ఇటువంటి వారికోసమే మాజీ మందుబాబులే ఆల్కహాలిక్స్ ఎనానిమస్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. మద్యం మాన్పించేందుకు ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో డీ ఎడిక్షన్ సెంటర్లు చాలానే పనిచేస్తున్నాయి. ఇవన్నీ దాదాపు వ్యాపార ధోరణితో నడుస్తున్నవే. మద్యం మానేయాలనుకుంటున్నవారిని భారీగా ఫీజులు వసూలు చేసి ఈ కేంద్రాల్లో చేర్చుకుంటారు. హైపవర్ మందులు ఇస్తుంటారు. తర్వాత మళ్లీ సైకియాట్రిస్టులు, పోలీసులు వంటి వారితో క్లాసులు చెబుతారు. చివరాకరికి మళ్లీ కౌన్సెలింగ్ కోసం ఏఏ సెంటర్లకే తమ వద్ద చేరిన వ్యసనపరులను పంపిస్తుంటారు. దీన్నిబట్లే ఏఏ సెంటర్లు ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సంస్థ మందుబాబులను మార్చి సన్మార్గంలోకి మళ్లించడంలో దాదాపు 65 శాతం విజయం సాధిస్తుండటం విశేషం. అదే నేరుగా ఏఏ సెంటర్లకే వెళితే పైసా ఖర్చు లేకుండా పవర్‌ఫుల్ ఔషధాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్‌కు గురికాకుండా వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇద్దరు ఆల్కహాలిక్స్‌తో మొదలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 186 దేశాల్లో 1.25 లక్షల ఏఏ గ్రూపులు ఉన్నాయి. వీటిలో 30 లక్షలమంది సభ్యులుగా ఉన్నారు. మనదేశంలోని ముంబైలో 1957 మే ఐదో తేదీన తొలి ఏఏ కేంద్రం ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని సికింద్రాబాద్‌లో 1983లో, ఉత్తరాంధ్రలోని ఎస్.కోటలో 1990లో తొలి ఏఏ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
మాజీ వ్యసనపరులే నిర్వాహకులు
ఏఏ కేంద్రాల్లో ప్రత్యేకంగా మందుబాబులను సంస్కరించడానికి ప్రత్యేకంగా సైకియాట్రిస్టులు, ఇతర రంగాల నిపుణులెవరూ ఉండరు. ఎటువంటి వైద్యం చేయరు.. ఔషధాలు వాడరు. జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ మెరుగు అన్న నానుడిని అనుసరించి కౌన్సెలింగ్ మాత్రమే నిర్వహిస్తారు. అది కూడా మద్యం బానిసలుగా ఉంటూ ఏఏ కేంద్రాల్లో చేరి దాని బారినుంచి బయటపడినవారే కొత్త వ్యసనపరులకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. తమ అనుభవాలను, మద్యపానం వల్లే జరుగుతున్న అనర్థాలను, మందు మానేసిన తర్వాత తమ జీవితాల్లో వచ్చిన మంచి మార్పులను వివరిస్తూ మందుబాబుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే మద్యం మానడానికి ఎవరికివారుగా ఎలా ప్రయత్నించవచ్చు వివరిస్తూ రకరకాల పుస్తకాలు, కరపత్రాలు, ఇతర సాహిత్యం రూపొందించి సభ్యులతో చదివించి, వాటిలో సూచించన మార్గాల్లో ప్రయత్నించమని సూచిస్తుంటారు. ఇందులో కీలకమైన పుస్తకం ‘ఆల్కహాలిక్స్ ఎనానిమస్’ ఈ పేరునే సంస్థకు కూడా పెట్టుకున్నారు. మందుబాబుల గుప్త మిత్రమండలి అని స్థూలంగా దీని అర్ధం. దీన్నే ఏఏ కేంద్రాల కౌన్సెలింగ్‌లో ప్రమాణికంగా.. అంతకుమించి గైడ్‌లా ఉపయోగిస్తున్నారు.
శ్రీకాకుళంలో 14 ఏళ్లుగా..
ఇటువంటి ఏఏ కేంద్రం మన శ్రీకాకుళం నగరంలో కూడా ఉన్న విషయం చాలామందికి తెలియదు. దానికంటే ముందే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, రాజాం, చీపురుపల్లి, ఎంకే రాజపురం, కుసుమి, బుక్కూరు, ఉంగరాడ తదితర పలు గ్రామాల్లో దాదాపు 2005 నుంచి ఈ కేంద్రాలు పని చేస్తుండగా 2010 నవంబర్‌లో శ్రీకాకుళం నగరంలోని ఓబీఎస్ వెనుక ఉన్న రెడ్‌క్రాస్‌కు చెందిన మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం మేడపైని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 14 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు రాత్రి 6.30 నుంచి 8.30 గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుంటారు. రోజూ 15 నుంచి 20 మంది వ్యసనపరులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పటివరకు సుమారు 500 మందిని వ్యసనం బారి నుంచి రక్షించినట్లు నిర్వాహకులు చెప్పారు. కాగా వారంలో ఒక్కరోజు ఆదివారం నాడు మహిళా వ్యసనపరులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆధ్యాత్మికం, వైద్యం, మానసిక రుగ్మతలు అనే మూడు అంశాల్లో క్లాసులు ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా వ్యసనం నుంచి బయటపడిన వారితోనే జరుగుతుండటం విశేషం. అలాగే కేంద్రాల నిర్వహిణకు గానీ, ఇతరత్రా ఖర్చులకు గానీ ప్రత్యేకంగా ఫీజులేవీ వసూలు చేయరు. కౌన్సెలింగ్ కేంద్రంలో ఒక హుండీ ఉంటుంది. కౌన్సెలింగ్‌కు వచ్చేవారు తమకు తోచినంత అందులో వేస్తే చాలు. ఆ సొమ్ముతోనే నిర్వహణకు ఖర్చులు చేస్తుంటారు. సాధారణంగా 90 రోజులు కౌన్సెలింగ్‌కు హాజరైతే వ్యసనం మరుపునకు వచ్చేస్తుంది. అయితే మళ్లీ దీని బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రెగ్యులర్‌గా క్లాసులకు హాజరుకావాల్సిందేనంటున్నారు.
మరెందుకు ఆలస్యం.. మీలో ఎవరైనా మందు బానిసలు ఉంటే.. వారికి దాని నుంచి బయటపడాలన్న కోరిక ఉంటే ఈ కేంద్రాన్ని సందర్శించవచ్చు. లేదా 9542718118, 9000498502 అనే హెల్ప్‌లైన్ నెంబర్లకు సంప్రదించవచ్చు. మీ వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతారు.
ఒకప్పుడు రోజుకు ఏడు ఫుల్‌బాటిల్స్!
ఏఏ కేంద్రాల సక్సెస్‌కు గొప్ప ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ను పేర్కొనవచ్చు. ప్రస్తుతం శ్రీకాకుళంలో జరుగుతున్న ఏఏ వార్షికోత్సవాలకు హాజరైన ఆయన్ను ‘సత్యం’ ప్రతినిధి కదిలించినప్పుడు ఆయన తన అనుభవాలను వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పదహారేళ్ల ప్రాయంలో మద్యపానానికి అలవాటుపడ్డాను. ఒక్క గ్లాస్ బీరుతో ఇది మొదలైంది. మూడు నాలుగేళ్ల తర్వాత ప్రతిరోజూ సాయంత్రం మందు వేయడం అలవాటైంది. తర్వాత మధ్యాహ్నాల్లోనూ.. కొన్నాళ్లకు ఉదయంపూట కూడా తాగే పరిస్థితి ఏర్పడిరది. చివరి ఏడెనిమిదేళ్లలో అయితే నిరంతరం తాగుతూనో, తాగుడు మత్తులోనో మునిగి ఉండేవాడిని. మానేయాలని చాలాసార్లు అనుకుని ఒకటి రెండు రోజులు దూరంగా ఉండేవాడిని. కానీ ఆ తర్వాత కోరికను తట్టుకోలేక మళ్లీ మొదలెట్టి.. గతంకంటే ఎక్కువ తాగేసేవాడిని. ఈ వ్యసనం వల్ల నా 20 ఏళ్ల జీవితం పోయింది. చదువు, కుటుంబంపై ప్రభావం పడిరది. సుమారు రూ.నాలుగు కోట్లు మద్యానికే సమర్పించుకోవడం వల్ల ఆర్థికంగా చితికిపోయాను. మానసికంగా, శారీరకంగానూ దిగజారిపోయాను. నన్ను మార్చడానికి నా కుటుంబ సభ్యులు 2011 జనవరి 13న ఒక రిహ్యాబిలేటేషన్ కేంద్రంలో చేర్చారు. అక్కడ నాలుగు నెలలు ఉన్నాను. అక్కడినుంచి బయటకొచ్చేటప్పుడు నిర్వాహకులు ఏఏ కేంద్రాల గురించి చెప్పారు. మళ్లీ జీవితంలో తాగకూడదనుకుంటే.. తమ వద్దకు రాకూడదనుకుంటే ఏఏ కేంద్రాల్లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు వెళ్లమని సూచించారు. అక్కడే నాకు మద్యం బానిసలుగా మారిని వివిధ వర్గాలవారు తారసపడ్డారు. తమ అనుభవాల సారం వినిపించారు. ఫలితంగా నాకు కనువిప్పు కలిగింది. 13 ఏళ్లుగా ఒక్క చుక్క మద్యమైనా రుచి చూడకుండా దూరంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను మార్చిన ఏఏ సంస్థలోనే పబ్లిక్ ఇన్‌ఫర్మేషన్ విభాగం వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నాను.
Comments