ఏడుగురిపై సస్పెన్షన్లు ఎత్తివేత
- NVS PRASAD
- Mar 28
- 2 min read
ఆ సస్పెన్షన్లు చెల్లవంటూ ‘సత్యం’ కథనంపై స్పందన
సస్పెండ్ చేస్తూ పేర్కొన్న సెక్షన్లు వర్తించవని ముందే చెప్పిన సంచలన సాయంకాల పత్రిక
మిగిలినవారికి ఇచ్చిన ఉత్తర్వుల్లో సెక్షన్లు మార్చిన డీఈవో
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కుప్పిలి మోడల్ స్కూల్, హైస్కూల్‌లో మాల్‌ప్రాక్టీసింగ్ జరిగిందని, ఇందుకు అక్కడ ఇన్విజిలేటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు బాధ్యులంటూ 14 మందిని డీఈవో తిరుమల చైతన్య సస్పెండ్ చేసిన కేసులో ఏడుగురికి ఉపశమనం లభించింది. ఎవరికైతే రూల్ 8(1)(2) ఏపీసీఎస్ (సీసీఏ) నిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తున్నానంటూ డీఈవో ఉత్తర్వులిచ్చారో అవి చెల్లవని ‘సత్యం’ ఈ నెల 25న ‘ఆ సస్పెన్షన్లు చెల్లవు అనే శీర్షికన ఓ కథనం ప్రచురించింది. అందులో 1991 ఏపీసీఎస్ చట్టం ఏం చెబుతుంది? 1964 ఏపీసీఎస్ కాండక్ట్ రూల్స్ ఏం చెబుతున్నాయని చట్టాన్ని సోదాహరణంగా వివరించడంతో డీఈవో తిరుమలచైతన్య నాలుక కర్చుకున్నారు. దీంతో నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను రీవోక్ చేస్తున్నట్టు, అయితే వీరిపై విచారణ కొలిక్కి వచ్చేవరకు రీఇన్‌స్టెంట్ కొనసాగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం జిల్లాకు రావడంతో రాత్రి ఉపాధ్యాయ సంఘ నేతలందరూ కలెక్టర్‌ను కలిసి డీఈవో మీద ఫిర్యాదు చేశారు. ఆయన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డీఈవోను సస్పెండ్ చేసే పరిధిలో తాను లేనని, ఉపాధ్యాయులను రీ ఇన్‌స్టెంట్ చేయడానికి ప్రయత్నిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అసలు సస్పెండ్ చేసిన ఉత్తర్వులే చెల్లవని ‘సత్యం’లో వచ్చిన కథనాన్ని యూనియన్ నేతలు కలెక్టర్ ముందు ఉంచారు. దీంతో 27న రాత్రి ఆగమేఘాల మీద డీఈవో వీరి సస్పెన్షన్ ఉత్తర్వులను పక్కన పెట్టి రీ ఇన్‌స్టెంట్‌మెంట్ సర్వీస్ అంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో లావేరు మండలం అదపాక జెడ్పీ హైస్కూల్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎంవీ కామేశ్వరరావు, ధర్మవరం జెడ్పీ హైస్కూల్ ఇన్‌ఛార్జి హెచ్‌ఎంగా పనిచేస్తున్న పి.హరికృష్ణ, కేశవరావుపేట జెడ్పీ హైస్కూల్ మ్యాథ్స్ సీనియర్ అసిస్టెంట్ బీవీ సాయిరాం, మురపాక జెడ్పీ హైస్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ పైడి ఫల్గుణరావు, కేశవరావుపాలెం జెడ్పీ హైస్కూల్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ బి.రామ్మోహనరావు, ఎచ్చెర్ల మండలం బడివానిపేట ఎంపీయూపీ స్కూల్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఎస్.శ్రీనివాసరావు, కేశవరాయునిపాలెం జెడ్పీ హైస్కూల్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ ఎ.శ్రీరాములునాయుడులను ఎంక్వైరీ పూర్తయ్యే వరకు రీ ఇన్‌స్టెంట్ చేస్తున్నట్టు ఉత్తర్వులిచ్చారు. అసలు సస్పెన్షన్ ఉత్తర్వులే చెల్లనప్పుడు మళ్లీ రీ ఇన్‌స్టెంట్ ఉత్తర్వులేమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే కలెక్టర్ నోట్ ఆర్డర్ మేరకు రీ ఇన్‌స్టెంట్ ఉత్తర్వులు ఇస్తున్నట్టు డీఈవో ఇచ్చిన ప్రొసీడిరగ్స్‌లో పేర్కొన్నారు. ఈసారి మాత్రం ఏపీ సివిల్ సర్వీస్ రూల్స్ 1991లో వర్తించే 8(5)(సి) నిబంధనను పక్కాగా రాసి రీ ఇన్‌స్టెంట్ ఆర్డర్‌ను ఇవ్వడం కొసమెరుపు.
Comments