top of page

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌`2 మెయిన్స్‌

Writer: ADMINADMIN

ప్లీజ్‌: రోస్టర్‌ పాయింట్లను సరిచేయండి!



గత పదిహేను రోజుల నుంచి గ్రూప్‌`2 మెయిన్స్‌ అభ్యర్థులు కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చేస్తున్నారు. కారణం.. గ్రూప్‌`2 నోటిఫికేషన్‌కు సంబంధించి రోస్టర్‌ పాయింట్లు ఏర్పాటు చేయడంలో తప్పు జరిగింది కనుక దానిని సవరించి మెయిన్స్‌ పరీక్ష పెట్టాలి అన్నది ఉద్యోగార్థుల డిమాండ్‌. సామాజిక న్యాయం కోసం రాజ్యాంగం ద్వారా లభించిన ఉద్యోగాల రోస్టర్‌ పాయింట్లు గ్రూప్‌`2 ఉద్యోగాలకు సరిగ్గా ఎంచలేదని ఆధారాలతో సహా పలువురు నిరుద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కౌంటర్‌ దాఖలు చేయవలసిన ప్రభుత్వం స్పందించలేదనేది నిరుద్యోగుల వాదన. ఒకవేళ రోస్టర్‌ పాయింట్లను గనుక సరిగా సవరించకుండా మెయిన్స్‌ పరీక్ష పెట్టినట్లయితే పలు వర్గాలకు చెందిన ఉద్యోగార్థులకు అన్యాయం జరుగుతుందనేది సత్యం.

అసలు రోస్టర్‌ అంటే.. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రమోషన్లకు సంబంధించి సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం కోసం రోస్టర్‌ పద్ధతి అవలంభించబడిరది. ఇది ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్‌ నెంబరు 77(1) ప్రకారం సమర్థించబడిరది. అయితే ప్రస్తుతం గ్రూప్‌`2 ఉద్యోగ ప్రకటనకు సంబంధించి మాత్రం ఈ 77(1) జీవో ప్రకారం రోస్టర్‌ కేటాయింపులు సరిగా జరగలేదని అవకతవకలు ఉండటం వల్ల ఉద్యోగార్థులు కోర్టుకెక్కిన పరిస్థితి. నిజానికి మొత్తం ఉద్యోగాల సంఖ్యను బట్టి ప్రతి నియోజకవర్గానికి ఉన్న ఉద్యోగాల సంఖ్యను బట్టి ఇంత శాతం ఉద్యోగాలు లభించాలి అనే లెక్కన తయారు చేయబడే పట్టికను రోస్టర్‌ అంటారు. రోస్టర్‌ పాయింట్ల సరైన కేటాయింపు వల్ల ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత పెరుగుతుంది.

తాజా వివాదం:

గ్రూప్‌`2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబరు 7న జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్‌ పాయింట్లు ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఉద్యోగార్థులు కేసులు వేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్‌ రోస్టర్‌ని సరిగా అమలుచేయడం లేదనేది ప్రధాన అంశం. అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగస్టులో జారీ చేసిన జీవో 77, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా కొన్ని వర్గాలకు రిజర్వేషన్‌ పాయింట్లు కేటాయించారన్నది వాదన. దీనివల్ల సామాజిక న్యాయం, పారదర్శకత లోపిస్తుంది.

ఉద్యోగార్థుల వాదన:

రోస్టర్‌ పాయింట్లు సరిచేయకుండా మెయిన్స్‌ పరీక్షలు నిర్వహిస్తే భవిష్యత్తులో వచ్చిన ఉద్యోగాలు కోల్పోవలసిన పరిస్థితి వస్తుందని, అంతకు మించి అసలు నోటిఫికేషన్‌ రద్దయిపోతుందని ఇటీవల జార్ఖండ్‌లో జరిగిన విషయాన్ని ఉదహరిస్తున్నారు. జార్ఖండ్‌లో అక్కడ ఇచ్చిన రోస్టర్‌ తప్పుల వల్ల కొన్నాళ్లకు ఉద్యోగాలు చేస్తున్నవారిని తొలగించారు. కనుక రోస్టర్‌ విధానంలోని తప్పులను సవరించి, వీలైనంత త్వరగా మెయిన్స్‌ పరీక్ష నిర్వహించాలని ఉద్యోగార్థులు గత 15 రోజుల నుంచి అన్నం, నీళ్లు మానేసి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దాదాపు ప్రతి జిల్లా నుంచి ఉద్యోగార్థులు ఏకబిగిన ఐకమత్యంతో ఆందోళనలు చేస్తున్నారు.

ఏపీపీఎస్‌సీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అత్యున్నత స్వతంత్ర వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఫిబ్రవరి 23, 2025న ఆదివారం పరీక్షలు జరపడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ పరీక్షను ఆపి, రోస్టర్‌ పాయింట్ల లెక్క తేల్చి వీలైనంత త్వరగా మెయిన్స్‌ పెట్టాలని ఎమ్మెల్సీలు చిరంజీవి, శ్రీకాంత్‌, రాంభూపాల్‌ రెడ్డి, ఏపీపీఎస్‌సీ చైర్‌పర్సన్‌ అనురాధను శుక్రవారం సాయంత్రం కలిసినట్టు చిరంజీవి చెప్పారు. మెయిన్స్‌ రాయవలసిన సుమారు 92 వేల మంది ప్రభుత్వ నిర్ణయం కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌లో ఒక గవర్నమెంట్‌ కొలువు సాధనకు సగటున ఐదు సంవత్సరాలు పడుతుంది. ఇక కేసులుంటే నోటిఫికేషన్‌కి పష్కర కాలం పట్టిన ఉదంతాలు ఉన్నాయి. సొసైటీలో గవర్నమెంట్‌ జాబ్‌ అంటే ఒక రకమైన క్రేజ్‌. మంచి జీతభత్యాలతో పాటు ప్రజాసేవ కూడా చేయవచ్చు. ఒక స్థిరమైన జీతం. అందుకే పాపం ఉద్యోగార్థులు తిండి తినడం మానేసి అయినా సరే పరీక్షలకు ప్రిపేరవుతుంటారు. ఒక కొత్త పుస్తకం మార్కెట్‌లోకి వస్తే ఆ పూటకి అన్నం మానేసి ఆ డబ్బులతో పుస్తకం కొని చదువుతుంటారు. ఇటు సొసైటీ కూడా వారిని సూదుల్లాగా పొడుస్తుంటుంది. ఒకపక్క అమ్మానాన్నల ఆశలు అడియాశలు కాకూడదని భూనభూంతరాలు బద్దలయ్యేలా చదువుతుంటారు.

ఏమిటీ రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌, రోస్టర్‌?

కేంద్ర ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ` రోస్టర్‌ కోసం 100 వరకు పాయింట్లు సూచించింది. ఈ మేరకే భర్తీ జరగాలి. ఇందులో ఉదాహరణ తీసుకుంటే ఓసీ మహిళ మొదటి కేటగిరీలోను, ఎస్సీ మహిళ రెండో కేటగిరీలోను, ఓపెన్‌ కేటగిరీ మూడులోను ఉంటుంది. ఎస్సీ మహిళ పోస్టు ఖాళీ అయితే మళ్లీ అదే రిజర్వేషన్‌తో ఆ పోస్టును భర్తీ చేయాలి. అయితే ఎప్పుడైతే ఓపెన్‌ కేటగిరీలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ చేరిందో.. అక్కడే రోస్టర్‌ దెబ్బతింది. మహిళ, ఎస్సీలకు సంబంధించి రోస్టర్‌లో, రిజర్వేషన్‌లో ఎటువంటి తేడాలు పెద్దగా కనిపించకపోయినా ఓపెన్‌ కేటగిరీలో అనేక మార్పులు జరిగిపోయాయి. ఓసీ మహిళగా ఉన్నది ఈడబ్ల్యూఎస్‌ మహిళగా మారిపోయింది. అలాగే ఓసీ జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ జనరల్‌ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్‌ కోటాలోను, మిగిలిన ఎస్సీ కోటాలోను మహిళా రిజర్వేషన్లు ఒకటికి రెండుసార్లు నమోదైపోయాయి. ఉదాహరణ తీసుకుంటే.. స్టేట్‌వైడ్‌ పోస్టు హెడ్‌ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసరు పోస్టుకు ఓసీ కేటగిరీలో ఆరు వేకెన్సీలు చూపిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం మహిళలకు రెండు పోస్టులు కేటాయించాలి. కానీ మూడు కేటాయించారు. అంటే ఒక పోస్టు అధికంగా మహిళలకు వెళ్లిపోయింది. అలాగే మొత్తం 10 పోస్టుల్లో మూడు మహిళలకు కేటాయించాలి. కానీ ఐదు పోస్టుల కింద మహిళలకు చూపించారు. వీటిని ఇప్పుడు సవరించకపోతే భవిష్యత్తులో దీనివల్ల ఉద్యోగాలు కోల్పోయినవారు కోర్టుకెక్కితే మొత్తం రద్దయిపోతుంది. అందుకే పెద్ద ఎత్తున దీనిపై ఆందోళన చేస్తున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణలో బయోమెట్రిక్‌ ద్వారా గ్రూప్‌ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి, ఆ విధానాన్ని అవలంభించకపోవడం వల్ల ఆ పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా పరీక్ష రాయాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ కూడా అలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సివుంది.

వచ్చేవి అరకొర ఉద్యోగాలు.. అవి ఎప్పుడు ప్రకటిస్తారో తెలియదు.. ప్రకటిస్తే సకాలంలో జరగవు.. ఇప్పటిలా రోస్టర్‌ పాయింట్లు పరిస్థితి వస్తే రోడ్డెక్కాల్సిన పరిస్థితి.. పోరాడాల్సిన స్థితి. మొత్తంగా ఉద్యోగ సాధనా ప్రక్రియ ఒక మహా భారత యుద్ధభూమిని పోలివుంటుంది. యుద్ధం అయినా సరే చేసి జీవితంలో నిలబడాలన్నది బలమైన ఉద్యోగార్థుల కోరిక. కనుకనే కళ్లనిండా ఆశలతో ఒకటికి రెండుసార్లు పరీక్షలు రాసి అనుకున్నది సాధించినవారూ ఉన్నారు. అటు ప్రభుత్వానికి కూడా ఉద్యోగులు కావాలి కదా!

కనుక పెద్దమనసుతో ప్రభుత్వం రోస్టర్‌ పాయింట్లను సరిచేసి, ఆ వెంటనే పరీలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.

ఇరవై ఐదేళ్లుగా గ్రామసేవలో హిస్టరీ రఫీసార్‌

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page