
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సోషల్ మీడియా పోస్టుల చుట్టూ రాజకీయ వివాదం నడుస్తోంది. వైకాపా కార్యకర్తలతో పాటు రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. వైకాపాకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి, పవన్ కల్యాణ్ కుటుంబసభ్యులపై ‘అసభ్యకర భాష’లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనేది వర్రా రవీందర్ రెడ్డి మీద ఉన్న ఆరోపణ. గతంలో వైకాపా సోషల్ మీడియా విభాగం కన్వీనర్‌గా ఉన్న సజ్జల భార్గవరెడ్డి మీద కేసులు పెట్టారు. సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు అయింది. ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. శ్రీరెడ్డి మీద కూడా కేసులు నమోదయ్యాయి. సుమారు 680 మందికి నోటీసులు ఇవ్వగా, 147 మంది మీద కేసులు నమోదు చేశారని, 50 మందిని అరెస్టు చేశారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. కానీ,అధికారికంగా పోలీసులు ఇంకా ఎటువంటి వివరాలూ చెప్పలేదు. వైకాపా హయాంలోనూ సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతిపరుల మీద కేసులు నమోదయ్యాయి. 2020లో విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రభుత్వ స్పందనను తప్పుబడుతూ ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టును ఫార్వార్డ్ చేసినందుకు టీడీపీ సానుభూతిపరురాలు, గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ మీద కేసు పెట్టారు. 2020లో కరోనా సమయంలో నాటి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌లపై అనుచిత వ్యాఖ్యలతో వచ్చిన వార్తా కథనాన్ని ఫార్వార్డ్ చేశారంటూ విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు నలందకిశోర్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. 2023లో నాటి సీఎం వైఎస్ జగన్ ఫోటోను మార్ఫింగ్ చేసి కించపరిచారంటూ గుంటూరుకి చెందిన టీడీపీ మహిళా కార్యదర్శి పిడికిటి శివ పార్వతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టులపై వైకాపా, టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అసభ్యకర పోస్టులు పెట్టేది మీ వాళ్లంటే మీ వాళ్లు అని నిందలు వేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 30ఏళ్ల కిందటే రాజకీయాల్లో వ్యక్తిత్వాలను కించపరిచేలా మాట్లాడటం మొదలైంది. కొందరు రాజకీయ నేతలు తమ అనుకూల పత్రికల ద్వారా ఇతర నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రధాన మీడియా సంస్థల పత్రికలు, టీవీ చానెళ్లను వాడుకుంటున్న తరుణంలో సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిన తర్వాత మెల్లగా రాజకీయ నేతలు వాటిని వేదికగా చేసుకోవడం మొదలుపెట్టారు. ఇతరులను లక్ష్యంగా చేసుకుంటూ సోషల్ మీడియాను ఆయుధంగా వాడటం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది రానురాను మరింత దిగజారుతూ వచ్చింది. చివరకు ప్రజలు గౌరవప్రదంగా జీవించే హక్కును సోషల్ మీడియా కాలరాసే పరిస్థితి తెచ్చింది. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు కారణం. ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలు సంస్థాగత కమిటీల కంటే సోషల్ మీడియా సైన్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. పార్టీకి బలమైన పునాదిగా భావిస్తూ ఆయా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా బృందాలను సమకూర్చుకుంటున్నాయి. అందుకు భారీగా ఖర్చు చేస్తున్నాయి. తమ పార్టీ సిద్ధాంతాలను, భావజాలాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడం అనే దశను దాటి ప్రత్యర్థుల వ్యక్తిగత సంబంధాల మీద, ఇంట్లో వాళ్లపై జుగుప్సాకరంగా మాట్లాడే స్థితికి ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దిగజారింది. ఏపీలో రాజకీయ యుద్ధాలు బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ జరుగు తున్నాయి. సోషల్ మీడియా ఖాతాల్లో ప్రధాన రాజకీయ పార్టీల అభిమానులు ముసుగు ముఖాలు వేసుకుని తమ పార్టీల తరఫున చెలరేగిపోతున్నారు. అసత్య ప్రచారాలు హద్దులు దాటేసి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోల స్థాయికి ఎదిగాయి. రాజకీయ విమర్శల పేరుతో మహిళలను కించపరచడం, దూషించడం యథేచ్ఛగా సాగిపోతోంది. ప్రత్యర్థి పార్టీలను విమర్శించే క్రమంలో వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి నేతల కుటుంబాలను, మహిళలను టార్గెట్ చేయడం అలవాటైపోయింది. సోషల్ మీడియా దుష్టశక్తులను ఏరి వేయడం సామాజిక బాధ్యత. సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ప్రచారాలకు పాల్పడితే ఏదో చిన్న కేసుతో పోదని జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి. చిన్నపిల్లలను ఇబ్బందికి గురి చేసినట్టుగా పోస్టులు ఉంటే పోక్సో చట్టం సెక్షన్ 57-బీ కింద, బాధితులు దళితులు, గిరిజనులైతే ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. సోషల్ మీడియా పోస్టులను ఎవిడెన్స్‌గా పరిగణిస్తారు. ఒకవేళ పోస్ట్ పెట్టి వెంటనే డిలీట్ చేసినా అది కూడా రికార్డ్ అయి ఉంటుంది.
Comments