ఏమార్చి.. రికార్డులు మార్చి.. ఇదో వంచనా ‘విజయ’ం!
- ADMIN
- Mar 29, 2024
- 4 min read

మలగాం భూమి పేరుతో హరిబాబు నెత్తిన టోపీ
`భీమిలి, పొన్నాడ భూముల పేరుతో నాగరాజుకు ఎసరు
`బ్యాంకు తాకట్టులో ఉన్న ఆస్తి పేరుతో ఆయనకే గాలం
`కౌలు పేరుతో రైతు భూమి తీసుకొని వేరే వ్యక్తి పేరుతో పత్రాలు
`ఆది అంతం లేని శమళ్ల విజయలక్ష్మి లీలలు
ఖరీదైన కారు.. దానిపై ఎమ్మెల్యే స్టిక్కర్. ఎమ్మెల్యే అన్నంత బిల్డప్‌తో అందులో ఆమెగారి షికార్లు. కానీ ఆ పేరుతో ఆమె చేసేవన్నీ తలలు మార్చి కోట్లు కొల్లగొట్టే పనులే. తెలుగుదేశం నాయకురాలి ముసుగులో ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్న శమళ్ల విజయలక్ష్మి బారిన పడి జిల్లాలో అనేకమంది ప్రముఖులే నిండా మునిగిపోయారు. ఈమె పరపతి, పోలీసులను మేనేజ్ చేస్తున్న తీరు చూసి.. ఇంతకాలం ఈమె చేతిలో మోసపోయినా బయటకొచ్చి చెప్పడానికి భయపడిన బాధితులు ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు. ఈమె ఆగడాలపై ‘సత్యం’లో ప్రచురితమైన కథనాలు ఇచ్చిన ధైర్యంతో తాము కూడా విజయలక్ష్మి బాధితులమేనంటూ ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు. మొదట మాయమాటలు చెప్పి ఎవరో ఒకరి నుంచి లక్షలు దండుకోవడం.. వారు ఒత్తిడి చేస్తే మరొక బకరాను పట్టుకుని డబ్బులు పిండేసి ఆ మొత్తం తెచ్చి మొదటి వ్యక్తికి ఇవ్వడం లేదా భూములు రాయిస్తానంటూ ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీలతో మోసం చేయడమే తన వృత్తిగా విజయలక్ష్మి మలచుకుంది. తనకు అడ్డొచ్చేవారిని, తన మాయలు పసిగట్టి ఇచ్చిన డబ్బు గురించి ఒత్తిడి తెచ్చేవారిని పోలీసులను మేనేజ్ చేసి ఎదురు కేసుల్లో ఇరికించడం ఈమె నిత్యదందాలు. తాజాగా వెలుగులోకి వచ్చిన మరికొన్ని దందాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కోటబొమ్మాళిలో డాక్యుమెంట్ రైటర్ బోయిన నాగరాజును రూ.1.26 కోట్లకు టోకరా వేసిన విజయలక్ష్మి రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బందిని మేనేజ్ చేసి అక్రమంగా భూముల బదలాయింపు, రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. సంతబొమ్మాళి మండలం మలగాం గ్రామ సర్వే నెంబర్ 9`4ఏ, 37`11జీ, 37`11ఏ పరిధిలోని 1.75 ఎకరాల భూమిని జలుమూరు మండలం చిన్నయ్యవలసకు చెందిన కె.హరిబాబుకు విక్రయించిన విజయలక్ష్మి.. 15 రోజుల వ్యవధిలోనే హరిబాబుకు చెప్పకుండా ఆ సేల్‌డీడ్‌ను రద్దు చేయించి తన పేరుతో బదలాయించుకుంది. ఇదే భూమిని విక్రయించి డబ్బులు ఇచ్చేస్తానని చెప్పిన విజయలక్ష్మి రెండు నెలల వరకు నాగరాజుకు అందుబాటులోకి రాలేదు. చివరికి ఒకరోజు నాగరాజు వద్దకు వచ్చి చిన్న సమస్య ఎదురవడం వల్ల డబ్బులు ఇవ్వలేకపోయానని నమ్మించింది. అక్కడితో ఆగకుండా ఆమదాలవలస ఆంధ్రాబ్యాంకులో (ప్రస్తుతం యూనియన్ బ్యాంకు) లోన్ ఉందని, దానికి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) చెల్లిస్తే రూ.1.50 కోట్ల రుణం వస్తుందని చెప్పి నాగరాజును అక్కడకు తీసుకువెళ్లింది.
తనఖా ఆస్తి విడిపించాలంటూ..
ఆంధ్రాబ్యాంకులో ఆస్తి తనఖా పెట్టి రూ.75 లక్షల రుణం తీసుకున్న విజయలక్ష్మి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఓడీ చెల్లిస్తోంది. మరో రూ.18 లక్షలు చెల్లిస్తే రుణం తీరిపోయి తనఖా ఆస్తిని విడిపించుకోవచ్చని, తిరిగి రుణాన్ని రెన్యూవల్ చేయిస్తే ప్రస్తుతం పెరిగిన రేట్ల ప్రకారం రూ.1.50 కోట్ల రుణం లభిస్తుందని నాగరాజును విజయలక్ష్మి నమ్మించింది. ఆ మొత్తం అందిన తర్వాత తీసుకున్న అప్పు మొత్తం ఇచ్చేస్తానని అతన్ని మళ్లీ మాయలో పెట్టింది. అదే సమయంలో ఆమదాలవలస ఆంధ్రాబ్యాంకు మేనేజర్ అంటూ ఓ వ్యక్తిని పరిచయం చేసి అతనితో ఫోన్‌లోనే మాట్లాడిరచింది. రెండు రోజుల్లో రూ.18 లక్షలు కట్టకపోతే లోన్ రెన్యువల్ కాదని అతనితోనే చెప్పించింది. ముఖ పరిచయం కూడా లేని వ్యక్తి ఫోన్‌లో చెప్పిన మాటలు నమ్మిన నాగరాజు తాను విజయలక్ష్మికి అప్పుగా ఇచ్చిన రూ.60 లక్షలు తిరిగి వస్తాయన్న ఆశ పడ్డాడు. తన వద్ద రూ.3 లక్షలు ఉన్నాయని, మిగతా రూ.15 లక్షలు సర్దుబాటు చేస్తే సరిపోతుందని విజయలక్ష్మి ఎగదోయడంతో తనకు తెలిసిన ముగ్గురు వ్యక్తుల నుంచి తలో రూ.5లక్షలు చొప్పున తీసుకుని మొత్తం రూ.15 లక్షలు విజయలక్ష్మి చేతిలో పెట్టి ఆంధ్రా బ్యాంకు రుణం కింద చెల్లించారు. అక్కడికి వారం రోజుల తర్వాత విజయలక్ష్మిని డబ్బులు అడిగితే ఆమె నుంచి సరైన స్పందన లేకపోవడంతో నాగరాజు నిలదీశాడు. అయితే ‘మీ ఇంటి ఆడపిల్లకు కష్టం వస్తే నువ్వు ఆదుకోవా’ అంటూ విజయలక్ష్మి సెంటిమెంట్‌తో కొట్టడం ప్రారంభించింది.
భీమిలి స్థలం పేరుతో మరో మాయ
అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత మళ్లీ నాగరాజు నుంచి ఒత్తిడి మొదలు కావడంతో విజయలక్ష్మి కొత్త ఎత్తు వేసింది. అతనికి ఇవ్వాల్సిన అప్పునకు బదులుగా మలగాంలో తన భూమి ఉందంటూ దాన్ని నాగరాజు భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. కానీ కొన్ని రోజులకే మళ్లీ వచ్చి మలగాం భూమిపై వివాదం నడుస్తోందని, దానికి బదులుగా భీమిలిలో ఉన్న 300 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయిస్తానని విజయలక్ష్మి చెప్పగా నాగరాజు ఒప్పుకోలేదు. దాంతో కోటబొమ్మాళికి చెందిన టీడీపీ పెద్దలతో చెప్పించి నాగరాజును ఒప్పించింది. ఆ మేరకు నాగరాజు, అతని భార్యను భీమిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లి ముందుగానే సిద్ధం చేసిన డాక్యుమెంట్‌ను అతని చేతిలో పెట్టి చదువుకోమంది. దాన్ని పరిశీలించిన నాగరాజు అంగీకారంతో అతని భార్య పేరుతో భీమినిపట్నం మండలం కుమ్మరిపాలెం గ్రామం సర్వే నెంబర్ 24/7, 25/4, 27/9లో ఉన్న ఎల్‌పీ నెంబర్ 49/2005లో 18, 19, 20 పార్టులో ఉన్న 300 గజాల స్థలానికి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీతో కూడిన స్వాధీన క్రయ ఒప్పంద పత్రాన్ని 2022 మే 16న రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ఆరు నెలల వరకు దాన్ని ఇతరులకు విక్రయించడానికి వీల్లేదని, ఆలోగా డబ్బులు ఇచ్చేస్తానని, ఇవ్వని పక్షంలో ఆ స్థలాన్ని విక్రయించుకోవచ్చంటూ ఒక అంగీకార పత్రాన్ని కూడా రాయించుకుంది. ఆ 300 గజాల స్థలం విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంటూ ‘నీకు ఇవ్వాల్సిన డబ్బు మినహాయించుకుని మిగతా రూ.80 లక్షలు ఇవ్వాలని’ నాగరాజును కోరింది. దీనికి నాగరాజు సరే అన్నాడు.
కౌలు పేరుతో మరో వంచన
ఇచ్చిన ఆరు నెలల గడువు ముగిసిపోయినా అప్పు తీర్చకపోవడంతో తన భార్య పేరిట రిజిస్టర్ చేసిన భీమిలి స్థలాన్ని విక్రయిస్తున్నట్టు విజయలక్ష్మికి నాగరాజు సమాచారం ఇచ్చాడు. దాంతో మరోసారి ఆమె మాట మార్చేసింది. అప్పటి వరకు నాగరాజు నుంచి దఫదఫాలుగా తీసుకున్న రూ. 1.10 కోట్లకు బదులుగా ఎచ్చెర్ల మండలం పొన్నాడ రెవెన్యూ సర్వే నెంబర్ 299`18ఏ లోని 1.50 ఎకరాల జిరాయితీ భూమిని ఇవ్వజూపింది. ఈ భూమిని పొన్నాడ గ్రామానికి చెందిన ఒక రైతు వద్ద కౌలుకు తీసుకొని.. కరోనా సమయంలో అదే గ్రామానికి చెందిన గొండు తవుడు అనే కౌలురైతు పేరుతో రికార్డులు మార్చి ఆయన నుంచి కొనుగోలు చేసినట్టు కోటబొమ్మాళి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 2021 డిసెంబర్ 22న రిజిస్ట్రేషన్ చేయించుకుంది. దీనిపై సదరు రైతు కొందరు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా విజయలక్ష్మి మాయలో పడిన వారంతా ఆమెకే జైకొట్టారు. దీన్ని శ్రీకాకుళంలో ఉన్న ఓ వ్యక్తి(రెడ్డి)కి రూ.2.50 కోట్లకు విక్రయిస్తున్నట్టు చెప్పి దాని ఒరిజినల్ డాక్యుమెంట్‌ను నాగరాజు వద్ద ఉంచింది. ఈ భూమిని రెడ్డికి చూపించి రూ.60 లక్షలకు విక్రయిస్తున్నట్టు చెప్పి రూ.10 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. ఆ తర్వాత అందుబాటులో లేకుండాపోవడంతో సదరు భూమిని ఆ వ్యక్తి స్వాధీనం తీసుకున్నట్టు తెలిసింది.
ఫేక్ డాక్యుమెంట్లతో మోసం

డాక్యుమెంట్ ఇచ్చిన మూడు రోజుల తర్వాత నాగరాజు వద్దకు వచ్చిన విజయలక్ష్మి రూ.15 లక్షలు అడిగింది. డాక్యుమెంట్ ఉంచి డబ్బులు ఇస్తే ఆ భూమికి నాలా ట్యాక్స్ కట్టి, రెవెన్యూ అధికారులకు ఫార్మాలిటీలు చెల్లించి ప్లాట్లు వేస్తానని చెప్పింది. వాటిని అమ్మిన తర్వాత వడ్డీతో సహా మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని చెప్పింది. దీంతో నాగరాజు ఆ డాక్యుమెంట్‌ను తీసుకొని తనకు తెలిసిన వారి నుంచి రూ.15 లక్షలు అప్పు ఇప్పించాడు. రెండు రోజుల తర్వాత నాగరాజు వద్దకు వచ్చిన విజయలక్ష్మి పొన్నాడ భూమిని విక్రయించడానికి కుదువపెట్టిన ఒరిజనల్ డాక్యుమెంట్లు ఇవ్వాలని గొడవ చేసింది. తీసుకున్న రూ.15లక్షలు ఇస్తే డాక్యుమెంట్లు ఇస్తానని నాగరాజు చెప్పాడంతో కోటబొమ్మళి పోలీసుల వద్దకు వెళ్లి డాక్యుమెంట్లు తీసుకొని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు నాగరాజుపై ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగరాజును పిలిపించి విచారించగా విజయలక్ష్మి తనను ఆమె ఎలా మోసం చేసిందో వారికి పూసగుచ్చినట్టు ఆరు పేజీల లేఖలో వివరించాడు. దాంతో రూ.15 లక్షలు ఇచ్చి డాక్యుమెంట్లు తీసుకోండి అంటూ పోలీసులు సైతం ఆమెకు సూచించారు. అయినా ఫలితం లేకపోవడంతో తన వద్ద ఇప్పటివరకు తీసుకున్న రూ.1.26 కోట్లు ఇవ్వాలని విజయలక్ష్మితో నాగరాజు గొడవకు దిగగా భీమిలిలో ఉన్న 300 గజాల స్థలాన్ని అమ్ముకోవాలని సూచించింది. ఆ మేరకు రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకుని భీమిలి రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లాడు. వాటిని పరిశీలించిన మండల సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారులు అవి ఫేక్ డాక్యుమెంట్లని తేల్చేశారు. దీనిపై నాగరాజు ఫోనులో నిలదీయడంతో ఫేక్ అని ఎవరు చెప్పారని దబాయిస్తూనే ఆ సైట్ విషయం ఎవరికీ చెప్పవద్దని, రెండు రోజుల్లో మొత్తం డబ్బులు ఇచ్చేస్తానని, ఆ తర్వాత ఆ సైట్‌ను తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేసేసింది. దీంతో నాగరాజు నిండా మునిగిపోయినట్టు గ్రహించి తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక రోడ్డున పడ్డాడు.
Kommentare