top of page

ఏమీ సేతురా..స్వామీ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 5
  • 2 min read
  • అరసవల్లి దేవస్థానం అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సమ్మె

  • 14, 15 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడమే కారణం

  • భక్తుల అవసరాలు తీర్చలేక నిస్సహాయంగా సూర్యనారాయణుడు

  • టికెట్లు, ప్రసాదాల కౌంటర్లు.. అన్నీ ఖాళీ

  • ఆదివారం పరిస్థితి ఏమిటన్న ఆందోళన


కోర్కెలు తీర్చమని దేవుణ్ని మొక్కడానికి.. కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించడానికి వేలాదిమంది భక్తులు అరసవల్లి సూర్యనారాయణస్వామి సన్నిధికి వస్తుంటారు. పూజాదికాలు చేసి, ప్రసాద సేవనంతో తమ జన్మ తరించిందని మురిసిపోతుంటారు. కానీ ఇప్పుడా దేవుడే ఒంటరివాడైపోయాడు. తన వద్దకు వచ్చే భక్తులకు కనీసం ప్రసాదం గానీ, సౌకర్యాలు గానీ కల్పించలేని దుస్థితిలో పడిపోయాడు. కారణం.. స్వామి తరఫున వీటన్నింటినీ భక్తులకు సమకూర్చాల్సిన ఆయన పరివారం అస్త్ర సన్యాసం చేసింది. ఏడాదికిపైగా తమకు జీతాలివ్వకుండా ఎండబెడుతున్న అధికారుల తీరుకు నిరసనగా సమ్మె బాట పట్టడంతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి దేవస్థానంలో దాదాపు అన్ని రకాల పనులు, వ్యవహారాలు స్తంభించిపోయాయంటే అతిశయోక్తి కాదు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపురాతన, ప్రాశస్త్యమైన సూర్యక్షేత్రంగా అరసవల్లి వెలుగొందుతోంది. కానీ పాలకుల నిర్వాకం కారణంగా అనేక సందర్భాల్లో దాని ప్రతిష్ట మసకబారుతోంది. ఇప్పుడు కూడా అదే దుస్థితి దాపురించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరసవల్లిలో ప్రముఖంగా జరిగే రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ఏటా మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఇటీవల ఘనంగా ఉత్సవాలు జరిపారు కూడా. అంతవరకు బాగానే ఉంది. ఈ ఉత్సవాల ద్వారా అరసవల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు లభిస్తుందని, భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. కానీ వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే, దేవస్థానంలో దైనందిన కార్యకలాపాలు నిర్వహించే ఉద్యోగుల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న దాదాపు సిబ్బంది అందరికీ 14, 15 నెలల నుంచి జీతాలు చెల్లించడంలేదు. ఇంతకాలం ఓపికగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులు ఇక తమవల్ల కాదని, తమ కుటుంబాలను పస్తులు పెట్టి పనులు చేయలేమంటూ సమ్మె అస్త్రం ప్రయోగించారు. శనివారం నుంచి విధులు బహిష్కరించడంతో దేవస్థానంలో దాదాపు కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి.

నలుగురే మిగిలారు

దేవస్థానంలో పని చేస్తున్న వారిలో 95 శాతానికిపైగా అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే. ఆలయ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(ఈవో) సహా నలుగురు మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులు. అర్చకులు ఉన్నా వారు పూజలు ఇతర విధులు నిర్వర్తించరు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మొత్తం 48 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు శనివారం నుంచి సమ్మెలోకి వెళ్లడంతో దేవస్థానంలో కార్యకలాపాలు స్తంభించాయి. వారంతా దేవస్థానం ఆవరణలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు నెలల తరబడి జీతాలు లేక తమ కుటుంబాలు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నాయని వారు ఆరోపించారు. తక్కువ జీతాలతో తమతో ఎక్కువ పనులు చేయించుకుంటున్న అధికారులు, జీతాల గురించి అడిగితే విధుల నుంచి తొలగిస్తామని బెదిరించేవారని, దాంతో తమ దుస్థితిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారాలు, రథసప్తమి వంటి పర్వదినాల్లో తమతో రెట్టింపు చాకిరీ చేయించుకునే అధికారులు జీతాల విషయంలో మాత్రం ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, విధులకు హాజరుకావాలని ఆలయ అధికారులు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఉద్యోగులు ససేమిరా అన్నారు.

టికెట్లు కొట్టేవారు లేరు.. ప్రసాదం పెట్టేవారూ లేరు

మెజారిటీ సిబ్బంది సమ్మెలోకి వెళ్లడంతో అరసవల్లి దేవస్థానం బోసిపోయింది. దైవదర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి సేవలూ అందకుండా పోయాయి. దర్శనం టికెట్లు కొట్టేవారు లేక ఆ కౌంటర్‌ ఖాళీగా కనిపించింది. తలనీలాల సమర్పణకు టికెట్లు కొట్టే కౌంటర్‌, ప్రసాదాలు అమ్మే కౌంటర్ల వద్దా అదే పరిస్థితి కనిపించింది. అసలు ప్రసాదాలు తయారు చేసేవారే లేకుండాపోయారు. ఆలయంలో సాధారణ రోజుల్లో సుమారు 500 పులిహోర ప్యాకెట్లు విక్రయిస్తారు. ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఈ విక్రయాలు కొన్ని రెట్లు అధికంగా ఉంటాయి. లడ్డూ ప్రసాదం పరిస్థితి కూడా ఇంతే. అయితే పులిహోర ప్రసాదం వండేవారు లేకపోయారు. అయితే దేవస్థానంలో లడ్డూల స్టాక్‌ కొంతవరకు ఉంది. వాటిని ఎలాగోలా విక్రయించే ప్రయత్నం చేసినా ఒకటి రెండు రోజులకే ఆ స్ఠాక్‌ కూడా నిండుకుంటుంది. ఇక ఆలయంలో పారిశుధ్యం, ఇతర కార్యక్రమాల నిర్వహణ నిలిచిపోయాయి. దీనివల్ల ఆలయంలో పారిశుధ్యం దెబ్బతింటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హమ్మయ్యా.. స్వామి భోగానికి లోటు లేదు

సిబ్బంది సమ్మె వల్ల తలెత్తిన ఇబ్బందికర పరిస్థితుల్లో స్వామివారికి నిత్యభోగ కైంకర్యాలు ఎలా? అన్న ఆందోళన స్థానికులు, భక్తుల్లో కనిపించింది. అయితే ఆ విషయంలో మాత్రం ఇబ్బంది లేదని దేవస్థానం వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్నాళ్ల క్రితమే స్వామివారికి భోగంగా సమర్పించే ప్రసాదాల తయారీకి వెంకన్నబాబు అనే వ్యక్తిని కన్సాలిడేటెడ్‌ వేతనంపై దేవస్థానం నియమించింది. సమ్మెతో సంబంధం లేని ఆయన స్వామి కైంకర్యానికి ప్రసాదాలు తయారు చేస్తుండటంతో భోగానికి నోచుకోక సూర్యనారాయణ స్వామివారు పస్తులుండే ప్రమాదం తప్పింది. అయితే రేపు ఆదివారం రోజూ కంటే ఎన్నో రెట్లు అధిక సంఖ్యలో భక్తులు స్వామి దర్శనానికి తరలివస్తారు. సిబ్బంది సమ్మెలో ఉండటంతో టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, ఇతరత్రా ఏర్పాట్లు ఎలా చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

4 Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page