
ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఉచితంగా తాయిలాలు ఎరచూపుతుండంపై ఓవైపు చర్చ జరుగుతుండగా, ప్రజల్లో అడుక్కునే అలవాటు పెరుగుతోందని మధ్యప్రదేశ్ పంచాయతీ, గ్రామీ ణాభివృద్ధి మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలంటే ఎంత చులకనభావమో ఆయన మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నయా ఉదారవాద విధానాలు అంతిమ దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ఏలినవారి లీలావిన్యాసాలివి. తమ యజమానులైన కార్పొరేట్, బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం, అసంఖ్యాకులైన పేదల నోటికాడి కూడు లాగేసుకునే కుతం త్రాలివి. ‘ప్రభుత్వాన్ని అడుక్కోవడం ప్రజలకు అలవాటుగా మారింది. స్టేజి మీద మెడలో దండేసి, చేతి లో అర్జీ పెట్టడం పరిపాటిగా మారిపోయింది. ఇది మంచి అలవాటు కాదు. అడగడానికి బదులు.. ఇవ్వడం నేర్చుకోండి. అప్పుడు జీవితం ఆనందంగా ఉండడంతో పాటు మంచి సమాజం సొసైటీ నిర్మిత మవుతుంది’ అని హితోక్తులు పలికారు. ‘ఉచితాలపై ఎక్కువగా ఆధారపడకూడదని, అలా చేస్తే సమా జం బలహీనపడుతుంది’ అని మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇది సంక్షేమ రాజ్యమన్న మౌలిక సూత్రాన్నే మరిచి, అదే దేశాభివృద్ధికి ఆటంకమనడంలోని ఉద్దేశమేమిటి? నిజంగా పేదలకిచ్చే ఈ అరకొర సంక్షేమమే ఆర్థికవ్యవస్థకు భారంగా మారిందా? మరి రాయితీలు, ప్రోత్సాహకాల పేరుతో పెద్దలకిచ్చే కానుకల మాటేమిటి? ఇప్పటికే పేదలకందుతున్న అరకొర సంక్షేమ పథకాలకు భారీగా కోతలు పడుతున్నాయి. ఇప్పుడు ఉచితానుచితాల గురించి చర్చ లేపి ఏకంగా వాటిని రద్దుకే సిద్ధమయ్యారు వీరు. అయినా ఈ ప్రభుత్వాలు పెద్దలకిచ్చే ఉచితాలతో పోలిస్తే పేదలకిచ్చే ఉచితాలు ఏపాటివి? ఆకలి తో ఉన్న వారికి అన్నం పెట్టడం మాని, అజీర్తితో ఉన్నవారికి కుక్కి కుక్కి తినిపించడాన్ని ఏమనాలి? ఇలాంటి విధానాల ఫలితమే కదా అసంఖ్యాకుల అర్థాకలి జీవితాలు? వ్యవసాయ సంక్షోభం నానాటికి తీవ్రమై కోట్లాది మంది ఆ రంగాన్ని వదిలేస్తున్నారు. యువతకు కొత్త ఉద్యోగాలు లేవు. ఉన్న అరకొర ఉపాధిలో భద్రత లేదు. ఈ పరిస్థితుల్లో, ఇప్పటికే అడ్డూ అదుపూ లేకుండా పెరిగిన ధరలతో జనం అల్లాడుతుంటే.. నిత్యావసరాలకు తోడు, శ్మశానంలో కర్మకాండలపై కూడా జీఎస్‌టీ విధించి పేదల ఉసురు తీస్తున్న ఘనత ఈ పెద్దలదే కదా. ఏలినవారు మోపుతున్న ఈ భారాల ముందు వీరికిచ్చే ఉచితాలు ఏపాటివి? ‘ఈ బిచ్చగాళ్ల సైన్యం సమాజాన్ని బలోపేతం చేయడంలేదు.. బలహీన పరుస్తు న్నది. ఉచితాలకు ఆకర్షితులవడం.. అమరులకు ఇచ్చే గౌరవం కాదు. వాళ్ల సిద్ధాంతాలకు అనుగుణం గా నడుచుకోవడమే వాళ్లకు ఇచ్చే నిజమైన గౌరవం. అమరులు ఎవరైనా అడుక్కున్నట్టు చరిత్రలో ఉందా?’ అని ప్రశ్నించారు. ఆయన చెప్పిన అమరులెవరూ ప్రజలను బిచ్చగాళ్లుగా చూడలేదు. ‘నర్మదా పరిక్రమ యాత్రికుడిగా నేను దానం అడిగాను. కానీ నాకోసం ఎప్పుడూ ఏదీ ఎవరినీ అడగలేదు. నాకు ఏదైనా ఇచ్చానని ఎవరూ చెప్పలేరు’ అంటూ తన సచ్చీలత నిరూపించుకునే ప్రయత్నం చేశారు. సంక్షేమపథకాలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలన్న యావే తప్ప, ఈ ఉచితాల వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుందన్న ధ్యాసే ప్రతిపక్షాలకు లేదని సాక్షాత్తు ప్రధానమంత్రే శెలవిచ్చారు. ఇది పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేయడమేనని వాపోయారు. (ఆ చెల్లింపుదారులు ప్రజలేనన్న సంగతి మరిచిపోయారు) ఇవన్నీ పలుకుతున్నది ప్రధానీ, పాలకపార్టీ నేతలే అయినా.. పలికిస్తున్నది మాత్రం కార్పొరేట్లేనన్నది విజ్ఞుల మాట. ఇవాళ పాలకులే ప్రజలను బిచ్చగాళ్లుగా, తాము దానగుణ సంపన్నులుగా భావిస్తున్నారు. అందుకే సంక్షేమ కార్యక్రమాల్ని తమ ఔదార్యంగా ప్రకటించుకుంటు న్నారు. ఇది ఉదారత కాదు, ప్రభుత్వ బాధ్యత. ప్రజలు కట్టే పన్నులతో ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడం పాలకుల కర్తవ్యం. అధికారంలో ఉన్నవారు తమ జేబులోంచి ఖర్చు పెట్టడంలేదు. జనం డబ్బునే వెచ్చిస్తున్నారు. అయినప్పటికీ ఉద్యోగులకు, కార్మికులకు జీతాలు పెంచడం, కళాశాలలు, ఆస్పత్రులు స్థాపించడం, పెన్షన్లు మంజూరుచేయడం, రేషన్ సరుకులు సరఫరా చేయడం తమ దాన గుణశీలానికి, ఉదారబుద్ధికి సంకేతంగా చెప్పుకుంటున్నారు. ప్రజల డబ్బుతో చేపట్టే పథకాలకు తమ పేరు పెట్టుకొని అపర దానకర్ణులుగా గొప్పలకు పోతున్నారు. వ్యక్తులే గాక ప్రభుత్వాలు సైతం దానం చేస్తున్నట్టుగా మాట్లాడటం, వ్యవహరించడం విదూషకత్వం. ‘ఓట్ల కోసం ప్రజలను అడుక్కోవడానికి త్వరలో వాళ్లే వస్తారు’ అన్న సంగతి ఇప్పుడు ప్రజలు గుర్తుంచుకోవాలి.
Comments