`హైప్ కోసం చేరికలను ప్రోత్సహిస్తున్న అభ్యర్థులు
`పార్టీలో ఉన్నవారికే మళ్లీ మళ్లీ కండువాలు
`అభ్యర్థి ప్రాపకం కోసం స్థానిక నేతల అత్యుత్సాహం
`ఫలితంగా జనబాహుళ్యంలో పలుచనవుతున్న పార్టీలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

వార్నీ దుంపతెగా.. ఇవేం చేరికలురా బాబు..! అనే విధంగా ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ కండువాలు మార్చేస్తున్నవారిని చూసి ముక్కున వేలేసుకుంటున్నాడు సగటు ఓటరు. జగన్మోహన్‌రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్‌తో సంబంధంలేదు.. కేవలం ఓటరుతోనే మన బంధం అన్నట్లు వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి నేరుగా ప్రతి ఇంటికీ చేరువైనా కూడా పార్టీలో పెద్ద సంఖ్యలో చేరికలు జరుగుతున్నట్లు చూపించడం ద్వారా తమ బలం అంతకంతకూ పెరుగుతోందని నిరూపించుకోడానికి ఆ పార్టీ పడరాని పాట్లు పడుతోంది. రాష్ట్రంలో ఎక్కడా పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య యుద్ధం జరగడంలేదు. కేవలం జగన్మోహన్‌రెడ్డి వర్సెస్ చంద్రబాబునాయుడు అన్నట్లుగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. వైకాపాకు పడే ప్రతి ఓటు జగన్మోహన్‌రెడ్డిది ఎలాగో.. పడని ప్రతి ఓటు చంద్రబాబు రావాలని కోరుకుంటున్నవారిదే. అయినా స్థానికంగా తాము ఒక మెట్టు పైనున్నామని చెప్పుకోవడానికి అభ్యర్థులు నానా తిప్పలు పడుతున్నారు. ఒకప్పుడు ఓ బలమైన నాయకుడు పార్టీ మారితే ఆ నియోజకవర్గ అభ్యర్థికి ఓటు గణనీయంగా పెరిగేది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం వ్యక్తిగతంగా ఓటరు మారితే చాలు.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చివరకు తమ పార్టీలో ఉన్నవారికే, తమతో తిరుగుతున్న వారికే మళ్లీ కండువాలు వేసి పార్టీలో పెద్దఎత్తున చేరికలు జరిగాయని ప్రచారం చేసుకుంటున్నారు.

ఉదయం వైకాపాలో చేరినవారు సాయంత్రం టీడీపీ గూటికి వెళ్లిపోతున్నారు. ధర్మాన ప్రసాదరావు సమక్షంలో తండ్రి చేరితే, కొడుకు గొండు శంకర్ వెనుక తిరుగుతున్నాడు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కావడంతో ఏ ఒక్కరు వచ్చినా కాదనకుండా కండువా కప్పేస్తున్నారు. జిల్లాలో మిగిలినచోట్ల కంటే శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో రెండు ప్రధాన పార్టీల్లోనూ చేరికలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికీ అది కొనసాగుతునే ఉంది. పలాస కూడా మేమేం తక్కువ తినలేదని నిరూపిస్తోంది. ప్రతిచోటా పార్టీ ఓటుబ్యాంకునే మళ్లీ కొత్తగా వచ్చినవారిగా చూపించి కండువా కప్పి ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మొన్నటికి మొన్న స్థానిక మంగువారితోటలో ధర్మాన ప్రసాదరావు సమావేశం నిర్వహించి మాజీ కౌన్సిలర్ పొందూరు రమణకు వైకాపా కండువా కప్పగా ఆ మరునాడే టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ ఇంటింటి ప్రచారానికి వెళ్లి పొందూరు రమణ కొడుకు మద్దతు పొందివచ్చారు. అంతకు ముందు కలెక్టర్ ఆఫీసు పక్కన కొత్తపేట ప్రాంతంలో ధర్మాన సమక్షంలో పెద్దఎత్తున చేరికలు చూపెడితే, ఆ మరుసటి రోజు వారంతా పసుపు కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీకి జైకొట్టారు. వైకాపా ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా టీడీపీలో చేరిన నాయకులే ఈదఫా ఎక్కువ కనిపిస్తున్నారు. స్వయంగా ధర్మాన ప్రసాదరావు నివాసముండే పెద్దపాడు ప్రాంతంలోనే వైకాపా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను సైతం తెలుగుదేశం లాక్కుపోయింది. ఇవన్నీ ఎమ్మెల్యే అభ్యర్థులకు తెలిసి ఉండకపోవచ్చు. కేవలం కొందరు కిందిస్థాయి నేతలు తమ నాయకుడి మెచ్చుకోలు కోసం హెచ్చులకు పోతుండటంతో డ్యామేజ్ జరుగుతోంది. ఒకసారి ధర్మాన సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న తర్వాత వేరే పార్టీ వైపు వెళ్లిపోవడం వల్ల జరిగే డ్యామేజీని అంచనా వేయలేని కొందరు నగరమంతా తమ వెనుకే ఉందని చెప్పుకోవడానికి ఎవరు, ఏమిటి అనేది చూడకుండా ముందు వచ్చేయండి, ఆ తర్వాత చూసుకుందామని బలవంతంగా కండువాలు మార్పిస్తున్నారు. దీనివల్ల మొదట్నుంచి ఉన్న క్యాడర్ దూరమైపోతున్నా పట్టించుకోవడంలేదు.
Comments