top of page

ఐఏఎస్‌, ఐపీఎస్‌లకూ నకిలీ మకిలి!

Writer: DV RAMANADV RAMANA
  • పూజా ఖేద్కర్‌ ఉదంతం తర్వాత తెరపైకి పలు ఆరోపణలు

  • తప్పుడు వైకల్య, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లతో సివిల్స్‌ ఉద్యోగాలు

  • అనుమానాలు తీర్చలేకపోతున్న ఆరోపణలకు గురైన వారి వివరణలు

  • స్పందించని యూపీఎస్సీ.. మసకబారుతున్న ప్రతిష్ట

  • కేంద్ర ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టాలన్న డిమాండ్లు

దేశంలో అత్యున్నత పౌర సర్వీసుల నిర్వహణపై వివాదాల ముసురుకుని.. వాటిని నిర్వహించే వ్యవస్థలతోపాటు వాటి ద్వారా ఆయా సర్వీసుల్లో చేరిన వారిపైనా అనుమానాల మేఘాలు కమ్ముకుంటున్నాయి. వైద్య ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ పరీక్షలపై ఎంత వివాదం జరిగిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లతో కుమ్మక్కై ప్రశ్నపత్రాలు అమ్ముకోవడం వల్ల ఒకే సెంటర్‌లో పరీక్షలు రాసిన వారందరూ అత్యున్నత ర్యాంకులు పొందారన్న వివాదం పెనుదుమారం రేపి.. చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అదే సమయంలో పూజా ఖేద్కర్‌ రూపంలో యూపీఎస్‌సీ నిర్వహించే దేశంలోని అత్యున్నత పౌర సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌లను ఎంపిక చేసే సివిల్స్‌ పరీక్షలు, ఎంపిక విధానంలోనూ అక్రమాలు జరుగుతున్న విషయంలో వెలుగులోకి వచ్చింది. పూజా ఖేద్కర్‌ నకిలీ వైకల్య సర్టిఫికెట్‌తో ఐఏఎస్‌ సాధించిన విషయం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సివిల్స్‌ ర్యాంకులు సాధించి, సర్వీసులో చేరిన పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై కూడా ఇదే తరహా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పరిపాలనను క్షేత్రస్థాయిలో నిర్వహించాల్సిన ఈ అత్యున్నత అధికారుల ఎంపిక విషయంలోనే అక్రమాలు చోటుచేసుకుంటే.. ఉన్నతాధికారులకు వారు నిబద్ధతతో, నిజాయితీతో ఎలా పనిచేయగలరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌లందరూ అలాంటివారే కాకపోవచ్చు గానీ.. కొందరు మాత్రం నకిలీ సర్టిఫికెట్లతో ఎంపికై మొత్తం వ్యవస్థకే మకిలీ అంటిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరి గురించే ఈ కథనం.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఐఏఎస్‌ హోదా పొందిన అనంతరం ప్రొబేషనర్‌గా విధుల్లో చేరిన మహారాష్ట్రకు చెందిన పూజా ఖేద్కర్‌ అత్యుత్సాహం ఆమె బంఢారాన్ని బయటపెట్టింది. అత్యున్నత సివిల్‌ సర్వీసులకు అభ్యర్థుల ఎంపిక తీరును ప్రశ్నించే పరిస్థితి తీసుకొచ్చింది. తన వ్యక్తిగత ఆడి కారుకు రెగ్యులర్‌ ఐఏఎస్‌ అధికారులకు కల్పించినట్లే బీకన్‌(రెడ్‌ బల్బ్‌), వీఐపీ నెంబర్‌ ప్లేట్‌ వంటి ప్రోటోకాల్‌ మర్యాదలు కల్పించాలని హడావుడి చేసి వార్తల్లోకి వచ్చిన పూజా చివరికి నకిలీ వైకల్య సర్టిఫికెట్‌తో సివిల్‌ సర్వీస్‌కు ఎంపికైనట్లు తేలింది. చివరికి కేంద్ర ప్రభుత్వం ఆమె సర్వీసును రద్దు చేయడంతోపాటు ఇకముందు ఎటువంటి పోటీ పరీక్షల్లోనూ పాల్గొనకుండా నిషేధం విధించింది. అయితే ఒక పూజా ఖేద్కరే కాదు.. ఆమెలాగే ఇంకా చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో అడ్డదారుల్లో సివిల్స్‌కు ఎంపికై ఐఏఎస్‌, ఐపీఎస్‌ హోదాలు వెలగబెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారు. పూజా ఉదంతం తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పూజా మాదిరిగా నకిలీ వైకల్య సర్టిఫికెట్లతోపాటు ఈబీసీలమంటూ ఆ కేటగిరీ సర్టిపికెట్లు సృష్టించి పలువురు అత్యున్నత పౌర సర్వీసుల్లో చేరిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధించి పలు ఆధారాలు కూడా మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయి. కానీ కేంద్రం గానీ, యూపీఎస్సీ గానీ వీటిపై స్పందించడంలేదు. తమపై ఆరోపణలు వచ్చిన కొందరు మాత్రం వాటికి వివరణలు ఇచ్చి సరిపుచ్చుకుంటున్నారు.

తండ్రి ఐఎఎస్‌.. ఆమె ఈడబ్ల్యూఎస్‌!

ఢల్లీిలోని పితంపుర నివాసి అను బెనివాల్‌ 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్‌(ఆర్థికంగా వెనుకబడిన వర్గం) కేటగిరీలో ఆమె 217వ ర్యాంకు పొంది ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న ఆమె ఫొటో ఒకటి గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతోంది. ఫొటోలో ఉన్న బోర్డుపై 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లు కనిపిస్తున్నాయి. వాటిలో అను తండ్రి పేరు ఐపీఎస్‌ సంజయ్‌ బెనివాల్‌ అని ఉండటం ఆరోపణలకు ఆస్కారమిచ్చింది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ అనేది దేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకే వర్తిస్తుంది. కానీ రిటైర్డ్‌ ఐపీఎస్‌ కుమార్తె అయిన అను ఆర్థికంగా వెనుకబడి ఉండే అవకాశమే లేదని, అలాంటప్పుడు ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో ఎలా ఎంపికయ్యారన్న ప్రశ్నలు ఎదరువుతున్నాయి. దీంతో రాజస్థాన్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి అయిన బెనివాల్‌ తన తండ్రి కాదని అను వివరణ ఇచ్చారు. సంజయ్‌ బెనివాల్‌ పితాంపుర నుంచి ఐపీఎస్‌ సాధించిన మొదటి వ్యక్తి అయినందున తాను అతన్ని స్ఫూర్తిగా తీసుకున్నాననే తప్ప అతను తన తండ్రి కాదన్నది అను వివరణ. వాస్తవానికి తన తన చాలా నేళ్ల క్రితం ఓ ఫ్యాక్టరీని స్థాపించినా అనారోగ్యం వల్ల దాన్ని నడపలేకపోయారని, మేనమామ తమను పెంచాడని క్లారిటీ ఇస్తూనే తన ఎక్స్‌ ఖాతాలో తల్లిదండ్రులతో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. అయినా ఆ ఆరోపణలు, వివరణలు నిర్ధారణ కాలేదు.

వికలాంగుడు ట్రెకింగ్‌ చేయగలడా?

2019 యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షల్లో ప్రఫుల్ల దేశాయ్‌ అనే అభ్యర్థి 532వ ర్యాంక్‌ సాధించినట్లు ప్రకటించారు. గతంలో ఈయన తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్ట్‌ కోటాలో ఆయన ఐఏఎస్‌కు ఎంపికైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దేశాయ్‌ బయోడేటాకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. అతను ట్రెక్కింగ్‌ చేస్తున్నట్లు ఆ ఫొటోల్లో కనిపించడం అనేక అనుమానాలకు దారితీసింది. దీంతో ప్రఫుల్ల ఎంపిక ప్రక్రియపై ప్రశ్నలు మొదలయ్యాయి. ఆర్థోపెడికల్‌ వైకల్యం ఉన్న వ్యక్తి పర్వతాన్ని ఎలా అధిరోహిస్తున్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు వైకల్యం ఉండటం వాస్తవమని, చిన్నతనంలో తన ఎడమ కాలు పోలియో వల్ల చచ్చుబడిపోయిందని ఆయన వివరణ ఇచ్చారు. అంతమాత్రాన తాను ట్రెక్కింగ్‌, సైక్లింగ్‌ వంటి చేయలేనని, చేయకూడదని చెప్పడం సమంజసం కాదని ఆయన వాదిస్తున్నారు. ఎంపికకు ముందు ఢల్లీిలోని ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డు వద్ద కూడా వైద్యపరీక్షలు చేయించుకోగా మొదట వారు వైకల్య సర్టిఫికెట్‌ను ఆమోదించలేదు. అయితే మరోమారు పరీక్షలు చేయించుకోగా 45 శాతం వైకల్యం ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారని ఆయన వెల్లడిరచారు.

దృష్టిలోపం ఉన్నా డ్రైవింగ్‌

నితికా ఖండేల్వాల్‌ 2015 సివిల్స్‌లో 857 ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. దృష్టిలోపం సర్టిఫికెట్‌తో ఆమె ఈ హోదా సాధించారు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్‌లో పనిచేస్తున్నారు. ఆమె సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. నితికా స్క్రీన్‌పై చూస్తూ డ్రైవింగ్‌ చేస్తున్నట్లు అందులో ఉంది. తనకు దృష్టిలోపం ఉందంటున్న ఆమె కనీసం కళ్లద్దాలు కూడా లేకుండా డ్రైవింగ్‌ ఎలా చేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి ఆమె సమాధానం చెబుతూ ఆ వీడియో ఆరేళ్ల క్రితం నాటిదని అంటున్నారు. ఆర్టీవో కార్యాలయంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీలో అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులపై విచారణలో భాగంగా ఆర్టీవో కార్యాలయాన్ని తనఖీ చేశాను. ఈ క్రమంలోనే తాను డ్రైవర్‌ సీట్లో కూర్చొని టెస్ట్‌ చేశానే తప్ప డ్రైవింగ్‌ చేయలేదన్నారు. సాధారణంగా ఎవరైనా ఏదైనా చూడలేకపోతే దృష్టి లోపం ఉన్నట్లు భావిస్తారు. నా రెటీనాలో సమస్య ఉంది. కానీ నేను ఎంతవరకు చూడగలనో నాకే తెలుసు.. చూసేవన్నీ నిజాలు కావన్నది గుర్తించాలని నికితా అంటున్నారు.

ఇవి కొన్ని ఉదాహరణలు కాగా.. ఇంకా అనేక మంది ఫేక్‌ సర్టిఫికేట్లతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉద్యోగాలు సంపాదించారని ఆరోపణలు వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్‌, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్‌ కోటాలను దుర్వినియోగం చేస్తూ ఉద్యోగాల్లో చేరిపోతున్నారంటూ వారికి సంబంధించిన వీడియోలను పలువురు సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఇందుకు సంబంధించి భారీగా సెటైర్లు, మీమ్స్‌ కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటివల్ల యూపీఎస్సీ ప్రతిష్ట మసక బారుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి వారివల్ల ప్రతిభావంతులైన చాలామంది అవకాశాలు కోల్పోతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో యూపీఎస్సీ డాక్టర్‌ మనోజ్‌ సోనీ రాజీనామా చేశారు. ఆమె స్థానంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పని చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రీతి సుదాన్‌ కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె అయినా ఇటువంటి ఆరోపణలపై విచారణ జరిపించి యూపీఎస్‌సీ ప్రతిష్టను కాపాడాల్సిన అవసరముంది.

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page