top of page

‘ఐఏఎస్‌’ బాధితులు జిల్లాలోనే అధికం

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • దిగువ, మధ్యతరగతివారందరూ మోసపోయారు

  • ఇప్పటికీ నమోదుకాని ఫిర్యాదు

  • తేలుకుట్టిన దొంగల్లా ప్రమోటర్లు

సత్యంన్యూస్‌, శ్రీకాకుళం




ఐఏఎస్‌ యాప్‌ బాధితులు జిల్లాలో వేలాది మంది ఉన్నట్టు సంస్థ కార్యకలాపాలు నిలిపేసిన తర్వాత వెలుగు చూస్తోంది. కుటుంబంలో సభ్యులంతా ఒకరికి తెలియకుండా మరొకరు ఐఏఎస్‌ యాప్‌లో పెట్టుబడులు పెట్టి ఖాతాదారులుగా చేరారు. ఈ యాప్‌లో పెట్టుబడులు పెట్టించిన కమిషన్‌ ఏజెంట్లు ఎవరూ స్పందించడం లేదు. సంస్థ వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చే మెసేజ్‌లను ఫాలో కావాలని సూచిస్తున్నారు. వివిధ హోదాల్లో కమిషన్లు పొందిన ఏజెంట్లు ఖాతాదారులకు అందుబాటులో లేరు. ఫోన్‌లు స్విచాఫ్‌ చేసి ఉన్నారు. ఖాతాదారులంతా ఇప్పటి వరకు ఐఏఎస్‌ యాప్‌లో వచ్చే నిబంధనలను ఫాలో అవుతూ వచ్చారు. సుమారు నాలుగు నెలల పాటు తక్కువ మొత్తాలకు రిటర్న్స్‌ ఇవ్వడం, పెద్ద మొత్తాలకు సమయం పెంచుకుంటూ వచ్చారు. ఈ నెల 13 నుంచి ఐఏఎస్‌ సంస్థ యాప్‌ ద్వారా విత్‌డ్రాలను సమయాన్ని 48 గంటల నుంచి 72 గంటలకు, ఆ తర్వాత 120 గంటలుగా చేయడంతో ఖాతాదారులకు ప్రతివారం చివరి రోజున రావాల్సిన విత్‌డ్రాలు నిలిచిపోయాయి.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఐఏఎస్‌ యాప్‌కు చెందిన కార్యాలయాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో వచ్చే లింక్‌ ద్వారా వ్యక్తిగత బ్యాంకు సమాచారం ఇచ్చి కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టేలా చాటింగ్‌ ద్వారా పురిగొలిపిన సంస్థ విత్‌డ్రాలు నిలిచిపోయిన తర్వాత ఎవరిని సంప్రదించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రతి ఖాతాదారుడికి ఒక ఐడీ నెంబర్‌ కేటాయించి ఐఏఎస్‌ యాప్‌ ద్వారా పెట్టుబడులు పెట్టించడం, విత్‌డ్రాలు చేయించడం జరిగింది. మొదటి నెల రోజులు ఆన్‌లైన్‌లో ఐఏఎస్‌ యాప్‌లో కార్యకలాపాలు సవ్యంగా జరిగినా పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువ కావడంతో పాటు పెట్టుబడి ఎక్కువ మొత్తంలో చేస్తుండడంతో విత్‌డ్రాల సమయాన్ని రెండు నుంచి ఐదు రోజులకు పెంచారు. దీంతో విత్‌డ్రా చేసిన ఐదు రోజులకు నగదు వ్యక్తిగ ఖాతాల్లో జమ కాకపోవడంతో సంస్థ కార్యాలయాలపై అనుమానం వచ్చి వాకబు చేశారు. దీంతో కొందరు కమిషన్‌ ఏజెంట్లు ఖాతాదారులను నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా యాప్‌ల్లో చాటింగ్‌ చేస్తూ నిలదీయడం ప్రారంభించారు. దీంతో కొందరి ఐడీలను శాశ్వతంగా రద్దు చేసినట్టు తెలిసింది. ఎందుకని కమీషన్‌ ఏజెంట్లను ఖాతాదారులు ప్రశ్నిస్తే యాజమాన్యం మీ చాటింగ్‌ వల్ల హర్ట్‌ అయిందని, అందుకోసమే మీ ఐడీని చాటింగ్‌ చేయకుండా నిలిపేశారని చెబుతున్నారు.

గ్రూపుల్లో వాయిస్‌ మెసేజ్‌లు

బుధవారం వరకు కొందరు కమీషన్‌ ఏజెంట్లు యాప్‌ నిర్వాహకులకు వత్తాసు పలుకుతూ బెదిరింపులకు దిగినట్టు కొందరు ఖాతాదారులు చెబుతున్నారు. ఐఏఎస్‌ ఖాతాదారుల గ్రూపుల్లో వాయిస్‌ మెసేజ్‌ పెట్టి సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తూవచ్చారు. గురువారం ఉదయం నాటికి ఐఏఎస్‌ యాప్‌ ఆన్‌లైన్‌ కార్యాకలాపాలు పూర్తిగా నిలిపేశారు. ఈ యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో కనిపించదు. పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకొనే వ్యక్తి ఐఏఎస్‌ ప్రొవైడర్‌లో వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ఏపీకే ద్వారా లింక్‌ను ఫోన్‌కు పంపించి యాక్టివేట్‌ చేయిస్తున్నారు. ఇది యాక్టివేట్‌ అయిన తర్వాత వ్యక్తిగతంగా కేటాయించిన ఐడీ ద్వారా ఏపీకే ద్వారా ఐఏఎస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఎంటర్‌ కావాల్సి ఉంటుంది. అన్ని ఆర్ధిక కార్యకలాపాలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలి. ప్రస్తుతం ఐఏఎస్‌ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోవడంతో యాప్‌లో రిజిస్ట్రేషన్‌ నిలిపేశారు. దీంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. బాధితులంతా వాట్సాప్‌ గ్రూపుల్లో మోసపోయామంటూ మేసేజ్‌లు పెట్టుకోవడం తప్ప ఎవరిని నిందించాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు.

ఇంటి నుంచే రూ. లక్షల్లో ఆదాయం..

ఇంటి వద్ద ఉంటూ రూ.లక్షల్లో ఆదాయం పొందవచ్చని వాట్సాప్‌ల్లో, సోషల్‌ మీడియాలో వచ్చిన ప్రకటనలతో అనేక మంది గృహిణులు, ఉద్యోగులు ఎగబడి ఖాతాదారులుగా చేరి చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టారు. వాటి రిటర్న్స్‌ ప్రతి వారానికి వారం ఐఏఎస్‌ వాలెట్‌ ద్వారా విత్‌ డ్రాకు అవకాశం కల్పించడంతో మొదటి రెండు పర్యాయాలు ప్రకటనలో చెప్పిన మాదిరిగా రిటర్న్స్‌ రావడంతో వారంతా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం, మరికొందరితో పెట్టుబడి పెట్టించడం ప్రారంభించారు. జూన్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఐఏఎస్‌ సంస్థ ఈ నెల 13 నాటికి లక్షల్లో ఖాతాదారులుగా చేరారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, ఆ తర్వాత విత్‌డ్రా సమయాన్ని రెండు నుంచి 5 రోజులకు పెంచడం, అంతకు ముందు వారం పెట్టిన విత్‌డ్రాలు ఖాతాల్లో జమ కాకపోవడంతో మోసపోయారని గుర్తించారు. ఇప్పటికీ ఐఏఎస్‌ యాప్‌ ఖాతాదారుల వాట్సాప్‌ గ్రూపుల్లో కొందరు వాయిస్‌ మెసేజ్‌లు పెట్టి ఆందోళన చెందవద్దని టాస్క్‌ పూర్తిచేయకుంటే ఐడీని శాశ్వతంగా రద్దు చేస్తారని చెబుతున్నారు. గురువారం నుంచి మూడు విత్‌ డ్రాలకు అవకాశం ఇచ్చారని, కొత్త ఖాతాదారులను చేర్చుకోవద్దని సంస్థ నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు. దీన్ని కొందరు ఖండిస్తుండగా మరికొందరు సమర్థిస్తూ గుడ్డిగా నమ్మి యాప్‌లో వచ్చే టాస్క్‌లను పూర్తిచేస్తున్నారు. లేదంటే ఐడీ పోతుందని, దీనివల్ల ఖాతాలో వాలెట్‌లో ఉన్న మొత్తం విత్‌ డ్రాకు అవకాశం ఉండదని చెబుతున్నారు.

మెసేజ్‌ల ద్వారా ప్రచారం

అయితే కమీషన్‌ ఏజెంట్ల గ్రూపుల్లో మాత్రం సంస్థ నుంచి వచ్చే మెసేజ్‌ల్లో పూర్తిస్థాయిలో అకౌంట్లు వివరాలు సమర్పించకుండా ఉన్న వాటిని ఫేక్‌గా గుర్తించి మెంబర్‌షిప్‌ స్థాయి డిపాజిట్‌ని ఏడు పనిదినాల్లో ఐఏఎస్‌ యాప్‌కు ఇచ్చిన అకౌంట్‌కు జమ చేస్తున్నట్టు పెట్టారు. దీంతోపాటు ఖాతాను యాక్టివేట్‌ చేయడానికి, ఇచ్చిన టాస్క్‌ పూర్తి చేయడానికి మరో గంట సమయం మాత్రమే మిగిలివుందని సందేశం ద్వారా కమీషన్‌ ఏజెంట్లకు పేర్కొన్నారు. యాక్టివేషన్‌ విధానాన్ని పూర్తిచేయడానికి హైరింగ్‌ మేనేజర్‌ను వీలైనంత తొందరగా సంప్రదించాలని ఏజెంట్లకు సూచించారు. యాక్టివేషన్‌ పూర్తిచేసిన తర్వాత ప్రతి ఏజెంట్‌ వర్క్‌ అకౌంట్‌ రెగ్యులారిటీ ఏజెన్సీ ద్వారా చట్టబద్ధత కలిగివుండడంతో పాటు శాశ్వతంగా ఉపయోగించే అవకాశం ఉంటుందని సందేశంలో పేర్కొన్నారు.

ఖాతాలను తొలగించామంటూ సందేశం

నాస్డాక్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లో కంపెనీ లిస్టింగ్‌ కోసం గురువారం ఉదయం దరఖాస్తు చేసినట్టు గ్రూపుల్లో మెసేజ్‌ పెట్టారు. దీనిలో ఉద్యోగులందరికీ కంపెనీ వ్యక్తిగత ప్రమాణీకరణ పని విజయవంతంగా పూర్తయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఐఏఎస్‌ ఉద్యోగులందరి వర్క్‌ ఖాతాల అసలు పేరును ప్రమాణీకరణగా సేకరించి లిస్టింగ్‌ అప్లికేషన్‌ను సమర్పించినట్టు ప్రకటించారు. లిస్టింగ్‌ ప్రక్రియ అయితే కంపెనీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఒక మందుగా భావిస్తున్నట్టు సందేశంలో పేర్కొన్నారు. దీని కోసం అందరూ వేచివుండాలని తెలుపుతూ చాలా విచారకరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నట్టు పేర్కొన్నారు. కంపెనీ నుంచి వివరణాత్మక గణాంకాల తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఖాతాలను విజయవంతంగా యాక్టివేట్‌ చేయలేని ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. కంపెనీ నిబంధనల ప్రకారం వారి ఖాతాలను తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకు ఉద్యోగులకు సంస్థ క్షమాపణలు, ప్రగాఢ విచారం వ్యక్తం చేస్తుందని సందేశంలో పేర్కొన్నారు. కంపెనీ లిస్టింగ్‌ ప్రక్రియ సజావుగా సాగడాన్ని నిర్ధారించుకోవడానికి వివిధ అంశాలను పరిశీలించిన తర్వాతే కంపెనీ వర్క్‌ ఖాతా డేటాను తొలగిస్తున్నట్టు తెలిపారు. ఖాతాలను యాక్టివేట్‌ చేయని ఉద్యోగుల మెంబర్‌షిప్‌ స్థాయి డిపాజిట్‌ ఏడు పని దినాల్లో కార్యాలయ ఖాతాకు జతచేసిన బ్యాంక్‌ ఖాతాకు తిరిగి చెల్లించనున్నట్టు తెలిపారు. కంపెనీ లిస్టింగ్‌ తర్వాత తమ ఉమ్మడి ప్రయత్నాలతో సంస్థ భóవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందని నమ్ముతున్నామంటూ ముగించారు.

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page