సిక్కోలులో మరో ఆర్ధిక ఉగ్రవాదం
కోట్లు మింగేసి పరారైన సంస్థ
లబోదిబోమంటున్న ఖాతాదారులు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రతిరోజు దేశంలో ఏదో ఒకచోట ఆర్థిక కలాపాలు నిర్వహించే సంస్థలు బోర్డు తిప్పేయడం సర్వసాధారణమైపోయింది. అధిక వడ్డీలకు, రిటర్న్స్‌కు ఆశపడి రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి ఖాతాదారులుగా చేరి రూ.లక్షల్లో మోసపోతున్న వైనం అనేక సందర్భాల్లో వెలుగుచూశాయి. అధిక వడ్డీలను ఆశ చూపించి పెట్టుబడులను ఆకర్షించేలా ప్రకటనలు ఇస్తూ ఖాతాదారులను మోసం చేయడం అనేక ఏళ్లుగా సాగుతుంది. అదే కోవలో శ్రీకాకుళం నగరం కేంద్రంగా ఇండియా అడ్వర్టైజింగ్ సర్వీసెస్ (ఐఏఎస్) పేరుతో ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాల్లో సుమారు లక్ష మందికి టోకరా పెట్టి బోర్డు తిప్పేసింది.

జిల్లాలో నాలుగు నెలలుగా కార్యకలాపాలు సాగించిన ఐఏఎస్ సంస్థ ఆన్‌లైన్‌లో ఐఏఎస్ యాప్‌లో పెట్టుబడి పెట్టించి రూ.కోట్లలో సొమ్ములు కొట్టేసారని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నగరంలోని ముద్దాడ చిన్నబాబు ఆసుపత్రి సమీపంలో ఇండియన్ బ్యాంకుపై అంతస్తులో ఉన్న సంస్థ కార్యాలయం వద్దకు ఖాతాదారులు చేరుకొని అందోళన చేశారు. కార్యాలయంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఫర్నిచర్‌ను ధ్వంసంచేసి చేతికి అందిన వస్తువులన్నింటినీ పట్టుకుపోయారు. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టినవారిలో ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు ఉండడంతో కార్యాలయం వద్దకు వచ్చి వాకబు చేసి ఉసూరుమంటూ వెళ్లిపోతున్నారు.
జూలై 13న నగరంలో ప్రారంభించిన ఐఏఎస్ కార్యాలయంలో నగరానికి చెందిన కొండవీటి అన్నాజీరావును మేనేజర్‌గా నియమించి ఐఏఎస్ యాప్ వాలెట్ ద్వారా రూ.60వేలు జీతం చెల్లిస్తున్నట్టు తెలిసింది. ఈ కార్యాలయం తెరిచిన రెండు నెలలు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించినట్టు ఖాతాదారులు చెబుతున్నారు. మేనేజర్‌గా వ్యవహరించిన అన్నాజీరావు కూడా ఐఏఎస్ యాప్‌లో పెట్టుబడి పెట్టి ఇంకొందరితో పెట్టుబడి పెట్టించారని తెలిసింది. ఆ కారణంతోనే అన్నాజీరావును మేనేజర్‌గా నియమించి వేతనం చెల్లిస్తుందని విశ్వసనీయ సమాచారం.
చెల్లింపులన్నీ వాలెట్ ద్వారానే

ఐఏఎస్ సంస్థ తన కార్యాలాపాలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నట్టు ఖాతాదారులు చెబుతున్నారు. ఇందులో ఖాతాదారులను చేర్చినవారు వివిధ హోదాల్లో కమీషన్లు తీసుకుంటున్నారు. వీరు ఇచ్చిన వివరాల ప్రకారం ఐఏఎస్ సంస్థ ఆన్‌లైన్ బేస్డ్‌గా నిర్వహిస్తుంటారని తెలుస్తుంది. ఈ సంస్థకు సంబంధించిన యజమానులు ఎవరూ అందుబాటులో లేరని, కార్యాలయం ఏర్పాటు, ఫర్నీచర్ కొనుగోలు, నిర్వహణ ఖర్చులను వాలెట్ ద్వారానే ఐఏఎస్ సంస్థ చెల్లింపులు చేసినట్టు చెబుతున్నారు. కార్యాలయాన్ని అద్దెకు ఇచ్చిన భవన యజమాని నగరానికి చెందిన బాబ్జీ ఉద్యోగ రీత్యా విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. భవన యజమానిని మేనేజర్‌గా పని చేస్తున్న అన్నాజీరావు సంప్రదింపులు జరిపి అద్దెకు తీసుకున్నట్టు తెలిసింది. భవన యజమానికి నెలవారీ అద్దెను ఐఏఎస్ వాలెట్ ద్వారానే చెల్లిస్తున్నారని తెలిసింది. ఈ సంస్థలో పట్టుబడి పెట్టేవారిని ఆకర్షించడం కోసం శ్రీకాకుళం కేంద్రంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కమీషన్లు ఆశ చూపించి ఏజెంట్లుగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు. ఏజెంట్లుగా వారు చేర్చిన ఖాతాదారుల సంఖ్యను బట్టి హోదా ఇచ్చి కమీషన్ చెల్లిస్తుండడంతో వారంతా వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో పెట్టుబడులు పెట్టించారు. రూ. 2,100, రూ. 5,500, రూ.18,300, రూ. 55 వేలు ఐఏఎస్ యాప్ ద్వారా జమ చేయించారు. ఐఏఎస్ యాప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చే ఛానల్స్‌లో ఖాతాదారుల నుంచి వసూలుచేసే మొత్తాన్ని జమ చేస్తుండేవారు. ఈ మొత్తం ఒక్కోసారి ఒక్కొక్కరి ఖాతాల్లో జమవుతుండేది. యాప్‌లో చాటింగ్ తప్ప నేరుగా సమాచారం ఇచ్చేవారు ఉండరని కమీషన్ ఏజెంట్లు జెబుతున్నారు.
ఆన్‌లైన్ లింక్ ద్వారా జమ
ఖాతాదారుల నుంచి జమ చేయించిన మొత్తాలను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి వారంలో ఐదు రోజులకు వచ్చే లాభాలను ప్రతి వారం ఐఏఎస్ వాలెట్ ద్వారా ఖాతాదారులకు చెల్లింపులు చేస్తుంటారని ఏజెంట్లు చెబుతున్నారు. వారం చివరిలో ఐఎఎస్ యాప్ వాలెట్ ద్వారా వచ్చే రిటర్న్స్ విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విత్‌డ్రా చేసుకోకుంటే ఖాతాదారులకు రావాల్సిన మొత్తం వెనక్కి వెళ్లిపోతుంది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించే వారికి మొదట ఒక లింక్ ఫోన్‌కు వస్తుంది. ఈ లింక్ క్లిక్ చేసి అందులో పేరు, చిరునామా, ఆధార్, బ్యాంకు అకౌంట్ వివరాలు ఇస్తే అందులో ఎంత పెట్టుబడికి ఎంత రిటర్న్స్ వస్తుందన్న వివరాలు కనిపిస్తాయి. ప్రతి విత్‌డ్రాకు 10 శాతం సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తున్నట్టుగా చూపిస్తారు. రోజులో ఒక్కసారి మాత్రమే ఒక ఖాతాదారుడు విత్‌గ్రా చేయడానికి అవకాశం ఉంటుందని చాటింగ్ ద్వారా సమాచారం ఇస్తారు. రూ.2,100 జమచేస్తే రోజకు రూ.75 చొప్పున ఏడాదికి 22,500, రూ.5,500కు రోజుకు రూ.200 చొప్పున ఏడాదికి రూ.60వేలు, 18,300కు రోజుకు రూ.600 రిటర్న్స్ ఏడాదికి రూ.1.98 లక్షలు రిటన్స్ వస్తాయని ఐఏఎస్ సంస్థ కమిషన్ ఏజెంట్ల ద్వారా ఖాతాదారులకు ఎరవేసి పెట్టుబడులు పెట్టించారు.
ఖాతాదారులే ఏజెంట్లు
మొదట్లో పెట్టుబడి పెట్టినవారందరికీ సంస్థ చెప్పిన మాదిరిగా రిటర్న్స్ వారంలో వాలెట్ ద్వారా రావడం, వాటిని విత్‌డ్రా చేసుకోవడంతో వీరంతా ఏజెంట్లుగా మారిపోయి ఖాతాదారులను చేర్పించి కమీషన్లు పొందడం ప్రారంభించారు. దీంతో ఎంతమంది ఖాతాదారులను తీసుకువస్తే అంత ఆదాయం రావడం, సంస్థ హోదా కట్టబెట్టడంతో ఐదు జిల్లాల్లో సుమారు లక్షమంది దీనిలో పెట్టుబడులు పెట్టారు. మొదట 10 మందిని చేర్చితే ఇన్‌టైమ్స్ అసిస్టెంట్‌గా, 20 మందిని చేర్చితే ఫార్మల్ అసిస్టెంట్‌గా, 100 మందిని చేర్చితే ఫార్మల్ సూపర్‌వైజర్‌గా, 300 మందిని చేర్చితే మార్కెటింగ్ మేనేజర్‌గా, 600 మందిని చేర్చితే రీజనల్ మినిస్టర్‌గా, 3వేల మందికి చేర్పిస్తే రీజనల్ పార్టనర్‌గా హోదాలు కట్టబెట్టి రూ.5 వేల నుంచి రూ.10లక్షలు నెలవారీ కమిషన్లు ఇవ్వజూపారు. మొదట్లో చేరిన, చేర్చుకున్నవారికి ప్రతి వారం వాలెట్ ద్వారా రిటన్స్ రావడంతో వారంతా అత్యాశకు పోయి చిన్న మొత్తాలు జమ చేసిన వారంతా రూ.18,300, రూ.55వేలు జమచేయడం ప్రారంభించారు.
కార్యాలయంలో చొరబడి
జమ చేసిన వారి సంఖ్య అమాంతం పెరగడం, తక్కువ మొత్తాలు కట్టిన వారికే రిటర్న్స్ రావడంతో పెద్ద మొత్తం కట్టేవారిని మరి కొన్నాళ్లు వేచి ఉండాలని యాప్ ద్వారా సమాచారం ఇవ్వడంతో నెల రోజుల పాటు అందరూ వేచిచూశారు. ఆతర్వాత ఎవరిని సంప్రదించాలో తెలియక ఐఏఎస్ యాప్‌లో చాటింగ్ చేసినా ఎవరూ స్పందించకపోవడంతో జిల్లా కేంద్రంలో ఉన్న కార్యాలయానికి రావడం ప్రారంభించారు. కార్యాలయంలో ఉన్న మేనేజర్ అన్నాజీరావును సంప్రదించగా, ఆయన సమాధానం చెప్పలేక ఫోన్ స్విచాఫ్ చేసి కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారని తెలిసింది. వారం రోజులుగా కార్యాలయానికి తాళం వేసి ఉండడం, సమాధానం చెప్పేవారు లేకపోడం, ఎవరిని సంప్రదించాలో తెలియక కార్యాలయం తాళాలు పగలుగొట్టి చొరబడి మరుగుదొడ్డి డోరుతో సహా పట్టుకుపోయారు. నేరుగా డబ్బులు ఇవ్వకపోవడం, ఫోన్ల నుంచే ఫోన్‌పే ద్వారా చెల్లింపులు చేసి వాలెట్ ద్వారా విత్‌డ్రాలు చేసుకోవడంతో ఎవరిపై ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు తలలు పట్టుకుంటున్నారు. కమీషన్ ఏజెంట్ల ద్వారా పెట్టుబడిని నేరుగా సొంత ఫోన్ ద్వారా బాధితులు చెల్లింపులు చేయడం వల్ల తమకు సంబంధం లేదని, తామూ బాధితులమేనంటూ ఎదురు తిరుగుతున్నారని బాధితులు చెబుతున్నారు.
Commentaires