
ఐఐటి డిగ్రీ కోర్సులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే...
ప్రపంచస్థాయి ఇంజినీరింగ్ సాంకేతిక విద్యకు చిరునామాగా భారతీయ ఐఐటీలు పేరుపొందాయి. భవిష్యత్తు భారతానికి కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిచడంలో మన ఐఐటీల పాత్ర మరువలేనిది. ప్రపంచ ప్రఖ్యాత సీఈవోలను, శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను అందించిన ఘనత ఐఐటీలకే దక్కుతుంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చదివించాలని భావిస్తారు. ఎన్నో ప్రయాసలు పడతారు. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో కేవలం 17,385 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంతటి ప్రతిష్ట కలిగిన ఈ ఐఐటీలలో సీటు దక్కాలంటే విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు మంచి మార్కులు పొందాలి. ఈ సీట్లకు ఈ ఏడాది సుమారు 14 లక్షలకు పైగా విద్యార్ధులు పోటీ పడుతున్నారు. దీనిని బట్టి ఐఐటీలో సీటు కోసం విద్యార్ధుల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు విద్యార్ధులు ఐఐటీలలో చేరాలంటే ఇన్ని ప్రయాసలు పడాల్సిన అవసరం లేదు. నూతన విద్యా విధానంలో భాగంగా అన్ని ఐఐటీలు ఇప్పుడు ఆన్‌లైన్ డిగ్రీలు అందజేస్తున్నాయి. దాదాపు అన్ని ఐఐటీలు అందించే ఈ ఆన్‌లైన్ డిగ్రీ కోర్సుల్లో చేరాలంటే అత్యంత క్లిష్టమైన అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఆయా ఐఐటీలు నిర్వహించే ఓ సాధారణమైన పరీక్ష రాస్తే చాలు.. ప్రతిష్టాత్మక మద్రాస్ ఐఐటీ నాలుగేళ్ల బీఎస్సీ డేటా సైన్స్ డిగ్రీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది హోనర్స్ డిగ్రీ. ఇది పూర్తి ఆన్‌లైన్ కోర్సు. ఇందులో చేరినవారు ఎనిమిదేళ్లలో సంబంధిత డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇది నాలుగేళ్ల డిగ్రీ అయినప్పటికి విద్యార్ధులు మొదటి ఏడాదిలోను, రెండో ఏడాది, మూడో ఏడాదిలోను ఆ ఏడాది కోర్సు పూర్తి చేసి వైదొలగొచ్చు. మొదటి ఏడాది పూర్తి చేసిన వారికి ఫౌండేషన్ సర్టిఫికేట్, రెండో ఏడాది పూర్తిచేసిన వారికి డిప్లొమా సర్టిఫికేట్, మూడో ఏడాది పూర్తిచేసిన వారికి బీఎస్సీ, నాలుగో ఏడాది పూర్తి చేసిన వారికి బీఎస్ హానర్స్ డిగ్రీ అందజేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కోర్సులో ఇప్పటికి 20వేల మంది చేరినట్టు మద్రాస్ ఐఐటీ చెప్తుంది. వీరితో పాటు 3వేల మంది వివిధ ఉద్యోగ సంస్థల్లో పనిచేస్తున్నవారు ఈ ఏడాది ఈ కోర్సులో చేరారు. ఈ కోర్సు చేసిన వారిలో 20కి పైగా విద్యార్ధులు ఉన్నత చదువులకు ఉపకరించే గేట్ ర్యాంక్ పొందారని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఇదే తరహాలో గౌహతి, కాన్పూర్ ఐఐటీలు ఈ ఏడాది డిగ్రీ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసాయి. ఫీజు విషయానికి వస్తే నాలుగేళ్ల డిగ్రీ పూర్తి అయ్యేసరికి రూ.3.50 లక్షలు ఖర్చవుతుంది. ఐఐటీ హోదాతో పాటు ప్లేస్‌మెంట్ అందించే ఈ ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రుల ఐఐటీ కల సాకారం అయ్యేలా చేస్తుంది. ఈ కోర్సుతో పాటు మరో డిగ్రీ చేసుకొనే వెసులుబాటు కూడా ఉండే డ్యూయల్ డిగ్రీ విధానం ఇందులో ఉంది. ఉదాహరణకు ఇక్కడ బీఎస్సీ డాటా సైన్సు చదువుతూ మరో కళాశాలలో ఇంకో డిగ్రీ చదువుకునే అవకాశం కల్పించారు. మద్రాస్ ఐఐటీలో ఈ కోర్సుకు సంబంధించి అప్లికేషన్ అందజేయడానికి చివరి తేదీ మే 26 కాగా, ప్రవేశ పరీక్ష జులై 7న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు https://study.iitm.ac.in/ds ను సందర్శించండి.
కోర్సెరా
క్లాస్‌రూమ్‌లో తపస్సు చేయుట వేస్ట్‌రా గురూ.. బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురూ.. ఇది గులాబీ సినిమా కోసం సిరివెన్నల రాసిన పాట. ఇప్పుడు సరిగ్గా అదే నిజమవుతుంది. అవును కాలం మారింది.. చదువు కోసం, డిగ్రీ పట్టా కోసం తరగతి గదికే పరిమితమయ్యే రోజులు పోయాయి. కరోనా కాలంలో ప్రాచుర్యం పొందిన ఆన్‌లైన్ విద్య ఇప్పుడు ఊపందుకుంది. స్కూల్ విద్య నుంచి డాక్టరేట్ ప్రోగ్రాం వరకు ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లోనే. ఒకప్పుడు హార్వర్డ్‌లో లేదా ప్రిన్‌స్టన్‌లో చదవాలి అంటే అమెరికా వెళ్లాలి. ఇంపీరియల్‌లోనో లేదా లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్‌లోనో డిగ్రీ చేయాలంటే లండన్ వెళ్లాలి. ఇక మన దేశంలో ఐఐటీలలో చేరి డిగ్రీ పొందాలంటే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాలి. ఐఐఎంలో చేరాలంటే ఇప్మాట్ లేదా జిప్మాట్ రాయాలి. క్యాట్ పరీక్షలో ఉత్తమ స్కోర్‌తో పాటు మంచి కంపెనీలో పని అనుభవం ఉండాలి. ఆయా సంస్థల్లో నిర్దిష్ట సమయం గడపాలి. ఇవన్ని ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట కోర్సేరా. కోర్సెరా అనేది ఒక గ్లోబల్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు ప్రొవైడర్. ఇది ప్రపంచ వ్యాప్తంగా మూడొందలకు పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలతో పాటు మన దేశంలో ఉన్న దాదాపు అన్ని ఐఐటీలతో అనుసంధానం అయింది. ఆయా యూనివర్సిటీలలో ఉన్న ప్రముఖ కోర్సులను ఆన్‌లైన్ విధానంలో అందిస్తుంది. ఇందులో అనేక యూనివర్సిటీలలో ఉన్న కోర్సులను మన ఆదాయ పరిస్థితులను బట్టి ఉచితంగా కుడా పూర్తిచేయవచ్చు. అంతేకాకుండా ఈ కోర్సెరా గూగుల్, ఐబీఎం వంటి ప్రముఖ సంస్థలతో కలిసి సుమారు 7వేల నైపుణ్య కోర్సులు అందిస్తుంది. వయసు, అర్హతలతో సంబంధం లేకుండా మీకు నచ్చిన కోర్సు చేసుకునే సౌలభ్యం ఇక్కడ ఉంది. మరెందుకు ఆలస్యం.. కోర్సెరా వెబ్‌పేజీ చూడండి మరెన్నో విశేషాలు మీకు తెలుస్తాయి.
- సీహెచ్ దుర్గాప్రసాద్
Comentários