top of page

ఐటీకే కాదు.. పాములకూ ‘భాగ్య’నగరమే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 14
  • 2 min read

పల్లెసీమల నుంచి పట్నవాసాలకు వలసలు విపరీతంగా సాగుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. కారణం. పల్లెల్లో ఉపాధి అవకాశాలు తగినన్ని లేకపోవడం, జనాభా పెరిగిపోవడమే. దీనికి తోడు ప్రధాన వ్యాపకంగా ఉన్న వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, దాదాపు ప్రతిఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం వాటిల్లుతుండటంతో.. ఈ బాధలు పడేకంటే పట్నానికి వెళ్లి కూలి పనులైనా చేసుకుంటే నోట్లో నాలుగు వేళ్లయినా వెళ్తాయన్న ఆశతో చాలామంది వలసపోతున్నారు. దానికితోడు కాస్తోకూస్తో చదువుకున్న యువత కూడా ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలను వెతుక్కుంటూ పట్నంబాట పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలకు చేరుకుంటున్నారు. కాకపోతే ఈ వలసల పర్వం మనుషులకే పరిమితం కాలేదని ఇప్పుడు అర్థమవుతున్నది. ఎందుకంటే పల్లెలు, అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన పాములు కూడా మహానగరమైన హైదరాబాద్‌ను ఆవాసంగా మార్చుకున్నట్లు ఇటీవల జరిగిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఆ నగరంలో పదేళ్ల వ్యవధిలో పట్టుబడిన పాముల సంఖ్య వింటే అమ్మో ఈ జనారణ్యంలో ఇన్ని పాములు ఉన్నాయా అనిపించకమానదు. వీటి మధ్యే నివసిస్తున్నామా! అని భయం కూడా కలగకమానదు. సాధారణంగా పాములు జనసంచారానికి దూరంగా ఉండటానికే ఇష్టపడతాయి. అందుకే శివారు ప్రాంతాలు, జనసంఖ్య తక్కువగా ఉంటే గ్రామాలు.. వాటికి ఆనుకుని ఉండే పంట పొలాలు, చెట్లు, పొదలు, అటవీ ప్రాంతాలనే ఆవాసాలుగా చేసుకుంటుంటాయి. వాటికి ఆహారం కూడా ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా లభిస్తుంది కనుక వాటి సంచారం అధికంగా ఉంటుంది. అయితే దీనికి విరుద్ధంగా కాంక్రీట్ జంగిల్‌గా మారిన హైదరాబాద్ నగరానికి పాములు కూడా షిఫ్ట్ అవుతున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది. దీనికి కారణాలను కూడా ఆ అధ్యయనం విశ్లేషించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వరంగ పరిశోధన సంస్థ సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ ఆండ్ మాలిక్యులర్ బయాలజీ), ఎఫఓఎస్ఎస్(ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ) సంస్థలు సంయుక్తంగా నగరంలో పాముల సంచారంపై గత ఏడాది ప్రత్యేక అధ్యయనం నిర్వహించాయి. 2013 నుంచి 2022 వరకు పదేళ్ల కాలంలో హైదరాబాద్ నగరంలో పాముల సంఖ్య తగ్గిందా లేక పెరిగిందా అన్న కోణంలో పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆ పదేళ్లలో ఈ మహానగరంలో ఐటీ ఇండ్రస్టీతోపాటు పాములు కూడా బాగా వేళ్లూనుకున్నాయని వీరి స్టడీలో తేలింది. ఎంతలా అంటే ఏటా 8 నుంచి 10 శాతం పాముల సంఖ్య పెరుగుతున్నదట! స్నేక్ క్యాచర్స్ పట్టుకుంటున్న పాముý సంఖ్యే ఈ పెరుగుదలను సూచిస్తున్నాయి. ఇవికాకుండా పాము కనిపిస్తే కొట్టి చంపేసే ఉదంతాలు చాలానే ఉంటాయి. పదేళ్లలో చుట్టుపక్కల ప్రాంతాలు కాకుండా ఒక్క హైదరాబాద్ నగర పరిధిలోని జనావాసాల్లోనే 55,467 పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెట్టారని స్నేక్‌క్యాచర్స్ నుంచి సేకరించిన లెక్కలను బట్టి తేలింది. ఇక్కడ భయపట్టే మరో అంశం ఏమిటంటే.. ఇలా పట్టుకున్న పాముల్లో ఎక్కువ శాతం అత్యంత విషపూరితమైనవే. అందులోనూ అత్యంత ప్రమాదకరమైన కోబ్రా(తాచుపాము)లే 47.5 నుంచి 50 శాతం వరకు ఉండగా.. వాటి తర్వాత 24 నుంచి 27 శాతంతో జెర్రిపోతు, రసెల్ వైపర్లు రెండోస్థానంలో ఉన్నట్లు వెల్లడైంది. మొత్తంగా చూసుకుంటే మహానగరంలో పట్టుబడిన అత్యంత విషపూరిత పాముల్లో 70 శాతంపైగా ఈ రెండు జాతులవే. మొత్తం పట్టుబడిన పాముల్లో దాదాపు 54 శాతం విషపూరితమైనవి కాగా మిగతా 46 శాతం విషరహితమైనవని అధ్యయనంలో తేలింది. సాధారణంగా పాములు వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.. హైదరాబాద్‌లో కూడా ఇదే జరుగుతోంది. ఆ నగరంలో జూలై నుంచి నవంబర్ మధ్యకాలంలో పెద్దసంఖ్యలో పాములు పట్టుబడుతున్నాయి. అక్టోబర్ నెలలో ఇది మరీ ఎక్కువగా ఉంటుందని ఎఫఓఎసఎస్ చెబుతోంది. పాముల సంతానోత్పత్తికి ఇది అనుకూలమైన కాలం కనుకే ఈ సీజనులో ఎక్కువగా కనిపిస్తుంటాయని పేర్కొన్నారు. అయితే నగరమంతటా పాముల సంచారం ఎక్కువగా ఉందని చెప్పడానికి లేదు. ఎందుకంటే.. ఈ అధ్యయనం ద్వారానే పాములు అత్యధికంగా సంచరించే హాట్‌స్పాట్స్‌గా హైదరాబాద్‌లోని 232 ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాలు నగరంలో 6.9 శాతం భూభాగంలో ఉన్నట్లు అంచనా వేశారు. పాములు ఎక్కువగా పట్టుబడిన సంఘటనల ఆధారంగా మియాపూర్, దమ్మాయిగూడ, నగరం, రాంపల్లి, మణికొండ, బండ్లగూడ జాగీర్, వనస్థలిపురం, బాలాపూర్ ప్రాంతాలను ఆ హాట్‌స్పాట్లుగా నిర్థారించారు. ఇవన్నీ నగరంలో అభివృద్ధి చెందుతున్న, నిర్మాణాలు అధికంగా జరుగుతున్న అవుటర్ రింగ్‌రోడ్డు(ఓఆరఆర్) లోపలే ఉన్న తూర్పు, పశ్చిమ, దక్షిణ ఫ్రింజ్ ఏరియాలు కావడం గమనార్హం. దీన్ని బట్టి అభివృద్ది బాగా జరుగుతున్న ప్రాంతాల్లో వీటి ఉనికి ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇటువంటి ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉంటాయి. చిట్టడవుల్లాంటి పొదలు, నిర్మాణ వ్యర్థాలు పెద్దపెద్ద కుప్పలుగా పడి ఉంటాయి. వీటికితోడు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉండదు. ఇటువంటి ప్రాంతాల్లో ఎలుకలు, కప్పలు, ఇతర చిన్న చిన్న జీవుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఇవే పాములకు ఆహారం. అందువల్ల వాటి కోసం పాములు వస్తాయి. ఇక్కడే ఆవాసం ఏర్పరచుకుంటాయి. అందువల్ల ప్రజలు అహారం, ఇతర వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకూడదు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణీకరణ పెరుగుతుండటం వల్ల పంట పొలాలు, పొదలు, గుట్టలు వంటివి కనుమరుగవుతున్నాయి. దాంతో నివాసాలను కోల్పోయిన పాములు జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. వీటన్నింటిపైగా ప్రజలను అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తే పాముల బెడద తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page