
వారానికోసారి పోలీసు స్టేషన్‌కు వచ్చి కనిపించాలి. రిజస్టర్‌లో సంతకం చేయాలి. సాధారణంగా క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి బెయిల్ మంజూరు చేసినప్పుడు కోర్టులు ఈ షరతు విధించడం అందరికీ తెలిసిందే. దీన్నే కండీషనల్ బెయిల్(షరతులతో కూడిన బెయిల్) అంటుంటారు. చిత్రమేమిటంటే నిందితుల విషయంలో ఇది షరతు మాత్రమే. కానీ ఇటువంటి కేసులను విచారించే పోలీస్ బాస్‌లకు ఇప్పుడు అది శిక్షగా పరిణమించింది. వివిధ హోదాల్లో ఉన్న 16 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు రోజూ కార్యాల యానికి వచ్చి హాజరుపట్టీలో సంతకం చేసి వెళ్లాలని రాష్ట్ర పోలీస్ బాస్ అయిన డీజీపీ ద్వారకా తిరుమల రావు శిక్ష వేశారు. అది కూడా సంతకం పెట్టి, ముఖం చూపించి వెళ్లిపోవడం కాదండోయ్. మంగళగిరిలోని రాష్ట్ర డీజీపీ కార్యాలయం పని వేళలైన ఉదయం పది గంటలకు ఠంచనుగా వచ్చి.. సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడి వెయింటింగ్ హాల్లో ఉండి అప్పుడు సంతకం పెట్టి వెళ్లాలి. నిజంగా దీన్ని శిక్ష అనే కంటే తీవ్ర అవమానమనే చెప్పాలి. డీజీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వెయింటింగులో ఉన్నా ప్రధాన కార్యాలయానికి అందుబాటులో లేరన్న కారణంతో 16 మంది సీనియర్ ఐపీఎస్‌లకు ఈ మేరకు డీజీపీ కార్యాలయం మెమోలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా కొందరు కీలక పోస్టుల్లోకి వెళ్లగా గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న, వైకాపా కనుసన్నల్లో పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నవారిని లూప్‌లైన్ పోస్టుల్లోకి నెట్టేశారు. ఇంకా పలువురిని వెయిటింగ్‌లో పెట్టారు. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు ఇతర కీలక అధికారుల బదిలీలు జరుగుతుంటాయి. ఏ ప్రభుత్వమైనా తమ విధానాలకు అనుకూలంగా పనిచేసే అధికారులనే ముఖ్యమైన పోస్టుల్లో పెట్టాలనుకుం టుంది. ఇప్పుడూ అదే జరిగిందనుకోవచ్చు. అలాగే ప్రభుత్వం మారిన సందర్భంలో తమకు ఇబ్బంది ఏర్ప డుతుందని భావించే ఐఏఎస్, ఐపీఎస్‌లు ముందుజాగ్రత్తగా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుం టారు. అది కుదరనివారు మాత్రం బదిలీ వేటుకు గురై అప్రాధాన్య పోస్టుల్లోకి వెళుతుంటారు. పోస్టింగ్ లేకుండా వెయింటింగ్‌లో ఉన్నవారి గురించి ఇప్పటివరకు ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవు. సదరు అధికారులే నానాపాట్లు పడి మళ్లీ పోస్టింగ్ పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పటికే వెయి టింగ్ పేరుతో శిక్ష అనుభవిస్తున్నవారిని మళ్లీ సంతకాలంటూ రోజంతా వెయిటింగ్ శిక్ష వేయడం చర్చనీ యాంశంగా మారింది. సీనియర్ ఐపీఎస్ అధికారులను ఇటువంటి శిక్షకు గురిచేస్తున్నవారు ఐఏఎస్‌ల విష యంలోనూ దీన్ని అమలు చేయగలరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ప్రభుత్వం మారిన వెంటనే గత ప్రభుత్వానికి అనుకూలంగా అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారంటూ చాలామంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురిని వెయిటింగులో కూడా పెట్టింది. అయితే దీనిపై ప్రభుత్వ వాదన వేరేగా ఉంది. గత ప్రభుత్వంలో వైకాపాకు, ఆ ప్రభుత్వ పెద్దలకు వంతపాడిన ఐపీఎస్ అధికారులు ఇప్పుడు పోస్టింగ్ లేకపోయినా వైకాపా నేతలపై నమోదైన కేసుల విచారణలో జోక్యం చేసుకుంటున్నారట. ఆయా కేసుల విచారణాధికారులను పిలిపించి కేసుల తీవ్రత తగ్గించాలని, నీరుగార్చాలని ఒత్తిడి చేస్తున్నారన్నది ప్రభుత్వవర్గాల వాదన. ఈ మేరకు ఇంటెలిజెన్స్ నివేదించిందని సమాచారం. దీన్ని అడ్డుకునేందుకే 16 మంది సీనియర్ ఐపీఎస్‌లకు మెమో జారీ చేశారంటున్నారు. ఈ మెమోలు అందు కున్నవారిలో సంజయ్‌కుమార్, పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, సునీల్ కుమార్, అమ్మిరెడ్డి, విశాల్‌గున్ని, రిషాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. డీజీపీ నిర్ణయంపై అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందిస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికా రుల పరిస్థితి రాజకీయ నేతల కంటే దారుణంగా తయారైందన్నారు. తాము కేసుల్లో చిక్కుకుని జైలుపాలైతే కండీషనల్ బెయిల్ పొంది కోర్టు సూచన మేరకు అప్పుడప్పుడూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సంతకం పెడితే సరిపో తుందన్నారు. ఇప్పుడు పోలీస్ బాస్‌ల పరిస్థితి అంతకంటే హీనంగా తయారైందన్నారు. సంతకం పెట్టడంతో పాటు రోజంతా వెయిటింగ్ హాల్లో కూర్చోవడం నరకప్రాయమని వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశంపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. ఏపీ పోలీస్ బాస్ తన కార్యాలయ వెయిటింగ్ హాల్‌ను ఖైదీలను శిక్షించే కాన్సెంట్రేషన్ సెల్‌గా మార్చేశారని విమర్శించారు. లక్షల రూపాయల వేతనాలు పొందుతున్న అత్యున్నత పౌర సర్వీసులకు చెందిన సీనియర్ అధికారులను వెయిటింగ్ హాల్లో మగ్గబెట్టడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేయడం అధికారుల కర్తవ్యమని గుర్తు చేశారు. ఒకవేళ అలా పనిచేయకపోతే.. వారిని ప్రభుత్వానికి వ్యతిరేకులుగా ముద్రవేస్తారని వ్యాఖ్యానించారు. అధికారులు ఏమైనా తప్పులు చేస్తే వాటిపై విచారణ జరిపి డిసిప్లినరీ యాక్షన్ లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదని అన్నారు. అటువంటివేవీ లేకుండా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఉన్నతాధికారులం దరినీ ఒకేచోట కట్టగట్టి రోజంతా కూర్చోబెట్టడం మానసికంగా హింసించడమేనని ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు.
Comments