ఒకరితోనే డేటింగ్.. అతడితోనే పెళ్లి!
- Guest Writer
- Apr 11
- 2 min read

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి వ్యక్తిగత జీవితంపై పూర్తి క్లారిటీతో ఉందా? అంటే అవుననే అనాలి. నేటి తరం యువత డేటింగ్ సంస్కృతిపై భిన్నమైన అభిప్రాయాలతో ఉన్నప్పటికీ కృతి మాత్రం పాత తరం విలువలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చింది. తాను ఎవరితోనైనా డేటింగ్ చేస్తే? అది కేవలం పెళ్లి కోసమే ఉంటుందని ఒకరితోనే ప్రేమ.. అతడితోనే జీవితం అనే సూత్రాన్ని తాను నమ్ముతానని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు ఆమెలోని పరిణతిని, సంప్ర దాయాల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుతున్నాయి. ప్రేమ , పెళ్లి విషయంలో కృతి శెట్టికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్నట్లు కనిపిస్తుందని ఆమె మాటలతో అర్దమవుతుంది.
ప్రస్తుతానికి కృతిశెట్టి దృష్టి సినిమాలపైనే ఉందని మరో ఐదేళ్ల వరకు ప్రేమ లేదా పెళ్లి అనే ఆలోచనే తన దరిదాపుల్లోకి రాదని స్పష్టం చేసింది. ఐదేళ్ల తర్వాత మాత్రమే తన వ్యక్తిగత జీవితం గురించి ఒక నిర్ణయం తీసుకుంటానని అప్పటి వరకు తన శక్తిని, సమయాన్ని నటనకే కేటాయిస్తానని పేర్కొంది. ప్రేమ అనేది ఒక బాధ్యత అని సరదా కోసం చేసే పని కాదని కృతి అభిప్రాయపడింది. తాను పెళ్లాడబోయే వ్యక్తి తనను అర్థం చేసుకునేవాడై, తన వృత్తిని గౌరవించే వాడై ఉండాలంది. డేటింగ్ పేరుతో సమయాన్ని వృధా చేయడం కంటే ఒకే వ్యక్తితో బలమైన బంధాన్ని ఏర్పరచుకోవడమే ఉత్తమమని అమ్మడు నమ్ముతోంది.
గ్లామర్ ప్రపంచంలో ఉంటూ ఇంతటి స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండటం విశేషం. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి స్పష్టత ఉండటం వల్ల వృత్తిపరంగా ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకునే అవకాశం ఉంది. చాలామంది నటీమణులు కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రూమర్ల బారిన పడుతుంటారు. అయితే కృతి శెట్టి ముందే ఇలాంటి ప్రకటన చేయడం ద్వారా అనవసరమైన గాసిప్స్‌కు చెక్ పెట్టినట్లయింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్న మంగళూరు భామ నటనతో ప్రేక్షకులను మెప్పించడమే పరమావధిగా భావిస్తుంది.
కృతి శెట్టి కెరీర్ పై ఉన్న స్పష్టతతో ఇటు నిర్మాతలకు, అటు అభిమానులకు ఒకరకమైన భరోసా ఇచ్చినట్లే. ఐదేళ్ల పాటు కేవలం వెండితెరపైనే కనిపిస్తానని చెప్పడం ఆమె అంకితభావాన్ని సూచిస్తోంది. దీంతో నిర్మాతలు నిశ్చింతగా సినిమాలు చేసుకోవచ్చు. కృతి శెట్టి ఫాలోవర్స్ అమ్మడి కోస ప్రయత్నాలు చేయోచ్చు. ఈ బ్యూటీ నటించిన ఎల్ ఐ కె సినిమా కొన్ని గంటల క్రితమే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంపై అమ్మడు చాలా ఆశలే పెట్టుకుంది. అలాగే తెలుగులోనూ ఓ అగ్ర హీరో ప్రాజెక్ట్ కు సైన్ చేసింది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో..
తిమ్మరాజుపల్లిలో ‘టీవీ’ తగాదా

కిరణ్ అబ్బవరం నిర్మించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ప్రధాన తారాగణం దాదాపు కొత్తవారే. వి. మునిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటనలతో, పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. టీజర్ ఇప్పటికే ఆసక్తిని పెంచగా, ఈ రోజు విడుదలైన ట్రైలర్ మరింత ఆకట్టుకుంది.
టీవీలు, వీసీఆర్‌లు సామాన్యులకు అందని ద్రాక్షగా ఉన్న కాలంలో జరిగే కథ ఇది. తిమ్మరాజుపల్లిలో సతీష్ అనే కుర్రాడు ఆ గ్రామానికి ఓ టీవీ తీసుకొస్తాడు. అక్కడి ప్రజలకు అది ఓ పెద్ద సంబరం. కానీ అదే టీవీ కారణంగా గ్రామంలో తగాదాలు మొదలవుతాయి. అక్కడి నుంచి కథ ఒక్కసారిగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా మారుతుంది. ఆ గొడవలు ఎందుకు మొదలయ్యాయి? అసలు ఆ సస్పెన్స్ ఏమిటి? అన్నదే కథలో ప్రధానాంశం.
కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిల్మ్స్ నేపథ్యం నుంచి వచ్చినవాడు. మంచి కథలను ఎంచుకునే పట్టు ఆయనకు ఉంది. ఈ కథ చూస్తుంటే పాయింట్ పరంగా ఏదో ప్రత్యేకత ఉన్నట్లు అనిపిస్తోంది. మేకింగ్ మామూలుగానే ఉన్నా, నటీనటులు, సాంకేతిక బృందం పనితీరు ట్రైలర్‌ను ప్రామిసింగ్‌గా నిలబెట్టాయి.
ఓ గ్రామం, అక్కడి ప్రజలు, టీవీ తెచ్చిన సంఘర్షణ.. ఇవన్నీ సహజంగా కుదిరాయి. పల్లెటూరి నేపథ్యంతో సాగే సినిమాలు సరిగ్గా తెరకెక్కితే ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ ట్రైలర్‌లో విషయం అయితే ఉంది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఏప్రిల్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...






Comments