ఒక్కడే ‘ఆల్ ఇన్ వన్ ’
- BAGADI NARAYANARAO

- Jul 18
- 2 min read
డిగ్రీల్లేవు, రిజిస్ట్రేషన్ లేదు
ఆమదాలవలస నకిలీ వైద్య సామ్రాజ్యంపై ప్రత్యేక కథనం!

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
అతనికి ఎంబీబీఎస్ లేదు. కనీసం ఆయుష్ బోర్డు గుర్తింపు అంతకన్నా లేదు. కానీ.. అతనే అల్లోపతి డాక్టర్, అతనే ఆయుర్వేద నిపుణుడు, అతనే హోమియో వైద్యుడు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ కూడా. ఆమదాలవలస మండలం, టి.జొన్నవలస కేంద్రంగా సాగుతున్న ఈ నకిలీ వైద్య సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు నిజాలను మా ఇన్వెస్టిగేటివ్ టీమ్ బట్టబయలు చేసింది.
అసలేం జరిగింది?

2018లో టి.జొన్నవలస గ్రామంలో సమీప బంధువుల ఇల్లు ఆక్రమణకు గురైంది. అక్కడ రాత్రికి రాత్రే ‘అప్పలనరసమ్మ నేచురల్ హెల్త్ కేర్ సెంటర్ ’ వెలిసింది. బోర్డు మీద పెద్ద అక్షరాలతో ‘డాక్టర్ ’ రెడ్డి పాపారావు అని రాసుకున్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, ఉచిత వైద్య శిబిరాల పేరిట ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో లేని రోగాలను ఉన్నట్లు చూపిస్తూ, సొంత క్లినిక్‌లోనే రక్త పరీక్షలు చేస్తూ, అక్కడే మందులు కొనేలా బాధితులను దోచుకోవడం ప్రారంభించారు. ఈ దందాపై ప్రశ్నించినందుకు సొంత బంధువులపైనే భౌతిక దాడికి దిగి తీవ్రంగా గాయపరిచిన చరిత్ర కూడా ఈ నకిలీ డాక్టర్‌కు ఉంది.
ఆర్టీఐ బాంబు.. రాత్రికి రాత్రే మారిన బోర్డులు

గ్రామానికి చెందిన కొందరు యువకులు ఈ వ్యవహారంపై అనుమానంతో సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించడంతో ఈ నకిలీ డాక్టర్ బండారం ఒక్కొక్కటిగా బయటపడింది. ఆయుష్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జె.ధనుంజయరావు ఆర్టీఐ ద్వారా ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో.. ‘రెడ్డి పాపారావు అసలు ఏపీ ఆయుష్ బోర్డులోనే నమోదు కాలేదు’ అని తేల్చి చెప్పారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయని తెలియగానే, పాపారావు రాత్రికి రాత్రే ఆసుపత్రి బోర్డు పైనున్న ‘డాక్టర్ ’ అనే పదాన్ని తొలగించి ‘ప్రొప్రయిటర్ ’గా మార్చారు. అంతవరకు వేలాడదీసిన అర్హత డిగ్రీల వివరాలను బోర్డు నుంచి తొలగించారు. కానీ, ఆసుపత్రి లెటర్ హెడ్‌పై మాత్రం విరుద్ధమైన డిగ్రీలు ఉన్నట్లు ఆయనే స్వయంగా రాసి ఇవ్వడం గమనార్హం.
ఐదేళ్ల కోర్సు.. ఒకే ఏడాదిలో?

పాపారావు చదివినట్లు చెబుతున్న విద్యార్హతల కాలక్రమాన్ని పరిశీలిస్తే షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. 2017లో ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీలో యోగాలో డిప్లొమా పూర్తి చేసిన ఇతను, ఆ తర్వాతి సంవత్సరమే దూరవిద్య ద్వారా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ సైకాలజీ, అనంతరం ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌లో ఎంఎస్సీ చేసినట్లు సర్టిఫికెట్లు చూపిస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లన్నీ సృష్టించినవేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటన్నిటికంటే మించి, అరుణాచల్‌ప్రదేశ్‌లోని హిమాలయ యూనివర్సిటీలో తాను ‘బిఎన్‌వైఎస్ ’ (యోగ & నేచురోపతి) డిగ్రీ చదివినట్లు పాపారావు ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ రెగ్యులర్ డిగ్రీ పూర్తి కావడానికి ఐదున్నర ఏళ్లు పడుతుందని ఆయుష్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎటువంటి రెగ్యులర్ విద్య లేకుండానే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.
ఏడాది దాటినా కదలని ఫైళ్లు

కలెక్టర్ గ్రీవెన్స్‌కు అందిన ఫిర్యాదులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ గతంలో స్పందిస్తూ.. ‘రెడ్డి పాపారావు ఎంబీబీఎస్ హోల్డర్ కాదు, అతనికి అల్లోపతి వైద్యం చేసే అర్హత లేదు’ అని స్పష్టం చేసింది. కేవలం ఫిజియోథెరపీ సేవలకు మాత్రమే అనుమతి ఇచ్చామని, ఆ మేరకు బీపీటీ చదివిన డాక్టర్ మాత్రమే సేవలు అందించాలని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా పాపారావు ధృవపత్రాల వెరిఫికేషన్ కోసం విశ్వవిద్యాలయాలకు పంపించామని ఏడాది క్రితం ప్రకటించిన అధికారులు, ఇప్పటివరకు ఆ నివేదికలను బయటపెట్టకపోవడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తోంది.
నకిలీ డాక్టర్‌కు ‘వైద్య రత్న’ అవార్డు!

ఈ కథనంలో అత్యంత హాస్యాస్పదమైన, ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ, కనీస అర్హతల్లేని ఈ నకిలీ వైద్యుడికి హైదరాబాద్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ఏకంగా ‘వైద్య రత్న’ అవార్డు ఇచ్చి సత్కరించడం. కనీస బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఇలాంటి అవార్డులు ఎలా ఇస్తారనేది మిస్టరీగా మారింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి నకిలీ డాక్టర్‌పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, వెరిఫికేషన్ ప్రక్రియను తొక్కిపెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.






Comments