ఒక్కడు సరిపోడు.. కావాలి ఓ వివాహేతర తోడు!
- DV RAMANA

- Jul 4
- 3 min read
దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెడధోరణి
వివాహేతర సంబంధాల యాప్‌లలో లక్షలాది యÖజర్లు
వీటిలో రెండేళ్లలోనే 148 శాతం పెరిగిన మహిళలు
దాంపత్య జీవితంలో విభేదాలు, ఒంటరితనమే కారణాలు
భారతీయ వైవాహిక వ్యవస్థకు ప్రమాద సంకేతాలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
మన కుటుంబ వ్యవస్థకు పునాది వివాహ వ్యవస్థ. హిందూ సంప్రదాయంల వివాహ వ్యవస్థను అతిపవిత్రంగా పరిగణిస్తారు. అగ్నిసాక్షిగా చేసుకునే వివాహాన్ని విడదీయలేని బంధంగా భావిస్తారు. తాళి కట్టే సమయంలో ‘నాతి చరామి’ అని వరుడితో కన్యాదాతకు, పెళ్లికుమార్తెకు చెప్పిస్తారు. దాని అర్థం ఏమిటంటే.. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను, జీవితంగా తోడుగా ఉంటాను అని భరోసా ఇవ్వడమే. అంతేకాకుండా వివాహబంధాన్ని పటిష్టంగా ఉంచేందుకే మన పురాణాల్లో శ్రీరాముడిని ఏకపత్నీవ్రతుడిగా చూపించి.. సమాజానికి ఆదర్శపురుషుడిగా చూపించారు. మన చట్టాలు, సంప్రదాయాలు కూడా బహుభార్యత్వాన్ని అంగీకరించకపోగా నేరంగా పరిగణిస్తున్నాయి. కానీ ఆధునిక సమాజంలో ఆ నమ్మకాలు, కట్టుబాట్లు, వివాహ సమయంలో చేసిన బాసలు అన్నీ కట్టు తెంచుకుని వివాహేతర సంబంధాలను పెంచిపోషిస్తున్నాయి. సమాజం ఇటువంటి అపవిత్ర, అనైతిక సంబంధాలను అంగీకరించనందున.. చాటుమాటు వ్యవహారాలు పెరుగుతున్నాయి. ఈమధ్య కాలంలో పుట్టుకొస్తున్న పలు యాప్‌లు ఇలాంటి చాటుమాటు వివాహేతర సంబంధాలకు వేదికలుగా మారుతుండటం, ఇందులో మహిళల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గ్లీడెన్ అనే వివాహేతర సంబంధాల యాప్ తాజాగా విడుదల చేసిన వివరాలే ఈ ప్రమాదకర ధోరణిని తార్కాణంగా నిలుస్తున్నాయి.
ఒక్క యాప్‌లోనే 40 లక్షల మంది
వివాహేతర సంబంధాల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ల వినియోగం మనదేశంలో ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. ఒక అభిప్రాయం ప్రకారం వ్యభిచారాన్ని నేరంగా పరిగణించరాదని 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వివాహేతర సంబంధాల యాప్ వినియోగం బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి యాప్‌లో వందలు, వేల సంఖ్యలో ఉన్నప్పటికీ మనదేశంలో కొన్ని యాప్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో గ్లీడెన్ యాప్‌ను అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఈ యాప్‌కు 2026 లెక్కల ప్రకారమే సుమారు 40 లక్షల(నాలుగు మిలియన్లు) మంది క్రియాశీల వినియోగదారులు ఉన్నారట! దాని తర్వాత ఆష్లే మేడిసన్ అనే విదేశీ యాప్ ప్రాచుర్యం పొందింది. ‘లైఫ్ షార్ట్.. హావ్ యాన్ అఫైర’ అనే ట్యాగ్‌లైన్‌తో ఇది పనిచేస్తున్నది. దీనికి ఇండియాలోనూ లక్షలాది వినియోగదారులు ఉన్నారు. ఇవి కాకుండా ప్రత్యేకంగా భారతీయుల కోసమే రూపొందించిన అమోర్ అనే యాప్ కూడా అందుబాటులో ఉంది. హిందీ వంటి పలు స్థానిక భాషల్లో సేవలు అందిస్తూ, వివాహేతర సంబంధాల్లో గోప్యతను కోరుకునేవారిని ఆకర్షిస్తున్నది.
మెట్రో నగరాల్లో విపరీతం
వివాహేతర సంబంధం అనగానే సహజంగా పురుషులే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారన్న అభిప్రాయాలు ఉంటాయి. కానీ వివాహేతర సంబంధాల యాప్‌లలో పురుషులకు ధీటుగా మహిళలు కూడా యాక్టివ్ యÖజర్లుగా ఉంటుండటం విస్మయం కలిగిస్తుంది. గ్లీడెన్ యాప్ నిర్వాహకులు జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఒక్క ఈ యాప్‌లోనే 40 లక్షల మంది భారతీయులు సభ్యులుగా ఉన్నారంటే మొత్తంగా దేశంలో ఎంతమంది ఉంటారో ఊహించుకోవచ్చు. మరో విశేషమేంటంటే.. గత రెండేళ్లలోనే గ్లీడెన్ యాప్‌కు మహిళా వినియోగదారుల సంఖ్య ఏకంగా 148 శాతం పెరిగింది. ఈ యాప్ ప్రకటించిన డేటా ప్రకారం మొత్తం వినియోగదారుల్లో 65 శాతం మంది పురుషులు కాగా మిగతా 35 శాతం మంది మహిళలేనట! మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య, మళ్లీ రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు ఈ యాప్‌లు అత్యంత బిజీగా ఉంటాయని గుర్తించారు. ఈ గణాంకాలే దేశంలో గ్లీడెన్‌తో సహా వివాహేతర సంబంధాల యాప్‌లకు ఆదరణ పెరుగుతున్నదని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా టైర్`1, టైర్`2 నగరాల్లో వీటి వినియోగం అధికంగా ఉంది. 18 శాతం వినియోగంతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా.. 17 శాతంతో హైదరాబాద్ రెండోస్థానంలో నిలిచింది. ఢిల్లీ(11 శాతం), ముంబై (9 శాతం), పుణే (7 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. లక్నో, పాట్నా వంటి నగరాల్లోనూ ఈ యాప్‌ల వినియోగదారులు పెరుగుతున్నారు. ఈ అధ్యయనం వెల్లడించిన మరో ఆసక్తికర విషయమేమింటంటే.. పురుషులు తమకంటే చిన్న వయసున్న భాగస్వాములను కోరుకుంటే.. మహిళలు మాత్రం 30, 40 ఏళ్ల వయసులో ఉన్న డాక్టర్లు, సీఏలు వంటి వృత్తి నిపుణులను తమ వివాహేతర భాగస్వాములుగా ఇష్టపడుతున్నారు. రహస్య సంబంధాల ప్రపంచంలో కూడా ఆర్థిక స్థితిని చూస్తున్నారని ఇది వెల్లడిస్తోంది.
వివాహేతర సంబంధాలకు కారణాలు
ప్రజలు వివాహేతర సంబంధాలు ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయన్నదానిపైనా అధ్యయనాలు జరిగాయి. ఇప్సోస్ అనే సంస్థ 2025లో నిర్వహించిన సర్వే ప్రకారం.. ఒత్తిడితో కూడిన కార్పొరేట్ జీవితాలు, పెరుగుతున్న ఒంటరితనం, కుటుంబ బాధ్యతల భారం కారణంగా సుమారు 33 శాతం మంది వివాహేతర సంబంధాల వైపు మరలుతున్నారు. దంపతుల మధ్య భావోద్వేగ అనుబంధం లేకపోవడం కూడా కారణమవుతున్నది. చాలా మందికి భోజన విరామ సమయంలో స్వైప్ చేయడం వంటి సాధారణ విషయం కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని, భావోద్వేగ ఉపశమనాన్ని అందిస్తుందిన్నట్లు వెల్లడైంది. సుమారు 49 శాతం మంది భారతీయులు తమ జీవిత భాగస్వామితో కాకుండా ఒక ఏఐ బాట్‌తో లైంగికంగా సన్నిహితంగా ఉండటానికి మొగ్గు చూపుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని తేలింది.
సమాజంపై దుష్ప్రభావం
కారణాలు ఏవైనా ఈ రకమైన సంస్తృతి, యాప్‌ల ప్రభావం భారతీయ సమాజంపై, ముఖ్యంగా వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సామాజిక శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు విశ్లేషణల ప్రకారం.. వివాహ బంధానికి పునాది అయిన ‘నమ్మకం’ భార్యాభర్తల మధ్య సన్నగిల్లడానికి ఈ యాప్‌లు పరోక్షంగా కారణమవుతున్నాయి. ఎవరికీ తెలియకుండా రహస్యంగా మరొకరితో సంబంధం పెట్టుకునే అవకాశం ఉండటాన్ని అవకాశంగా తీసుకుని చిన్న చిన్న స్పర్థలకే జంటలు దారి తప్పడమో.. విడాకుల వరకు వెళ్లడమో చేస్తున్నాయి. వివాహేతర సంబంధాల యాప్‌లలో మహిళా యÖజర్ల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం.. సాధికారత, ఆర్థిక స్వాతంత్య్రం పెరగడం కీలకమని అంటున్నారు. వైవాహిక జీవితంపై అసంతృప్తి, రాజీ లేని ధోరణి, శారీరక అవసరాలు, భావోద్వేగ పరిణామాలు కూడా మహిళలను పక్కదారులు వెతుక్కునేలా చేస్తున్నాయి. శారీరక అవసరం లేదా ఆకర్షణ మాత్రమే కాకుండా భాగస్వామితో ఎమోషనల్ బాండింగ్ లేకపోవడం, ఇద్దరి బిజీ లైఫ్‌స్టైల్ వంటి మానసిక శూన్యతను సృష్టిస్తున్నాయి. వీటిని అధిగమించడానికే చాలామంది ఈ యాప్‌లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.






Comments