పేకాట శిబిరాల దారిలోనే దొంగనోట్ల ముఠాలు
అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్న యువకులు
లాభసాటి వ్యాపారం కావడంతో అటువైపు మళ్లుతున్న వ్యాపారులు
పది రోజుల్లో రూ.68 లక్షలు లాభం గడిరచిన నిర్వాహకులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పేక ఎవరాడరు? దొరికితే దొంగలు.. దొరక్కపోతే దొరలు. అయినా ఎవడి సరదాకు వాడు పేకాడుకుంటే మీకొచ్చిన నష్టమేంటి? పోలీసులే దీన్ని సాధారణంగా చూస్తుంటే ఎందుకంత రచ్చ? అనేవారు ఒక్కసారి ఈ కథనం చదవాలి.
ఆమధ్య పలాస`కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఒక యువకుడు చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. యథావిధిగా మరుసటి రోజు పత్రికల్లో కుటుంబ కలహాల వల్ల కలతచెంది మరణించాడని కథనాలు వచ్చాయి. పోలీసులు కూడా దాన్నే ధృవీకరించారు. పైపైన చూస్తే పోలీసులు ధృవీకరించింది వాస్తవం. ఆత్మహత్య చేసుకున్న యువకుడికి కుటుంబ సమస్యలు ఉన్నాయి. అయితే అవి ఎందుకొచ్చాయి? నిండా ముప్ఫై ఏళ్లు లేని ఒక యువకుడికి అంత కష్టం ఏమొచ్చింది? మూలాల్లోకి వెళితే అనేక విషయాలు బయటపడ్డాయి. తాము భారీ భవంతులు కట్టుకోడానికి, బంగారాన్ని దిగేసుకోడానికి, విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి స్వార్థంతో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలకు వెళ్లి లక్షలాది రూపాయలు పోగొట్టుకోవడం, ఆమేరకు అప్పులైపోవడంతో ఆ యువకుడు నిండుప్రాణాన్ని చెట్టుకు వేలాడదీసుకున్నాడు. ఈ విషయం స్థానికులకు తెలుసు. పేకాడి, అక్కడ మోసానికి బలైపోయి గెలుపే లేకుండా డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైపోవడంతో కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయి. దాని పర్యవసానమే ఆత్మహత్య. ఇప్పుడు దీనికి బాధ్యులెవరు? దీన్ని హత్య అనాలా? ఆత్మహత్య అనాలా? సాధారణంగా పరువు గల కుటుంబం కాబట్టి ఎక్కడా బయటపెట్టకుండా విధిరాతను నిందిస్తూ అంత్యక్రియలు చేసేశారు.
ఆమధ్య నరసన్నపేట నియోజకవర్గంలో ఒక యువకుడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. సహజంగానే ఈ కేసు కూడా అందరిలాగే క్లోజ్ అయిపోయింది. రణస్థలంలో ఒక వ్యక్తి కనిపించకుండాపోయాడు. అక్కడికి కొద్ది రోజుల తర్వాత ఎక్కడో శవమై కనిపించాడు. ఇదీ ఆత్మహత్యే. ఈమధ్య కాలంలో ఆత్మహత్యల మూలాల్లోకి వెళితే.. ప్రతీ ఆత్మకు ఓ కథ ఉంది. ఆ కథలో పేకాటుంది. ఆ పేకాట వెనుక ఒకే ఒక సిండికేటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇవి ఆత్మహత్యలు కావు. కేవలం పేకాట నిర్వాహకులు చేస్తున్న హత్యలు. పేకాడటం క్లబ్‌లలో నాగరికత కావచ్చు. డబ్బున్నవాడికి స్టేటస్ సింబల్ కావచ్చు. కానీ పేకాడటం ద్వారా డబ్బులు సంపాదించడం ఒక వృత్తిగా భావించినవారు శిబిరాలను నిర్వహించడమే ప్రవృత్తిగా మార్చుకున్నవారి చేతిలో ఇలా పరోక్షంగా హత్యకు గురవుతుంటారు. క్రికెట్ బెట్టింగుల్లో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన యువకుల జీవితాల కోసం ‘సత్యం’ అనేక కథనాలు గతంలో ప్రచురించింది. అలాగే నగరంలో మధురానగర్‌లో ఉన్న పేకాట క్లబ్‌ను మూయించేవరకు కథనాల ద్వారా పోరాడిరది. ఆ సందర్భంలో అనేకమంది బాధితులు ‘సత్యం’ వరండాలో కన్నీరు పెట్టుకున్న సందర్భాలూ తెలుసు. అయితే ఇప్పుడు సమస్యను మరొకరితో పంచుకోవడం, బాధ నుంచి బయటపడటం వంటి మౌలిక సూత్రం ఈతరానికి తెలియకపోవడంతో ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్నారు. పేకాట శిబిరాలు నిర్వహించేది ఒడిశాలో కావచ్చు. కానీ సొమ్ములు పోతున్నది, జీవితాలు కోల్పోతున్నది ఇక్కడివారే. మానవీయ కోణాన్ని మరచి సొమ్ములు సంపాదించడమే పరమావధిగా పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిపే ఘటనలే ఇవి.
పేకాట శిబిరాల నిర్వహణ ప్రస్తుతం లాభసాటి వ్యాపారంగా మారడం, పత్రికల్లో కథనాలు వస్తున్నా ఎక్కడా వెనక్కి తగ్గని టెంపరితనం చూపించడంతో ఈ వ్యాపారం వైపు మరికొందరు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగానే పోలాకి మండలం వెదుళ్లవలసకు చెందిన కూర్మారావు గోపి, తేజల సిండికేట్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టినట్టు పేకాట వర్గాల భోగట్టా. పేకాడుతున్నవారిలో ఎక్కువ మంది యువకులు, ప్రభుత్వ ఉద్యోగులు. గడిచిన 10 రోజుల్లో పేకాట నిర్వాహకులకు అన్ని ఖర్చులు పోనూ రూ.68 లక్షలు లాభం సమకూరినట్టు తెలిసింది. రోజుకు సుమారు రూ.కోటి లావాదేవీలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ లెక్కన పేకాటకు వచ్చేవారు ఎంత మొత్తం సమర్పించుకుంటున్నారో అర్ధం చేసుకోవాలి.
పేకాట నిర్వాహకులతో పాటు నగరానికి చెందిన శ్రీను అనే కానిస్టేబుల్ పేకాడడానికి వెలుతున్నట్టు సమాచారం. ఈయన అల్లుడు కూడా పోలీసుశాఖలో అధికారిగా పని చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. పేకాడడంతో పాటు మిగిలిన జూదర్లను పోలీసుశాఖ పేరు చెప్పి బెదిరిస్తున్నట్టు తెలిసింది. వీడియోలు తీసి నిర్వాహకులను, జూదర్లను బెదిరిస్తుంటాడని ఆడడానికి వెళ్లినవారు చెబుతున్నారు. ఈయన అండతోనే బెండి తులసి, తాండ్ర తేజ, గోపి, కూర్మారావు పేకాట ఒడిశాలో పేకాట శిబిరాలను గత ఆరు నెలలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్నారు.
గత నెలలో నకిలీ కరెన్సీని చెలామణి చేస్తున్న రెండు ముఠాలను జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. అందులో ఒకటి ప్రస్తుతం పేకాట శిబిరం నిర్వహిస్తున్న ఒడిశాలోని గారబందకు వెళ్లే మార్గంలోని మెళియాపుట్టిలో కావడం గమనార్హం. ఈ ముఠాకు పేకాట శిబిరం నిర్వహిస్తున్న గోపితో సంబంధాలు ఉన్నట్టు ప్రచారం ఉంది. ఈ ముఠాతో ఉన్న సంబంధాలతో 200 మందికి పైగా వచ్చి ఆడుతున్న పేకాట శిబిరంలో నకిలీ నోట్లు చలామణి చేసినట్టు ప్రచారం ఉంది. వరుసగా నాలుగు రోజుల పాటు పేకాట శిబిరంలో నకిలీ నోట్లతోనే తులసీ, తేజా, గోపీ ఆడిరచినట్టు జూదర్లు చెబుతున్నారు. నకిలీ నోట్ల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వాటి చలామణిని తాత్కాలికంగా నిలిపేసినట్టు తెలిసింది. తులసీ, తేజ, గోపీతో కొత్తగా జతకట్టిన కూర్మారావు డబ్బులు తీసుకొని కాయిన్స్ ఇవ్వడం, శిబిరం మధ్యలో ఉండి పేకలను అందించడం చేస్తున్నాడని చెబుతున్నారు. పలాస`కాశీబుగ్గలో ఆత్మహత్య చేసుకున్న యువకుడు కూడా శిబిరాల వద్దే ఫైనాన్స్ చేసినవారి నుంచి అప్పు తీసుకోవడం, అది వడ్డీతో సహా తడిసి మోపెడవడంతో తీర్చలేక, అక్కడ రౌడీలు ఇచ్చిన వార్నింగ్‌ను భరించలేక ఆత్మహత్యకు పూనుకొన్నాడని పోలీసులు గ్రహిస్తే బాగున్ను.
Comments