సౌతిండియా షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం
కనీస పరికరాలు లేకపోవడంతో మంటలు ఆర్పలేకపోయారు
సర్వర్ రూమ్‌లో షార్ట్‌సర్క్యూట్
లోనికి వెళ్లే దారిలేక నానా అవస్థలు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

అందమైన వస్త్రాలు అమ్మే షోరూమ్‌లు కూడా అందంగా ఉండాలన్నదే కార్పొరేట్ సిద్ధాంతం. అందులో పనిచేసేవారికి సైతం యూనిఫామ్ కోడ్ ఇచ్చి ఆకర్షణీయంగా ఉంచి ఆకట్టుకునే విధంగా వ్యాపారం చేయడంలో ఆరితేరినవారు అనుకోని సంఘటనలు జరిగితే ఎలా బయటపడాలన్నదానిపై దృష్టి సారించకపోవడం శనివారం జీటీ రోడ్డులో సౌతిండియా షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదం రుజువు చేస్తుంది. వెలుగుజిలుగుల కోసం నిబంధనలన్నీ పక్కనపెట్టి అగ్గిపెట్టెలా అన్నివైపులా మూసేసి ఎలివేషన్ కోసం, దాని సొబగుల కోసం తాపత్రయపడితే ప్రమాదం ఎంత స్థాయిలో ఉంటుందో ఈ బట్టలషాపులో జరిగిన అగ్నిప్రమాదం గుర్తుచేస్తుంది. ఏకంగా 12 ఫైరింజన్లు, మున్సిపాలిటీకి నీటిని సప్లై చేసే ట్యాంకర్లు, దగ్గర్లో ఉన్న సీఎంఆర్ షాపింగ్‌మాల్ నుంచి వాటర్‌ఫోర్స్‌తో పాటు పైడిభీమవరం ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఉన్న ప్రతి కంపెనీ నుంచి వచ్చిన ఫైరింజన్లు సైతం ఆపలేని అగ్నిప్రమాదం శనివారం చోటుచేసుకుంది. ఇందుకు పూర్తి కారణం షోరూమ్‌కు కనీసం కిటికీలు, ఫైర్ ఎగ్జిట్ లాంటివి లేకపోవడమే. శ్రీకాకుళం లాంటి నగరాల్లో ఫైర్‌స్టేషన్లకున్న కెపాసిటీ, కొత్తగా నిర్మాణమవుతున్న కమర్షియల్ కాంప్లెక్స్‌ల స్థాయికి ఏమాత్రం పొంతన లేదని సౌతిండియా షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాదం రుజువుచేసింది. శనివారం ఉదయం 6.30 ప్రాంతంలో గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది మేనేజ్‌మెంట్‌ను అలర్ట్ చేశారు. అప్పట్నుంచి సాయంత్రం 4 గంటల వరకు మంటలను అదుపులోకి తేవడానికి ఫైర్ సిబ్బంది ఎడతెగని కృషి చేస్తున్నా అదుపులోకి రావడంలేదు. సుమారు రూ.3కోట్లు విలువైన వస్త్రాలు బూడిదైపోయాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్న ఈ ప్రమాదం శ్రీకాకుళం కమర్షియల్ కాంప్లెక్స్‌లకు కనువిప్పు కావాలన్నదే ఈ కథనం సారాంశం. వస్త్రదుకాణాల్లో అగ్నిప్రమాదాలు జరగడం సాధారణం. అందులో భాగంగానే సౌతిండియా షాపింగ్‌మాల్‌లో సర్వర్ రూమ్‌లో షార్ట్‌సర్క్యూట్ కావడం వల్ల పక్కనే ఉన్న పట్టుచీరల సెక్షన్‌కు ముందుగా నిప్పు తగులుకున్నట్టు భావిస్తున్నారు. పట్టుబట్టలు కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న దగ్గర్నుంచి శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫైర్ సిబ్బంది ఎంత ఆర్పుతున్నా మంటలు అదుపులోకి రాలేదు. కారణం.. షాపింగ్‌మాల్ లోపలికి ప్రవేశించడానికి మరో మార్గం లేకపోవడమే. దీంతో ఎమ్మెల్యే గొండు శంకర్ నాలుగు జేసీబీలను పంపడంతో ముందుభాగంలో ఎలివేషన్ కోసం ముస్తాబుచేసినవాటిని తొలగించారు. నాలుగంతస్తుల ఈ భవనంలో మంటలు ఆర్పే యంత్రం మన జిల్లాలో లేదు. అలా అని విశాఖపట్నం నుంచి బాహుబలి (బ్రాంటో స్కై లిఫ్ట్) ఇంజిన్‌ను తెప్పించారు. ఇది ఐదో అంతస్తులో ఫైర్ జరిగినా ఇట్టే ఆర్పేయగల సమర్ధత కలిగినది. అందుకనే మూడు జిల్లాలకు ఒకటే ఉండే దీన్ని తెప్పించినా షాపింగ్‌మాల్‌లోకి ఫైర్ సిబ్బంది అడుగు పెట్టలేకపోయారు. నాలుగో అంతస్తు పైకి ఫైర్ ఫైటర్లు వెళ్లిన తర్వాత లోపలికి దిగడానికి మార్గం లేకపోవడాన్ని గమనించారు. పోనీ ప్రాణాలకు తెగించి కిందినుంచే మెట్ల మార్గంలో రెండు, మూడు అంతస్తులకు వెళ్లాలంటే ఆ మెట్లకు బలమైన గ్రిల్స్‌ను వేసేయడంతో పాటు మెట్ల మీద వస్త్రాల బండిల్‌లు పేర్చేసినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. గ్రిల్స్‌ను బద్దలుకొట్టడం, లోపలికి వెళ్లడం ఫైర్ సిబ్బందికి పెద్ద పని కాదు. కానీ ఒక్కరి దగ్గర కూడా ఆక్సిజన్ మాస్క్ లేదు. లోపలికి వెళ్తే వెలువడుతున్న పొగకు ప్రాణాలు పోవడం తప్ప మరోటి జరగదు. దీనితో నాలుగో అంతస్తు నుంచి కిందికి దిగలేక, కింది అంతస్తు నుంచి పైకి వెళ్లలేక కింది ఎంట్రన్స్ నుంచే నీటిని పంపడం వల్ల మంటలు అదుపులోకి రాలేదు. దీనివల్ల పెద్ద నష్టం జరిగింది. శ్రీకాకుళం మున్సిపాలిటీలో నాలుగు అంతస్తులకు పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఆమేరకు ఫైర్ ప్రొటక్షన్‌ను చూసుకుంటారు. చుట్టూ 20 అడుగుల సెట్‌బ్యాక్స్ లేనప్పుడు షాపు యాజమాన్యమే లోపల ఫైర్ సేఫ్టీని రూ.70 లక్షల వరకు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సౌతిండియా షాపింగ్‌మాల్ కూడా ఇటువంటి ఏర్పాట్లు చేయడం, మంటలు చెలరేగగానే అలారం మోగిందని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. కానీ ఈ భవనానికి వెళ్లడానికి, రావడానికి ఒక్క మార్గమే తప్ప కనీసం కిటికీలు లాంటివి కూడా లేకపోవడం వల్ల మరో మార్గంలో మంటలను ఆర్పలేకపోయారు. చివరకు భారత్ గ్యాస్ ఏజెన్సీ వైపు ఉన్న గోడను కొంతమేరకు తొలగించి మంటలను ఆర్పుతున్నారు. మధ్యాహ్నం 3.30 సమయానికి గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు అదుపులోకి వచ్చిన రెండు మూడు అంతస్తుల్లోకి ఫైర్ ఫైటర్లు అడుగు పెట్టలేకపోయారు. 250 మంది వరకు పని చేస్తున్న ఈ షాపింగ్‌మాల్‌లో పనివేళల్లో కాకుండా ప్రమాదం జరగడం ఒక్కటే ఊరట. ఉదయం నుంచి బట్టలు తగలబడుతుండటం వల్ల సింథటిక్ చీరలు రసాయనాల్లో ముంచడం వల్ల నగరమంతా వాసనతో ఉక్కిరిబిక్కిరి అయింది.




Comments