`గతంలో విజయావకాశాలను తారుమారు చేసిన శక్తి దానిది
`శ్రీకాకుళం నియోజకవర్గంలో ఇప్పుడు అదే పరిస్థితి
`వరం కుటుంబం వైకాపాను వీడటం ఆ కోవలోనిదే
`శంకర్ గట్టి నేత అని శ్రీకాకుళానికి పరిచయం చేసిన ఒకే ఒక్క ర్యాలీ

రాజకీయాల్లో ప్రతీదీ మాటలతో చెప్పాల్సిన పనిలేదు. సంకేతాలు, ఫీలర్లతోనూ చాలామార్పులు జరిగిపోతుంటాయి. మరీ ముఖ్యంగా నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉన్నచోట ఇటువంటి సంకేతాలు పెనుమార్పులకు దారితీసి విజయావకాశాలనే తారుమారు చేసేస్తుంటాయి. ఈ ఎన్నికల్లో వరం వారసులు వైకాపాను వీడి టీడీపీలో చేరడం కూడా బలమైన సంకేతం లాంటిదే. వరం ఉన్నప్పుడు నగర స్థాయిలోనే రాజకీయాలు చేసినా రాష్ట్రంలోని ప్రముఖ నాయకులతో ఉన్న సాన్నిహిత్యం రీత్యా జిల్లాలో ఆ సామాజికవర్గంతో పాటు వ్యాపారవర్గాల్లో ఆయన ప్రభావం బాగా కనిపించేది. అటువంటి నాయకుడి వారసులు పార్టీని వీడటం వైకాపాకు పెద్ద నష్టమే. వరం వారసులు ఏ మేరకు ఓట్లను టీడీపీ వైపు మళ్లించగలరనే విషయాన్ని పక్కన పెడితే, వారు తెలుగుదేశం లోకి వెళ్లిపోయారన్న సంకేతం మాత్రం కచ్చితంగా అధికార పార్టీకి నష్టం చేకూరుస్తుంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జగన్మోహన్‌రెడ్డి రంగప్రవేశంతో నేరుగా చంద్రబాబుతోనే యుద్ధమన్న రీతిలో రాజకీయాలు మారిపోయిన ఈ సమయంలో కూడా వరం సంతానం పార్టీ మారిన విషయం రెండు రోజులైనా జిల్లాలో తీవ్ర చర్చకు కారణమవుతోంది. ముగ్గురు వరం వారసులు పార్టీ మారుతారన్న సమాచారం బయటకు రాగానే ఆ ప్రభావం శ్రీకాకుళం నియోజకవర్గంలోని కళింగవైశ్యులపైనే ఉంటుందని అంతా భావించారు. కానీ వారు పార్టీ కండువా మార్చిన తర్వాత జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దీనిపై చర్చ నడుస్తోంది. అంటే.. ఓ బలమైన సంకేతం వెళ్లినట్లే. వరం కుటుంబం పార్టీని వీడుతున్న విషయం ముందుగా బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. పార్టీ మారుతున్న విషయాన్ని వారు మొదట ధర్మాన ప్రసాదరావుకే చెప్పడం విశేషం. అయితే టీడీపీలో మేయర్ పదవి ఆఫర్ ఉండటం వల్లే వారు ఆ పార్టీలో చేరారన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పడం సరికాదు గానీ, అటువంటి ఆఫర్ లేకపోయినా పార్టీ మారేవారనే అర్థమవుతోంది. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన వారసులు అంధవరపు ప్రసాద్, సంతోష్, జయంతిలు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ధర్మాన ప్రసాదరావును మాత్రం దగ్గర నుంచి గమనిస్తున్నారు. తాము ఇదే పార్టీలో కొనసాగితే రాజకీయంగా ఘనమైన వరం వారసత్వాన్ని చంపేసినవారమవుతామనే భావన వీరిలో చాలా రోజుల నుంచి ఉంది. ఎందుకంటే.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో గతంలో మాదిరిగా ధర్మాన మాటకు పెద్దగా విలువ లేకుండాపోయింది. అనేక సందర్భాల్లో రాష్ట్రస్థాయిలో జరగాల్సిన పనుల కోసం పలువురు ధర్మాన వద్దకు రావడం, తన వల్ల కాదని నిర్మొహమాటంగా ధర్మాన ప్రసాదరావు ముఖం మీదే చెప్పేయడాన్ని చూసిన వరం వారసులకు వైకాపాలో తమకు ఆశించిన అవకాశాలు దక్కవని అర్థమైంది.
నగరంపై పట్టు సాధించేందుకే
డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆ సానుభూతి పవనాలను జగన్ ఎలా వాడుకున్నారో, వరం మరణాన్ని ఆ రీతిలో ఆయన వారసులు వాడుకోలేకపోయారు. ఒకప్పుడు వరం నగరాన్ని శాసించారు. మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నా లేకపోయినా ఆయన మాట చెల్లుబాటైంది. నగరంలో ఏ మూలకు వెళ్లినా ఆయన కోసం పని చేసే నాయకులుండేవారు. ఆయన ఏ ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలిపినా దానికి అనుగుణంగా ఓటు పోలరైజ్ అయ్యేది. కానీ వరం చనిపోయిన తర్వాత ఆ కుటుంబం వైకాపాలో నాలుగో శ్రేణికి పరిమితమైపోయింది. వరం లేని లోటును ధర్మాన ప్రసాదరావు అనేకమంది నాయకులతో భర్తీ చేసుకున్నారు. అందులో భాగంగానే కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి వరం సోదరుడు సూరిబాబుకు వచ్చింది. వరం బతికినన్నాళ్లూ రాష్ట్ర కళింగకోమటి సంఘం అధ్యక్షుడిగా ఉంటే.. ఆయన తర్వాత ఆ స్థానంలో కోణార్క్ శ్రీనును కూర్చోబెట్టారు. నగర కళింగవైశ్య అధ్యక్షుడిగా ఊణ్ణ నాగరాజును తెచ్చారు. దీంతో వరం వారసులు వెనకనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనికి తోడు ఎంవీ పద్మావతి కుటుంబానికి ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో డైరెక్ట్ యాక్సెస్ ఏర్పడిరది. అందువల్ల జగన్మోహన్‌రెడ్డి మేయర్ పదవికి బీ ఫారం పద్మావతికే ఇస్తారన్నది నగరంలో చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోయింది. పోనీ ధర్మాన ప్రసాదరావు కళింగవైశ్యుల కోటాలో దాన్ని సాధించి ఇవ్వగలరా? అంటే.. ఆ సన్నివేశం ఊహకు కూడా రావడంలేదు. అదే సమయంలో టీడీపీలో వైశ్య సామాజికవర్గంలో చరిష్మా ఉన్న కుటుంబం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దానికి తోడు టీడీపీ హయాంలోనే పైడిశెట్టి జయంతి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పని చేశారు. ఆ తర్వాత నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగుతాయని, వైకాపా అవకాశం ఇస్తుందన్న ఆశతో ఆమె 2014, 2019 ఎన్నికల్లో ధర్మానతో ఉన్నారు. కానీ ఎన్నికలు వాయిదా పడుతున్నకొద్దీ వైకాపాలో మేయర్ ఆశావహుల జాబితా పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశంలోకి వెళ్లి తమ ఉనికిని కాపాడుకోవడం తప్ప మరో మార్గం వారికి లేకుండా పోయింది. టీడీపీ కళింగ వైశ్యులకే మేయర్ టికెట్ ఇవ్వాలని భావిస్తే వరం కుటుంబం తప్ప ఆ స్థాయిలో నగరాన్ని ప్రభావితం చేసే నాయకులు ఆ పార్టీలో లేరు. దీనికి తోడు టీడీపీలో ఆజన్మశత్రుత్వం ఉన్న గుండ కుటుంబం కూడా లేకపోవడం వరం వారసులకు టీడీపీ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. వీరు తెలుగుదేశంలో చేరిన రోజు స్థానికంగా వచ్చిన స్పందనపై వైకాపా ఓ కన్నేసి ఉంచింది. కానీ వైకాపా ఊహించిన దాని కంటే పెద్ద స్థాయిలోనే ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇప్పుడు వరం వారసులు వెళ్లిపోయారన్న ఇండికేషన్ శ్రీకాకుళం నియోజకవర్గంలో బలంగా పని చేయడం ప్రారంభిస్తుంది.
శంకర్ స్థాయిని చెప్పిన నామినేషన్ ర్యాలీ
అర్బన్ ఓటరులో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా ధర్మాన ప్రసాదరావుతో ఉన్న వ్యక్తిగత పరిచయాల రీత్యా నగరంలో పెద్ద ఎత్తున ఆయనకు ఓటింగ్ వస్తుందని, గొండు శంకరంటే ఎవరో నగరంలో చాలామందికి తెలియదన్న ఒక వాదనను నామినేషన్ రోజున శంకర్ చేసిన బలప్రదర్శన ఒక ఇండికేషన్‌గా మారి పటాపంచలు చేసింది. దానికి రెండో రోజుల ముందు ధర్మాన నామినేషన్‌కు పెద్ద ఎత్తున శ్రేణులు తరలివచ్చాయి. అయితే గొండు శంకర్ నామినేషన్ ఘట్టాన్ని చూసిన వైకాపా నాయకులే నోరెళ్లబెట్టారు. నగరంలో శంకర్ వెనుక ఎవరుంటారులే అని తేలిగ్గా కొట్టిపారేసిన వర్గాలే ఆయన నామినేషన్‌కు వచ్చిన జనాన్ని చూసి చెమటలు కక్కారు. రామలక్ష్మణ జంక్షన్ నుంచి జీటీ రోడ్డు మీదుగా వెళ్లి ఏడురోడ్ల కూడలిలో సమావేశం పెట్టి కళింగరోడ్డు మీద నుంచి కలెక్టర్ బంగ్లా రోడ్డు మీదుగా నామినేషన్‌కు పిలుపునిస్తే, ఈ రోడ్లతో పాటు 80 అడుగుల రోడ్డుకు రెండు వైపులా జనం కిక్కిరిసిపోయారు. ఈ ఒక్క నామినేషన్ ఘట్టం గొండు శంకర్‌ను శ్రీకాకుళం నగర ఓటరుకు దగ్గర చేసింది. నగరంలో ఒక్క పాలకొండ రోడ్డు మినహా అన్ని రోడ్లను శంకర్ నామినేషన్‌కు వచ్చిన జనాలు కవర్ చేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన కొందరు, మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలుసుకున్న మరికొందరు శంకర్ నామినేషన్ ఘట్టాన్ని ఇప్పటికీ చెప్పుకొంటున్నారు. ఒక్కసారిగా శంకర్ స్థాయిని పెంచిన ర్యాలీ అది. రాజకీయాల్లో ప్రతీది అవకాశమే. దేన్నీ తేలిగ్గా తీసిపారేయలేం.
Comments