top of page

ఒక తల్లి.. నలుగురు బిడ్డల కథ

Writer: ADMINADMIN
  • హైదరాబాద్‌లోనే అభివృద్ధి కేంద్రీకృతం వల్ల నష్టపోయాం

  • గత ప్రభుత్వానికి వైజాగ్‌, ఇప్పటి ప్రభుత్వానికి అమరావతి

  • వికేంద్రీకరణ లేకపోవడంతో నష్టపోతున్న రాష్ట్రం

ఒక తల్లికి నలుగురు బిడ్డలు. నలుగురిదీ ఒకటే లక్ష్యం ఇప్పుడున్న స్థితి నుంచి బయటపడాలని, అది చదువు వల్ల మాత్రమే సాధ్యం అని, అందరూ బడికి పోయి కష్టపడి చదువుదాం అని. అయితే ఆ తల్లి ఆలోచన వేరు. ‘నేను కూలి పని చేస్తే వచ్చే డబ్బుతో నలుగురినీ ప్రభుత్వ బడులకు మాత్రమే పంపగలననీ, అక్కడ చదువు అంతంత మాత్రమే కాబట్టి మీరు నలుగురూ ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే ఉండిపోతారు. అలా కాకుండా మీలో ముగ్గురు నాతో పాటు కూలి పనికి రాండి, ఒకడు బాగా చదువుతాడు కదా, వాన్ని కాన్వెంట్‌ స్కూల్‌కు పంపిద్దాం. వాడు బాగా చదివి, మంచి ఉద్యోగం తెచ్చుకోగానే ఆ సంపాదనతో మీ ముగ్గుర్ని ఇంకా మంచి స్కూల్‌ పంపిస్తాడు’ అని చెప్పింది. అదెలా సాధ్యం..! అయినా ‘పరిగెడుతూ పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు’ అని మిగతా ముగ్గురి మదిలో ఆలోచన మెదిలిన ప్రతిసారీ ‘నిలబడి నీళ్లు తాగాలని అనుకునేవాడిది అమాయకత్వం, చేతగానితనం. పరిగెడుతూ పాలుతాగే వాడే ధీరుడు’ అని ఉత్తేజిత ప్రసంగాలు ఇచ్చి మరీ కూలి పనులకు తీసుకెళ్లింది.

తల్లి ప్రేమ, ముగ్గురు అన్నదమ్ముల శ్రమను మనసులో పెట్టుకుని ఆ నాలుగో వాడు కష్టపడి చదివాడు. కాలం కలిసొచ్చి మంచి ఉద్యోగం, సంపాదన అన్నీ కుదిరాయి. కొద్దిరోజులు కుటుంబమే లోకంగా బతికాడు. పెళ్లి, పెండ్లాం, పిల్లలు రాగానే తల్లి, ముగ్గురు అన్నదమ్ములు భారంగా అనిపించి వేరు కుంపటి పెడదామన్నాడు. వీళ్లు ఒప్పుకోలేదు. ‘విడిపోవాలనుకున్న వాన్ని ఎన్నాళ్లని ఆపి ఉంచుతాము? వాడి ఎదుగుదలలో మీ శ్రమ ఎంతుందో, వాడి పట్టుదలా అంతే ఉందని విడిపోవడమే మేలు’ అని పెద్దలు పంచాయితీ చేశారు. అసలే ఆత్మాభిమానం మెండుగా కల తల్లీ, ముగ్గురు బిడ్డలు ఆ ఇళ్లు వదిలి బయటికొచ్చారు.

గతంలో ఎక్కడైతే కూలి బతుకు మొదలైందో మళ్లీ అక్కడే నిలబడ్డారు. ముగ్గురు బిడ్డలు మాట్లాడుకుని ‘ఈ కూలి బతుకులతో ఎన్నాళ్లని ఇగ్గులాడతాం? బడికిపోయి చదువుకునే వయసు ఎప్పుడో దాటిపొయింది కాబట్టి మన దేశంలో బాక్సింగ్‌కు ఇప్పుడిప్పుడే మంచి అవకాశం కనిపిస్తోంది.. అందరం అది నేర్చుకుందాం. దాని ద్వారా బాక్సింగ్‌ ఆడకపోయినా కోచింగ్‌ క్లాసులు చెప్పుకుని అయినా సక్సెస్‌ కొట్టొచ్చు’ అని తీర్మాణించుకున్నారు. దయ గల తల్లి మళ్లీ దూరింది. ‘నేను కూలి పనులకు వచ్చిన డబ్బుతో అందరికీ పచ్చడి, మజ్జిగన్నం మాత్రమే పెట్టగలను. ఆ చాలీచాలని పోషకాహారంతో మీరు బాక్సింగ్‌ రింగులో కనీసం నిలబడలేరు. కాబట్టి మీ ముగ్గురిలో ఇద్దరు నాతో కూలి పనికి రండి. ఆ వచ్చిన డబ్బుతో ఒకడికి రోజూ వేట కూర, నాటు కోళ్లు తెచ్చి మేపుదాం. ఆ శక్తితో వాడు బాక్సింగ్‌ రింగ్‌లో చెలరేగిపోతాడు. ఆ తర్వాత మీ భవిష్యత్‌ అంతా వాడే చూసుకుంటాడు’ అని చెప్పింది.

‘గతంలో కూడా నువ్విలాగే చెప్పావు. ఏం జరిగింది చూశావు కదా. వస్తుందో రాదో తెలియని భవిష్యత్‌ కోసం, చేతిలో ఉన్న వర్థమానాన్ని వదిలెయ్యమంటావా?’ అని గెట్టిగా నిలదీశారు. ‘రేపటి గురించి ఆలోచించలేకపోవడం ఒక జఢత్వం. అది వీడలేనన్నాళ్లూ మీ బతుకింతే’ అని మూతి ముడుచుకుంది. రాత్రంతా ఆలోచించారు. తల్లి మాటల్లో ఎక్కడో చిన్న ఆశావాదం కనిపించింది. పొద్దున్నే లేచి ‘సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేద్దాం. నువ్వు కాక మాకెవరున్నారు చెప్పు’ అంటూ ఇద్దరు పిల్లలు తల్లితో పాటు కూలికి నడిచి, వస్తూ వస్తూ ఒక బిర్యాణీ పొట్లం తెచ్చి మరొకడికి పెట్టారు. వాడు అది తిని బ్రేవ్‌మని తేన్చుతూ, బాక్సింగ్‌ ప్రాక్టీస్‌కు బయల్దేరాడు.

ముగ్గురి శ్రమతో పేర్చుకున్న పునాదుల మీద పట్టుదలతో అదే పనిగా కష్టపడితే ఎవరికైనా సక్సెస్‌ రాకపోదు. అయితే ఆ సక్సెస్‌ వచ్చిన తర్వాత అతనికి పెళ్లి కాదా, కుటుంబం రాదా అప్పుడు తల్లి, ఇద్దరు సోదరులు భారం కారా? తన సోదరుడు అడిగినట్టు వేరు కుంపటి పెడదాం అని అడగడా? పెట్టకపోతే మంచివాడే. ఒకవేళ మారిన కాలం కొద్దీ వేరు కుంపటి పెడితే ఆ మిగిలిన ఇద్దరు సోదరుల పరిస్థితేంటి? తొలిగా ఎక్కడైతే మెదలుపెట్టారో అక్కడే ఆగినట్టే కదా?

మన రాష్ట్రంలో జరిగింది, జరుగుతోంది, జరగబోయేది ఇదే. స్థూలంగా చెప్పాలంటే ఆ తల్లి ఆంధ్రప్రదేశ్‌. తొలి కొడుకు హైదరాబాద్‌. రెండవ కొడుకు అమరావతి. మూడు నాలుగవ కొడుకులు రాయలసీమ, ఉత్తరాంధ్ర. కేంద్రీకృత అభివృద్ధి కేంద్రీకృత అభివృద్ధి అంటూ ఆంధ్రప్రదేశ్‌ అరవయ్యేళ్ల శ్రమను, ఆశలను హైదరాబాద్‌ మీద ధారపోస్తే ప్రత్యేక తెలంగాణ రూపంలో అది దూరమైంది. తెలంగాణ విడిపోయే నాటికి హైదరాబాద్‌ అంత కాకపోయినా మోస్తరు సిటీలైన వైజాగ్‌ గానీ, విజయవాడ గానీ, హైదరాబాద్‌ లేని లోటును పూడ్చలేకపోయాయనేది వాస్తవం. గతాన్ని విస్మరించకుండా వర్ధమాన్ని బేరీజు వేసుకుంటూ భవిష్యత్‌ నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థితిలో కేంద్రీకృత అభివృద్ధి వల్ల జరిగిన నష్టం హైదరాబాద్‌ రూపంలో కళ్లముందరే ఉన్నా కూడా మళ్లీ అదే కేంద్రీకృత అమరావతిని భుజాన వేసుకున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, మీడియా సంస్థలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే కొంత అటు ఇటు అయినా కోరుకున్న అభివృద్ధి జరక్కపోదు. ఆలస్యంగా అయినా జరుగుతుంది కూడా. అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభా, గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత మళ్లీ రాష్ట్ర విభజన జరగాల్సి వస్తే రాయలసీమ పరిస్థితేంటి? ఈ మాట మన ఆలోచనల్లో మెదలగానే రాయలసీమ తెలుగు ప్రేమికులు, కడప న్యూట్రల్‌ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ అన్నీ ఒక్కటై ‘ఆఠ్‌..! మాదంతా అభివృద్ధి ఆలోచనలు. రాయలసీమకు మేం కియా ఇవ్వలేదా’ అంటూ కత్తులు, గొడ్డల్లు చేతబట్టుకుని యుద్ధానికి వస్తారు. కియా సరే కడప కొప్పర్తి ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఏర్పాటుకు సిద్ధమైన ఎంఎస్‌ఎంఈ (మైక్రో స్మాల్‌ మీడియం ఎంటర్ప్రైజెస్‌) ట్రైనింగ్‌ సెంటర్‌ను బతిమాలో, భయపెట్టో, ఒప్పించో అమరావతి మార్చడంలోని అంతర్యమేమిటో మరి. గత పాలకులకు వైజాగ్‌ ప్రాధాన్యం మీకు అమరావతి అంటే ప్రీతిపాత్రం. కాదనలేదు. ఎవరి ఆలోచనా, ఆచరణా విధానాలు వాళ్లవి. కానీ మీ మీ వ్యక్తిగత దుగ్ధల కోసం రాయలసీమను గొంతు ఎందుకు నొక్కాలి? ఈ లెక్కన సెంచురీ ప్లైవుడ్‌ గత ప్రభుత్వ హయాంలో పూనుకోబట్టి దారి తప్పి బద్వేల్‌కు వచ్చిందేమో కానీ ఇప్పట్లో అయ్యుంటే అది కూడా సర్వం అమరావతి సమర్పయామీ లాగా అయ్యుండేదేమో..!

- వివేక్‌ లంకమల

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page