top of page

ఒక పాలసీ లేకుండా పండగేంటి సామీ!

Writer: NVS PRASADNVS PRASAD
  • ఉద్దేశం మంచిదే అయినా.. ఆచరణకు అడ్డుపడుతున్న నిబంధనలు

  • ఇంకా ఖరారు కాని ఇసుక, కంకర ధరలు

  • జిల్లాలో అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్లు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఈ నెల 14 నుంచి రోడ్ల పండుగ నిర్వహిస్తామని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రకటించడం ముదావహం. కాకపోతే ఇది ఇంత వేగం రాష్ట్రంలో ఆచరణకు నోచుకోదని మాత్రం చెప్పక తప్పదు. పల్లెసీమల్లో వచ్చే సోమవారం నుంచి పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణ పనులు మొదలుపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. రూ.4,500 కోట్లతో 3వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్డు నిర్మాణాలకు అదే రోజున శ్రీకారం చుట్టనున్నారు. డిసెంబరు నెలాఖరు లోగా ఈ పనులను పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంక్రాంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నారు. గత ఐదేళ్లలో గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేదు. అప్పుడు విడుదలైన 15వ ఆర్ధిక సంఘం నిధులను కూడా జగన్‌ సర్కార్‌ రోడ్లకు ఉపయోగించకపోవడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రోడ్లన్నింటినీ వేస్తామని పవన్‌కల్యాణ్‌ చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ రోడ్డు నిర్మాణాలకు అవసరమైన ఇసుక, 20 ఎంఎం మెటల్‌పైన ప్రభుత్వం నిర్ధిష్టమైన విధానాన్ని ఇంతవరకు తీసుకోలేదు. ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చామని చెబుతున్నా గత ప్రభుత్వంలో కంటే ఇసుకకు ఎక్కువ ధర పలుకుతున్న విషయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకూ తెలుసు. జిల్లాలో అయితే కేవలం వంశధార కాలువల పూడికలో ఉన్న ఇసుకను తవ్వుకునే వెసులుబాటు మాత్రమే ఉంది. ఇక మిగిలిన ర్యాంపుల నుంచి అనధికారికంగా ఇసుకను విశాఖ జిల్లాలో విక్రయిస్తున్నారు. అదే జిల్లాలో రోడ్డు పనులకు సరఫరా చేయాలంటే ప్రభుత్వం నిర్దేశించిన రేటుకే ఇవ్వాలి. ఆ మేరకు ఇంకా ఇక్కడ ర్యాంపులు ప్రారంభం కాలేదు. కాబట్టి సిమెంట్‌ రోడ్డుకు అవసరమైన ఇసుకను 14వ తేదీ నుంచి ఎక్కడి నుంచి తెస్తారో, లేదా తెచ్చుకోవాలో ప్రభుత్వం ఎటువంటి గైడ్‌లైన్స్‌ ఇవ్వలేదు. ఇక అతి పెద్ద సమస్య సిమెంట్‌ రోడ్డుకు అవసరమైన 20 ఎంఎం రాయితోనే వచ్చింది. తోటకూర దొంగిలించినప్పుడే తల్లి మందలించకపోతే పెద్దయ్యాక చార్లెస్‌ శోభరాజ్‌ అయ్యాడని ఓ సామెత ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇన్నాళ్లూ అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వాలు కూడా క్రషర్ల కోసం లీజుకు తీసుకున్న కొండల్లో ఏ మేరకు రాయిని తీశారు, ఎంతకు అనుమతులు ఉన్నాయి, ఎంత క్రషింగ్‌ చేశారు అన్న లెక్కలు ఎప్పుడూ చూడలేదు. ఒక రాయి క్రషర్‌ పిక్కను ఆడటానికి మైన్స్‌తో పాటు మరి రెండు సంస్థల అనుమతి తీసుకొని ఒక కొండను లీజుకు తీసుకుంటుంది. అందులో ప్రతీ ఏడాది ఇన్ని హెక్టార్ల మేరకు రాయిని తరలిస్తామని, దానిని పిక్కగా మారుస్తామని సొమ్ములు చెల్లిస్తుంది. ఇంతవరకు ఏమేరకు అనుమతులు తీసుకున్నారు, ఎంత రాయిని కొండ నుంచి విత్‌డ్రా చేశారు అన్న లెక్కలు ఎప్పుడూ ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. దీంతో తక్కువ ట్యాక్స్‌ చెల్లించడం కోసం తమకున్న అనుమతుల కంటే తక్కువ రాయినే కొండ నుంచి విత్‌డ్రా చేశామని ప్రతీ క్రషరూ రికార్డుల్లో చూపించింది. గత ప్రభుత్వ హయాంలో సీనరేజ్‌ వసూలు చేయడానికి ఆశీలు వసూలుచేసేవారి మాదిరిగా వచ్చిన విశ్వసముద్ర కూడా ఇన్ని క్యూబిక్‌ మీటర్లకు ఇంత మొత్తం మాకు చెల్లించేయండంటూ మట్టి, రాయి లోడ్ల నుంచి సొమ్ములు వసూలు చేసిందే తప్ప అసలు ఎన్ని క్రషర్లు ఉన్నాయి, ఎన్నింటికి పర్యావరణ అనుమతులతో కొండలు ఉన్నాయి, ఎంతమంది అనధికారికంగా తవ్వుకుపోతున్నారు అన్న లెక్కలు ఎక్కడా చూడలేదు. ఇలా ఆశీల పాటకు ఇచ్చేయడం వల్ల ప్రభుత్వానికి ఎక్కువ సొమ్ములు వస్తాయని మొదటిసారిగా వైకాపా ప్రభుత్వం చేసిచూపించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది. కాకపోతే విశ్వసముద్ర సంస్థను తప్పించి వారి లాంటిదే ఏఎంఆర్‌ అనే మరో సంస్థకు సీనరేజ్‌ వసూలు చేసే బాధ్యతను అప్పగించింది. అయితే అదే రూల్స్‌ కొనసాగిస్తే పాత ప్రభుత్వానికి, తమకు తేడా ఏముంటుందనుకున్నారో ఏమో ఇప్పుడు అదనంగా మరో నిబంధనను జోడిరచారు. ప్రభుత్వ పనులకు మెటల్‌ను సరఫరా చేసే సంస్థలు తమ క్రషర్ల వద్ద ఉన్న స్టాకును ఇస్తే సరిపోదని, వారికి అనుమతి ఉన్న కొండలో కూడా ఆమేరకు విత్‌డ్రా చేయని రాయి ఉండాలని ఒక నిబంధన పెట్టింది. ఇన్ని దశాబ్దాల తర్వాత కొండను కొలిచేదెవరు, లెక్కలు తేల్చేదెవరో ఇంతవరకు తేలలేదు. దీంతో జిల్లాలో అణుమతులు ఉన్న క్వారీలన్నీ వ్యాపారాలు లేక మూసుకుపోతున్నాయి. ఇప్పుడు 14 నుంచి జరిగే రోడ్ల పండగకు ముఖ్యంగా కావాల్సింది 20 ఎంఎం మెటల్‌. ఇది సరఫరా చేయాలంటే జిల్లాలో 12కు మించిన క్రషర్లు లేవు. అనధికారికంగా 100 ఉండొచ్చు. కానీ పర్మిషన్లు తీసుకొని కొండను లీజుకు తీసుకొని రాయిని పిక్కగా మార్చే యూనిట్లు తక్కువే. అయితే ఇప్పుడు వీరి వద్ద ఉన్న కొండల్లో కూడా ఎప్పుడో అనుమతులకు తగ్గ రాయిని విత్‌డ్రా చేసేశారు. కాబట్టి 20 ఎంఎం మెటల్‌ సరఫరా చేయడానికి మైనింగ్‌ క్వాంటిటీ వీరికి ఉండదు. ఇసుక, పిక్క అందుబాటులో లేకపోవడం వల్ల అనధికారికంగా ఇవి తరలిపోతాయి. అంటే పన్నులు కట్టి వ్యాపారం చేసేవారి కంటే అనధికారికంగా ప్రకృతి సంపదను తరలించుకుపోయినవారికే ఇప్పుడు అవకాశం ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బ్యాంకు నుంచి మంజూరైన రుణంతో 2019లో ప్రారంభమైన పనులు పూర్తికాలేదు. కారణం.. గత ప్రభుత్వంలోనూ దాదాపు ఇటువంటి పరిస్థితే ఉండటం. రూ.125 కోట్లు విలువైన పనులు 2019 నుంచి ముక్కీ మూలుగుతున్నాయి. జగన్మోహన్‌రెడ్డి ఓటమికి ఇదొక కారణం. ఇక సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన నిధులతో మూడు పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. ఇందులో దంతలో 2, పూండీ`పర్లాకిమిడి ఒక రోడ్డు అలాగే ఉన్నాయి. ముందుగా ఇసుక ఏ ధరకు ఇస్తారు, 20 ఎంఎం మెటల్‌ ఎక్కడి నుంచి కొనాలి అనే దాని మీద జిల్లా స్థాయిలో కలెక్టర్‌, మైన్స్‌ అధికారుల నేతృత్వంలో ఓ కమిటీ వేసి, అక్కడి నుంచి సరఫరా చేస్తేగాని పవన్‌కల్యాణ్‌ అనుకున్నట్టు రోడ్ల పండగ ప్రారంభం కాదు. ఇక రోడ్లు కాకుండా గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల్లో బ్లీచింగ్‌కు కూడా సొమ్ములివ్వలేదని, ఇప్పుడు మేం బ్లీచింగ్‌ చల్లుతాం, అదే పండుగనుకుంటే ఇక వారిష్టం. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2వేల కోట్ల మేరకు ఇప్పటికే గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేశారు. వాటితో సిమెంట్‌ రోడ్లు వేయాలి. ఉపాధిహామీ నిధుల ద్వారా కూడా రోడ్లు మంజూరయ్యాయి. దీనికైనా 20 ఎంఎం మెటల్‌, ఇసుకకు ఇదే సమస్య ఉంది. ఇక రోడ్లు, భవనాల శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన 1393 రోడ్లకు సంబంధించి 7071 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయడానికి రూ.290 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్థనరెడ్డి రెండు రోజుల క్రితం తెలిపారు. దీనికి అవసరమైన క్రషర్‌ డస్ట్‌, కంకర చిప్స్‌ కావాలంటే ప్రభుత్వం నిబంధనలు సడలించాల్సి ఉంది. కాదూ కూడదూ అంటే ఆర్‌ అండ్‌ బీకి మరమ్మతులు చేయకుండానే సొమ్ములు తినేయడమెలాగో తెలుసు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page