top of page

ఒక రాధ.. ఇద్దరు కృష్ణులుకాదంబరి క్రైమ్‌ కదంబం!

Writer: DV RAMANADV RAMANA
  • ఛోటా నటితో బడా పారిశ్రామికవేత్తల దోస్తీ

  • ముంబైలో ఇద్దరిపై ఆమె కేసులు

  • ఏపీలో ఆమెపై కేసు.. చిత్రహింసలు

  • ఇప్పటివరకు ఒకవైపు కోణంలోనే వార్తాకథనాలు

  • ఇందులో జెత్వానీ హనీట్రాప్‌ కుట్ర ఉందన్న వాదనలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న పేరు కాదంబరి జెత్వానీ. బాలీవుడ్‌కు చెందిన ఈ ఛోటా నటితోపాటు ఆమె కుటుంబ సభ్యులను గత వైకాపా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తప్పుడు కేసులో జైల్లో పెట్టి 40 రోజులకుపైగా నరకం చూపించారన్నది ప్రధాన ఆరోపణ. దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా వెలుగొందుతున్న ఒక బడాబాబు కోసం ఏకంగా ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను, ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ద్వారా వైకాపా పెద్దలు ఈ వ్యవహారాన్ని నడిపారని మీడియాలో గత కొద్దిరోజులుగా విస్తృతంగా వస్తున్న కథనాల సారాంశం. సార్వత్రిక ఎన్నికల ముందు అత్యంత రహస్యంగా జరిగిన ఈ తతంగం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చింది. జగన్‌ ప్రభుత్వ బాగోతాలన్నింటినీ బయటకు లాగుతున్న చంద్రబాబు సర్కారు.. ఒక మహిళపై జరిగిన ఈ వేధింపుల పర్వంపై సీరియస్‌గా స్పందించి విచారణకు ఆదేశించగా, విచారణాధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్‌ని విజయవాడ కమిషనర్‌ నియమించడం, ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేయడం, పోలీసుల పిలుపుతో బాధితురాలిగా చెబుతున్న జెత్వానీ హుటాహుటిన శుక్రవారం హైదరాబాద్‌ మీదుగా విజయవాడకు చేరుకోవడం.. వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఈ కేసు రాజకీయ రంగు పలుముకోవడం.. అందుకు తగినట్లే ప్రధాన మీడియా కూడా తమ రాజకీయ అజెండాలకు అనుగుణంగా కథనాలు ప్రచురిస్తుండటంతో సాధారణ ప్రజల్లో గందరగోళం ఏర్పడిరది. కాదంబరి కేసులో అసలు ఏం జరిగింది? ఎక్కడో ముంబైకి చెందిన ఆమెపై కృష్ణా జిల్లాలో కేసు నమోదు చేసి జైల్లో పెట్టడమేమిటి? ఇదే జిల్లాకు చెందిన వైకాపా నాయకుడి పేరుతోనే ఎందుకు కేసు పెట్టారు? ఈ కేసుకు ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌తో సంబంధం ఏమిటి? వీరిద్దరితో కాదంబరి జెత్వానీకి ఉన్న లింకు ఏమిటి? అన్న ప్రశ్నలకు ప్రధాన మీడియా దేనికది తనకు అనుకూలంగా కథనాలు రాసుకొస్తోంది. ముంబై పారిశ్రామికవేత్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకే జెత్వానీపై ఏపీలో తప్పుడు కేసు పెట్టి హింసించారని ఒకవర్గం మీడియా, ప్రభుత్వవర్గాలు ఆరోపిస్తుంటే.. హనీట్రాప్‌తో పారిశ్రామికవేత్తలను వలలో వేసుకుని ఇబ్బందిపెడుతున్న జెత్వానీని రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకొస్తూ వైకాపాను, బడా పారిశ్రామికవేత్తలను బెదిరింపులకు గురిచేస్తోందని వైకాపా, దాని అనుకూల మీడియా ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ క్రమంలో వైకాపా పెద్దలకు వ్యతిరేకంగా కొన్ని అంశాలు కనిపిస్తుంటే.. అదే సమయంలో కాదంబరి జెత్వానీ వ్యవహారశైలిని కూడా తప్పుపట్టేలా కొన్ని అంశాలు ఉండటం విశేషం.

ఎవరీ కాదంబరీ జెత్వానీ

మోడల్‌గా, బాలీవుడ్‌ల్‌ చిన్నపాటి నటిగా కొనసాగుతున్న కాదంబరి జెత్వానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందినవారు. ఈమె తండ్రి మర్చంట్‌ నేవీలో, తల్లి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో పని చేశారు. అహ్మదాబాద్‌లోనే పుట్టి పెరిగిన కాదంబరి అక్కడే ఎస్‌హెచ్‌ఎల్‌ మున్సిపల్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చేసింది. రిజర్వ్‌ బ్యాంకులో పని చేస్తున్న తల్లికి ఉద్యోగరీత్యా ముంబైకి బదిలీ కావడంతో ఆ కుటుంబం అక్కడికి షిఫ్ట్‌ అయ్యింది. గ్లామర్‌ ఫీల్డ్‌పై ఆసక్తి ఉన్న జెత్వానీ ముంబైకి మారిన తర్వాత ఈ రంగంపై దృష్టి సారించింది. తొలుత మోడల్‌గా పని చేసింది. తర్వాత చిన్నాచితకా సినిమాల్లో నటించింది. సడ్డా అడ్డా అనే హిందీ సినిమాలో లీడ్‌ రోల్‌ చేసిన ఆమె 2014లో ఓయిజా అనే కన్నడ సినిమాతోపాటు తెలుగులో ఆట, మళయాలంలో ఐ లవ్‌ మీ, పంజాబీలో ఓ యారా ఐన్వయి, ఐన్వయి లుట్‌ గయా అనే సినిమాల్లో నటించింది. తెలుగులో ఒక్క సినిమా తర్వాత ఆమె దాదాపు ముంబైకే పరిమితమైంది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్‌తోగానీ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌తోగానీ పెద్దగా సంబంధాలు, పరిచయాలు కూడా లేవు. అయినా ఆమెను కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ తప్పుడు కేసులో ఇరికించి జగన్‌ ప్రభుత్వ సాయంతో ఆమెను, ఆమె కుటుంబాన్ని నరకయాతనకు గురిచేశారన్నది ఆరోపణ.

విద్యాసాగర్‌తో పరిచయం ఎలా?

కృష్ణా జిల్లాకు చెందిన కుక్కల నాగేశ్వరరావుకు బడా వ్యాపారవేత్తగా పేరుంది. ఆయన వైకాపా తరఫున కృష్ణా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయన కుమారుడే కుక్కల విద్యాసాగర్‌. 2015లో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యాసాగర్‌, కాదంబరిల మధ్య పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయం క్రమంగా పెరిగి చాలాకాలం మరిద్దరి మధ్య అనుబంధం కొనసాగింది. ఆ నేపథ్యంలో విద్యాసాగర్‌ పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చాడని జెత్వానీ చెబుతోంది. అయితే అప్పటికే అతనికి చాలామంది మహిళలతో సంబంధాలు ఉండటం, 2017లో అతనిపై కేసు కూడా నమోదైన విషయం తెలిసి తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని ఆమె వాదిస్తోంది. ఆ కక్షతోనే తనను తప్పడు కేసులో ఇరికించి, తన కుటుంబం మొత్తాన్ని 40 రోజులకుపైగా జైల్లో పెట్టి మానసికంగా, శారీరకంగా హింసించారని, తమ బ్యాంకు అకౌంట్లు కూడా సీజ్‌ చేసి ఆర్థికంగా ఇబ్బందుల పాల్జేశారని ఆరోపించింది. పెళ్లి ప్రతిపాదనకు తాను తిరస్కరించారనన్న అక్కసుతోపాటు సజ్జన్‌ జిందాల్‌పై తాను పెట్టిన కేసును విత్‌డ్రా చేయించేందుకే తప్పుడు కేసు పెట్టారన్నది జెత్వానీ ఆరోపణ. అయితే దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పెళ్లి ప్రతిపాదన విద్యాసాగర్‌ వైపు నుంచి కాకుండా జెత్వానీ నుంచే వచ్చిందన్న మరో వాదన ఉంది. అలాగే ఒక భూమి వ్యవహారం కూడా విద్యాసాగర్‌ కేసు పెట్టడానికి కారణమంటున్నారు. విజయవాడ నగరంలోని ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్‌కు ఉన్న భూమిని జెత్వానీ కొనుగోలు చేసిందని, దానికి సంబంధించి వివాదం ఏర్పడటం వల్లే విద్యాసాగర్‌ ఆమెపై ఎన్నికలకు రెండు నెలల ముందు ఫిబ్రవరి మూడో తేదీన కేసు పెట్టారని అంటున్నారు. అయితే విజయవాడతో ఏమాత్రం పరిచయం, సంబంధం లేని జెత్వానీ అక్కడ భూమి కొనుగోలు చేయడమేమిటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వాటిని పక్కన పెడితే వారిద్దరి మధ్య కొన్నేళ్లుగా సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని ఇవన్నీ తేటతెల్లం చేస్తున్నాయి.

సజ్జన్‌ జిందాల్‌ కేసుతో లింకేంటి?

విద్యాసాగర్‌, జెత్వానీ మధ్య సంబంధాలు, వివాదాలతో విజయవాడలో ఆమెపై కేసు నమోదైందనుకుంటే.. మరి ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌తో ఈ కేసుకు లింకేమిటన్న ప్రశ్న తలెత్తవచ్చు. సరిగ్గా ఇక్కడే వైకాపా పెద్దల ప్రమేయం, పోలీస్‌ ఉన్నతాధికారుల రంగప్రవేశం వంటివి జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కుక్కల విద్యాసాగర్‌ మాదిరిగానే దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక గ్రూప్‌ అయిన జిందాల్‌ సంస్థ యజమానుల్లో ఒకరైన సజ్జన్‌ జిందాల్‌తోనూ కాదంబరి జెత్వానీ చాన్నాళ్లు సన్నిహిత సంబంధం కొనసాగించింది. వారిద్దరి మధ్య స్నేహమో.. ఇంకెటువంటి సంబంధం ఉందో తెలియదుగానీ 2021లో జిందాల్‌పై జెత్వానీ ముంబైలోనే రేప్‌ కేసు పెట్టింది. దాన్నుంచి బయటపడటానికి తన మిత్రుడైన అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను సజ్జన్‌ జిందాల్‌ ఆశ్రయించారని అంటున్నారు. దాంతో ప్రభుత్వ సలహాదారుగా అప్పట్లో చక్రం తిప్పిన సజ్జలరామకృష్ణారెడ్డి రంగంలోకి దిగి అప్పటి విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా టాటా, డీసీపీ విశాలగున్నీల ద్వారా జెత్వానీని విజయవాడకు రప్పించి జిందాల్‌పై పెట్టిన కేసును వెనక్కి తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఐపీఎస్‌ అధికారి విశాలగున్నీ నేతృత్వంలోని పోలీస్‌ బృందం ముంబై వెళ్లి కాదంబరి జెత్వానీతో సహా ఆమె కుటుంబం మొత్తాన్ని విజయవాడకు తీసుకొచ్చి ఫిబ్రవరి ఆరో తేదీన రిమాండ్‌లో పెట్టి రకరకాలుగా హింసించారన్న ఆరోపణలే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనికి కుక్కల విద్యాసాగర్‌ కేసును పావుగా వాడుకున్నారని అంటున్నారు. అయితే సజ్జన్‌ జిందాల్‌పై పెట్టిన కేసును వాపసు తీసుకునేందుకు జెత్వానీ అంగీకరించలేదు. ఈలోగా ఎన్నికలు జరగడం.. వైకాపా ప్రభుత్వం ఓడిపోయి చంద్రబాబు సర్కారు అధికారంలోకి రావడంతో అంతవరకు రహస్యంగా సాగిన ఈ కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చి ప్రకంపనలు సృష్టిస్తోంది.

జెత్వానీ హనీట్రాప్‌కు పాల్పడుతోందా?

కాబందరి జెత్వానీ, సజ్జన్‌ జిందాల్‌, కుక్కల విద్యాసాగర్‌ ఈ ట్రయాంగిల్‌ క్రైమ్‌ కమ్‌ రొమాంటింగ్‌ కథా చిత్రంలో ఇంతవరకు జెత్వానీ, ప్రభుత్వ వర్గాల వాదనలు, ఆరోపణలకే విస్తృత ప్రచారం లభించింది. వీటిలో చాలావరకు కరెక్టే కావచ్చు. వైకాపా పెద్దలు, ఐపీఎస్‌ అధికారుల వైపు వేలెత్తి చూపవచ్చు. వాటిలోని వాస్తవాలు ఏమిటన్నది దర్యాప్తులో వెల్లడవుతుందని ఆశిద్దాం. అదే సమయంలో ఈ కేసులో రెండో కోణాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అదే హనీట్రాప్‌ కుట్ర కోణం. కాబందరి జెత్వానీ 2015లో కుక్కల విద్యాసాగర్‌తో ఏర్పడిన పరిచయాన్ని చాలా ఏళ్లు కొనసాగించడం, అలాగే అక్కడ ముంబైలో పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌తో స్నేహం సాగించడం, 2023లో అతనిపై రేప్‌ కేసు పెట్టడం వాస్తవమేనని ఇప్పటివరకు వచ్చిన వార్తలు, స్వయంగా ఆమె చెప్పిన విషయాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. అలాగే మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన ఏషియన్‌ పెయింట్స్‌ గ్రూపులో డైరెక్టర్‌ స్థాయిలో ఉన్న మాలవ్‌ ధనిపైనా 2021లో కాదంబరి ఈ తరహా కేసే పెట్టింది. అప్పట్లోనే వారిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్‌ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. సజ్జన్‌ జిందాల్‌, మాలవ్‌ ధని ఇద్దరూ ప్రముఖ పారిశ్రామికవేత్తలు కాగా కుక్కల విద్యాసాగర్‌ కూడా ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందినవారే. ఈ ముగ్గురితోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించడంతో కాదంబరి జెత్వానీ తీరుపైనే అనుమానాలు కలగడం సహజం. ప్రముఖ కుటుంబాలకు చెందిన వారిని స్నేహం, ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి హనీట్రాప్‌ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలన్న కుట్ర కూడా ఉండవచ్చన్న అనుమానాలకు ఇది తావిస్తున్నాయి. ఈ అంశాలనే మరో వర్గం మీడియాలో హైలైట్‌ చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ జెత్వానీ చేసిన వ్యాఖ్యలు కూడా వీటికి బలం చేకూర్చేలా ఉన్నాయి. మీపై ఇదొక్కటే కేసా.. ఇతర రాష్ట్రాల్లో ఇంకేమైనా ఉన్నాయా? అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ఏపీలో తనపై తప్పుడు కేసు పెట్టడం ట్రైలర్‌ మాత్రమేనని, ఇంకా చాలా కేసులు ఎదుర్కొనే ప్రమాదముందని కాదంబరి చెప్పడం విశేషం. అలాగే 2023లో కాదంబరి సజ్జన్‌ జిందాల్‌పై కేసు పెడితే దాన్నుంచి ఆయన్ను తప్పించేందుకు 2024లో సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు వైకాపా సర్కారు ఆమెపై తప్పుడు కేసు పెట్టి, తీసుకొచ్చి హింసించడం ప్రశ్నార్థకంగా మారింది. ఇక తమను తీసుకొచ్చి 40 రోజులకుపైగా హింసించారన్నది కాదంబరి ఆరోపణ. కానీ ఆ తర్వాత ఆమె ఎప్పుడు, ఎలా విడుదలైందన్నది శేష ప్రశ్నగానే ఉంది. సజ్జన్‌ జిందాల్‌ వంటి పెద్ద తలకాయపైనే కేసు పెట్టగలిగిన ఆమె తనను అక్రమ కేసులో ఇరికించి, జైలులో పెట్టి హింసించిన వారిపై ముంబై నుంచి అయినా కేసు పెట్టే అవకాశం ఉన్నా ఇన్ని నెలలపాటు ఎందుకు ఆ పని చేయకుండా మౌనంగా ఉండిపోయారో? చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page