top of page

ఓటు ఎక్కడో.. ఎవరు సరైనోడో?

Writer: NVS PRASADNVS PRASAD
  • `తెలుసుకోకపోతే మనకు, సమాజానికే చేటు

  • `ఓటరు స్లిప్పులు అందక చాలామంది అవస్థలు

  • `ఆ విషయంలో విఫలమైన అధికారులు

  • `సరైన అభ్యర్థిని ఎంచుకోకపోతే ఐదేళ్లు నష్టపోయినట్లే

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఏం జరుగుతూ ఉందో బిగ్గరగా చెప్పడమే ఎవరైనా ఎప్పుడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన పని అంటాడు రోజ్‌ లగ్జంబర్గ్‌. ఈ పనిని శతశాతం నోరు విప్పి చెప్పడానికి భారతదేశం లాంటి ప్రజాస్వామిక దేశాల్లో ఐదేళ్లకోసారే అవకాశం వస్తుంది. ఈలోగా నోరు విప్పితే జైలుపాలవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ దేశంలో ఎన్నికలు అత్యంత కీలకమైనవి. పోలింగ్‌ శాతం ఎంత పెరిగితే ప్రజాస్వామ్యానికి అంత బలం. ఓ అంచనా ప్రకారం రాష్ట్రంలో సోమవారం భారీవర్షం లేదా తట్టుకోలేని ఎండ ఉంటే తప్ప 85 శాతం వరకు పోలింగ్‌ జరగవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే స్థానిక అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, ఎలక్షన్‌ కమిషన్‌ ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో ప్రజల్లో అవగాహన లేమి కారణంగా అనేక నియోజకవర్గాల్లో అనేకమంది ఓట్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. కొన్నింటిని ఉద్దేశపూర్వకంగా తొలగిస్తే, మరికొన్ని ఓట్లు ఏ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఉన్నాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. 40 ఏళ్లుగా ఒకే చోట స్థిరనివాసం ఉన్న ఓటరుకు కూడా తనకు సమీపంలో ఉన్న పోలింగ్‌బూత్‌లో కాకుండా మరెక్కడో ఓటు వేసుకునే అవకాశాన్ని కల్పించిన యంత్రాంగానికి రెండు చేతులూ జోడిరచి నమస్కారం పెట్టడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. ఎప్పుడో ఇచ్చిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఓటర్‌ కార్డును పట్టుకొని, ఆ తర్వాత కొత్త ఓటరు కార్డులు వచ్చాయని కూడా తెలుసుకోలేని ఓటరుకు రెండు దండాలు. ఈ రెండిరటి పర్యవసానం వల్ల అనేకచోట్ల అనేకమంది ఓట్లు ఎక్కడ ఉన్నాయో తెలియక పార్టీలు కూడా ఓటరు స్లిప్పులను పంచలేక చేతులెత్తేశాయి. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదని ఏకవాక్య తీర్మానం చేసేసింది ఈసీ. దాంతో ఇప్పుడు అటు వలంటీర్లు లేక, ఇటు సచివాలయ సిబ్బందీ పంచక రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం మంది ఓటర్లకు ఆదివారం నాటికి కూడా ఏ బూత్‌లో తమ ఓటు ఉందో తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడిరది. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఇది కేవలం పార్టీలకే కాదు, సాధారణ ప్రజానీకానికి కూడా. ఎందుకంటే.. రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు ఆ విధంగా మారాయి. ఇంతవరకు కమ్మ నేతల వెంట బీసీలు (తెలుగుదేశం బీసీల పార్టీగా అవతరించింది), రెడ్ల వెంట కాపులు ఉండటం ఓ కామన్‌ కాంబినేషన్‌. కానీ ఈసారి కమ్మ, బీసీ, కాపులు కలిసి ఎన్నికల బరిలో ఉన్నారు. ఇది కొత్త కాంబినేషన్‌. ఈ కెమిస్ట్రీ ఏమేరకు కుదురుతుందో తెలిపే ఎన్నిక కాబట్టే ఇది ప్రత్యేకమైనది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే తన ఎన్నికల ప్రచారంలో చివరి మజిలీగా పవన్‌కల్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురాన్ని ఎంచుకున్నారంటే రాష్ట్రంలో ఈ కులాల కాంబినేషన్‌ ఏమేరకు ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

చాలాచోట్ల పంపిణీ కాని ఓటరు స్లిప్పులు

ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటూ కీలకమైనదే. ఓటరుగా నమోదైన ప్రతిఒక్కరు ఓటు వేయాల్సి అవసరం ఉంది. కానీ ఓటరుగా నమోదై ఉన్న చాలామందికి తమ ఓటు ఎక్కడ ఉందో తెలియని దుస్థితి నెలకొంది. ఓటుహక్కు వినియోగం, ఓటరును పోలింగ్‌ కేంద్రానికి తీసుకు రావడానికి ఎన్నికల సంఘం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ పోలింగుకు మరో 12 గంటలు సమయమే మిగిలి న తరుణంలోనూ శ్రీకాకుళం నగరంలో ఓటరు స్లిప్పులు ఓటర్లకు అందలేదు. అసలు తమ ఓటు ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? అన్న విషయాలు అర్థం కాక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ఎప్పుడో 2009లో ఇచ్చిన ఓటరు కార్డులు పట్టుకొని చాలామంది ఓటర్లు స్లిప్పుల కోసం, పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలుసుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఈ వివరాలతో కూడిన ఓటరు స్లిప్పుల పంపిణీలో సచివాలయం పరిధిలోని వీఆర్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణం. ఈ నెల 7 నాటికే ఇంటింటికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్టు జిల్లా అధికారులు ప్రకటించినా నగరంలో పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయలేదు. ఆయా డివిజన్లలో తమకు పరిచయం ఉన్న వారికి మాత్రమే పంపిణీ చేసి చేతులెత్తేశారు. దీన్ని ఆసరా చేసుకుని నగరంలో 40 వేల ఓట్లు గల్లంతయ్యాయన్న ఆరోపణలు చెలరేగుతున్నాయి. తుది ఓటర్ల జాబితా ప్రకటనకు ముందు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించినందున ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని అధికారులు కొట్టిపారేస్తున్నారు.

నచ్చడం కాదు.. ఉపయోగపడటం ముఖ్యం

జనం తమకు నచ్చినవారికి ఓటు వేస్తారు. తమకు ఉపయోగపడేవారికి వేయరు. క్యాండీ షాపు ఓనరుకు పడినన్ని ఓట్లు డాక్టర్లకు పడవు అని అన్నారు ఓ సందర్భంలో సోక్రటీస్‌. తమకు ఉపయోగపడేవారిని జనాలు అడగరు. అందుకే పాలిటిక్స్‌లో వారికి ఉపయోగపడేవారు కనిపించరు. తమకు నచ్చినవారికి మాత్రమే ఓటు వేస్తారు. అందుకే రాజకీయ మూలసిద్ధాంతం ఏ పని చేసినా జనానికి నచ్చాలన్న కోణంలోనే ఉంటుంది. ఏ పథకం పెట్టినా జనాలు ఆరాధించేలా చూసుకోవాలన్న పద్ధతిలోనే సాగుతుంది. ఇలాంటివి ప్రవేశపెట్టడం ద్వారా రాజకీయ నాయకులకు ప్రజలు బానిసలుగా ఉండాలని భావిస్తారు. మనం హేతుబద్ధంగా ఒక నాయకుడ్ని ఎంచుకోవాలంటే ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం మనం బేషరతుగా ఎవరినీ ఆరాధించకూడదు. ప్రతి నాయకుడ్ని బేరీజు వేసి మెరిట్‌ చూసి ఓటు వేయాలి. రాజకీయాల్లో వస్తున్న సంక్లిష్ట పరిణామాలను ప్రశ్నించడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే నాయకులను జవాబుదారీగా ఉంచగలం. పక్షపాతం లేకుండా మనకు మనం ప్రతినిత్యం ఛాలెంజ్‌ చేసుకున్న రోజునే పార్టీలకతీతంగా ఒక నాయకుడ్ని ఎన్నుకోగలం. అలా కాకుండా ఓ కంఫర్ట్‌ జోన్‌కు అలవాటు పడిపోతే.. ఎవడో ఒకడ్ని ఎన్నుకుంటే వచ్చిన తప్పేంటన్న భావన కలుగుతుంది. అలాంటి నాయకుడ్ని ఎన్నుకుని రోజూ భజన, పూజ చేసుకోవడం కంటే మనకు అందుబాటులో ఉన్న నాయకుడు ఏ పార్టీ అయినా ఫర్వాలేదని ఓటేస్తే ఫలితాలు కనీసం మన ఆత్మతృప్తికైనా అనుకూలంగా వస్తాయి. మెజారిటీ జనం ముందుగా ఏదో ఒక విషయంలో ఒక నాయకుడ్ని బలంగా ఇష్టపడతారు. అక్కడి నుంచి ఆ ఇష్టమే వారిని ఆ నాయకుడి వైపు నడిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కేవలం మోటివేషన్‌ మాత్రమేనని, ఆ మాయలో పడ్డామని తెలుసుకునేలోపు ఒక జీవితం పూర్తవుతుంది. నేను ఇష్టపడ్డాను కాబట్టి ఆయన అర్హత ఉన్న వ్యక్తే అయివుండాలనే అహం నుంచి సంబంధిత నాయకుడు చేసిన మంచి పనులను వెతుక్కుంటూ అంతకంటే బెటర్‌ ఎవరైనా ఉన్నారా? అని పోల్చుకుంటూ ఎమోషన్‌ను పక్కన పెట్టి హేతుబద్ధంగా ఆలోచిస్తే ప్రతి నియోజకవర్గంలోనూ మంచి అభ్యర్థే దొరుకుతాడు. అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థినే గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందనుకోవడం మిధ్య. ఇక్కడ అభివృద్ధికి మించిన సమస్యలు ప్రభుత్వ బడ్జెట్‌తో సంబంధం లేని పనులు అనేకం ఉంటాయి. వాటిని కనీసం నెరవేర్చే నాయకుడు మనకు అవసరం. ఈ స్టాక్‌ హోం సిండ్రోమ్‌ అనే వ్యాధి నుంచి బయటపడి.. పిలిస్తే పలికే నాయకుడ్ని ఎన్నుకోవడం ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికి అవసరం.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page