ఓటుకు నోటు.. ఎవరిదెంత రేటు!
- NVS PRASAD
- May 12, 2024
- 3 min read
`జిల్లాలో జరుగా మనీ, మద్యం పంపిణీ
`నరసన్నపేటలో అత్యధికంగా రూ.1500 ఇస్తున్న వైకాపా
`పాతపట్నంలో పూర్తిగా వెనుకబడిన టీడీపీ
`మెజారిటీ నియోజకవర్గాల్లో అధికార పార్టీ రూ.వెయ్యి, టీడీపీ రూ.500
పార్టీల మేనిఫెస్టోలు, సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయాలంటే.. నాకేంటి? అనే ప్రశ్న సగటు ఓటరు నుంచి వినిపిస్తోంది. ఏ పార్టీకి సానుభూతిపరుడైనా నోటు లేనిదే ఓటు వేయడం ఎందుకన్న భావం ఎక్కువ మందిలో చోటుచేసుకుంటుంది. పార్టీలు, సిద్ధాంతాలు నాయకులు మర్చిపోయినట్టే.. నైతిక విలువలు, ప్రజాస్వామిక బాధ్యతను ఓటరు మర్చిపోయాడు. చివరకు సొంత పార్టీ సానుభూతిపరుడికే డబ్బులిచ్చి ఓటు వేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రచారం ముగిసిన తర్వాత పంపకాలు మొదలవుతాయని తెలుసుకున్న ఓటరు శనివారం సాయంత్రం నుంచే తమకు ఇంకా డబ్బులు రాలేదని సంబంధిత పార్టీ నాయకులను విసిగించడం మొదలుపెట్టారు. రాత్రి 9 గంటలకే తలుపులు మూసుకునే ఓటరు 11 గంటల వరకు ఎవరైనా రాకపోతారా.. డబ్బులు చేతిలో పెట్టకపోతారా? అని ఎదురుచూశాడు. అయితే 2019లో ఓటరు భారీ తీర్పునివ్వడంతో ఈసారి ఎవరు ఎటున్నారో తెలియక డబ్బులు పంచడంలో జిల్లా వ్యాప్తంగా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిరది. ఆదివారం సాయంత్రం నాటికి కూడా కొన్నిచోట్ల పంపిణీ పూర్తికాలేదు. గతంలో పోటీలో ఉన్న పార్టీలు రెండూ ఓటరుకు ఎంతో సొంత ముట్టజెప్పేవి. దాని ప్రకారం ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే చెరో రెండు కింద సర్దేవారు. కానీ ఈసారి తమ పార్టీ సానుభూతిపరులకు మాత్రమే డబ్బులివ్వాలని నిర్ణయించుకోవడంతో పంపకాల్లో జాప్యం జరుగుతోంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గ్రామాల్లో ఓట్ల పండుగ పేరుతో నోట్ల పండుగ నడుస్తోంది. ఓటుకు నోటు అన్నది కామన్ పాయింట్‌గా మారిపోయింది. నోటు ఇస్తేనే ఓటు అన్న పరిస్థితికి ఓటర్లు చేరారు. నోటు ఇవ్వలేదని ప్రజలు రొడ్డెక్కి ఆందోళన చేస్తున్న పరిస్థితి అనేక గ్రామాల్లో కనిపిస్తోంది. ఓటు వేయాలని ఇంటింటికీ ప్రచారం చేస్తున్న నాయకులకు నోటు ఎప్పుడిస్తారని అడుగుతున్న పరిస్థితి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పంపకాల్లో పోటీ పడుతుంటే.. గ్రామ, పట్టణ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు అక్కడక్కడా కక్కుర్తి పడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు రెండు పార్టీలు వేగులను వెంట పంపించి మానిటరింగ్ చేయిస్తూ పంపకాల్లో కార్యకర్తలు చేతివాటం ప్రదర్శించకుండా చెక్ పెడుతున్నాయి. వైకాపాకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే బూత్ స్థాయి నుంచి మండల స్థాయి నాయకుల వరకు చేతి ఖర్చులకు కొంత మొత్తం ఇచ్చారు. టీడీపీలో మాత్రం ఎన్నికల ప్రచార ఖర్చులను అభ్యర్థులే భరిస్తూ క్యాడర్‌కు ఆర్ధిక ఇబ్బంది లేకుండా జాగ్రత్తపడ్డారు. జిల్లా అంతటా రెండు పార్టీలు పోటాపోటీగా పంపకాలు చేస్తున్నాయి. ఇది ఒక్కోచోట ఒక్కోలా ఉంది. కొన్ని స్థానాల్లో ఇంకా పంపకాలు ప్రారంభం కాలేదన్న వాయిస్ ఆదివారం ఎక్కువగా వినిపించింది. మందు పంపిణీ విషయంలో అధికార పార్టీ ఓ అడుగు ముందుంది. అధికారంలో ఉండటం వల్ల అనేక మార్గాల్లో అధికారికంగానే వీరికి మందు దొరకడంతో పంపిణీ సులభతరమైంది. జిల్లాలో ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న అభ్యర్థులందరిలో ఒక్క ఆమదాలవలసలో సువ్వారి గాంధీ మాత్రమే డబ్బులు పంచారన్న ప్రచారం సాగుతోంది.
ఏ నియోజకవర్గంలో ఎలా..
`ఇచ్ఛాపురంలో వైకాపా అభ్యర్ధి పంపకాల్లో దూకుడు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఓటుకు రూ.వెయ్యితో పాటు మద్యం పంపిణీ చేస్తున్నట్టు భోగట్టా. మరోవైపు టీడీపీ అభ్యర్థి రూ.500 పంపిణీ చేస్తూ సర్దుకుపోవాలని కోరుతున్నారట. అయితే వైకాపాలో ఓటుకు నోటు పంపకాల్లో కొన్ని చోట్ల వ్యత్యాసం కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. టీడీపీ గ్యారెంటీగా తమకే ఓటు వేస్తారనుకున్న వారికే నోట్లు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
`పలాసలో వైకాపా పంపకాల్లో వెనుకబడిపోయిందన్న ప్రచారం జోరుగా ఉంది. గ్రామాల్లో పంపకాలు ప్రారంభించినా పట్టణంలో మాత్రం మధ్యాహ్నం వరకు పంపకాలు జరగలేదని తెలిసింది. మద్యం పంపిణీలో వైకాపా దూకుడుగా ముందుకు వెళుతోందని తెలిసింది. టీడీపీ నగదు పంపకాల్లో దూకుడు చూపిస్తూ ఓటుకు రూ.వెయ్యి ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
`టెక్కలిలో వైకాపా, టీడీపీ పంపకాల్లో నువ్వా.. నేనా అన్నట్టు వ్యవహరిస్తున్నాయి. ఓటుకు రూ.వెయ్యి చొప్పున రెండు పార్టీలు పంచుతున్నాయి. గ్రామాల్లో కచ్చితంగా ఓటు వస్తుందని నమ్మితేనే నోటు ఇస్తున్నట్టు ప్రచారంలో ఉంది. మద్యం పంపకాల్లో వైకాపా జోరు చూపిస్తోంది. టెక్కలి పట్టణంలోని కొన్ని వార్డుల్లో పెద్ద మొత్తంలో నగదు పంపిణీకి వైకాపా సిద్ధమైందని సమాచారం.
`పాతపట్నంలో వైకాపా ప్రాంతాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.500 పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. నోటుతో పాటు మద్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సమాచారం. ఈ నియోజకవర్గంలో టీడీపీ పంపకాల విషయంలో పూర్తిగా వెనుకబడిపోయిందన్న ప్రచారం ఆ పార్టీ కార్యకర్తల నుంచే వినిపిస్తోంది. టీడీపీలో రెండు వర్గాలు ఉండడంతో ఒకరికి ఇస్తే మరొకరు దూరంగా ఉంటున్నట్టు భోగట్టా. ఎవరికి ఇచ్చినా ఓటర్ల వద్దకు వెళ్లదన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది.
`ఆమదాలవలసలో వైకాపా ఓటుకు రూ.వెయ్యి, మద్యం పంపిణీ చేస్తోందంటున్నారు. మున్సిపాలిటీలో ఒకటి రెండు చోట్ల రూ.500 పంపిణీ చేసినట్టు విమర్శలు రావడంతో సదరు నాయకుడిని మందలించి మిగతా మొత్తాన్ని తిరిగి పంపించి సర్దుబాటు చేసినట్టు తెలిసింది. టీడీపీ మాత్రం రూ.500 చొప్పున పంపిణీ చేస్తోంది.
`నరసన్నపేటలో వైకాపా ఓటుకు అత్యధికంగా రూ.1500, మద్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. టీడీపీ మాత్రం ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేస్తున్నారని వినికిడి.
`ఎచ్చెర్లలో వైకాపా సొమ్ము పంపిణీలో దూకుడుగా వెళుతోందని ప్రచారం జరుగుతోంది. 2019లో తమకు వచ్చిన ఓట్లను గుర్తించి వారికే డబ్బులు ఇస్తున్నారు. నోటుతో పాటు మద్యం పంపిణీ చేస్తున్నారు. కూటమి అభ్యర్ధిగా బీజేపీ నుంచి బరిలో నిలిచిన నడికుదిటి ఈశ్వరరావు పంపకాల్లో వెనుకబడిపోయినట్టు భోగట్టా. గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు వర్గాలుగా విడిపోవడంతో డబ్బులు ఎవరి ద్వారా పంపిణీ చేయాలో తెలియక తలపట్టుకున్నట్టు చెబుతున్నారు.
`శ్రీకాకుళంలో వైకాపా, టీడీపీలు ప్రాంతాలను బట్టి నగదు పంచుతున్నాయి. కొన్నిచోట్ల వైకాపా తరఫున పంపిణీ పూర్తి కాగా, మరికొన్నిచోట్ల టీడీపీ తరఫున పూర్తయింది. రెండు పార్టీలు ఓటుబ్యాంకు ఆధారంగా పంపిణీ చేస్తున్నాయి. అరసవల్లిలో ఎక్కువ ఓట్లు రావాలన్న ఉద్దేశంతో వైకాపా అక్కడ ఆదిత్యనగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేయగా, నగరంలో మిగిలిన చోట్ల రూ.500 చొప్పున ఇచ్చింది. టీడీపీ కొన్నిచోట్ల రూ.వెయ్యి పంచగా, మరికొన్ని చోట్ల రూ.700, ఇంకొన్నిచోట్ల రూ.500 చొప్పున పంపిణీ చేసింది. ఏది ఏమైనా ఎవరి ఓటుబ్యాంకుకు వారు మాత్రమే డబ్బులిచ్చారు. ప్రత్యర్థి పార్టీకి ఓటు వెళ్తుందని తేలినవారెవరికీ పక్క పార్టీ డబ్బులివ్వలేదు.
Comments