top of page

ఓటింగ్‌పై వైకాపా వేటు!

Writer: NVS PRASADNVS PRASAD
  • `పోలింగ్‌ పెరిగితే ఓడిపోతామని భయం

  • `ఓట్లు వేయకుండా ఓటర్లను అడ్డుకోవడమే వ్యూహం

  • `అందుకోసమే బూత్‌ల వద్ద ఉద్రిక్తతలు రేపే కుట్ర

  • `శ్రీకాకుళం నియోజకవర్గంలో తగ్గనున్న పోల్‌ శాతం

  • `జిల్లాలోనూ పలుచోట్ల చెదురుమదరు ఘటనలు

శ్రీకాకుళం నియోజకవర్గంలో పోలింగ్‌ శాతం పెరిగితే అధికార వైకాపాకు ఎదురుగాలి ఉన్నట్టేనన్న అంచనా ఉంది. అందుకు తగినట్లే సోమవారం మధ్యాహ్నం నుంచి పోలింగ్‌బూత్‌లకు వెళ్లడానికి ఓటర్లు భయపడే విధంగా అధికార వైకాపా కార్యకర్తలు వ్యవహరించారు. ఉదయం జరిగిన పోలింగ్‌లో ఫ్యాన్‌ గుర్తుకు తక్కువ ఓట్లు పడ్డాయన్న అంచనాకు వచ్చిన వీరు పథకం ప్రకారం రెండో పూట ఓటింగ్‌ను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వైకాపా నాయకులు బలంగా ఉన్నచోట, తెలుగుదేశం కోసం పని చేస్తున్న నాయకులు ఉన్నచోట రౌడీయిజానికి తెగబడ్డారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

ఇటీవలే వైకాపాలో చేరిన బుక్కా యుగంధర్‌ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పోలింగ్‌ కేంద్రంలో శ్యామ్‌పాలెంకు చెందిన ఒక ఓటరుపై చెయ్యి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన శ్యామ్‌ పాలెం వాసులు బుక్కా యుగంధర్‌ను కొట్టడానికి పెద్ద ఎత్తున పోలింగ్‌బూత్‌ వద్దకు చేరుకున్నారు. అసలు యుగంధర్‌ చెయ్యి చేసుకోవడం వెనుక వైకాపా కుట్ర ఉంది. ఇప్పుడు ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం, పోలీసులు చెల్లాచెదురు చేయడం వంటి ఘటనలతో ఓట్లు వేయడానికి ఎవరూ రాలేదు. మధ్యాహ్నం ఈ ఘటన జరిగిన సమయా నికి 50 శాతం మాత్రమే ఓటింగ్‌ జరిగింది. ఈ ఒక్క బూత్‌లో జరిగిన గొడవ వల్ల పక్కనే ఉన్న ట్రైనింగ్‌ స్కూల్‌, మరోపక్కనున్నఉమెన్స్‌ కాలేజీల్లో ఓటు వేయాల్సినవారు కూడా వెనక్కు తగ్గిపోయారు. గుజరాతీపేట ప్రాంతంలో వరం వారసులు టీడీపీలో చేరిన తర్వాత అక్కడ వార్‌ వన్‌సైడ్‌ అవుతుందని ముందే గ్రహించిన వైకాపా మధ్యాహ్నం లంచ్‌ విరామం వరకు స్తబ్దుగా ఉండి రెండో పూట పెద్ద ఎత్తున వార్డుతో సంబంధం లేని వ్యక్తులను అక్కడ మోహరించి భయానక వాతావరణం సృష్టించారు. అంతకు ముందే వైకాపాలో ఉన్న వరం సోదరులు ఇద్దరు ఆ ప్రాంతంలో హల్‌చల్‌ చేయడంతో ఓట్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. పోలింగ్‌కు మరో గంటన్నర సమయం మాత్రమే ఉందని తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున వైకాపా తరఫున బయటి వ్యక్తులు అక్కడకు వచ్చి గుంపులుగా గుమిగూడి ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఇక్కడ ధర్మాన తనయుడు చిన్ని తిష్ట వేశారని అంధవరపు సంతోష్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైన గొడవ చివరకు పోలింగ్‌ కేంద్రాన్ని ధర్మాన ప్రసాదరావు, గొండు శంకర్‌లు చేరుకొని ఇరు వర్గాల తరఫున మాట్లాడాల్సిన వాతావరణం ఏర్పడిరది. అనంతరం ఎస్పీయే రంగప్రవేశం చేసి 144 సెక్షన్‌ కఠినంగా అమలయ్యేటట్లు చూశారు. నియోజక వర్గం మొత్తం మీద 65 శాతానికి మించి పోలింగ్‌ జరగకూడదన్న ఓ వ్యూహం మేరకు ఎక్కడికక్కడ కావాలనే గొడవలు సృష్టిం చారు. దీంతో పాటు జిల్లాలో కూడా పోలింగ్‌ సందర్భంగా అనేక చోట్ల ఇటువంటి సంఘటనలే జరిగాయి.

8 టెక్కలి నియోజక వర్గంలో కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయాల్సిన భగీరధపురం, చిట్టయ్యవలస, ఊడి గలపాడు గ్రామాలకు చెందిన ఓటర్ల ను మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటేయడానికి రానివ్వలేదన్న ఫిర్యాదు మేరకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్‌, ఎంపీ అభ్యర్థి తిలక్‌లు ఎన్నికల సంఘం అధికారులకు సమాచారం ఇచ్చారు.

గోకర్ణపల్లిలో కొట్లాట

పొందూరు మండలం గోకర్ణపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీన్ని అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రంగా గుర్తించిన ఎన్నికల సంఘం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీగా కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. అయినా వైకాపా, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరిని రిమ్స్‌కు తరలించారు. ఇక్కడ వైకాపా జనరల్‌ ఏజెంట్‌గా పోలింగ్‌ కేంద్రంలో బైఠాయించిన స్పీకర్‌ సీతారాం సతీమణి తమ్మినేని వాణిని పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు పంపించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆందోళనకు దిగడంతో ఘర్షణ చోటు చేసుకుంది. దీనిపై టీడీపీ అధిష్ట్టానం స్పీకర్‌ సతీమణి వాణి రిగ్గింగ్‌కు పాల్పడినట్టు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

కిరణ్‌ను నిలదీసిన గ్రామస్తులు

ఎచ్చెర్ల మండలం ధర్మవరంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్లగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేగా తమ గ్రామానికి ఏం చేశావని కొందరు ప్రశ్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఉన్నవారిని చెదరగొట్టి కిరణ్‌ను అక్కడ నుంచి పంపించేశారు.

ఏజెంట్లపై దాడికి దిగిన వైకాపా

శ్రీకాకుళం రూరల్‌ మండలం ఇప్పిలి పోలింగ్‌ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌ను బయటకు పంపించారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న ఆ పార్టీ అభ్యర్ధి గొండు శంకర్‌ను వైకాపాకు చెందిన కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. దీంతో శంకర్‌ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకొని వైకాపా అక్రమాలకు చెక్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు.

టీడీపీ శిబిరంపై దాడి

గార మండలం కళింగపట్నం, అరంగి పేటలో ఓటర్‌ స్లిప్పులు అందజేస్తున్న టీడీపీ శిబిరంపై పోలీసుల సమక్షంలోనే వైకాపా నాయకులు దాడికి తెగబడ్డారు. టీడీపీ శిబిరాలను ధ్వంసం చేసి ఓటరు జాబితా లను చించేశారు. ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ సానుభూతిపరులతో పాటు పలువురు ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లనీయ కుండా అడ్డుకున్నారు. పోలింగ్‌ అధికారులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో వైకాపా నాయకులు అక్కడి నుంచి జారుకున్నారు. దీనిపై శంకర్‌ టీడీపీ ఏజెంట్ల నుంచి సమాచారం సేకరించి ఘటనపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

పలాసలో వైకాపా ఆందోళన

పలాసలో టీడీపీ నాయకులను పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించడంపై వైకాపా నాయకులు ఆందోళనకు దిగారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైకాపా నాయకులను పోలీసులు అడ్డగించారు. దీంతో వైకాపా నాయకులు బల్లయ్య తదితరులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు చెదరగొట్టారు.

 
 
 

Commentaires


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page