ఓట్లు మీకు.. నోట్లు మాకు
- BAGADI NARAYANARAO
- Jul 9, 2024
- 3 min read
`నిధులు రాలేదని సిబ్బందికి, వెండర్లకు పంగనామాలు
`పెండిరగ్ పెద్దగా లేదని తేల్చేసిన కలెక్టరేట్
`తహసీల్దార్, డీటీల జేబుల్లోకి పర్యవేక్షణ నిధులు
`పలువురు ఉద్యోగుల ఫిర్యాదుతో వెలుగులోకి అవినీతి
ప్రకృతి విపత్తులు వంటి అత్యవసర పరిస్థితులు, ఎన్నికలు వంటి ముఖ్యమైన సందర్భాలు వచ్చినప్పుడు రెవెన్యూ శాఖకు అసలు తీరిక ఉండదు. అబ్బో.. రెవెన్యూ ఉద్యోగులు ఎంత కష్టపడిపోతున్నారో అని అందరూ సానుభూతి చూపిస్తుంటారు. కానీ అటువంటి ప్రత్యేక సందర్భాలు వస్తున్నాయంటే రెవెన్యూ ఉద్యోగులకు పండగే. తీరిక లేకుండా పనిచేయడం నిజమే అయినా.. అంతకుమించి రెండు చేతులా సంపాదించుకుని భారీగా వెనకేసుకునే అవకాశం లభిస్తుండటమే దానికి కారణం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే జరిగింది. ఎన్నికల ఏర్పాట్లకు కేంద్ర ఎన్నికల సంఘం భారీగా నిధులు మంజూరు చేస్తుంటుంది. ఎన్నికలను కూడా అత్యవసర పరిస్థితుల కింద పరిగణించి కిందిస్థాయి అధికారులు తమ విచక్షణ మేరకు ఖర్చు చేసే వెసులుబాటు కల్పిస్తుంటారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత తీరిగ్గా ఆ ఖర్చులకు బిల్లులు, ఆడిటింగ్ వంటి తతంగాలు ఉంటాయి. ఇదే అదనుగా ఎన్నికల ఖర్చుల పేరుతో అధికారులు స్వాహా చేసేశారు. శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయం పరిధిలో ఎన్నికల ఖర్చుల పేరుతో లక్షలకు లక్షలు నొక్కేశారని జోరుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు ఎన్నికల ఖర్చులన్నింటికీ నిధులు విడుదలైనా.. ఇంకా భారీ మొత్తం ఎన్నికల కమిషన్ నుంచి రావాల్సి ఉందన్న సాకుతో తోటి ఉద్యోగులకు చెల్లింపులు జరపకుండా తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఎన్నికల ఖర్చుల పేరుతో శ్రీకాకుళం తహసీల్దారు కార్యాలయంలో జరిగిన సిత్రాలు శుభం కార్డులేని టీవీ సీరియల్‌ను తలపిస్తున్నాయి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఖర్చుల బాధ్యతను ఈ కార్యాలయానికే అప్పగించడంతో ఎక్కువ ఖర్చులు చూపించి నిధులు నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లేని అప్పును చూపించి చెల్లింపులను వాయిదా వేస్తూ ఎన్నికల్లో పనిచేసిన ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఇంకా తమ కార్యాలయానికి రూ.40 లక్షలు మంజూరు కావాల్సి ఉందని తహసీల్దార్ కార్యాలయ అధికారులు చెబుతుంటే.. రూ.15.70 లక్షలు మాత్రమే ఇవ్వాల్సి ఉందని కలెక్టరేట్ అధికారులు లెక్కలు తేల్చారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లకు రూ.2,06,63,918 (సుమారు 2.07 కోట్లు) ఖర్చు చేసినట్టు తహసీల్దార్ కార్యాలయ అధికారులు బిల్లులు చూపించగా మొదటి విడతలో రూ.1.79 కోట్లు విడుదల చేశారు. ఆర్ధిక శాఖ అనుమతి తర్వాత రూ.48.62 లక్షలు విడుదలకు అవకాశం ఏర్పడిరది. ఇందులో ఉద్యోగుల టీఏలతో పాటు ఇతర బకాయిల కింద రూ. 22.05 లక్షలు విడుదల చేయగా కొంత తహసీల్దార్ ఖాతాలో, మిగతా మొత్తాలు పలువురు వెండర్స్ ఖాతాల్లో జమయ్యాయి. ఇవి పోగా రూ. 15.70 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉందని పేర్కొంటూ కలెక్టరేట్ అధికారులు ఎన్నికల కమిషన్‌కు నివేదించి క్లియరెన్స్ కోసం వేచి చూస్తున్నారు. ఈ లెక్కన దాదాపు చెల్లింపులు పూర్తి అయినట్లే. కానీ నిధులు అందాల్సి ఉందంటూ ఉద్యోగులను, బకాయిదారులను శ్రీకాకుళం తహసీల్దారు, అక్కడి ఎలక్షన్ డీటీ శ్రీనివాసరావు మభ్యపెడుతున్నారు. మరోవైపు ఎన్నికల విధుల్లో రేయింబవళ్లు పాల్గొన్న కిందిస్థాయి ఉద్యోగులకు టీఏల చెల్లింపుల్లో వివక్ష చూపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలోని గారలో ఎనిమిది మందికి, శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయంలో పదిమందికి, ఆర్డీవో కార్యాలయంలో 24 మందికి టీఏలు చెల్లించి మిగతావారికి కలెక్టరేట్ నుంచి నిధులు అందిన తర్వాత చెల్లిస్తామంటూ తహసీల్దార్ ఖాతాలో జమ అయిన రూ.10.85 లక్షలు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇచ్చినదాంతోనే సర్దుకుపొండి
ఎన్నికల విధుల్లో పాల్గొన్న వీఆర్‌ఏలకు రూ.2,500, వీఆర్వోలకు రూ.3,500 చొప్పున చేతిలో పెట్టి సర్దుకుపోవాలని తహసీల్దారు, ఎన్నికల డీటీ సూచించారని తెలిసింది. ఆర్డీవో కార్యాలయంలో ముగ్గురు జూనియర్ సహాయకులకు రూ.6వేలు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ వారు తిరస్కరించారని తెలిసింది. తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.10వేలు చెల్లించి ఆర్డీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.15వేలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అటెండర్లలో కొందరికి రూ.4వేలతో సరిపెట్టి మరికొందరికి మాత్రం రూ.12వేలు ఇచ్చారంటున్నారు. సీనియర్ అసిస్టెంట్లకు రూ.15 వేలు, డీటీలకు రూ.20 వేలు టీఏగా ఇచ్చారని తెలిసింది. ఇవి కూడా 40 మందికి మించి ఇవ్వలేదని, మిగతావారికి నిధులు అందిన తర్వాత ఇస్తామంటూ దాటవేస్తున్నారని సమాచారం. పోలింగ్ కేంద్రాల నిర్వహణకు వీఆర్వోలకు రూ.8 వేలు చొప్పున ఇచ్చామని చెప్పినా ఆ నిధులను కూడా తహసీల్దార్ తన ఖాతాలోనే ఉంచేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరికి చెల్లించి, మరికొందరికి సర్దుకుపోవాలని సూచించడం ద్వారా మిగిలిన నిధులను తహసీల్దార్, డీటీ కలిసి మింగేశారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అందిన నిధుల్లో సుమారు రూ.32 లక్షలను తహసీల్దార్ తన సొంత ఖాతాల్లో జమ చేయించుకున్నారన్న చర్చ రెవెన్యూ ఉద్యోగుల్లోనే జరుగుతోంది.
వెండర్ల ప్రదక్షిణలు
ఎన్నికల నిర్వహణకు అవసరమైన టెంట్లు, సౌండ్ సిస్టం, ఆహారం, స్నాక్స్, వాటర్ బాటిల్స్ వంటివి సరఫరా చేసిన వారితో పాటు వివిధ ఏర్పాట్లలో భాగస్వాములైన వెండర్లు బిల్లుల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీరికి రూ.2లక్షల నుంచి రూ.10లక్షల వరకు చెల్లించాల్సి ఉందంటున్నారు. శ్రీకాకుళం ఆర్డీవో రంగయ్యను ముందుపెట్టి ఆర్థిక వ్యవహారాలన్నింటినీ తహసీల్దార్, ఎలక్షన్ డీటీయే చక్కబెట్టారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా వచ్చిన వీరు.. ఎన్నికలైన వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోతామన్న ధీమాతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తున్నా బదిలీల జీవో విడుదల కాకపోవడం.. ఉద్యోగులు, వెండర్లు బిల్లుల కోసం వెంటపడుతుండటంతో తహసీల్దార్, డీటీల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల్లా తయారైంది. ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిపోతే ఖర్చులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదన్న భావనతో వారు ఉన్నారు. 2019లో ఎచ్చెర్లలో ఎన్నికల డీటీగా వ్యవహరించిన శ్రీనివాసరావు ఆ ఎన్నికల్లోనూ టీఏ బిల్లులు చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై అప్పట్లోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అరకొర చెల్లింపులు జరిపి చేతులు దులుపుకొన్నారు.
ఉద్యోగుల ఫిర్యాదులు
ఈ ఎన్నికల సమయంలోనూ అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు సిఫార్సుతో శ్రీకాకుళం ఎలక్షన్ డీటీగా వచ్చిన శ్రీనివాసరావు నిర్వాకంపై గత నెలలోనే పలువురు ఉద్యోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో అభ్యర్ధులు చేసే ఖర్చులను, ప్రచారాలు, ఓటర్లకు ప్రలోభాలు, అక్రమ రవాణా, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, చెక్‌పోస్టుల్లో విధులకు అన్ని మండలాలతో పాటు శ్రీకాకుళంలోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ బృందాలకు పోలింగ్ ముగిసిన వెంటనే టీఏ చెల్లింపులు పూర్తి అయినా శ్రీకాకుళం ఎలక్షన్ డీటీ మాత్రం చెల్లింపులు జరపకుండా కలెక్టరేట్ నుంచి నిధులు రాలేదంటూ కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు. వారంతా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం, ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొందరికి చెల్లింపులు జరిపారు. ప్రస్తుతం శ్రీకాకుళం వీఆర్వోలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. టీఏలు చెల్లింపు, పోలింగ్ బూత్‌ల నిర్వహణ చెల్లింపుల్లో కోత విధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బదిలీ జాబితాలు మార్చి..
ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీలకు అప్పటి కలెక్టర్ శ్రీకేష్ బాలజీ లాఠకర్ ఇచ్చిన జాబితాను పక్కన పెట్టారు. లాఠకర్ స్థానంలో మనజీర్ జిలానీ రాగా అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావుతో సిఫార్సు చేయించి జాబితాలో మార్పులు చేయించడం ద్వారా తహసీల్దార్‌ను, ఎన్నికల డీటీని శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. వీరిద్దరి సూచనల మేరకు కార్యాలయ సూపరింటెండెంట్ రాజు, సీనియర్ అసిస్టెంట్ ప్రకాశరావు, ఏఎస్‌వో సుధాకర్ వ్యవహారాలు నడిపారు. చూపిన ఖర్చులకు తగినట్లు బిల్లులు సిద్ధం చేసి శ్రీకాకుళం నియోజకవర్గం ఆర్వోగా వ్యవహరించిన ఆర్డీవో రంగయ్యతో సంతకాలు పెట్టించి బిల్లులు సమర్పించారు. విడుదలైన నిధులను తహసీల్దార్, ఎలక్షన్ డీటీ తమ ఖాతాల్లో జమ చేయించుకుని వెండర్స్‌కు, ఉద్యోగులకు పంగనామాలు పెట్టి బదిలీపై వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Comments